Site icon Sanchika

భగవదేచ్ఛ

[dropcap]కొ[/dropcap]న ఊపిరితో ఉన్న సిగరెట్టుని ఒక్క సారి తనివితీరా పీల్చి ఖాసిం పక్కన పడేసాడు.

అతని దృష్టి మాత్రం వేప చెట్టు కింద సిమెంటు బెంచీ మీద కూర్చున్న వృద్ధుడి పైనే ఉంది.

పార్కులో దమ్ము కొట్టకూడదని ఖాసింకు బాగానే తెలుసు – మాములు పరిస్థితుల్లో అయితే పొగ తాగేవారిని తానే స్వయంగా వద్దని వారిస్తాడు. కానీ, ఇప్పుడతని పరిస్థితి మాములుగా లేదని చూసే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కాకపోతే ఖాసింని చూసే తీరికా, వారించే ఓపికా అక్కడ ఎవరికీ లేవు.

జనారణ్యం మధ్య సువిశాలమైన ప్రేమికుల ఉద్యానవనమది. గేటు పక్కన తుప్పు పడుతున్న రేకు ఫలకంపై ఉన్న నియమావళిలో ధూమపానం గురించి కూడా ఉంది. వాస్తవానికి ఆ నియమావళిని పక్కాగా అమలు చేసే బాధ్యత ఆ పార్కు కాపలాదారుడిగా ఖాసిందే.

సాధారణంగా ఖాసిం ఒక లాఠీ చేతబట్టి దర్పంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అతని రాకకి అక్కడకి వచ్చే జంటలు గబుక్కున సర్దుకుని కూర్చుంటారు, స్వరం తగ్గించి గుసగుసలుగా మాట్లాడుకుంటారు. ఏదో ఏకాంతంలో నాలుగు ఊసులు చెప్పుకుని గబగబా ఎవరి దారిన వారు వెళ్లిపోయే ప్రేమపక్షులకి వేళా పాళా లేని ముసలి కాపలాదారుడితో వాదులాడే తీరికెక్కడ?

ఇవేమీ పట్టనట్టు ఖాసిం తదేకంగా బెంచీ మీద ఒంటరిగా ఉన్న వయసుమళ్ళిన వ్యక్తినే చూస్తున్నాడు. ఇలా కొన్ని వందల సార్లు చూసి ఉంటాడు – ఐనా ఏదో కొత్తగా చూస్తున్నట్టే ఉంటుంది.

“ఏందీ పెద్దాయన సంగతీ?” జావేద్ ఉన్నపళాన ఊడిపడ్డాడు

ఖాసిం అప్పుడు మన లోకంలోకి వచ్చాడు.

జావేద్ అతని అన్న కొడుకు. తనకి వయసు పైనపడిందని మునిసిపాలిటీ వాళ్ళకి చెప్పి తనే జావేద్ని సహాయానికి పెట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే కుర్రాడికి మొక్కల గురించీ, వాటి పెంపుదల గురించీ నేర్పిస్తున్నాడు. జావేద్ చురుకైన వాడే – వచ్చిన వారంలోనే పువ్వుల మీదా, ప్రేయసి మీదా చేతులు వేసేవాళ్ళని బాబాయిలాగే లాఠీతో సైగ చేసి నిలువరించడం మొదలెట్టేసాడు.

“అయన వచ్చినప్పుడల్లా ఆ బెంచీ ఖాళీ చేయిస్తావు. అసలు విషయమేంటి బాబాయ్?”, జావేద్ ఆసక్తిగా అడిగాడు

“ఆయనగారి రాకలకి నువ్వు కూడా అలవాటు పడాలి. వెళ్లి మాటకలిపితే నీకే చానా సంగతులు తెలుస్తాయి”, ఖాసిం ఒప్పుకోలుగా తల ఊపుతూ చెప్పాడు

జావేద్ భుజాలెగరేసి వేప చెట్టువైపు బయలుదేరాడు, పోనిలే కొంత కాలక్షేపం దొరికిందని సంతోషిస్తూ.

నడిచే తోవంతా చలువ రాళ్లున్నాయి; వాటికి ఇరుపక్కలా చక్కగా పేర్చిన ఇటుకలూ వాటి వెనక గులాబీ మొక్కలు వరుసగా ఉన్నాయి. చల్లని గాలికి ఊగుతున్న గులాబీలు వెనకనున్న ముళ్ళని దాచడానికి మనతో దోబూచులాడుతున్నట్టు నాట్యం చేస్తున్నాయి.

కుర్రాడు తన పక్కన కూర్చోగానే ఓ సారి తేరి పారి చూసిన పెద్దాయన, “కొత్త వాచ్‌మాన్ నువ్వేనేంటి?” అన్నాడు కళ్ళజోడు సర్దుకుంటూ

“ఔ సార్”

“మంచిదే. ఒక విషయం బాగా అర్ధం చేసుకో. ఇది పేరుకే లవర్స్ పార్కు, కానీ ఎవరైనా రావచ్చు. కాదు కూడదు జంటలు మటుకే – ఒంటరిగా రాకూడదు అంటావా?” అని తన జేబులోంచి ఒక ఫోటో తీసి అందిస్తూ “ఇదిగో, నేనేమి ఒంటరిగా రాలేదు – చూసుకో” అన్నాడు ముసలాయన

పలకరింపు కాస్తా పక్కదారి పట్టిందేంటనుకున్న జావేద్ సంకోచిస్తూనే ఫోటో అందుకున్నాడు

లామినేట్ చేసిన పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది. అందులోని సుందరాంగి తెల్లని చుడీదార్లో నిండుగా నవ్వుతూ సూటిగా కెమెరానే చూస్తున్నట్టు ఉంది.

ఫోటో వెనకాల “ఎ నైస్ ఫోటో ఫర్ మై నైస్ ఫెలో” అన్న సందేశం కింద “విత్ లవ్, యువర్ డార్లింగ్ సౌందర్య” అని అందమైన చేతిరాత ఉంది

 ఆ రాత కిందనున్న తేదీ ఒకటికి రెండుసార్లు చూసాడు జావేద్ – నిజమే, అతను పుట్టడానికి ఎన్నో ఏళ్ళముందే తీసిన ఫోటో అది. బ్లాక్ అండ్ వైట్ ప్రేమ కథన్న మాట అని ముసిముసిగా నవ్వుకున్నాడు

“బాగుంది సార్” అంటూ ఫోటో తిరిగిచ్చేశాడు

“కదా. బాగుండకేం? బ్రహ్మాండంగా ఉంది. కానీ తనకేంటో నచ్చలేదు – బొద్దుగా ఉన్నానేమో నని అనుకునేది” వివరిస్తూ ముసలాయన ఫోటోని పదిలంగా చొక్కా జేబులో పెట్టుకున్నాడు

“నిజం చెప్పాలంటే ఏ ఫోటో కూడా తన సౌందర్యాన్ని పూర్తిగా బంధించలేక పోయిందంటే నమ్ము” ఖండితంగా చెప్పాడాయన

“మీ భార్యనా సార్?” కుతూహలం కొద్దీ అడిగాడు జావేద్

“ప్చ్ గాళ్ ఫ్రెండ్”

“మరి బాయ్ ఫ్రెండ్ తో లేదేంటి సార్” అని చమత్కరించాడు కుర్రాడు

“నేను తన బాయ్ ఫ్రెండ్ కాదు. మాజీ అనుకో”

“ఓహ్ విడిపోయారా?” ఏదో అర్థమైనట్టు అడిగాడు జావేద్ కొంత విచారం ధ్వనించేలా

“లేదు తను మాత్రమే విడిపోయింది” సవరించాడు సారు.

ఒక క్షణం తికమక పడ్డా వెంటనే చిక్కుముడి విప్పిన ఉత్సాహంతో “ఓహ్ అర్థమైంది.. మీరు ఇంకా ప్రేమిస్తున్నారు” అన్నాడు జావేద్.

పెద్దాయన అలానే స్తబ్ధుగా కూర్చున్నాడు

 “ఎప్పుడు విడిపోయింది?”, మళ్ళీ మాట కలిపాడు చిన్నోడు.

 “చాలా ఏళ్ళ క్రితం.. కానీ తలుచుకుంటే నిన్న లాగే అనిపిస్తుంది”

“ఎప్పుడు?”

“చాన్నాళ్ల క్రితం.. నా జుట్టు ఒత్తుగా నల్లగా ఉండేటప్పటి మాట” తన నెరిసిన బట్టతల వైపు చూపిస్తూ నవ్వాడాయన.

“ఆహా! అంటే చాలా ఏళ్ళే లెండి”

మళ్ళీ పెద్దాయన మౌనంగా ఉండిపోయాడు.

“ఇప్పుడెక్కడ ఉంది?” ఎలాగోలా సంభాషణ కొనసాగించడం కోసం కొంత సంశయంగానే అడిగాడు జావేద్

“తెలీదు”

ఒక పెద్ద నిట్టూర్పు విడిచి మళ్ళీ అందుకుంటూ “కొన్నాళ్ల తర్వాత తనని వెతకడం మానేశాను” అన్నాడు పెద్దాయన.

ఎందుకన్నట్టు చూసిన జావేద్ కి సమాధానంగా ఆయనే కొనసాగించాడు.

“వాళ్ళ ఇంటి ఓనరు కలిసినప్పుడు చెప్పాడు – వాళ్ళు మకాం మార్చేసి వేరే ఊరెళ్ళిపోయారుట. ఆ రోజుల్లో పెళ్లవగానే ఆడపిల్లలు అత్తారింటికే వెళ్ళిపోయేవారు మరి”

“ప్చ్ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందా?”

భారంగా తల ఊపాడు ముసలాయన.

“మళ్ళీ ఎప్పుడూ కలవ లేదా?”

“లేదు. అందుకే నేనూ నా ప్రయత్నాలు మానేశాను. తనకి నేనక్కరలేక పోతే పోనీ – నేనేమీ ప్రేమ భిక్షకోసం ఎదురు చూడట్లేదు”

ఒక నిమిషం మౌనం తర్వాత మళ్ళీ ఆయనే వేదాంత ధోరణిలో మొదలుపెట్టాడు.

“నేను ఎదురుగా ఉన్నప్పుడే అర్థం చేసుకోలేనిది, నా ఎదురు చూపులనేమర్థం చేసుకుంటుంది?”

“బహుశా ఆవిడ ప్రయత్నించి వుండచ్చు కదా? ఉత్తరమో పత్తరమో.. ” సమాధాన పరిచే స్వరంతో జావేద్ అన్నాడు.

 జావేద్ కళ్ళలోకి చూసి పెద్దాయన నిరాశగా నవ్వాడు.

“ఇన్నేళ్లగా నేను నా ఇల్లు మారలేదు. నా కాలేజి, ఆఫీసు – ప్రతి చోటా నాకోసం ఎవరైనా వస్తే చెప్పండంటూ వాకబు చేసుకునే వాణ్ణి. నన్ను చేరాలనే మనసుండాలే కానీ మార్గాలు బోలెడన్ని”

ఆశ్చర్యంగా చూస్తున్న కుర్రాడికి ఖంగు తినే మరో విషయం చెప్పాడాయన.

“అంతెందుకు? మనం కూర్చున్న ఈ బెంచీ, ఈ చెట్టు – మేము కలిసే రోజుల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి. ఏదో పార్కు పునరుద్ధరణ అని పదేళ్ల కిందట మేయరు చెట్టు నరకబోయాడు. నేనూరుకుంటానా? పదిరోజుల్లో రెండున్నర వేల సంతకాలు సేకరించి వాడి మొహాన కొట్టాను – మళ్ళీ నా జోలికీ ఈ చెట్టు జోలికీ వచ్చే సాహసం ఎవడూ చెయ్యలేదు. “

“వావ్ సారూ నువ్వు మామూలోడివి కాదు” మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు జావేద్.

“మరేం అనుకున్నావ్! సౌందర్య ఎప్పుడొచ్చినా ఈ చెట్టూ మా బెంచీ దాని మీద నేనూ..” గర్వంగా మీసం సద్దుకున్నాడు సారు.

“నీ ప్రేమ కూడా మామూలుది కాదు సారూ.. సవాలే లేదు” మరింత ఉత్సాహంగా పలికాడు కుర్రాడు.

“ఛ ఛ .. నువ్వేం చూసావ్.. ఇంకా బోలెడంత ఉంది” ముసలాయన మొహంలో వెలుగు తొణికిసలాడింది

“మరెందుకు వదిలి పోయింది సారూ?” అమాయకంగా మొహంపెట్టి జావేద్ అడిగేశాడు.

“నాకు తెలీదు” ముక్తసరిగా చెప్పాడు ముసలాయన.

“అంటే? ఏమర్థం అన్నట్టు?”

 “ఏమో”

“అరే నీకు తెలీకుండా ఎట్లుంటది?”

“తను చెప్పలేదు – నేను అడగలేదు” కుర్రాడి ఆందోళనని ఆనందిస్తున్న ధోరణిలో చెప్పాడాయన.

“ఇడిసి పోయేటప్పుడు ఏదో చెప్పే వుంటది గదా సారూ?” దాదాపు బ్రతిమాలాడు చిన్నోడు.

“నా మీద ప్రేమ పోయిందట” కళ్ళు తిప్పుతూ వెటకారంగా చెప్పాడాయన.

“ఏందీ?”

“ఔను నా పట్ల తన భావాలు మారిపోయాయిట” విడ్డూరాన్ని వివరిస్తున్నట్టు మొహం పెట్టాడు పెద్దాయన.

“గదే ఎందుకంటా?” పట్టు వదలకుండా గట్టిగా అడిగాడు జావేద్.

“నాకు తెలీదు – తెలుసుకుని ఉపయోగమూ లేదు” వైరాగ్యంగా చెయ్యి ఊపాడు ముసలాయన.

“ఛీ! ఈ ఆడోళ్ళంతే సారూ – ఏదీ సక్కంగా చెప్పరు. కానీ ఏదో ఉండే ఉంటది”

“నేనూ చాలా ఆలోచించాను – ఇదే కారణం అని ఏదీ తేలలేదు. కాకపోతే ఒక మాట వాస్తవం” అన్నాడు పెద్దాయన ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతూ.

జావేద్ కళ్ళు మెరిసాయి.

“విడిపోవడానికి మునుపు తన ఫ్రెండు వాళ్ళ ఊరికి కలిసి వెళ్ళాం. అక్కడ కొంతసేపు నన్ను మర్చిపోయి స్నేహితురాలితో ఒకటే ఇకఇకలూ పకపకలూ – నాకు ఒళ్ళుమండి చెడామడా పేలాననుకో..”

“అగ్గదీ సంగతి .. గొడవ పడిండ్రు” ఏదో చిక్కుముడి విప్పిన సంతృప్తి జావేద్ మాటలో వినిపించింది.

“కానీ.. మా గొడవలు మాములే – విరసం లేనిదే సరసం ఎక్కడినుంచి వస్తుందీ?” పెద్దాయన తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పుకు పోయాడు. “మేము ఆ రోజే తిరుగు ప్రయాణంలో సర్దుకుపోయాం. ఇంకా చెప్పాలంటే ఎక్కువ ముద్దులు పెట్టుకున్నది ఆనాడే – ‘సారీ రా’ అని తన అరచేతిని ముద్దుపెట్టుకుంటే – ‘నువ్వు ఉడుక్కుంటే నాకెంత ముచ్చటో’ అని ఇక్కడ రెండు ముద్దులు పెట్టింది” అని మురిసిపోతూ కుడిజబ్బ తడుముకున్నాడు ముసలాయన.

చేతులకి ముద్దులేంటబ్బా అని అయోమయంగా చూడడం జావేద్ వంతయ్యింది.

అతని పరిస్థితి అర్థమైనట్టు నవ్వుకుంటూ “పాతకాలం రోజులవి – పాతకాలం ప్రేమలు మావి. నీకర్థం కావులే” అన్నాడు సారు.

“ఏంది సారూ .. మళ్ళీ మొదటికొచ్చినాము.” నీరసంగా మూలిగాడు జావేద్. “ఏదో ఒకటి లేకుండా ఎందుకు పోతుంది?”

పెద్దాయన ఇంకా జబ్బరాసుకుంటుంటే జావేద్‌కి అసహనం పెరిగి పోయి “నీకు పైసలు, ఉద్యోగం – అన్నీ సక్కగుండేవా?” డిటెక్టివ్ లాగా ప్రశ్నించాడు

“అబ్బే అవేవీ కావు. తను కోరాలే కానీ, చందమామని చంకలోచుట్టి తెచ్చెయ్యనూ?” వీరావేశంగా చెప్పాడు పెద్దాయన.

ఆ ఆత్మవిశ్వాసం చూసి జావేద్ కి ఏమనాలో అర్థం కాలేదు.

“ఐతే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోనుండదు సారు” ముక్తాయింపుగా కేసు కొట్టేసిన జడ్జీలా ధ్వనించాడు జావేద్.

“నేనొప్పొకోను” అప్పీలు చేసాడు పెద్దాయన.

అయోమయం, నీరసం, అసహనం అన్నీ జావేద్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

“నన్ను సరిగ్గా అర్ధం చేసుకుంది కనుకే నా సౌందర్య ఆ కారణం చెప్పింది. వేరే ఏ వంక పెట్టినా అతలకుతల రసాతల పాతాళాలు ఏకంచేసైనా నేను సమాధాన పరిచేవాడిని” గీతోపదేశం చేస్తున్న కృష్ణుడిలా ఫోజు పెట్టి పెద్దాయన వివరించాడు.

ఒక పెద్ద నిట్టూర్పు వదిలి “నా మీద ప్రేమే లేదంటే వేరే ఏం చెయ్యగలనూ? తెలివైంది నా సౌందర్య – నా ప్రేమని నాకంటే బాగా అర్థం చేసుకుంది” అన్నాడు.

జావేద్‌కి జాలేసింది. చిక్కుముడి విప్పే పనిలో పాపం ముసలాయనని ఇబ్బంది పెట్టింది చాలుననుకున్నాడు.

కొంత ఊరటగా మాట్లాడితే అయన కుదుట పడతాడనిపించింది.

“పోతే పోన్లే సారు – ఆమే నష్టపోయింది. దేముడు న్యాయమే చేస్తాడు – అసుంటోళ్లను ఊరికే ఒదులుతాడా ఏంది?” అనునయంగా పలికాడు జావేద్.

పెద్దాయన ప్రతిస్పందన అతను నివ్వెర పోయేలా చేసింది.

“అంటే?.. అంటే ఏంటి నీ ఉద్దేశం?” కొద్దిగా పెద్ద స్వరంలో నిలదీశాడాయన “నా సౌందర్య కష్టాలు పడుతుందా?”

“సారీ సారూ.. ఏదో కోపంలో.. ” సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు జావేద్

“ఇదే మీ తరం వాళ్ళతో వచ్చిన చిక్కు. నిస్వార్థమైన నిరాపేక్ష ప్రేమ మీకెప్పుడు అర్థమౌతుంది? అనుకున్నట్టు అవ్వకపోతే చచ్చిపోడాలు చంపెయ్యడాలూ.. ప్రాణం నిలిపేదిరా ప్రేమంటే” ఆవేశంగా చెప్పుకుపోతున్న అయన ముందు తన తరం తరఫున తలవంచుకోడం తప్ప జావేద్‌కి మరో మార్గం లేకపోయింది.

అది గ్రహించి కాస్త మెత్తబడిన ముసలాయన మృదువుగా “పిల్ల ఒకరిని పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే తల్లితండ్రుల ప్రేమ తగ్గిపోతుందా? మరి ఇరవై ఏళ్ళు పెంచిన వాళ్ళకే అంతుంటే జీవితాంతం కలిసి ఉండాలనుకున్న మనకెంత ఉండాలి?”

ఆ వాదనకి ఔనన్నట్టు తలూ పాడు జావేద్.

“చాకుతో పొడవడమో యాసిడ్ పొయ్యడమో కాదు.. చాతనైతే .. ” ముసలాయన వాక్యం ముగించే ముందే మరేదో తట్టినట్టు ఆగిపోయి, కనుబొమ్మలు మూడేసి చెప్పాడు “నా సౌందర్య పిల్లాపాపలతో, నాకంటే బాగా చూసుకునే మనిషితో ఉంటే నాకానందం కాదూ? బహుశా వాళ్లంతా గుమ్మరించే ప్రేమా ఆప్యాయతలతో తన గుండె నిండిపోయి నాకింక చోటులేదేమో.. అందుకే కలవలేదేమో??.. అదీ సంతోషమేలే. దేవుడికి నా ప్రార్థన కూడా అదే – తనెప్పుడూ సంతోషంగా ఉండాలి” అనేసి ఊరుకున్నాడు.

“చానా గొప్ప తరం సారూ మీది. ఆవిడ రాకూడని మొక్కుకుంటూ రాకకోసం రోజూ పడిగాపులు పడుతున్నావు.. ఇంత గొప్ప ప్రేమ మాకు సమజవ్వదులే” ఎద్దేవా చేశాడు జావేద్.

“అలా కాదబ్బాయ్.. ఎక్కడో ఒక మూల ఏదో నమ్మకం. ఏదో ఓక రోజు నా కోసం వెతుక్కుంటూ వస్తుందని విశ్వాసం – అలా వచ్చిన రోజున నేను తేలిగ్గా దొరకద్దూ?” విశదీకరించాడు పెద్దాయన.

“ఇంకా వస్తుందనే అనుకుంటున్నావా సారు?” నిలిదీశాడు కుర్రాడు.

“ఆ ఆశతోనే బతుకుతున్నా. అలాగే కాలం వెళ్లదీస్తున్నా..” అంటూ ఏదో స్ఫురించిన వాడిలా పెద్దాయన ప్యాంటు జేబులోంచి ఒక కాగితం తీసి “తన పుట్టినరోజు వచ్చే వారం – అందుకే ఒక లెటర్ మొదలెట్టాను” అన్నాడు.

జావేద్‌కి ఒక క్షణం ఏమీ పాలుపోలేదు నమ్మశక్యం కాని నిజం కళ్ళముందు కనిపిస్తుంటే మనుసులో మాట బయటకే అనేశాడు.

“ఇది ప్రేమ కాదు సార్ పిచ్చి – మంచి దవాఖానాకి పోవాలె ఎమ్మటే”

“నా ప్రేమ ఇంకా బోలెడంత ఉందని ముందే చెప్పాగా. నీ కర్థం కాదులే” పెదవి విరుస్తూ లెటర్‌ని జేబులో పెట్టుకున్నాడాయన

“ఇంక చాలు సార్ నీ ఎదురుచూపులు. కొన్నాళ్లు ప్రశాంతంగా” ఏదో సలహా ఇవ్వబోయిన జావేద్‌ని మాట తొణకనివ్వలేదు ముసలాయన.

“నేను ప్రశాంతంగానే ఉన్నాను. అప్పట్లో కొన్నేళ్లు బాధగా అనిపించింది. పోను పోను భగవదేచ్ఛకి శిరస్సు వంచడం నేర్చుకున్నాను”

“భగవదేచ్ఛనా?”

“అన్నీ మన చేతుల్లో ఉన్నాయనుకోడం మిథ్య. మనం కేవలం పైవాడి ఆటలో పావులు మాత్రమే!” పెద్దాయన మళ్ళీ గీతాబోధ నందుకున్నాడు “నిష్కారణంగా ఏదీ చెయ్యడు దేవుడు. ఏదో ఒక నిమిత్తం లేకపోతే నాకు ఆకాశమంత ప్రేమ ఎందుకిచ్చాడు? ఇన్నేళ్ళైనా నా సౌందర్య మీద నాకీ మమకారమేమిటి?”

ఈసారి జావేద్ అర్జునిడిలా ఖిన్నుడై వింటున్నాడు.

“నీ చుట్టూ చూడు – ఈ చెట్లు, మొక్కలు, పక్షులు, పురుగులు, ఆకాశం, మేఘాలు – ప్రకృతి సమస్తంలో అన్నిటికీ ఏదో ఒక కారణం ఉంది. తను వదిలి వెళ్ళిపోయినా, వయసు దాటిపోయినా నా ప్రేమ చెక్కుచెదరలేదు.. పెరిగిందేమో కానీ ఒక్కరవ్వ తరగలేదు ఇవేవీ ఏ కారణమూ లేకుండానే అంటావా? అందుకే ఏదో ఒకరోజు నా సౌందర్య నాకోసం వస్తుందని నాకు తెలుసు”

కళ్ళముందు కాలానికీ కర్మకీ అతీతంగా సాక్షాత్కరించిన ప్రేమ విశ్వరూపాన్ని చూస్తూ ఉండిపోయాడు జావేద్. ఇదేదో ఒక అధ్యాయంలోనే అర్థమయ్యేది కాదని మాత్రం అర్థమయ్యింది

పెద్దాయన జావేద్ దగ్గరకొచ్చి భుజం తడుతూ “ఏదైనా ఎక్కువగా మాట్లాడుంటే నొచ్చుకోకు. ఏదో మనసులో మాట చెప్పుకుంటే తేలికగా ఉంటుందని రెండు ముక్కలు మాట్లాడాను” అంటూ బయల్దేరాడు

జావేద్ చూపులు నేలని కొలుస్తున్నాయి. కన్నీళ్లు మెల్లగా జారుతున్నాయి.. తలెత్తకుండానే వీడుకోలన్నట్టు ఊపి ఊరుకున్నాడు.

గేటు దాటుకుని వెళ్లే వృద్ధుణ్ణి చూస్తూ పెదవి కరుచుకుని కన్నీళ్లు మింగే విఫలయత్నం చేశాడు.. వయోభారంతో వంగిన మానులా మహాసముద్రమంత ప్రేమని గుండెలోనే ఔపోశన పట్టిన ఋషిలా.. విధికే విస్తుపోయేలా విల్లువిడవకుండా పోరాటం సాగిస్తున్న యోధుడిలా కనిపించాడు.

కొంతసేపలాగే కూర్చుని లేచి ముఖం తుడుచుకుంటూ, చెట్టుకింద సేద తీరుతున్న ఖాసిం వైపు నడిచాడు జావేద్.

“ఎట్లనిపించుండు మన దోస్తు?” కుతూహలంగా అడిగాడు ఖాసిం

“ఓ సిగరెట్టియ్యి బాబాయ్” అంటూ బదులు కోసం ఆగకుండా పక్కనే ఉన్న డబ్బాలోంచి ఒకటి తీసి వెలిగించాడు కుర్రాడు.

“దిమాకంతా ఖరాబయ్యింది. అరే ప్రేమించుడంటే ఇట్లనా?” జావేద్ ప్రవాహంలా మాట్లాడుతుంటే ఖాసిం అతని ముఖకవళికలని గమనిస్తూ కూర్చున్నాడు.

“ఆమె ఎవత్తో వదిలేసి పోయి తన బతుకు చూసుకుంది.. పాపం పెద్దాయన పరేషానై జిందగీ మొత్తం నాశనం జేస్కున్నాడు” అని గట్టిగ్గా ఓ దమ్ము లాగాడు

వేళ్ళ మధ్య సిగరెట్టుతోనే చెయ్యి ఊపుతూ “షైతాన్ కీ బచ్చీ.. ఇంతకింతా చెల్లిస్తుంది చూడు” అని సవాల్ చేశాడు.

ఖాసిం నిర్వికారంగా ఒక నవ్వు నవ్వి తన కిళ్ళీ డబ్బాలోంచి ఏదో తీసి కుర్రాడికి అందించాడు

అది చాలా పాత కాలపు యాభై రూపాయల నోటు – చలామణీ లోలేక ఎన్నో ఏళ్ళయ్యుంటుంది

“ఏందిదీ?” జావేద్‌కి ఏమీ అర్థం కాక అడిగాడు.

“ఆవిడ చెల్లింపు” తాపీగా చెప్పాడు ఖాసిం తానూ ఒక సిగరెట్టు వెలిగిస్తూ.

“ఈయన గారొచ్చిన్నప్పుడల్లా ఆ బెంచీ మీద చోటు కోసం నాకిచ్చింది” ఖాసిం మాట్లాడుతుంటే జావేద్ విస్తుపోయి వింటున్నాడు.

“ఈ జంటని నేను చిన్నప్పటి సంది చూసినా. అసుంటోళ్లని మళ్ళీ జిందగీలో చూడలేదు. చూడముచ్చటగా ఉండేవారు – ఎప్పుడూ ఆ బెంచీ మీదే కూర్చుని గంటల తరబడి మాట్లాడుకునేవారు. కొంత కాలానికి ఏమయ్యిందో ఏమో వాదులాడుకోడం అరుచుకోడం షురూ చేశారు. ఒక రోజైతే ఆమె ఏదో అరిచి రుసరుసా వెళ్ళిపోయింది. అతను అక్కడే కూలబడి కూచున్నాడు. మళ్ళీ కలిసి చూడలేదు ఇద్దరినీ”

ఖాసిం ఆలోచనల్లో మునిగిపోయి చెప్తూనే ఉన్నాడు “అప్పటి సంది అతనే ఒంటరిగా వచ్చి ఏడ్చుకుంట కూసుండేవాడు. ఆమె తోడుగా ఎప్పుడు కనిపించలే. కానీ ఒకరోజు నా కంట పడింది – అదిగో ఆ దూరాన బురఖాలో కూచునుంటే చూసినా. నేను వెళ్లే లోపే కళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తింది”

జావేద్ సిగరెట్టు పక్కన పడేసి ఇంకా ఏకాగ్రతగా వింటున్నాడు

“మళ్ళీ బురఖాలో ఒకటి రెండు సార్లు దూరం నించీ అతనిని గమనిస్తూ కనిపించింది. అతనికి చెప్పొద్దని సైగ చేసేది.. తర్వాత తర్వాత రావడమే బంద్ చేసింది” ఖాసిం ఏదో పూనిన వాడిలా శూన్యంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు “రెండో మూడో నెలల తర్వాత అనుకుంటా .. నేను గేటు బంద్ చేసే టైంకి బురఖాలో వచ్చింది. నాకు డబ్బులిచ్చి, అతనిని చూసుకోమని దణ్ణం పెట్టింది. మనిషి చిక్కి శవంలా ఉంది, దగ్గుతుంటే రక్తం చూసి నేను పరేషానై పోయా. మాట్లాడేలోపే చీకటిలోకెళ్ళిపోయింది.. అప్పటి సంది మళ్లీ రాలేదు”

“యా అల్లా .. సచ్చిపోయిందా??” జావేద్ నమ్మలేనట్టు అడిగాడు.

“అతని మనసులో బతికే ఉందిగా” నిర్లిప్తంగా అన్నాడు ఖాసిం.

“అంటే .. నువ్వు ఏమీ చెప్పలేదా ?” జావేద్ ప్రశ్నించాడు.

లేదన్నట్టు తలూపాడు ఖాసిం.

“అంటే.. ఇన్నేళ్లూ ఆయన పాగల్ గానిలెక్క వస్తుంటే నువ్వు గమ్మునున్నావా?” దబాయించాడు జావేద్.

ఒక పెద్ద నిట్టూర్పుతో తన సిగరెట్టు పడేసి కూలబడ్డాడు ఖాసిం.

“నేను పుట్టి బుద్దొచ్చిన సంది మొక్కలు పెంచుతున్నా. ఏనాడూ విచ్చే పువ్వును మొగ్గలో తెంపనివ్వలేదు. పువ్వులు పుడతాయి పెరుగుతాయి వాడిపోతాయి.. అన్నీ భగవదేచ్ఛ ప్రకారం జరిగిపోతాయి. కాలానికి తగ్గట్టు కదులుతాయి కరుగుతాయి. నేను కూడా అయన ప్రేమ వాడిపోతది అప్పుడు మెల్లగా చెప్పచ్చునని గమ్మున్నుండి పోయా” ఖాసిం ఇక కళ్ళలో నీళ్లు ఆపే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు.

“ఇన్నేళ్ళ సంది అయన వచ్చినప్పుడల్లా చూస్తున్నా.. ఒక రోజు కూడా నాకు అతని ప్రేమ తగ్గినట్టు అనిపించలే” ఖాసిం కొంత తమాయించుకుని మళ్ళీ మొదలెట్టాడు “ఈ నాలుగు గోడల మధ్య వికసించిన అంతగొప్ప ప్రేమని నా చేతుల్తో తుంచలేక పోయా. గుండె గట్టి చేసుకోడానికి చానా కోషిష్ చేసినా. నా వల్ల కాలేదు. ఖుదా కసం — ఇన్నేళ్ల సంది ఆ దేవుడే చెయ్యలేక పోయిన పని నేనెట్లా చేసేది? అందుకే భగవదేచ్ఛకి సలాం చేసి… ” ఇంక గొంతు పెగలక ఖాసిం గళం మూగబోయింది.

ఇద్దరి కళ్ళలో నీరు వరదలా వచ్చింది .. ఇలాంటి ప్రేమ కథలకి కాపుకాయడం అదృష్టమో దురదృష్టమో తేల్చుకోలేని నిస్సహాయత పరస్పరం వాళ్ళకి దర్శించింది.

కొంత సేపయ్యాక జావేద్ లేచి ఆ యాభై నోటుని జాగ్రత్తగా యూనిఫామ్ జేబులో పెట్టుకున్నాడు .. కన్నీళ్లు తుడుచుకుంటూ పార్కులోకి వెళ్ళిపోయాడు.

కొత్త మొక్కలకి పాదులు తవ్వుతూ కుర్రాడు పనిలో నిమగ్నమై పోయాడు.

ఖాసిం చెట్టుకి ఆనుకుని తృప్తిగా చూశాడు – తన వారసుడికి ఒక పవిత్ర కార్యం అప్పగించి బరువు దించుకున్నందుకో ఏమో!

“పర్లేదు! సువాసనల పువ్వులనీ, సున్నితమైన ప్రేమలనీ కావలి కాయడం బాగానే నేర్చుకున్నాడు” అనుకుంటూ విశ్రమించాడు.

Exit mobile version