భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 12: మంగళగిరి పానకాలరాయుడు

0
1

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 12” వ్యాసంలో మంగళగిరి లోని నరసింహస్వామి ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం

భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్

[dropcap]గుం[/dropcap]టూరు జిల్లాలో ప్రఖ్యాతి చెందిన క్షేత్రం మంగళగిరి. దీనిగురించీ చాలామందికి తెలిసే వుంటుంది, చాలామంది చూసే వుంటారు. అయితే ఆలయం అనగానే వెళ్ళటం నమస్కారం చెయ్యటం, రావటం తప్ప వివరాలు వివరంగా సాధారణంగా కనుక్కోము. ఎవరికైనా ఆసక్తికలిగి అడిగినా, చెప్పేవారు తక్కువే వున్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగి, పురాణాలలో పేర్కొనబడిన ఈ ఆలయాల పూర్వ చరిత్రలు గతంలో కలిసిపోతున్నాయి. వాటిని భావి తరాలకి అందించాలనే నా ఈ చిన్ని ప్రయత్నం.

మా నాన్నగారు తెనాలి తర్వాత విజయవాడలో కూడా చాలాకాలం వుండటంతో ఇక్కడి చుట్టుపక్కల ప్రముఖ ఆలయాలను చాలాసార్లే దర్శించే అవకాశం దొరికింది. అందులో ఒకటి ఈ మంగళగిరి కూడా. మరి ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి చరిత్ర కూడా తెలుసుకుందాము.

శ్రీ నరసింహుడు సద్యోజాతుడు. అంటే భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. ఆపదలలో వున్న భక్తులను, వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటివారు తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన వెలసిన ఐదు క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు… ఈ ఐదు క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అవి

  1. మంగళగిరి – పానకాలయ్య
  2. వేదాద్రి – స్నానాలయ్య
  3. మట్టపల్లి – అన్నాలయ్య
  4. వాడపల్లి – దీపాలయ్య
  5. కేతవరము – వజ్రాలయ్య

వీటిలో రెండు – మంగళగిరి, కేతవరము గుంటూరు జిల్లాలో వునాయి. మనమిప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం గురించి తెలుసుకుందాము. మిగతా నాలుగు క్షేత్రాలకన్నా, ప్రస్తుతం కృష్ణానదికి కొంచెం దూరంగా వున్న క్షేత్రమిది.

మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలి గోపురం, చేనేత వస్త్రాలు (మంగళగిరి చేనేత వస్త్రాలు – డ్రెస్ మెటీరియల్, చీరెలు బహుళ ప్రచారం పొందాయి). ఇవ్వన్నీ ఇక్కడ ప్రసిధ్ధి కెక్కినవే. ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకుందాము.

స్ధల పురాణం:

మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన వున్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోవచ్చు.

హిరణ్యకశిపుని వధానంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ వున్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్థించినా ఫలితం కనబడలేదు. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించినది. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఈయనకి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.

పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.

పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం వున్నది. దీనికి పక్కగా ఒక సొరంగం వుంటుంది. దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన వున్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు. ఋషులు ఇదివరకు ఆ మార్గంగుండానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసివచ్చి స్వామిని సేవించేవారంటారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది.

సర్వ మంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవి.

పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో వున్న ఇంకొక కథ.. స్వామి పానకం తాగటం ఎంతమటుకు నిజమో పరీక్షించటానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయడు తన బావమరిది, శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలసి కొండపై స్వామివారి తెరిచివున్న నోట్లోకి తన కుడిచేతిని పోనిచ్చారుట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందిట. అంకినీడుగారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడుగారు చెయ్యి బయటకి తియ్యగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా వుండటం చూసి విస్మయం చెందారుట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి, స్వామికి తన శరీరం ఆహారమయిందని, తన జన్మ సార్ధకమయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారుట.

కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం వుండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ దీపం పెడతామని మొక్కుకుని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు.

కొండకిందవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో వున్న భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయంలో మూర్తులను, ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించారుట.

గాలి గోపురం:

ఆలయానికి నాలుగువైపులా గాలి గోపురాలున్నా తూర్పున వున్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టి 3 అంతస్తులు కట్టించారు. తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు క్రీ.శ. 1807 – 1809లో ఈ గోపురం పై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపచేశారు. 153 అడుగుల ఎత్తు వున్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా వుండి ఇంత ఎత్తుగావున్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇది ప్రసిధ్దికెక్కింది.

దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషంకూడా ప్రచారంలో వున్నది. గోపురము 14 అంతస్తులూ నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట. గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక, శిల్ప శాస్త్రంలో విజ్ఞుల సలహామేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సుప్రసిధ్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు.

ఉత్సవాలు:

ఫాల్గుణ మాసంలో 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. ఫాల్గుణ శుధ్ద షష్టినాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి, శ్రీదేవి, భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మరునాడు, అంటే పౌర్ణమి రోజు జరిగే రథోత్సవంలో లక్షమంది పైగా ప్రజలు పాల్గొంటారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరనాళ్ళు కూడా ప్రసిద్ధికెక్కింది.

శ్రీరామనవమి, హనుమజ్జయంతి, నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి వగైరా ఇక్కడ జరిగే ఇతర ముఖ్య ఉత్సవాలు.

కొండపైన పానకాలస్వామి ఆలయానికి మెట్ల మార్గమేకాక వాహనంలో కూడా చేరుకోవచ్చు.

దర్శన సమయాలు:

కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది. సాయంత్రం సమయంలో దేవతలు, ఋషులు స్వామిని సేవించటానికి వస్తారని ఇక్కడివారి నమ్మకం. అందుకే 3 గం.లకి ఆలయం మూసేస్తారు.

కొండ దిగువనవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలు – ఉదయం 5 గం. లనుంచి 12-30 దాకా తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి 8-30 దాకా.

మార్గము:

విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో వున్న మంగళగిరి చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.

భోజన, వసతి సౌకర్యాలు:

మంగళగిరి, విజయవాడ, గుంటూర్లలో అన్ని వసతులు లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here