[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 26” వ్యాసంలో తాడిపత్రి పరిసరాల లోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
తాడిపత్రి పరిసరాలు
[dropcap]జు[/dropcap]లై 5వ తారీకు 2007 ఉదయం 9 గంటలకి బయల్దేరి బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని ఆటోలో బయల్దేరాము. ఆటో అక్కడ వున్న ఆలయాలు అన్నీ చూపించటానికి ముందే మాట్లాడుకున్నాము. అందుకే చిన్నవీ, పెద్దవీ అన్నీ సిన్సియర్‌గా చూపించాడు ఆటో అతను. ముందు బుగ్గ రామలింగేశ్వరాలయం దర్శించాము. ఈ ఆలయం చూస్తే బేలూరు, హొళేబీడు గుర్తొచ్చాయి. ఈ ఆలయం గురించి ఇంతకు ముందే చెప్పాను. అందుకే ముందుకు వెళ్తాను.
ఉదయం 10-15కి కన్యకాపరమేశ్వరి గుడికి వెళ్ళాము. ఈ ఆలయం కొత్తది. 10 గంటలకే మూసేశారుట. అమ్మవారిని చూడలేదు. అక్కడనుంచి మార్కండేయాలయం… అది కూడా మూసే వుంది. అక్కడనుంచి చింతల వెంకట రమణ మూర్తి ఆలయం. గాలి గోపురం రెనొవేషన్ జరుగుతోంది. స్వామికి పూజ చేయించాము. అమ్మవారి గుడి మూసి వుంది. అక్కడనుంచి కోదండరామ-రంగనాథ స్వామి ఆలయం కొత్తదే వెళ్ళాము. గుడి మూసి వున్నది. పూజారి గారు అయ్యంగార్. ఎదురుకుండానే వుంటారు. వచ్చి తలుపు తీశారు.
దర్శనమయ్యాక 11-30కల్లా అక్కడనుండి బయల్దేరి ఆదూరు కోన నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్ళాడు ఆటో అతను. చిన్న కొండమీద నరసింహస్వామి ఆలయం. కొంచెం పాతదే. చరిత్ర తెలియదు. పురాతన ఆలయం కాకపోతే చరిత్ర ఎక్కువ వుండదు కూడా. భక్తులు బాగానే వున్నారు. అక్కడనుండి ఓబులేశ కోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పై దానికన్నా కొత్తది. ఇక్కడా జనం వున్నారు. ఇవ్వన్నీ నేనూ, ఉమా వెళ్ళినప్పుడు మళ్ళీ చూడలేదు.
ఆలూరు కోన రంగనాథస్వామి గురించి మాకప్పుడు తెలియలేదో, లేక ఓబులేశుకోన, ఆదూరు కోన చూశాక వద్దనుకున్నామో గుర్తులేదు కానీ 1-45కల్లా తిరుగు ప్రయాణం, 2-15కి హోటల్ కి చేరుకుని 4-15కి గది ఖాళీ చేసి అనంతపురం బస్ ఎక్కి అనంతపురంలో దిగాం. అక్కడనుండి హిందూపురం బస్ ఎక్కి రాత్రి 8-30కి పెనుగొండలో దిగాం. అక్కడ వుండటానికి సరైన హోటల్ దొరకలేదు. అక్కడివారి సలహాతో మళ్ళీ బస్ ఎక్కి హిందూపురం చేరేసరికి రాత్రి 9-30. బస్ స్టాండ్ ఎదురుగానే హోటల్ రూమ్ తీసుకుని ఆ రోజుకి విశ్రాంతి.