[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 19” వ్యాసంలో అడవుల దీవి లోని శ్రీ భ్రమరీ బాలత్రిపురసుందరీ సహిత మల్లికార్జునస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
చేతిలో వాహనం, తిరిగే మనసు వుంటే ముందు మనమనుకున్న గమ్యానికి వెళ్ళే దోవలో అనేక ఇతర మార్గాలు కనబడతాయి. కూచినపూడి వెళ్దామనుకుని బయల్దేరామా.. దోవలో శ్రీ ఫణిగారన్నారు.. మీ పూర్వీకులు తిరుగాడిన ఊరు ‘అడవుల దీవి’ కూడా చూపిస్తానని. అసలే మా తాత ముత్తాతలు నివసించిన, తిరిగిన ప్రదేశాలు చూడాలనే ఉత్సాహంతో వున్నానేమో సంబరంగా సరేననేశాను. ఇంకేముంది రేపల్లెనుంచి అక్కడికి 7 కి.మీ.ల దూరంలో వున్న ‘అడవుల దీవి’ మార్గం పట్టింది మా రథం.
నా చిన్నతనంలో మా ఇంట్లో ఈ ‘అడవుల దీవి’ పేరు తరచూ వినిపిస్తూ వుండేది. ఏదో స్కూల్లో చదువుతున్నాను కనుక దీవి అంటే తెలిసింది. ‘అడవుల దీవి’ అంటే ఆ దీవినిండా అడవులు వుండేవేమో, పాపం మా చుట్టాలెలా వుంటారో అక్కడ అనుకునేదాన్ని. ఆ ఆలోచన ఇప్పుడూ వున్నది కనుక ఇదివరకంత ఘోరంగా కాకపోయినా, ఇప్పుడూ ఆ ప్రాంతాలంతా మిగతా చోట్లకన్నా చెట్లు చాలా ఎక్కువగా వుంటాయేమోననుకున్నా. పాడి పంటలతో పచ్చగా వున్న ఊరేగానీ అడవులతో నిండిన దీవి కాదు. అసలు మనవాళ్ళెవరన్నా ఈ ఊళ్ళ పేర్లు ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో కొంచెం పరిశోధన చెయ్యాలండీ. ఏమంటారు?
ఇంతకీ మేము చూసిన ఆలయం గురించి చెప్పాలి కదా. ఇది శివాలయం. ఇక్కడ స్వామి పేరు శ్రీ భ్రమరీ బాలత్రిపురసుందరీ సహిత మల్లికార్జునస్వామి. ఈ స్వామి ఎప్పటినుంచి ఇక్కడ కొలువుతీరి వున్నాడో చెప్పలేము కానీ ఆలయం గోడమీద 2-2-1928న శ్రీ యల్లాప్రగడ వెంకట చలమయ్యగారు, వారి శ్రీమతి ప్రతిష్ఠించినట్లు వున్నది.
మల్లికార్జునస్వామి పక్కన ప్రత్యేక ఆలయంలో శ్రీ భ్రమరాంబ కొలువు తీరి వున్నది. చతుర్భుజాలతో విరాజిల్లే అమ్మ పైన రెండు చేతులలో త్రిశూలం, ఢమరుకం, కింద రెండు చేతులూ అభయ ముద్రతో, భక్తులను ఆదరిస్తున్నట్లుంటుంది. అమ్మవారి ప్రసన్న వదనాన్ని చూసినంతనే మనసంతా ప్రశాంతత నిండిపోతుంది. కోరికలను మరచి మనసంతా నిండిన సంతోషంతో నమస్కరిస్తాము.
ప్రక్కన ప్రత్యేక మండపాలలో ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు విరాజిల్లుతున్నారు. వీరభద్రుడు క్షేత్ర పాలకుడు పక్కనే ప్రత్యేక ఆలయంలో దర్శనమిస్తాడు.
నిత్య పూజలు, విశేష పూజలేకాక మాఘ పౌర్ణమికి ఈ స్వామి తిరునాళ్ళు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ముందురోజు అర్ధరాత్రి పూజలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. దీనికి నిజాంపట్నం, అడవులదీవి, హ్యారీస్ పేట, కొత్తపాలెం, గుర్నాధనగర్ తదితరప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేకపూజలు చేయించుకుంటారు.
తిరునాళ్ళలో రెండోరోజు, మాఘపౌర్ణమి రోజున, పరిశావారిపాలెం దగ్గర సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. రంగు రంగుల విద్యుద్దీపాల అలంకరణతో అతి సందడిగా వుండే ఈ తిరునాళ్ళను పురస్కరించుకొని భక్తులు ప్రభలు కూడా తీసుకు వస్తారు.
అడవులదీవి కరణంగారి అమ్మాయి జిల్లెళ్ళమూడి అమ్మగారి కోడలు అని ప్రత్యేక సమాచారం తెలిపారు శ్రీ ఫణిగారు.
చిన్నప్పుడు ఎక్కువగా విన్న అడవుల దీవి కూడా చూశామనే సంతోషంతో అక్కడనుంచి బయల్దేరాము.