[box type=’note’ fontsize=’16’] రామచంద్రుడు తెలుగువారి భద్రగిరీశుడుగ భద్రాచలకీర్తిగ భద్రాచల రామదాసు కీర్తన అయిన రీతిని తెలుపుతూ ఆ అయోధ్యరాముడు భద్రాద్రి రాముడే అని వివరిస్తున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు “భద్రాద్రి రామభద్రుడు” వ్యాసంలో.[/box]
శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడు. ఆ అయోధ్యరామునికి నామకరణమునాడే రామభద్రుడని పేరుంది. అయోధ్యరాముడు తెలుగువారికి రామభద్రుడుగ రామయ్యగా భద్రాద్రి రాముడై భద్రాచలములో కొలువైనాడు. భద్రాద్రిపేరులోని భద్రుని తలపిస్తూ తరింపజేసిన భక్త సులభుడు రామునికి భద్రుడి పేరుతో సంబంధములేదు. భద్రుడు తపస్సుచేసి భద్రాద్రి పేరు మీదుగా రామనివాసము కోరాడు. భద్రునిపేరిట రామభద్రాచలము భద్రుని జన్మను ధన్యత గాంచినది.. కాని రామజనన సమయాననే రామభద్రుడుడి పేరులో భద్రుడి పేరుండడము విచిత్రము.
నామకరణ మహోత్సవమునాడు శ్రీరామచంద్రుడు రామభద్రుడని తారకరాముడని పిలవబడ్డాడని జ్ఞానపీఠకవి విశ్వనాథ కల్పవృక్ష రామాయణములో అన్నారు. కల్పవృక్షములో కవిసామ్రాట్టు పలికించిన అయోధ్యవాసుల పలుకులు గమనించదగ్గవి.
ఊరెల్ల రామభద్రుడు
ధారణినేతకును ఋషికి దల్లికి శిశువున్
శ్రీరామచంద్రుడయ్యెను
దారకమయ్యెను సమస్తధరణీ ప్రజకున్
అయోధ్య ప్రజలు ఒకరినొకరు ప్రశ్నోత్తరములలో రామచంద్ర, రామభద్ర శబ్దములు రెండింటినీ ప్రయోగిస్తారు. ప్రజలెల్ల ప్రశ్నోత్తరంబుల యందు ప్రశ్నయడుగబోయి రామచంద్రుడంద్రు… బదులుచెప్పగ రామభద్రుడందురు (బాల.అవతార282). ఇందుకు కారణము కవి ఇలా అంటారు. పళ్ళెములో బియ్యములో వశిష్ఠులు రామచంద్రు డనక ముందే ధశరథుండు రామచంద్రుండని వ్రాసె. దశరథుండు వ్రాయకమున్న వశిష్టుల నోటి నుండి రామచంద్రుండని వచ్చె. ఆలస్యముగ వచ్చిన సుమంత్రుండు బియ్యములో యక్షరమ్ములు సరిగ్గా గన్పింపక రామభద్రుండని చదివే. మొదలిపల్కులకు రామ ముద్రగా నాడినవారు వేదములకు వేదశేఖరంబులకందని సిద్దమతులు. భద్రుడిపేరు నామకరణ మహోత్సవమునాడే తారకరామునికి చేరింది. కాని అర్థము వేరు. త్రిశూలములో చెప్పుకొన్నట్లు చిత్రచితధ్వని బహు విచ్ఛిత్తి మన్మహాకృతి ప్రణీత విశ్వనాథకులాంభోధి సత్యనారాయణ కవి. జాతీయకవితాశాఖ నధిష్టించి కూసిన కలకంఠము.
“పరిపరి రామరామ యన భద్రత క్షుద్రతరధ్వనుల్ తద్దురమహిమ ప్రతారిత విధూతములై చెడియొత్తిగిల్లగన్” అన్నారు కల్పవృక్షకవి. కాబట్టి రామభద్రుడు తెలుగువారి భద్రగిరీశుడుగ భద్రాచలకీర్తిగ భద్రాచల రామదాసు కీర్తనయ్యాడు. రామభద్రుడనిపించుకున్నాడు. క్షుద్రశక్తులనుంచిభద్రతనిచ్చువాడు రామభద్రుడు.
రాముడితోబాటు బాలలక్ష్మణుని అనుసరణ పెరుగుదల భావిరామాయణగాథ సూచించింది. ఆడువారు ఎత్తుకున్నపుడు రాముడు తలలపై అభయముగా హస్తముంచేవాడు. లక్ష్మణుడు మాత్రము ముక్కులు, చెవులు తడిమేవాడు. దశరథతనయునికి దిష్టితీశారు. అది మారుతి లంకాదహన సూచనధ్వనించింది. గోధుమలను పోసి గోతుపు పట్టుచీర పఱచి రాముని పడుకోబెట్టారు. గడ్డమీది చిన్నిబిడ్డ మాదంచును కొఱవి త్రిప్పినారు చుట్టు అనిచెప్పి..” ఇప్పసికందు పెనుగొఱవి కప్పుపొగలు రాత్రిచరపురీ గేహములన్ కప్పులు చుట్టునని దిష్టితీసి భావించారని కవిసమ్రాట్ చెప్పారు.
కల్పవృక్షకావ్యములో ఈ శిశురక్షకవచగ దిష్టి తీయు సంప్రదాయము జనన సమయమున పిశాచపీచమడిచే హనుమద్రక్షణగ సమజాచారమును ప్రతిబిబించినా భావిలంకాదహనగాథ ఊహ తెలుగుకవి కలములోని ధ్వని. భద్రాద్రి రామయ్య కథ అయినా అయోధ్య రామయ్య కథయే తెలుగునేల ఆచారవ్యవహారము. భిన్నత్వములో ఏకత్వమే అనిపించినా లక్ష్మణ, ఆంజనేయ సహితరామభద్రుడు అభయహస్తమై కొలువుగ భద్రాద్రిపై వెలిశాడు..
వాల్మీకి రామచంద్రుని “కౌసల్యా సుప్రజారామ” అని నిద్రమేల్కొలిపాడు. మన రామభద్రుని విశ్వనాథుడిలా అన్నారు. విశ్వామిత్రుడు యాగరక్షణకు వెంటవచ్చిన రాముని మేల్కొలిపిన పద్యమిది
తొలివెలుగయ్యెనిదోయి! యోయె! యో
కోసలసుతసుప్రజ! సాధు రామచంద్రా!
తొలివెలుగయ్యే నీదోయి! కోసలేయా!
మెలకువ వచ్చెనే మీకురామభద్రా! ….
రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్ష గావించారు. తాటకిని చంపి అహల్యకు శాపవిముక్తి గావించాడు రాముడు. మిథిలకు వెళ్ళి సీతను రాముడు పరిణయమాడాడు.
శ్రీరామనవమినాడు స్వామికి కల్యాణవేళ భద్రాద్రి రాముడిగ విశ్వఖ్యాతి. ప్రతిచైత్ర శుద్ధనవమికి జరిగే కల్యాణగాథగా కల్పవృక్షవర్ణన చదివితే అనిర్వచనీయానందము కలిగిస్తుంది. ఆరోజున చిరు జల్లులు పడతాయని తెలుగునాట అవి సీతారాముల తలపై జారుతున్న ముత్యాలజల్లులనిపిస్తాయని విశ్వనాథకవి సమ్రాట్టు వర్ణన. ఈ అయోధ్యరాముడు భద్రాద్రి రాముడె అని అనిపిస్తాడు. శాపవిముక్తి పొందిన అహల్య భర్త గౌతమునితో కలిసి రామభద్రునికి ఆతిధ్యమిచ్చి కొనియాడినది ఈ క్రింది పద్యము.
సీ. ప్రభుమేనిపైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శవచ్చె
ప్రభుకాలిసవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులుగలిగే
ప్రభుమేని నెత్తవి పరిమళించినతోన యశంబు ఘాణేంద్రియంబుజెందె
ప్రభునీలరత్నతోరణ మంజులాంగంబు గనవచ్చి జాతికి గనులు గలిగె
ఆప్రభుండు వచ్చి యాతిథ్యమును…స్వీకరించినంత నుపలహృదయవీథి
నుపనిషద్వితాన మొలికి శ్రీరామ…భద్రాభిరామమూర్తి యగుచుదోచే
రామచంద్రుడిగా, రామభద్రుడిగా, శ్రీరామునిగా తారకమంత్రము కోరిన దొరుకుతుందని చెప్పి భద్రాచల రామదాసును భద్రాద్రిని తరింపజేసి తానీషాకు దర్శనమిచ్చి ఇక్కడే కొలువున్న రామభద్రుడు తెలుగువారికి సార్థకనామధేయుడిగ రామభద్రుడు యావద్భారత భద్రతమూర్తిగా అభయ ముద్రనిస్తున్నాడు.
-డా.జొన్నలగడ్డ మార్కండేయులు