Site icon Sanchika

భగవంతుడు హృదయవాసి!

[24 ఏప్రిల్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ ఆధ్యాత్మిక వ్యాసాన్ని అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు.]

[dropcap]“భ[/dropcap]గవంతుని నివాసము వైకుంఠమని, కైలాసమని, స్వర్గమని అనేక విధములుగా చెబుతుంటారు. ఇవన్నీ కేవలం పిచ్చి భ్రాంతులే! భగవంతుని నివాసము భక్తుని యొక్క హృదయమే! కైలాసము, వైకుంఠము, స్వర్గము.. ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు. నీవు ‘ఓ కైలాసవాసీ!’ అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన చెంతకు చేరుతుందో లేదో కానీ, ‘హృదయవాసీ!’ అని ప్రార్థిస్తే మాత్రం డైరెక్ట్‌గా చేరుతుంది.. నిస్సందేహంగా చేరుతుంది” అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పలుమార్లు ఉద్బోధించారు.

‘వైకుంఠము!’ అనగా మార్పు చెందనిది. మనుష్యుల బాహ్య స్వరూపములలో ఎన్ని రకాల మార్పులైనా సంభవించవచ్చును గానీ.. హృదయం మాత్రం మార్పు చెందదు! అట్టి నిర్గుణ నిరంజనతత్వమే భగవంతుని నివాసము. భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం, భగవంతుడు ఎక్కడున్నాడోనని వెతుకుతూ.. మానవుడు ఆధ్యాత్మక అన్వేషణ మొదలు పెట్టాడు. భగవత్ తత్వాన్ని తెలుసుకోకుండా ఎంత దూరం పరుగులు తీసినా ప్రయోజం ఏముంది?

అందుకే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈ విధముగా ప్రవచించారు –

“ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలను మనం ఏనాడు మరచిపోతామో ఆనాడే మనకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది. ఇది దేహము, ఇది మనస్సు, ఇవి ఇంద్రియాలు అనే దృష్టి వున్నంత వరకు ‘బ్రహ్మతత్వము’ నీకు అర్థం కాదు. నీవు దేనిని చింతుస్తున్నావో దానిగా మారిపోవాలి. ‘బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి!’.. అదే నిజమైన సాధన. కేవలం.. పూజలు, వ్రతాలు చేయటం కాదు భక్తి యొక్క లక్షణాలు. నీ నిజతత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు. నీలో ఆవిర్భవించిన ప్రేమ తత్వాన్ని పరమాత్మ వైపు మరల్చు! ఇదే భక్తి యొక్క ప్రమాణము, ఇదే భక్తి యొక్క స్వరూపము.”

ఈనాడు మానవులు దైనందిన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ, పాపపరిహారం కోసం దైవాన్ని ఆరాదిస్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా కేవలం పాపపరిహారం కోసం దైవారాధన చేస్తూ, పూణ్యక్షేత్రాలను దర్శిస్తూ దైవాన్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. త్రికరణ శుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా, మరెన్ని వ్రతాలు చేసినా, ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినా ఫలితం ఉండదని స్వామి ఎన్నో మార్లు తమ దివ్య ప్రబోధాలలో తెలియచేశారు.

“మనసు, వాక్కు, హస్తము. ఈ మూడింటిని పరిశుద్ధం చేసినప్పుడే మనము పవిత్రమైన మానవులుగా రూపొందుతాము. వీటినే ‘త్రికరణములు’ అన్నారు. ఆధ్యాత్మికము వల్లనే ‘చిత్తశుద్ధి’ కలుగుతుంది. తద్వారా మనస్సనే మొదటి కరణము పవిత్రమవుతుంది. రెండవదైన వాక్కును శుద్ధి గావించుటకు నైతికము చాలా అవసరము. ఇంక, హస్తము.. దానము చేసినప్పుడే పవిత్రమవుతుంది. ఇది ధార్మికము! కనుక.. ఆధ్యాత్మికము, నైతికము, ధార్మికము అనే ఈ మూడింటి వల్లనే మనకు ‘త్రికరణ శుద్ధి’ ఏర్పడుతుంది. ఈ త్రికరణ శుద్ధిని పొందిన మానవులే దివ్యత్వాన్ని పొందగలగుతారు. ఈ త్రికరణములలో ఏ ఒక్కటీ మాలిన్యమైనా దివ్యత్వాన్ని పొదంలేము. పాత్రలోని నీరు కారిపోవాలంటే పది చిల్లులు ఉండనక్కరలేదు.. ఒక్క చిల్లు చాలు! విద్యార్థికి అన్ని సబ్జెక్ట్ లోనూ మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఏ ఒక్క సబ్జక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చినా ‘ఫెయిల్’ అయినట్లే కదా! అదే విధముగా, త్రికరణములలో ఏ ఒక్కటి మాలిన్యంగా వున్నా అన్నీ అపవిత్రమైపోతాయి! కనుక, త్రికరణ శుద్ధి నిమిత్తమై మనం ఆధ్యాత్మిక, నైతిక, ధార్మికములను మూడింటినీ పెంచుకోవాలి. లేని యెడల, మానవునకు, పశువునకు ఏ మాత్రము వ్యత్యాసముండదు. మానవుడు ద్విపాద పశువు.. ఆది చతుష్పాద పశువు!”

అన్ని జన్మలకంటే, మానవ జన్మ పవిత్రమైనది. మానవుడికి జ్ఞానాన్ని, మంచి చెడుల విచక్షణను, పాపపుణ్యముల తేడాను.. వాటి ద్వారా సంభవించే పరిణామాలను తెలుసుకునే బుద్ధిని ప్రసాదించాడు భగవంతుడు. కానీ, నేటి మానవులు స్వార్థపూరిత మనస్కులై, భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

ఈ మానవ జన్మ పవిత్రత గురించి భగవాన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు –

“ఎంత పవిత్రమైనది నరజన్మము! ఈ మానవులు, ఇలాంటి నరజన్మను వానరజన్మగానే గాక, రాక్షసజన్మగా కూడా మార్చుకుంటున్నారు. నరుని చూసి వానరము కూడా అపహాస్యం చేస్తూ.. ‘ఓ పిచ్చివాడా! నీవు మానవుడవై పుట్టి మాధవుణ్ణి మరచిపోతున్నావు. నేను వానరుడనై పుట్టినా రామ చింతన చేస్తున్నాను. రామకార్యంలో పాల్గొని రోమ రోమమునూ రామనామంతో నింపుకున్నాను. నీకంటే నేనే మేలు!’ అంటున్నది.”

నేడు సమాజంలో ఉన్నత విద్యలను అభ్యసించి, అంతులేని సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఆధునిక మానవ జాతిని గురించి భగవాన్ ఈ విధంగా విశ్లేషించారు.

“ఈనాడు మానవుడు ఎన్నో చదువులు చదివి కూడా ఏమి సాధిస్తున్నాడు?! అతని జీవితమంతా టెన్షన్, అశాంతితో గడిచిపోతోంది. పశుపక్షి మృగాదులైనా శాంతిని పొందుతున్నాయి గానీ, మానవునికి మాత్రం ‘శాంతి’ చాలా దూరంగా వున్నది. కారణం ఏమిటి? మితిమీరిన కోరికల చేత మతిని చెరుపుకుంటున్నాడు ఈ ఆధునిక మానవుడు. మానవులకు ఉండవలసినది ఒకే ఒక్క కోరిక. అదే.. దైవం పై కోరిక! ‘దైవం నాకు కావాలి’ అనే కోరిక బలంగా వుంటే, అన్ని కోరికలూ నేరవేరుతాయి. మన చేతిలో ‘బంగారం’ వుంటే ఎన్ని నగలైనా చేసుకోవచ్చును! కానీ.. నేటి మానవుడు బంగారమును మరచిపోయి నగలను ఆశిస్తున్నాడు!”

ఈ ఆధునిక మానవుని అజ్ఞానాన్ని స్వామి సోదాహరణంగా వివరించారు. భారతదేశము వేదభూమి, పుణ్యభూమి. సృష్టి స్థితి లయలకు మూల పురుషుడైన పరమేశ్వరుడు ఈ పవిత్ర భూమిలో పలుమార్లు, యుగయుగాలుగా మానవ రూపధారియై అవతరించినట్లు, అధర్మవర్తనులైన మానవులను సంస్కరించినట్లు, దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించినట్లు మన ప్రాచీన గ్రంథాలు, ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. ఈ అవతార పరంపరలో భాగంగా కలియుగావతరియై ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ వారు అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో జన్మించినారు. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ దత్తాత్రేయుని అంశంలో శ్రీ షిర్డి సాయి బాబా వారి తదుపరి అవతారముగా పెదవెంకటరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. బాల్యం నుండియే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి భగవంతుని అవతారంగా గుర్తించబడి, ప్రపంచం వ్యాపితముగా కోట్లాది మంది భక్తుల హృదయమందిరాలలో కొలువై నిత్యమూ పూజలు అందుకుంటున్నారు. ‘సత్యధర్మశాంతి ప్రేమ అహింసలు’ ఆయుధాలుగా సమాజాన్ని సంస్కరించాలని భక్తులకు పిలుపునిచ్చారు. సేవే లక్ష్యంగా ప్రతి మనిషీ తన జీవన మార్గాన్ని ఎంచుకోవాలని ఉద్బోధించి ‘మానవ సేవే మాధవ సేవ’ అనే సూక్తితో, ఆకలిగొన్న వారిని ఆదుకోవాలని ‘శ్రీ సత్యసాయి సేవాదళ్’ని నెలకొల్పి.. విశ్వ వ్యాపితముగా సేవా కార్యక్రమములకు శ్రీకారం చుట్టారు.

భగవంతుడు మానవ రూపధారియై భూమి మీద అవతరించి ‘సేవ’ ద్వారా మానవ జాతిని ఉద్ధరించి.. ‘సేవే దైవం’ అనే నానుడిని సార్థకం చేయవచ్చని నిరూపించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. భగవంతుడు ఎక్కడో లేడని, ప్రతి మనిషి హృదయమందిరంలో కొలువై వున్నాడని, సాటి మనిషికి సేవ చేస్తే, పేదవాడి ఆకలి తీరిస్తే.. వారి హృదయమందిరాలలో కొలువై వున్న ‘పరమాత్మ’ సంతృప్తి చెందుతాడని భగవాన్ పలుమార్లు ఉద్బోధించడమే గాక, ఆచరణాత్మకంగా నిరూపించారు.

ప్రతి మనిషి సాటి మనిషిని ప్రేమించాలని, ఈ ప్రేమతత్వాన్ని బోధించడం కోసమే భగవంతుడు మానవుడిగా అవతరిస్తాడని, తద్వారా మానవ జాతి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని సెలవిచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా!

“భగవంతుడు ఏ అవతారము దాల్చినా ప్రేమ తత్వాన్ని నేర్పించే కోసమనే వాస్తవాన్ని తెలియజేయడం కోసమే! ఓ మానవుడా! నీకు ప్రేమ లేకపోవడం చేతనే, స్వార్థం పెరిగిపోవడం చేతనే పలురకాల బంధనాలతో జగత్తులో నీవు చిక్కుకొని వుంటున్నావు. త్యాగము, ప్రేమ.. ఈ రెండు కలిగియున్నప్పుడే నీవు దివ్యమైన మానవునిగా రూపొందుతావు. త్యాగము లేని మానవుడు కేవలము రోగము నందే నశించిపోతాడు. ప్రేమ లేని మానవుడు జీవించిన శవముగా రూపొందుతాడు. మానవుని యొక్క దివ్యత్వము ప్రేమ, త్యాగములందు మాత్రమే గోచరిస్తుంది. ప్రేమకు ప్రేమయే సరైన ఫలము. కనుక, మానవాళికి ప్రేమను నేర్పే నిమిత్తమై భగవత్ అవతారములు ఈ జగత్తునందు ఉద్భవిస్తూ వుంటాయి!”

ప్రతి మనిషినీ ప్రేమించడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యతలను నెలగొల్పమని తన జీవన మార్గంలో ఆచరించి ప్రపంచానికి మార్గనిద్దేశనం చేశారు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా!

Exit mobile version