[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 13” వ్యాసంలో వజ్రాలయ్య కేతవరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]తె[/dropcap]లుగునాట కృష్ణా పరీవాహక ప్రాంతంలో నెలకొన్న ఐదు నరసింహ స్వామి ఆలయాల్లో (పంచ నారసింహ క్షేత్రాలు) రెండు గుంటూరు జిల్లాలో వున్నాయని, వాటిలో ఒకటి మంగళగిరి అని కిందటి వారం చెప్పుకున్నాం కదా. ఈ వారం రెండవ క్షేత్రం కేతవరం గురించి చెబుతాను. దీనిని మేము రెండుసార్లు దర్శించే అవకాశం కలిగింది. మంగళగిరి తప్ప మిగతా నాలుగూ కృష్ణ ఒడ్డునే వున్నాయి. కేతవరంలోని దేవాలయం వరకు తూర్పు దిశగా ప్రవహించిన కృష్ణమ్మ ఇక్కడనుండి ఉత్తర దిశగా సాగుతుంది.
అన్ని మెట్లు ఎక్కలేనివారి కోసమో, తగు స్ధలం లేకో, కొండ దిగువన కూడా ఒక ఆలయం నిర్మించి అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడా నిత్య పూజలు జరుగుతాయి. కొండ దిగువున వున్న ఆలయం స్వామివారి ఉత్సవాలకోసం నిర్మించబడిందని కూడా చెబుతారు.
ఈ రెండు ఆలయాలే కాక ఈ ఊర్లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మూడో ఆలయం కూడా కృష్ణానది ఒడ్డునే నిర్మింపబడింది. ఇది మిగతా రెండు ఆలయాలకన్నా సుందరమైనది, విశాలమైనది అంటారు. ఇక్కడ ప్రకృతి రమణీయంగా వుంటుంది. కేతవరం చిన్న ఊరు. ఇంత చిన్న ఊరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు మూడు వుండటం, ఆ మూడింటిలోనూ నిత్య పూజాదులు జరగటం విశేషమే.
స్ధల పురాణం
క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కేతవర్మ అనే రాజు పరిపాలించాడు. ఆయన పేరుమీదే ఈ ఊరుకి కేతవరం అనే పేరు వచ్చింది. వాడుక భాషలో కేతారం అని కూడా అంటారు. ఇక్కడ స్వామి ఆవిర్భావానికి సంబంధించి ప్రచారంలో వున్న కథ… కేతవర్మ ఈ ప్రాంతాన్ని పాలించే కాలంలో ఒక గొఱ్ఱెల కాపరి ఈ కొండమీదకి గొఱ్ఱెలను కాచుకోవటానికి వెళ్ళాడుట. మధ్యలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో స్వామి గొఱ్ఱెలకాపరి కలలో కనబడి తాను అక్కడ వెలసి వున్నానని, అప్పటిదాకా దేవతలకే దర్శనమిస్తున్న తాను ఇక ముందు మనుష్యులకు కూడా దర్శనమివ్వదలచానని, రాజుకి తెలిపి ఆలయం నిర్మించమని చెప్పాడు. గొఱ్ఱెల కాపరి ఆ విషయాన్ని మహారాజైన కేతవర్మకి తెలియజేశాడు. కేతవర్మ కొండమీదంతా గాలించి శ్రీ స్వామి, అమ్మవార్ల స్వయంభూ మూర్తులను చూసి, వెంటనే కొండపై స్వామికి దేవాలయం కట్టించారు.
దేవాలయ నిర్మాణం సమయంలో నీటి కోసం కొండ కింద ఇప్పటి ఆలయం ముందు కోనేరు తవ్వారు. అప్పుడు ఇక్కడ నీరు పడిందిటగానీ, నిర్మాణం పూర్తికాగానే ఈ కోనేరులో నీరు ఎండిపోయిందట. ఆ కోనేరు తవ్వే సమయంలో రెండు అద్భుతాలు జరిగాయి. అక్కడ తవ్వేటప్పుడు, పనిచేసే కూలీలలో ఒకరి కాలికి రాయి గుచ్చుకొని రక్తస్రావం జరిగింది. ఆ గాయాన్ని నీటితో శుభ్రపరిచేటప్పుడు గుచ్చుకున్న రాయిని వజ్రంగా గుర్తించారు. అక్కడ ఇంకా వజ్రాలు దొరుకుతాయేమోనని ఇంకా త్రవ్వగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు బయటపడ్డాయి.
ఇప్పటికీ వర్షాకాలంలో అప్పుడప్పుడూ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయిట. ఇది వజ్రాలు దొరికే ప్రదేశంగనుక, స్వామి వజ్రంతో దొరికాడుగనుక, ఈ స్వామిని వజ్రాలయ్య అనికూడా అంటారు.
ఉత్సవాలు
ప్రతి సంవత్సరం చైత్ర శుధ్ధ త్రయోదశినుంచి పౌర్ణమి వరకు స్వామివారు కళ్యాణోత్సవాలు ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. చైత్ర శుధ్ధ చతుర్దశికి స్వామివారి కళ్యాణం కొండకింది దేవాలయంలోనే జరుగుతుంది.
చైత్ర శుధ్ధపౌర్ణమి రోజు స్వామివారికి రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. పూర్వం స్వామివారికి కంచు రథం వుండేదట. ఒకసారి కోనేరులో దొరికిన ఉత్సవ విగ్రహాలను కంచు రథంలో ఊరేగిస్తుండగా భక్తుల పట్టుదప్పి ఆ రథం విగ్రహాలతో సహా పల్లంలో వున్న కృష్ణానదిలో పడిపోయిందనీ, ఇప్పటికీ ఆ రథం అక్కడ కృష్ణానదిలో వుందని చెప్పుకుంటారు. ఇక్కడ కృష్ణానది లోతుగా వుంటుందిట.
కంచు రథం కృష్ణానదిలో పడిన తర్వాత శ్రీ పింగళ రామిరెడ్డి అనే భక్తుడు స్వామివారికి ఇంకో రథం చేయించారు. అప్పటినుంచీ స్వామివారి రథయాత్రలో ఈ రథాన్ని ఉపయోగిస్తున్నారు.
ఒకప్పుడు ఈ ఆలయం 20 సత్రాలతో అత్యంత వైభవంగా వెలుగొందిందట. గుడికి కొంచెం దూరంలో నేలమట్టమయిన కోట చిహ్నాలు కనబడతాయి.
క్రీ.శ. 1992 దాకా ఈ ఆలయానికి పెద్ద ఆదాయం లేదు. తర్వాత దేవాలయ భూములలో పలకల బండలు పడ్డాయిట. దానితో ఆలయ ఆదాయం పెరిగి, అభివృధ్ధి జరుగుతోంది.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో వెలిసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటైన కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అవకాశం వున్నవారు తప్పక దర్శించవలసిన క్షేత్రము.
మార్గము
గుంటూరునుంచి మాచర్ల వెళ్ళే రహదారిలో బెల్లంకొండ అడ్డ రోడ్డునుంచి దాదాపు 25 కి.మీ.ల దూరంలో వున్నది కేతవరం. సత్తెనపల్లినుంచి పులిచింతల, చిట్యాల వెళ్ళే బస్సులు కేతవరం గ్రామంగుండా వెళ్తాయి.