[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 17” వ్యాసంలో ఉండబండ లోని ‘వీరభద్రస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
ఉండబండ వీరభద్రస్వామి
[dropcap]మా[/dropcap] షాపింగ్ అయి, ఆలయం చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అయింది. ఆలయం పెద్దగానే వున్నది. పురాతనమైన ఆలయంగా చెప్పబడే ఈ ఆలయ చరిత్ర మా ఆటో డ్రైవరు కొంత, అక్కడున్నవారు కొంత చెప్పినదానిని బట్టి ఏమిటంటే…
800 సంవత్సరాల క్రితం అక్కడ ఒక రైతు పొలం దున్నుతుంటే నాగలికి వీరభద్రస్వామి విగ్రహం అడ్డుపడిందిట. దానిని జరుపుదామని ప్రయత్నిస్తే ఫలితం లేకపోయింది. దానిని అలాగే వుంచి ఇంటికెళ్ళి పడుకున్నాడుట. కలలో స్వామి కనబడి తాను వీరభద్రుడననీ, ఆయన పొలంలో కనబడ్డది తానేననీ… ఎద్దుల బండిలో ఆ విగ్రహాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళమనీ, ఆ సమయంలో ఇరుసు విరిగి పడ్డ చోట తనని ప్రతిష్ఠించి పూజలు చేయమని చెప్పాడు. అలాగే చేశారుట. దీనికి సాక్ష్యం నాగలి తగలటంవల్ల, స్వామి విగ్రహం నొసలు, కుడి కనుబొమ దగ్గర రెండు గీతలుంటాయి.
ఉండబండ అని పేరు రావటానికి కారణం అంతకు ముందు బండమీద వుండి తిని వచ్చాడు. అందుకని ఆ పేరు అన్నారు. సరిగా అర్థం కాలేదు కదూ. నాకూను. ఈయనకు పేద భక్తులు ఎక్కువట. సహజంగా వీరభద్రస్వామి అంటే గంభీర రూపుడు. కానీ ఈయన శాంత స్వరూపుడు.
పూర్వం ఒక కోమటి, వక్కల వ్యాపారం చేసుకునేవాడు. ఆ సమయంలో ఎడమపక్క కోనేరు వుండేదిట. ఆ వ్యాపారి తన వ్యాపారంలో భాగంగా వారానికొకసారి ఆ ప్రాంతాలకి వచ్చి అక్కడ రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. అలా వచ్చినప్పుడు ఒకసారి ఈ విగ్రహం చూసి ఇది వరకు లేదే ఎలా వచ్చిందని వాకబు చేశాడట. సంగతి తెలుసుకుని, తన వ్యాపారం అభివృధ్ధి చెందితే లాభాలలో 20 శాతం ఇస్తానని మొక్కుకున్నాడుట. ఆయన వ్యాపారం అభివృధ్ధి చెందింది. మొక్కుకున్న విధంగానే ఆయన ఆ గుడిని చాలా అభివృధ్ధి చేశాడుట. 1971 నుంచీ ఎండౌమెంట్స్ వారి అధీనంలో వుంది.
ఆలయ మండపాలన్నీ 300 సంవత్సరాల క్రితం కట్టించినవి. భద్రకాళి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి 15 సంవత్సరాలు అవుతోంది.
దర్శనమయ్యాక తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్నం చూసిన ఆలయాలు తృప్తికరంగా అనిపించలేదు అని మాలో మేము అనుకుంటుంటే మా డ్రైవర్ బూదగవిలో ఒక పురాతనమైన సూర్యాలయం వుంది తీసుకెళ్ళనా అని అడిగాడు. మనవైపు సూర్య ఆలయాల గురించి అంత వినలేదు. అందుకే ఉత్సాహం చూపించాము. ఆటో బూదగవి దోవ తీసింది.