[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 18” వ్యాసంలో బూదగవి లోని ‘సూర్య దేవాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
బూదగవి సూర్య దేవాలయం
[dropcap]పె[/dropcap]రటి చెట్టు మందుకి పనికి రాదని ఒక సామెత. అలాగే మన దగ్గరవున్న వాటి గొప్ప గుర్తించటం మనకి తెలియని విషయం. తెలిస్తే ఇలాంటి ఆలయాలని ఎందుకు పాడుపెట్టుకుంటామండీ!?
హిందూ ధర్మం ప్రకారం సూర్యుడు ప్రత్యక్ష దైవం. అందుకే ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటాము. ఈయనే ప్రాణాధారం. అంతేకాదు, శివుడి అష్టమూర్తులలో సూర్యుడు కూడా ఒకడంటారు. అలాంటి సూర్య దేవాలయాలు అరుదుగానే వున్నాయి.
తెలుగు రాష్ట్రలలో వున్న సూర్య దేవాలయాలు అంటే ఎంతసేపటికీ అరసవిల్లి చెబుతాం (అదయినా తెలిసింది. సంతోషం). ఇంకా ఏమన్నా వున్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. అనంతపురం జిల్లాలోని బూదగవిలో ఒక అద్భుతమైన సూర్యాలయం వుందని ఎంతమందికి తెలుసు? నేను చెప్పేది సూర్యుని ఉపాలయం కాదు సూర్యునికి ప్రత్యేక ఆలయం. ఇది నిన్న మొన్న కట్టింది కాదండి. 13వ శతాబ్దంలో చోళులు కట్టించినది. ఆంధ్రప్రదేశ్‌లో రెండవది, దక్షిణ భారత దేశంలో మూడవది, యావత్ భారత దేశంలో ఎనిమిదవది. ఇంకా విశేషం ఏమిటంటే ప్రపంచంలో దక్షిణాభిముఖంగా వున్న ఏకైక సూర్య దేవాలయం ఇదని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆలయం గోపురంపై గణపతి, కుమారస్వాముల ప్రతిమలు చెక్కబడిన ఈ ఆలయం చిన్నదే.
పద్మపాణి
ఈ ఆలయంలో సూర్యుడు పద్మపాణి పేరుతో విరాజిల్లుతున్నాడు. ఇందులో సూర్య విగ్రహం నల్ల గ్రానైట్‌తో తయారుకాబడింది. చేతుల్లో తామర మొగ్గలు వుంటాయి. ఇరు పక్కలా ఉషా, ఛాయలు కొలువుతీరి వుంటారు.
ఇక్కడ దేవస్ధానంలో ఇంకో విశేషం కూడా వున్నది. శిష్యునికి గురువుపట్ల వున్న భక్తికి నిదర్శనం. సూర్యుని ముఖ్య శిష్యుడు హనుమంతుడు. ఈయన ఇక్కడ సూర్యునికి సాష్టాంగ నమస్కారం చేస్తూవుండటం విశేషం.
మన శాస్త్రాల ప్రకారం దక్షిణ దిక్కు అధిపతి యమ ధర్మరాజు. ఈయన సూర్యుని కొడుకు. తన కుమారుని చూస్తున్న సూర్య దేవాలయంలో ఎటువంటి పూజలు చేసినా… సూర్య నమస్కారాలు చేసినా లేదా చేయించినా అపమృత్యు భయం పోయి సర్వ రోగములు నయమవుతాయని భక్తుల నమ్మకం.
ఆలయంలో చిన్ని చిన్ని ఉపాలయాలలో కాళికాదేవి, నాగ ప్రతిమలు వున్నాయి. ఆలయం ఎదురుగా ఆంజనేయస్వామికి, మల్లికార్జునస్వామికి ప్రత్యేక ఆలయాలున్నాయి.
ఈ ఆలయం ప్రస్తుతం ఏన్షియంట్ మాన్యుమెంట్‌గా ప్రకటించబడి, ఆర్కియాలజీ ఎండ్ మ్యూజియమ్స్ డిపార్టుమెంట్ అధీనంలో వున్నది.
ఇంత ప్రశస్తి కలిగిన ఈ ఆలయం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ ఆలయం శిధిలావస్థలో ఆదరణ లేకుండా, ఆవరణ అంతా పశువులకావాసమయింది. ఈ స్ధితి చూసిన అనంతపూర్‌కి చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ కాళీభట్ల రామశర్మ తన సొంత డబ్బు, సమయం వెచ్చించి ఈ ఆలయాన్నీ పునరుధ్ధరించారు. ఇప్పుడు నిత్య పూజలు జరుగుతూ, ప్రతి రోజూ భక్తులతో కళకళలాడుతోంది.
ఇలాంటివారు ఇంకా కొందరు కనీసం వాళ్ళ ఊళ్ళల్లో వున్న పురాతన శిధిలాయలాను బాగు చేయించి తద్వారా పురాతన కట్టడాలను, చరిత్రలను నిలుపుకోవటానికి, పూర్వీకులు ఎంతో ఆలోచించి కట్టించిన ఆలయాలలో భగవంతుని పూజలు జరగటానికి, తద్వారా భక్తుల ప్రశాంతతకి తోడ్పడితే పురాతన ఆలయాలన్నీ కళకళలాడుతాయి కదూ.
ఒక విశిష్ట ఆలయం చూశామనే తృప్తితో తిరిగి అనంతపురం చేరి ఆ రోజుకి విశ్రాంతి.