భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 10: మా తెనాలి

0
1

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 10” వ్యాసంలో తెనాలిలోని పలు ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]తె[/dropcap]నాలి అనగానే హృదయం ఉప్పొంగుతుంది. ఒక విధమైన సంతోషం కట్టలు తెంచుకుంటుంది. ఏదో ఆత్మీయతా భావం. నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో ఏలూరులో అయినా చదువుకున్నది తెనాలిలోనే. 3వ తరగతి దేవీ చౌక్‌లో వున్న తడికల బడిలో, ఆరవ తరగతినుంచి ఎనిమిదో తరగతి దాకా తాలూకా హైస్కూలు, తర్వాత యస్.యస్.యల్.సి. దాకా మునిసిపల్ గరల్స్ హైస్కూలు. టైవు, షార్టుహేండు సుబ్బయ్యగారి ఇన్‌స్టిట్యూట్‌లో. తెనాలి వాస్తవ్యులందరికీ ఇవన్నీ పరిచయమే.

తర్వాత నా పదహారో ఏట అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ చేరి 55 ఏళ్ళు ఇక్కడ గడిపాను ఉద్యోగ రీత్యా. తెనాలిలాగానే, హైదరాబాద్ అన్నా ఆత్మీయతలు ఉప్పొంగే వేళ సెపరేషన్ వచ్చి, సంబంధాలు ప్రశ్నార్ధకాలయ్యే సందర్భాలలో ఆత్మీయతలని, అభిమానాలని చంపుకోలేక మౌనంగా వున్నాము. రాజ్యాలు విడగొట్టి, రాజధానులను మార్చినంత తేలికగా మనసులను మార్చుకోలేక మా మమతల తీవెని ఇక్కడే పాకిస్తున్నాము ఎప్పటికైనా పూలు పూస్తుందనే ఆశతో.

మళ్ళీ తెనాలికి వెళ్తే… మేము ఎక్కువగా వున్నది రామలింగేశ్వరపేట, పులిపాటి వారి వీధిలో శ్రీధర వారి ఇళ్ళల్లో. శ్రీధర వారివి ముగ్గురన్నదమ్ముల ఇళ్ళు వరసగా వుండేవి. అందులో జానకమ్మగారింట్లో (క్షమించండి… ఆయన పేరు గుర్తులేదు), వర్ధనమ్మగారింట్లో వున్నాము (అప్పటికే ఆవిడ పూర్వ సువాసిని). ఎదురుగా శ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రిగారిల్లు. ఈయన సుప్రసిధ్ధ శాస్త్రీయ సంగీతకారుడు, హరికథాగానం కూడా అద్భుతంగా చేసేవారు. నాకు గుర్తుండి ఆయన దగ్గరకు ఒక అమ్మాయి వచ్చేది సంగీతం నేర్చుకోవటానికి. ఎదురిల్లేకదా… ఆ సమయంలో నేనూ వెళ్ళేదాన్ని అప్పుడప్పడూ… పాట వినటానికి. సీతమ్మ మా యమ్మ, శ్రీ వరలక్ష్మి నమోస్తుతే ఆ అమ్మాయి నేర్చుకుంటుండంగానే మొదటిసారి విన్నాను. ఎందుకో, ఆ రెండు పాటలూ ఇప్పటికూ నాకిష్టం.

రామలింగేశ్వరపేటతో నాకున్న ఇంకో అనుబంధం మా అమ్మ. మేము అక్కడ వుండగానే నా 15వ ఏట మా అమ్మ స్వర్గస్తులయ్యారు. మా ఇంటి ఎదురుగా శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వున్నది. విశాలమైన ఆవరణలో ఆలయం. ఆ పేరు మాకప్పుడు తెలియదు. (కానీ ప్రస్తుతం పెద్ద బోర్డు వుంది.) శివాలయం… అంతే తెలుసు. అప్పుడు ఆవరణలో వేరే కట్టడాలు ఏమీ లేవు. గుడి చాలా పాతగా వుండేది. కానీ భక్తులు వస్తూ వుండేవారు. మా అమ్మ మీద అలిగి ఒకటి రెండుసార్లు నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే మా అమ్మ వచ్చి పిలుచుకు వచ్చేది. ఎందుకో, ఆ ఏరియాకి, ఆ ఇంటికి వెళ్తే అమ్మ కనబడుతుందనే ఒక పిచ్చి ఆశ చాలా కాలంనుంచి వుంది. అమ్మ అక్కడే పోవటంవల్ల అయి వుంటుంది.

అందుకే పొద్దున్నే ముందు ఆ వీధికి వెళ్ళాము. అంతా మారిపోయింది. మాధవపెద్దివారి డాబాకెళ్ళి సాయంకాలం సన్నజాజులు తెచ్చుకునేవాళ్ళం. అదెక్కడుందో… మేమున్న ఇళ్ళుకూడా ఆధునాతనంగా రూపు దిద్దుకున్నాయి. ఇళ్ళముందు ఎవరూ లేరు… పలకరించటానికి. ధైర్యం చేసి ములుకుట్ల సదాశివశాస్త్రిగారింట్లో అడుగు పెట్టాము. మేము ఫలానా అని చెబితే వారు ఆదరంగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళ రెండో అబ్బాయి విశ్వనాధం అక్కడ వుంటున్నారుట. ఇదివరకు మా ఇళ్ళవాళ్ళెవరూ ప్రస్తుతం అక్కడ లేరన్నారు. పోలిక లేని ఆ ఇళ్ళతో నా ఆలోచనలు సరిపోక, శివాలయానికి వెళ్ళాము.

ఇప్పుడు ఆ పాత ఆలయం కాదు. చాలా మార్పు వచ్చింది. చుట్టూ ఉపాలయాలు, హాలు కట్టారు. పూర్వం ఆలయం చాలా పాత ఆలయంలా కనిపించేది. కానీ ఇప్పుడు కొత్తగా వేసినట్లుందనిపించే రంగులతో ఆకర్షణీయంగా వున్నది. ఆలయం పేరు తెలుపుతూ పెద్ద బోర్డు. భక్తులతో సహా ఆలయంలో అభివృధ్ధి బాగా కనబడింది.

క్రీ.శ. 1911లో ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందట. 76 సంవత్సరాలపాటు కణ్యాణ మహోత్సవం వగైరాలు జరగలేదు. ప్రతిష్ఠించిన 76 సంవత్సరాల తర్వాత 23-6-87 నుంచి 26-6-87 వరకు శ్రీ పినపాటి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారిచే ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రోక్షణ వగైరా కార్యక్రమాలు జరిగాయి. 1988లో విమాన గోపురం నిర్మాణం జరిగింది. అప్పటినుంచి వివిధ పూజలు జరుగుతున్నాయి. భక్తులుకూడా బాగానే వస్తున్నారు. అన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఆలయం చూశానన్న తృప్తితో, మా జ్ఞాపకాలను మావారితో పంచుకుంటూ కొంచెంసేపు అక్కడ గడిపి రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్‌కి బయల్దేరాము.

రామలింగేశ్వరపేటతో వున్న మరో అనుబంధం సత్యనారాయణ పార్కు. ఆ పార్కుకు వెళ్ళే సమయం లేకపోయినా తలచుకునే సమయం దొరికింది. అట్ల తద్దె, ఉండ్రాళ్ళ తద్దె .. ఇప్పటి వాళ్ళకి తెలియక పోవచ్చు కానీ, మాకప్పుడు పెద్ద పండగలు. తలంట్లు పోసుకుని, గోరింటాకు పెట్టుకుని, తెల్లవారుఝామున లేచి కంది పచ్చడి, గోంగూర, గడ్డ పెరుగుతో భోజనం చేసి సత్యనారాయణ పార్కుకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. 10, 11 గంటల దాకా ఆ వీధిలో బల్ల ఉయ్యాల వున్న వారింట్లో ఉయ్యాల ఊగి ఇంటికి చేరేవాళ్ళం.

ఈ దేవీచౌక్… నాలుగు రోడ్ల కూడలిలో ఒక పక్కగా చిన్న దేవీ మందిరం. దీని పక్కనే ఒక రంగులు తయారు చేసే కంపెనీ. దానిపేరు అన్వేష్ పెయింట్స్. మా నాన్నగారు శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారు అక్కడే మేనేజర్‌గా పని చేశారు చాలాకాలం. ఆ కంపెనీని ఆనుకునే వున్న ఇంట్లో కూడా వున్నాము కొంతకాలం. దేవీ నవరాత్రులు అక్కడ చాలా వైభవంగా జరిగేవి. పెద్ద పెద్ద పందిళ్ళు వేసేవారు. రోజూ పూజా కార్యక్రమాలే కాకుండా సాయంకాలం సాస్కృతిక కార్యక్రమాలు వుండేవి. చక్కని నాట్య ప్రదర్శనలు, పౌరాణిక నాటకాలు… మా ఇంటి అరుగు మీద కూర్చునే చూసేవాళ్ళం. అవన్నీ ఎంత బాగుండేవో.

ఆ వీధి చివరే సాయిబాబా గుడి. మా చిన్నప్పుడు ఆ సాయిబాబా గుడికి రోజూ వెళ్తూండేదాన్ని. దేవుడిమీద భక్తితో కాదు… ప్రసాదం మీద భక్తితో. సాయంకాలాలు అక్కడు శ్రీ ములుగు సుబ్రహ్మణ్య శాస్తిగారిచే పురాణ కాలక్షేపం జరిగేది. నాకేమీ తెలియని వయసులో అన్ని కాలక్షేపాలు చుట్టూ వుండేవి, ఇలాంటప్పుడు వాటన్నింటికీ దూరమయ్యామే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్నట్లు సాయిబాబా గుడి దాటగానే స్వరాజ్య టాకీస్. ఎన్ని సినిమాలు చూశామో అక్కడ.

ఇంకొంచెం ముదుకు వెళ్తే చిట్టాంజనేయస్వామి గుడి. పేరుకు తగ్గట్లే చిన్న ఆంజనేయస్వామికి చిన్న గుడి. కానీ మహత్తు మాత్రం చాలా గొప్పది. ఎంతోమంది భక్తులు. అక్కడ శ్రీరామనవమికి తొమ్మిది రోజులు ఉత్సవాలు అతి వైభవంగా జరిగేవి. తర్వాత శ్రీరామ కళ్యాణం, వడపప్పు, పానకం… ఎలా మర్చిపోగలం!?

అక్కడనుంచి వైకుంఠపురం వెళ్ళాము. ఆ గుడి దగ్గర రైలు కట్ట వుండేది. రైలు పట్టాలకు మధ్యలో అడ్డంగా వుండే చెక్కలు అక్కడక్కడ విరిగి పోయి వుండేవి. చిన్నప్పుడు వాటిని దాటటానికి చాలా భయం వేసేది. ఆ వైకుంఠపురం నా చిన్నతనంలోనే మొదలయింది. విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావటం గురించి చెప్పుకోవటం నాకింకా గుర్తే. ముందు ఆ విగ్రహాలని ఎత్తయిన మట్టి దిబ్బమీద (పుట్ట?) ఏటవాలుగా పడుకోబెట్టి పైన ఆఛ్ఛాదనకి ఒక తడిక, నాలుగు వైపులా తడికలు కట్టారు. అయితే భక్తులు మాత్రం మొదటినుంచీ కూడా చాలామంది వచ్చేవారు. ఇప్పుడు అత్యంత వైభవోపేతమైన ఆలయంకింద రూపుదిద్దుకుంది.

ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఒక చిన్న కధ వుంది. శ్రీ తూళ్ళూరు బాలనరసింగరావు అనే ఆయన కలలో సర్పరాజు కనిపించి శ్రీ వెంకటేశ్వరస్వామికి ఆలయం నిర్మించమని సెలవివ్వటమేగాక ఫలానా స్ధలంలో నిర్మించమని కూడా చెప్పిందట. ఆ స్ధలమే ఇప్పుడు వైకుంఠపురం వెలసిన స్ధలం. ఇది నిజాపట్నం కాలువ పక్కన, రేపల్లె – గుంటూరు రైలు మార్గానికి దక్షణంలో వుంది. ఇంతకీ ఆ స్ధలం బాలనరింగరావుగారిదేనట. ఇంకేముంది… ఆయన కలలో సర్పరాజు ఆనతిని తన అదృష్టంగా భావించి, అందరి సహాయంతో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. తనని నిరూపించుకోవటానికా అన్నట్లు అనేక మంది భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరటం, ఆలయం దినదనాభివృధ్ధి చెందటం జరిగింది. ఇప్పుడున్న ఆలయం ఉన్నతమైన గోపురంతో, ఉపాలయాలతో, ఎన్నో ఆకర్షణలతో, మరెన్నో వసతులతో విలసిల్లుతోంది.

ఈ ట్రిప్‌లో నేను చూడాలనుకుని చూడలేకపోయినవి మా స్కూల్స్. తర్వాత మా అత్తయ్యగారబ్బాయి శ్రీ బదరీ షష్టిపూర్తికి వెళ్ళినప్పుడు వాటినీ చూశాను. అయితే మేము వెళ్ళేటప్పడికి చీకటి పడుతూండటంతో గేట్లు మూసేసి వున్నాయి. బయటనుంచే దర్శనం. మరీ మునిసిపల్ గరల్స్ హైస్కూలయితే గేటు మూసి వున్నా కొంచెం సేపు బయటనుంచే చూసి కొంత తృప్తిపడి వచ్చాను. గేట్లోంచి వెళ్తూనే ఎదురుగా ఉదయం ప్రార్ధన చేసేవాళ్ళం. కుడి చేతివైపు మొదటి గది మా ఫిప్త్ ఫారం క్లాస్ రూం. ఎడమ చేతి వైపు మొదటి గది యస్.యస్.యల్.సి. బి సెక్షన్. వై.యస్.ఆర్. టీచర్, విమలా టీచర్ ఒక్కసారి కళ్ళల్లో మెదిలారు. నేను 1961లో నా 13వ ఏటనే యస్.యస్.యల్.సి పాసయ్యాను. అప్పట్లో స్కూలు ఎదురుగానే సినీనటి శ్రీమతి శారద మకాం. అప్పట్లో ఆవిడకి పెళ్ళికాలేదు, సినిమాలలోకి రాలేదు. ఎప్పుడన్నా వచ్చి మాకు డంబుల్స్ నేర్పించేది.

వైకుంఠపురంనుంచి హోటల్‌కి వెళ్ళి రూమ్ ఖాళీ చేసి విజయవాడమీదుగా హైదరాబాద్ చేరుకున్నాము. నాలుగు రోజుల పాటు మావారు, నేను సాగించిన ఈ యాత్రలో దర్శించిన ఆలయాలివి.

వచ్చేవారంనుంచీ గుంటూరు జిల్లాలోనే ఈ వ్యాసాలు మొదలు పెట్టిన తర్వాత వేసిన ఇంకో ట్రిప్ విశేషాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here