భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 25

0
2

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 25” వ్యాసంలో ‘గుత్తి కొండ కోట’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

గుత్తి కొండ కోట

కోటలు చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ కోటలను పరిశీలించడం వల్ల ఆయా కాలంనాటి రాజుల గురించీ, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానాల గురించీ తెలుసుకోగలుగుతాము. అందుకోసమే వేల సంవత్సరాల క్రితం నిర్మించిన కోటలపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి కోటలు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇప్పుడు అనంతపురం జిల్లాలోని గుత్తి కొండ కోట గురించి చెబుతాను.

గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్ఠం చేశారు. గుత్తి కోట గురించి లభ్యమైన తొలి శాసనాలు కన్నడం, సంస్కృతంలో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఒక శాసనంలో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనంలో గుత్తి కోట దుర్గరాజముగా కీర్తించబడింది. అంటే అప్పుడెంత వైభవోపేతంగా వుండేదో కదా.

గుత్తి కోట, గూటీలో మైదానానికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అతి పురాతన కొండ కోటల్లో ఒకటి. ఈ కోటను విజయనగర రాజ్యానికి చెందిన చక్రవర్తులు నిర్మించారు. మురారీ రావు ఆధ్వర్యములో మరాఠాలు దీనిని జయించారు. తర్వాత 1773 సం.లో హైదర్ ఆలీ ఆక్రమించడము జరిగింది. చివరికి 1799 సం.లో టిప్పు సుల్తాన్ పరాజయం తర్వాత బ్రిటిష్ వారి చేతుల్లో పడింది.

నిర్మాణ వివరాలు

ఈ కోట సముద్రమట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోట షెల్ ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారాలు కలిగి ఉంది. కోట పశ్చిమ కొండపై ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపైన మురారీ రావు గద్దె అనే ఒక చిన్న పెవిలియన్ ఉంది. ఇక్కడి నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మరాఠా జనరల్ మురారీ రావు ఇక్కడ చదరంగం ఆడేవాడు.

కోట చుట్టూ బలిష్టమైన కోట గోడ, బురుజులతో ఉంటుంది. వర్షపునీటిని ఆపి నిల్వచేయడానికి రాళ్ళ పగుళ్ళలో గుంటలు తవ్వి అనేక జలాశయాలు ఏర్పాటు చేశారు. వీటినే బావులంటారు. అలాంటి బావులు కోట లోపల 108 వున్నాయి.

ఈ కోటని మేము 13 ఏళ్ళ క్రితం చూశామని చెప్పాను కదా. తర్వాత అనేక మార్పులు వచ్చి వుంటాయి. కానీ మేము చూసినప్పటి, నాకు తెలిసిన విశేషాలు రాస్తున్నాను నేను. జులై 4వ తారీకు 2007 ఉదయం 9-30కల్లా బస్ స్టాండ్ ఎదురుగా వున్న హోటల్ అన్నపూర్ణలో టిఫెన్ చేసి ఆటోలో 5 నిముషాల్లో గుత్తి కొండ కోటని చేరుకున్నాము. అప్పటికి మా వయసు 59 సంవత్సరాలు. మెట్లు ఎక్కటం, దిగటం గురించి అప్పటిదాకా ఎక్కువ ఆలోచించలేదు. కొత్త ప్రదేశాలన్నీ ఆసక్తిగానే చూస్తున్నాము. చారిత్రక ప్రాధాన్యత వున్న స్ధలం, చూడాలి అనే తపనతో కొండ ఎక్కటం మొదలు పెట్టాము. ఎత్తు ఎక్కువగానే వుంది. దోవ పైదాకా రోడ్డులాగానే వుంది విశాలంగా. దోవ అంతా ఆ కాలంలోనే పెద్ద పెద్ద గ్రనైట్ రాళ్ళు వేశారు. ఎక్కటానికి తేలిగ్గా వుంది. కొంచెం దూరం ఎక్కిన తర్వాత సయ్యద్ సాహెబ్ దర్గా వుంది. అక్కడ ఆగి ప్రణామాలు చేశాము. అది మా స్నేహితుడు మహమూద్ తల్లిగారి తరఫున తాతగారిదట (పూర్వీకులది) ఆ దర్గా.

కోటకి 15 ద్వారాలున్నాయిట. 108 బావులున్నాయన్నారు కదా. మేము 5, 6 చూశాము. అంత ఎత్తు కొండమీద నీటి నిల్వకి ఆ రోజుల్లో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఎంత ముందు చూపుతో ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నారోనని ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఏడాది దాకా అక్కడ కోటలో వాళ్ళెవరూ బయటకు రాకపోయినా దేనికీ ఇబ్బంది రాని విధంగా ఏర్పాటు చేసుకున్నారు.

చాలా పెద్ద అశ్వశాల, ధాన్యాగారం. పైన మహల్ లాంటిది ఏమీ లేదు. శిఖరాగ్రాన ఒక గుండ్రని ప్రదేశంలో ఎత్తయిన రాతి కట్టడం వుంది. జనాలెవరూ లేరు. కొండపైన అనంతపురంనుంచి వచ్చిన ఒక కుటుంబంవారు కలిశారు. అందులో ఒకాయన డి. భాస్కర్, గుత్తిలో సిండికేట్ బేంక్‌లో పనిచేస్తున్నారు. నాకు తెలిసిన ఈ కొద్ది వివరాలు ఆయనద్వారా తెలిసినవే. వాళ్ళు కూడా రావటంతో కొండ పై దాకా ధైర్యంగా వెళ్ళాము. లేకపోతే జన సంచారం లేని చోట మేమిద్దరమే వెళ్ళటానికి నేను కొంచెం భయపడ్డాను.

మధ్యాహ్నం 12 గం. అయింది శిఖరాగ్రం చేరేసరికి. 12-20 కి దిగటం మొదలు పెడితే కిందకొచ్చేసరికి 3 గం. అయింది. కొండ ఏటవాలుగా వుండటంతో ఆ రోడ్డుమీద అంత దూరం ఎక్కటంకన్నా దిగటం కష్టమయింది.

ఆటోలో రూమ్‌కి వచ్చాము. 4-25కి గది ఖాళీ చేసి తాడిపత్రి వెళ్దామని బయల్దేరాము. దోవలో ఆటో అతను తొండపాడు చెన్నకేశవస్వామి ఆలయం పురాతనమైనది, బాగుంటుందంటే అదే ఆటోలో బయల్దేరాము. అక్కడే తాడిపత్రి బస్ ఎక్కవచ్చంటే. 25 నిముషాల్లో ఆలయం చేరుకున్నాము. అక్కడకి చేరిన తర్వాత తెలిసింది అసలు గుడి కొండమీద వున్నదిట. కింద చిన్న ఆలయంలో ఉత్సవ విగ్రహాలు. చిన్న గుడి చుట్టూ యాత్రికులు వుండటానికి గదులు వున్నాయి. మేము అంత పెద్ద గుత్తి కొండ ఎక్కివచ్చి అలసిపోవటంతో మళ్ళీ కొండ ఎక్కే ప్రయత్నం చెయ్యలేదు.

5-05కల్లా అక్కడే తాడిపత్రి వెళ్ళే బస్ ఎక్కాము. 6-40కల్లా తాడిపత్రి చేరుకుని బస్ స్టాండ్ దగ్గరే శ్రీ గురు లాడ్జిలో రూమ్ తీసుకున్నాము. డబల్ బెడ్ రూమ్ 250 రూ. ఆ రోజుకింక విశ్రాంతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here