Site icon Sanchika

భగవంతుడిని చేరడానికి సాధనా మార్గం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుడిని చేరడానికి సాధనా మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]గవద్గీతలో ‘యో మద్భక్తస్స మే ప్రియః’ అన్నాడు భగవానుడు. అంటే ఎవరు నన్ను నిస్వార్థంగా, చిత్తశుద్ధితో, నిశ్చల ప్రేమతో, ఎట్టి కోరికలు లేక ఆరాధిస్తారో అట్టి వారే నాకు అత్యంత ఇష్టులు అని ఆయన భావం.

భాగవతంలో:

‘నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింప దగున్‌ దీనునిన్‌

రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!!’

అని ఒక శ్లోకం ఉంది.

అంటే “భగవంతుడా! నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యం, మానసిక దృఢత్వం తగ్గిపోయింది. ప్రాణాలు కూడా పోతూ,  మూర్ఛ వస్తోంది. ఇట్టి పరిస్థితులలో  నీవు తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో కూడిన నా మొర ఆలకించి ఆదుకోవా? దేవాదిదేవా రావయ్యా! కరుణించి కాపాడవయ్యా!” అని ఆర్తితో ఏనుగు ఆరాధించే సరికి, ఆ సమయంలో వైకుంఠంలో విశ్వమయుడు, సర్వాంతర్యామి, అయిన మహా విష్ణువు తన భక్తుడైన గజరాజును కాపాడటానికి నిశ్చయించుకున్నాడు. భగవద్గీతలో భక్తులు తనను ఆశ్రయిస్తే వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటానని (యోగ క్షేమ వహామ్యహమ్‌) చెప్పారు. ఆ భక్తి త్రికరణ శుద్ధిగా, ఆర్తితో ఉంటే, జన్మ జన్మలకు ఆ పరమాత్మ రక్షింస్తూంటాడని తెలియచేసేదే గజేంద్ర మోక్షం. ఈ ఘట్టం మనందరికీ ఆదర్శం కావాలి.

ఎక్కడ పరిపూర్ణ, నిశ్చల భక్తి వుంటుందో అక్కడ శ్రద్ధ, ఎక్కడ శ్రద్ధ వుంటుందో అక్కడ జ్ఞానం, ఎక్కడ జ్ఞానం వుంటుందో అక్కడ సాధన, ఎక్కడ సాధన వుంటుందో అక్కడ భగవంతుని అనుగ్రహం వుంటాయి. భగవంతుని చేరడానికి, ధన, కనక, వస్తు వాహనాలు, సకల శాస్త్రాలలో పాండిత్యం అక్కరలేదు. కావలసిందంతా నిర్మల, నిశ్చల, నిస్వార్థ ప్రేమ మాత్రమే. మొదట్లో కోరికల మూటతో భగవంతుని ఆరాధించినా తర్వాత కోరికలను తగ్గించుకుంటూ, చివరకు అసలు కోరికలే కలగని స్థితికి చేరుకోవాలి. మనకి కర్మలకు ప్రతిఫలం నిశ్చయించేది, ఇచ్చేది భగవంతుడేనన్న అచంచల విశ్వాసం, త్యాగ బుద్ధి, శరణాగతి తత్వం, ప్రసాద భావన ఉండాలి.

మలిన మనస్సుతో భగవంతుని ఆరాధిస్తే ఎట్టి ఫలితం దక్కదు. సర్వశ్య శరణాగతి భావన ద్వారానే భగవంతుడు లభ్యం అవుతాడు. స్వార్థ రహితం, అహంకార రహితం, పరుల హితం కాంక్షించే కర్మల ద్వారా చిత్తశుద్ధి ఒనగూడి తద్వారా భగవంతుడు లభ్యమవుతాడు.

ఎవరికైనా ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నా పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అంతే తప్ప సమస్యలన్నింటినీ తనపైనే వేసుకొని, అన్నింటికీ తానే కర్తృత్వ భావం వహించి, అవి సఫలీకృతం అయితే తనంతటి వాడు లేడని విర్రవీగితూ, అపజయం లభించేసరికి ఆ నెపం ఇతరులపై నెట్టి వేసి లేదా అపజయానికి తానే కారణం అని క్రుంగుబాటుకు లోనయ్యేవారికి భగవంతుడు ఏ విధంగా సహాయం చేయడన్నది నిస్సందేహం.

‘కరిష్యే వచనం తవ’ అంటే నీవు చెప్పినట్టు చేస్తాను. పరమాత్మ చెప్పినట్టు చేస్తాను అని అర్థం. అంటే నేను చేస్తున్నాను, అంతా నావల్లే జరుగుతూ ఉంది అనే అహంకారము, కర్తృత్వ భావన వదిలి పెట్టి, శరణాగతి పొందడం. ఇదే మానవుని అంతిమ లక్ష్యం.

Exit mobile version