భగవంతుని దివ్య అభయం

0
2

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని దివ్య అభయం’ అనే రచనని అందిస్తున్నాము.]

అజోపి సన్నవ్యయాత్మా భూతనామీశ్వరోపి సన్।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవామ్యాత్మమాయయా॥

[dropcap]భ[/dropcap]గవద్గీత యందు అధ్యాయం 4 దివ్య యోగంలోని 6 వ శ్లోకం ఇది.

ఓ అర్జునా, జన్మ లేనివాడను, ఎన్నడూ నశింపని దివ్యదేహము కలవాడను, సకల జీవులకు ప్రభువునైన నేను శాశ్వతమైన నా దివ్య దేహముతో ప్రతీ యుగము నందును అవతరిస్తాను అని పై శ్లోకం భావం.

భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేని వాడు అయినా, తన యోగమాయా శక్తిచే, ధర్మాన్ని పరిరక్షించటానికి, ఈ భూలోకం లోకి దిగి వస్తాడని ఈ అధ్యాయం ద్వారా మానవాళికి ఉపదేశించాడు. ఆయన ఈ భువిపై సామాన్యులవలె జన్మ మెత్తినా ఆయన యొక్క జన్మ, కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసినవారు, దృఢవిశ్వాసంతో భక్తిలో నిమగ్నమౌతారు. అనుక్షణం ఆయన పాదాలనే శరణు వేడుతారు. చిత్తశుద్ధితో, నిష్కలంక భక్తితో, అనుపమానమైన సాధన ద్వారా భగవంతుడిని పొందిన తరువాత, ఈ లోకంలో తిరిగి జన్మనెత్తరు. ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి శాశ్వతంగా విడివడతారు. అదియే మోక్ష సంప్రాప్తి.

సాధకులను సన్మార్గంలో నడిపించేందుకు నేను పుట్టుకలేని వాడిని అయిఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను అని మానవాళికి భగవానుడు అభయం ఇచ్చాడు.

భక్తుల సంరక్షణకై భగవంతుడు తన సహజ స్వరూపాన్ని, స్థితిని మార్చుకొని దిగిరావడమే అవతారమంటే! ఆయా సందర్భాలలో ఆయా భక్తుల అవసరాలకి తగినట్లుగా ఆర్తిని తీర్చగలిగేట్టుగా తన వ్యూహం నుండి మనకోసం అనేక సార్లు అవతరించాడు ఆ సర్వేశ్వరుడు. తార అంటే నక్షత్రం. అవ అంటే దిగి రావడం. జీవరాశుల అభ్యున్నతి కోసం నిర్హేతుక కృపతో భగవంతుడు స్వీకరించేదే అవతారం. ప్రజలకు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం.

మనం కర్మలను భక్తితో చేసినప్పుడు, అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత, ధ్యానము, యోగము వంటి ఉన్నత ఉపకరణలు మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతాయి. ధ్యానము, యోగము ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి శ్రమిస్తారు. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారు. వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, యజ్ఞం (భగవత్ అర్పితము)గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here