Site icon Sanchika

అనంతపురం జిల్లా యాత్ర – 21

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 21” వ్యాసంలో వజ్రగిరి లోని ‘శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి

ఆలూరు కోన నుంచి మధ్యాహ్నం 1-30 గంటలకి బయల్దేరి మా ఆటోలో అనంతపురం జిల్లాలోని అత్యంత పురాతనమైన లక్ష్మీ నరసింహ క్షేత్రాలలో ఒకటైన వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాము. దీని గురించి ఆలూరు కోనలో కొంత, మా ఆటో డ్రైవర్ ద్వారానూ తెలుసుకున్నాము. పురాతన ఆలయాలలో చాలామటుకు పూర్వం వైభవోపేతంగా విలసిల్లి, తర్వాత అనేక కారణాలవల్ల ఆదరణ కోల్పోయాయి. అయితే వీటిలో కొన్ని ఆలయాలను స్ధానికులు పునరుధ్ధరించుకుంటున్నారు. వాటిలో ఇదీ ఒకటి.

ఇక్కడ వున్న లక్ష్మీ నరసింహస్వామి పూర్వం జనమేజయుడిచేత ప్రతిష్ఠింపబడ్డాడని ప్రతీతి. మేము వెళ్ళినప్పుడు అక్కడ వున అర్చకుడు శ్రీ వెంకట గిరయ్య చెప్పిన సమాచారం ప్రకారం ఆలయం ముందు వున్న ధ్వజస్తంభానికి పూర్వం గొప్ప మహిమ వుండేదిట. ఆ స్తంభంపైన నెయ్యి రాసి చూస్తే దొంగలు కనిపించేవారట.

పూర్వం ఒకసారి ఆలయంలో వున్న ఉత్సవ విగ్రహాలు దొంగిలింపబడ్డాయి. ఆ సమయంలో ధ్వజస్తంభానికి నెయ్యి రాసి చూస్తే ఆ దొంగలు అనంతపురం సమీపంలోని సింగనమల చెరువు దగ్గర కనబడగా వెళ్ళి పట్టుకుని శిక్షించారు. తర్వాత ఆ దొంగలు ధ్వజస్తంభం మూలంగా తమ వునికి తెలిసిందని దానిని ధ్వంసం చేశారు. ధ్వంసమయిన ధ్వజస్తంభానికి పూజలు జరగకూడదని, దానికి ప్రత్యామ్నాయంగా పక్కన వేరొక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఆలయం ముందు రెండు ధ్వజస్తంభాలనూ చూడవచ్చు.

అర్చామూర్తి

శ్రీ నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠింపబడ్డారు. విగ్రహం పెద్దదే. స్వామి పక్కనే లక్ష్మీదేవి వున్నది. స్వామికి ఐదు పడగల ఆది శేషు ఛత్రం పడుతున్నట్లుంటాడు. ఆలయం వున్న ఈ కొండను వజ్రగిరి అంటారు. పూర్వం దుండగుల దాడిలో స్వామి పైన ఆది శేషు మూడవ శిరస్సు కొంచెం దెబ్బ తిన్నది. వజ్రాలు వున్నాయని పగలగొట్టారుట. ఆ విగ్రహం పూజకి పనికి రాదని, దానిని అలాగే వుంచి, కింద వేరే చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు.

పంచలోహాలతో తయారుచేయబడిన ఉత్సవ విగ్రహాలు వున్నాయిగానీ, ఆలయం ఊరికి కొంచెం దూరంగా వుండటంతో వాటిని ఊళ్ళో ఆంజనేయస్వామి ఆలయంలో వుంచారుట. స్వామి కళ్యాణం సమయంలో వాటిని తీసుకువచ్చి, మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడే భద్రపరుస్తారు.

గర్భ గుడి ముందు వున్న హాలు గోడపై కొంచెం స్ధలంలో బొట్లు పెట్టి వున్నాయి. అదేమిటని అడిగితే కల్పవృక్ష వాహనం అని చెప్పారు.

ఆలయం

చిన్న కొండమీద వున్న ఈ ఆలయం మరీ చిన్నది కాదు. అలాగని పెద్దదీ కాదు. ఎత్తయిన ప్రదేశంమీద వుండటంతో చుట్టూ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. మేము మధ్యాహ్నం వెళ్ళినా చల్లనిగాలితో సేద తీరాము.

గర్భగుడి, ముందు పెద్ద హాలు వున్నాయి. మేము వెళ్ళేసరికి అక్కడి అర్చకుడు శ్రీ వెంకటగిరయ్య అక్కడే వున్నారు. దర్శకులు మాత్రం మేమే. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వంట. వచ్చిన భక్తులు ఇచ్చిన దక్షిణలు తప్ప వేరే ఆదాయం ఏమీ లేదన్నారు.

1980నుంచీ అక్కడ టీచర్‌గా పని చేసే శ్రీ చంద్రశేఖరయ్య ఆలయ అభివృధ్ధికి కృషి చేస్తున్నారు.

ఇక్కడవున్న రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వివాహాలవుతాయని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

ఉత్సవాలు

నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో వైశాఖ పౌర్ణమికి (ఇక్కడివారు దీనిని మొలకల పున్నమి అని కూడా అంటారు) స్వామి కళ్యాణం, తిరణాల జరుగుతాయి. అప్పుడు భక్తులు బాగా వస్తారు.

మార్గము

అనంతపురం జిల్లా, యాడికి మండలం, తిమ్మాపురం గ్రామంలో వున్న ఈ ఆలయం తాడిపత్రి, ఆలూరుకోనలకు సమీపంలో వున్నది. తాడిపత్రి, ఆలూరు కోనలను సొంత వాహనాలలో దర్శించినవారు ఈ ఆలయాన్ని ఏ ఇబ్బందీ లేకుండా దర్శించవచ్చు.

అర్చకుడు శ్రీ వెంకట గిరయ్య ఫోన్ నెంబరు 9701313967

Exit mobile version