Site icon Sanchika

భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 14: భట్టిప్రోలు బౌద్ధస్తూపం

[box type=’note’ fontsize=’16’] ” భక్తి పర్యటన గుంటూరు జిల్లా– 14″ వ్యాసంలో భట్టిప్రోలులోని బౌద్ధస్తూపం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఇం[/dropcap]తకుముందు నేను చాలా సార్లు చూసిన కొన్ని ఆలయాల గురించి ఇప్పటిదాకా చదివారు కదా. సంచికలో ఈ యాత్ర మొదలు పెట్టాక గుంటూరు జిల్లాలో నేను చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి అనిపించింది. పైగా మా అన్నయ్య శ్రీ పులిగడ్డ ఉమా మహేశ్వరరావు చాలా కాలంనుంచి నాకు మా ఊరు కూచినపూడి చూపించాలని ఉత్సాహపడ్డారు. నా యాత్రల గురించి చదువుతూ, కూచినపూడి.. మన ఊరు, మన ఆలయం (మాదేమీ లేదండీ.. మా తాతగార్ల అన్నదమ్ములది..) అవి చూపిస్తాను.. వాటి గురించి రాయి అనేవారు. అయితే వివిధ కారణాలవల్ల అప్పట్లో మేము కలిసి వెళ్ళటం కుదరలేదు. ప్రస్తుతం ఆయన దూర ప్రయాణం చేసే ఓపిక లేక నాకు ఆ ఊరు చూపించాలనే ఉత్సాహంతో ఆ బాధ్యత అక్కడ వున్న మా తమ్ముడు శ్రీ పులిగడ్డ రామచంద్రమూర్తికి అప్పజెప్పారు. ఈయన సుప్రసిధ్ధ గాయకుడు. హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరే అక్కడి జమీందార్లు (ప్రస్తుతం జమీలు లేవులెండి). వీరి తాతగారు కీ.శే. శ్రీ పులిగడ్డ రామచంద్రరావుగారు తన హయాంలో ఆ గ్రామానికీ, పరిసరాలకీ చాలా సేవలు చేశారు. ఊళ్ళో హైస్కూలు స్ధాపించి పిల్లలు అవస్థ పడకుండా చదువుకునే మార్గమేర్పాటు చేశారు. అలాగే వీరి తండ్రిగారు కీ.శే.శ్రీ పులిగడ్డ సీతారామాంజనేయ ప్రసాదరావుగారు కూడా ఈ గ్రామాభివృధ్ధికి చాలా కృషి చేశారు.

మా వంశీకుల గురించీ, మా ఊరు గురించీ తెలుసుకోవాలని నాకూ చిన్నప్పటినుంచీ ఉత్సాహం వుండేది. అది ఇప్పటికి నెరవేరింది. నిజానికి నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నా అంతట నేను వెళ్ళటం, అక్కడ వారికి నా ఉద్దేశం చెబితే వాళ్ళు అర్ధం చేసుకుని అక్కడ విశేషాలు తెలియజెయ్యటమే చాలామటుకూ జరుగుతుంది. కాని ఈ మారు గుంటూరు జిల్లాలో నేను చేసిన యాత్రలకు నాకు మార్గదర్శకులు.. స్నేహితులు, చుట్టాలు, పరిచయస్తులు, అప్పుడు పరిచయమైనవారు, ఇలా అనేక మంది సహాయం చేశారు, అండగా నిలిచారు. అంతేకాదు, కొత్త పరిచయాలు అనేకం అయినాయి. వారందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు.

ఇప్పటి గుంటూరు జిల్లా యాత్ర 29-7-2018న మొదలయింది. మా ఈ యాత్ర మూడు రోజులు, 15 ఊళ్ళల్లో జరిగింది. నేను 28వ తారీకుకే విజయవాడలో వున్న మా చెల్లెలు శ్రీమతి కాజ విమలగారింటికి చేరుకున్నాను. కూచినపూడిలోని మా తమ్ముడు శ్రీ రామచంద్రరావు (ఇంకో విశేషమేమిటంటే మేము చుట్టాలమేగానీ, ఇప్పటిదాకా ఒకరికొకరం తెలియము. ఈ ప్రయాణంతో ఎంతో ఆత్మీయులయ్యారు) 28వ తారీకు హైదరాబాదు త్యాగరాయగాన సభలో ఒక కార్యక్రమంలో పాల్గొని, 29 ఉదయం 6 గం.లకి కూచినపూడి చేరాడు. అయినా మాకోసం ఎంత శ్రమ తీసుకున్నాడో మీరే చూడండి.

ముందుగా ఫోన్‌లో మాట్లాడుకున్నదాని ప్రకారం 29వ తారీకు ఉదయం 9 గం. లకల్లా మేము భట్టిప్రోలుదాకా వెళ్ళాలి. అక్కడ ఆయన కలుస్తానన్నారు. మేము విజయవాడనుంచి నేను, మా చెల్లెలు విమల, వాళ్ళమ్మాయి నీలిమ, మా మేనకోడలు (ఉమామహేశ్వరరావుగారి అమ్మాయి) రాధిక పొద్దున్న 6-30కల్లా విజయవాడలో తెనాలి వెళ్ళే నాన్‌స్టాప్ బస్ ఎక్కి తెనాలిలో దిగాము. దోవలో మా విమల ఇంటినుంచి పేక్ చేసి తెచ్చిన ఇడ్లీ, మజ్జిగ లాగించేశాము. తెనాలినుంచి భట్టిప్రోలు బస్‌లో సరిగ్గా 9 గం.లకి భట్టిప్రోలు బస్ స్టాండ్‌లో దిగాం.

బస్ స్టాండ్ అంటే అన్ని ఊళ్ళకి వున్నట్లులేదు. కాలువ పక్కన రోడ్డుకి అటొకటి, ఇటొకటి రెండు బెంచీలు, 3, 4 కొట్లు. అదే సెంటరు, అదే బస్ స్టాండ్. అక్కడ దిగి మా తమ్ముడికి ఫోన్ చేశాము. దగ్గరలోనే వున్నాము, పది నిముషాల్లో వస్తున్నాము అన్నాడు. ఆ పది నిముషాలు వృథా చెయ్యకుండా, కాలువ పక్కన ఫోటోలు తీసుకున్నాము. సరిగ్గా పది నిముషాల్లో పెద్ద కారు ఆగింది మా ముందు. అందులోంచి మా తమ్ముడు సతీ సమేతంగా దిగాడు. పక్కనే శ్రీ ఫణిగారు, కూచినపూడి ఆలయంలో పూజారిగారు, ప్రముఖ జ్యోతిష్యులు, కారు నడుపుకుంటూ వచ్చిన ఇంకో స్నేహితుడు శ్రీ సతీష్ గారు. పరిచయాలు కాగానే, బాధ్యత శ్రీ ఫణిగారికి అప్పచెప్పేశాడు మా తమ్ముడు. ఆయనకి ఆలయాల గురించి బాగా తెలుసని ఆయనని తీసుకువచ్చాడు మా తమ్ముడు. ఆయన మమ్మల్ని ఎక్కడా సమయం వృథా చెయ్యనివ్వకుండా, అవసరమైన చోట హడావిడి చేసి ఆ రోజు సాయంకాలం లోపు ఎనిమిది ఊళ్ళు చూపించారండీ. ఆయన ఎంత బిజీ మనిషి అంటే ఆయనకోసం ఫోన్లు వస్తూనే వున్నాయి. వాళ్ళకి సమాధానం చెబుతూనే మా యాత్ర గురించి అమిత శ్రధ్ధ తీసుకున్నారు.

ఇంక మా తమ్ముడు మరదలు గురించి ఏమి చెప్పను. తమ్ముడు కూచినపూడి శ్రీ పులిగడ్డ రామచంద్రరావు హైస్కూలు నుంచి హెడ్ మాస్టర్‌గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. మా మరదలు శ్రీమతి సునీత కూడా అదే స్కూల్లో టీచర్‌గా చేస్తోంది. చాలా కలుపుగోలు మనిషి. అదే మొదటి పరిచయం అయినా, ఎంతో ఆత్మీయులంలా కలిసిపోయాం.

వాళ్ళు నలుగురూ, మేము నలుగురం ఎనిమిదిమందినీ ఎక్కించగానే ఫణిగారు కారుని కొంచెం దూరంలో ఆపి ఆదే భట్టిప్రోలు దిబ్బ. బౌద్ధస్తూపం అని చూపించారు. గేటు వేసి వుండటంతో దిగి వెళ్ళలేదు. కానీ దూరంనుంచీ అయినా మేము చూసిన బౌద్ధస్తూపం గురించి కొంచెం చెప్పాలికదా.

బౌద్ధస్తూపం

భట్టిప్రోలు దిబ్బల తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధస్తూపం ప్రపంచంలో వున్న స్తూపాలన్నింటిలోకీ ప్రముఖమైనది. ఇది క్రీ.పూ. 4 – 3 శతాబ్దాలనాటిదట. భవన నిర్మాణం మొదలయిన కొత్తల్లో వున్న నిర్మాణ వైఖరిని ఈ స్తూపం ప్రతిబింబిస్తోందిట. ఇక్కడ లభించిన శాసనాల వలన భట్టిప్రోలు ఆ కాలంలోనే గణతంత్ర రాజ్యంగా విలసిల్లిందని తెలుస్తోంది.

కాలగర్భంలో కలిసిపోయిన ఈ బౌద్ధస్తూపం తిరిగి క్రీ.శ. 1870నుంచి వెలుగులోకి రాసాగింది. బాస్వల్ లాంటి విదేశీయులేకాక, రాయప్రోలు సుబ్రహ్మణ్యం మొదలయిన తెలుగువారి కృషి వలన ఇక్కడ అనేక అమూల్యమైన చారిత్రిక నిక్షేపాలు బయల్పడ్డాయి.

ఇక్కడ దిబ్బలు తవ్వితే 1700 చ.గ.ల ఆవరణతో వున్న స్తూపం బయల్పడింది. స్థూప ప్రాకారంలో చలువరాతి పలకలు, మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కిన నలుచదరపు స్తంభాలు కనబడ్డాయి. శాసనాలలో వున్న కొన్ని వాక్యాల ఆధారంగా ఈ స్తూపం బౌద్ధ ధాతువుపై నిర్మంచబడిందని తెలుస్తోంది.

అక్కడినుంచి ఫణిగారి నిర్దేశం ప్రకారం కోటిపల్లివైపు బయల్దేరింది మా కారు. అంతమందిమి వున్నాం కదా. దోవంతా ఆలయాల గురించేకాక, సరదా కబుర్లు కూడా చాలా చెప్పుకుంటూ, అలసట అన్నది తెలియకుండా ప్రయాణం చేశాం.

అంతే కాదు, శ్రీ ఫణిగారు నాకు నిజాపట్నం మండల సంక్షిప్త దర్శిని, దివి సీమ ఆలయాల గురించి రెండు పుస్తకాలు కూడా ఇచ్చారు.

వచ్చేవారం కోటిపల్లి గురించి.

Exit mobile version