Site icon Sanchika

భగవంతుడు ఎవరు?

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుడు ఎవరు?’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]గవద్గీత 10వ అధ్యాయం (భగవద్విభూతి) లోని 20వ శ్లోకం. ఈ శ్లోకం అన్ని వేదాల, ఉపనిషత్తుల సారాంశంగా పండితులు భావిస్తున్నారు.

శ్లో:

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః।

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥

ఓ అర్జునా, నేను నాచే సృష్టింపబడిన ఈ సమస్త ప్రపంచంలో నివసించే సర్వ జీవుల హృదయాలలో నివసించే పరమాత్మను. సర్వ జీవులకు ఆది మధ్యాంతములె నేనే అయి వున్నానని తెలుసుకొనుము.

భగవంతుడు ఎవరు, ఎక్కడ వుంటాడు, అతని చిరునామా ఏమిటి అని సామాన్యులు పదే పదే వేసే ప్రశ్నలకు సమాధానంగా ఆయన అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని స్పష్టమైన సమాధానం ఈ శ్లోకం ద్వారా ఇచ్చారు.

శ్రీకృష్ణుడు, తాను జీవుడికి దూరంగా ఎక్కడో వైకుంఠంలోనే, కైలాసంలోనే లేక మరొక దివ్యలోకంలో లేనని ప్రకటిస్తున్నాడు. నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. వేదాలలో ఒక మాట  వుంది.

‘య ఆత్మని తిష్ఠతి’ అంటే భగవంతుడు మన ఆత్మలో యందు స్థితమై ఉన్నాడు. భగవంతుడు సర్వ ప్రాణుల ఆత్మకు ఆత్మ. అందులో కూర్చుని ఆ ఆత్మకు జీవశక్తి మరియు నిత్యశాశ్వత గుణము ప్రసాదిస్తాడు. ఎవని నుండి సర్వ ప్రాణులు ఉద్భవించాయో వాడే భగవంతుడు; ఎవని యందు సర్వ ప్రాణులు ఆధారపడి స్థితమై ఉన్నాయో వాడే భగవంతుడు; ఎవని లోనికి సర్వ ప్రాణులు ఏకమై పోతాయో వాడే భగవంతుడు.

సద్గురువు పత్రీజీ ఆత్మతత్వం గురించి ఈ కింద విధంగా అద్భుతంగా తెలియజేసారు. ఆ విషయాన్ని యథాతథంగా ఈ కింద ఉటంకించడం జరుగుతోంది.

ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో ఒకానొక పరిస్థితిలో మాత్రమే ఉన్నది దేహం. కానీ సర్వ దేశాలలో, సర్వ కాలాలలో సర్వ పరిస్థితులలో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ.  ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ వుండేది..

భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ వుండేది మరి భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉండేది.

భౌతికమైన సృష్టి అంతం కావచ్చు  కాని ఆత్మపదార్థం మట్టుకు అంతం కాదు. ఆత్మ ఒకానొక భౌతికమైన సృష్టిలోంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్ళి ఉంటూ వుంటుంది. ఇలా తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం. ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం కడు దుర్లభం. జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది. అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం అది ఈ శరీరలోనే ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జ్యోతి రూపంలో మన హృదయంలోనే వుంది. ఈ అత్మ వలనే శివానికీ, శవానికి మధ్య బేధం కలుగుతోంది.

గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని ఎన్నో గుడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. అటువంటి ఆత్మ పదార్థమే భగవంతుడని. ఆయన మన హృదయాలలోనే తిష్ఠ వేసుకొని మనం చేసే ప్రతీ పనిని, ప్రతీ ఆలోచనను గమనిస్తున్నాడని తెలుసుకుంటే మన జీవన శైలే మారిపోతుంది. అట్టి మార్పునే భగవంతుడు ఆశిస్తున్నాడు.

Exit mobile version