[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవన్నామ సంకీర్తన’ అనే రచనని అందిస్తున్నాము.]
హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా
[dropcap]ఈ[/dropcap] కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందడానికి భగవంతుని నామ సంకీర్తనయే సులభమైన మార్గం అని శాస్త్రంలో చెప్పబడింది. భగవంతుని నామం తీసుకోవడానికి ఎలాంటి సంశయాలు, పద్ధతులు, శాస్త్రయుక్తమైన పూజాదివిధానాలు లేవు. కావాల్సింది చిత్తశుద్ధి, పవిత్రమైన మనస్సు మరియు భగవంతుని పాదారవిందాల పట్ల భక్తి శ్రద్ధలు మాత్రమే.
భగవంతుని దివ్యలీలా గుణ విశేషములను, వైభవమును కీర్తించే భక్తికి ‘కీర్తనం’ అని పేరు. సర్వకాల, సర్వావస్థల యందు భగవన్నామ సంకీర్తన సలిపి ముల్లోకాలయందు దివ్యమైన వాతావరణమును కల్పించిన వ్యక్తి, బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు. ఆయన నాలికపై నిత్యం భగవంతుని నామం కదలాడుతూ వుండేది.
నేను వైకుంఠంలో వుండను, కఠినమైన తపస్సు సాగించే యోగుల హృదయాలలో వుండను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా గుణగణాలను భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను…అని స్వయంగా విష్ణుమూర్తి నారద మహర్షులతో చెప్పినట్లు శ్రీమహావిష్ణు పురాణంలో వుంది. నిత్యం ఉరుకులు పరుగులు పెడుతూ గజి బిజి జీవితం గడిపే నేటి ఆధునిక యుగంలో భగవన్నామస్మరణ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చెయవచ్చు.
అందుకే శ్రీరామ నీ నామమెంతో రుచిరా.. కదళీ ఖర్జూరాది ఫలములకన్న, నవరస పరమాన్న నవనీతములకన్న ఎంతో రుచిరా’ అంటూ భద్రాద్రి రామదాసు ఎంతో పారవశ్యంతో నామ సంకీర్తన ప్రాశయాన్ని గానం చేసారు.
ఒక కథనం ప్రకారం విపరీతమైన దాహంతో ఒక అడవిలో తిరుగుతున్న జ్ఞానదేవుడు ఒక బావి వద్దకు రాగా అందులో అట్టడుగున జలం వుండడంతో నేను నమ్ముకున్న దేవుడే నాకు కావాల్సింది ఇస్తాడంటూ పారవశ్యంతో భగవన్నామ సంకీర్తన చేయగానే..
అప్పటిదాకా ఆ బావి అట్టడుగున ఉన్న జలం ఉబికి వచ్చి ఆయన దాహం తీర్చింది. ఆ సంఘటన ద్వారా జ్ఞానదేవుడు మరొకసారి లోకాన అన్నిటికన్నా నామ కీర్తనే మిన్న అని రుజువు చేసారు.
కలియుగంలో భక్తిని మించిన యుక్తి కనిపించదు. భక్తి, భగవంతుని నామం పలకడం తప్ప తప్ప మరో మార్గం లేదంటారు చైతన్య ప్రభువు. భగవన్నామ సంకీర్తన ఒక్కటి చాలు భక్తుల మనస్సును పరిశుభ్రంగా ఉంచడానికి అర్చన తోడయితే కైవల్య ప్రాప్తి మరింత వేగవంతం అవుతుంది అని ఆయన భక్తులతో అంటుండేవారు. ఔషధ సమయంలో – విష్ణుదేవ, భోజన సమయంలో – జనార్దన, నిద్రించేటపుడు – పద్మనాభ, పెళ్లిలో – ప్రజాపతి, దుస్స్వప్నంలో – గోవింద, కష్టంలో – మధుసూదన, సర్వకాలాల్లో – మాధవ… అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది. ఇదే నామస్మరణ యొక్క గొప్పదనం.
ఓం నమో నారాయణాయ.