గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 2: కోటప్ప కొండ

0
2

[box type=’note’ fontsize=’16’] కోటప్ప కొండ లోని త్రికూటేశ్వర స్వామి ఆలయం గురించి, పరిసర ప్రాంతాల గురించి, అక్కడి ఉత్సవాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మిగుంటూరు జిల్లా భక్తి పర్యటన – 2: కోటప్ప కొండ“లో. [/box]

[dropcap]ఈ[/dropcap] వారం కోటప్ప కొండ గురించి చెప్పుకుందామనుకున్నాం కదా. కైలాసాధినేత అయిన ఆ మహా శివుడు త్రికూటేశ్వరునిగా కొలువైన దివ్య సన్నిధి కోటప్ప కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసారావు పేట సమీపంలో వెలసిన ఈ దివ్య క్షేత్రం శివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతుంది.

కోటప్ప కొండ విశేషాలు

కోటప్ప వెలసిన కొండ మూడు శిఖరాలతో భక్తులని ఆకర్షిస్తూ వుంటుంది. అందుకే దీనికి త్రికూటమని, ఇక్కడ వెలసిన శంకరుడికి త్రికూటేశ్వరుడని పేరు వచ్చింది. ఈయననే మేధా దక్షిణా మూర్తి అంటారు. దక్షిణా మూర్తి జ్ఞాన ప్రదాత. ఈ స్వామిని కొలిస్తే జ్ఞానం అభివృధ్ధి చెందుతుందని నమ్మకం. అంతేకాదు. స్వామి దర్శనం చేసుకున్న వారి జాతకాలలో గురు బలం పెరుగుతుందట. దీని వలన జాతకంలో వుండే ఇతర గ్రహాలవల్ల వచ్చే దోషాలు కొంత తగ్గుతాయట.

కొండపైన 1587 అడుగుల ఎత్తులో వున్న ఈ ఆలయాన్ని చేరుకోవటానికి వెయ్యి పైన మెట్లు ఎక్కాలండీ. ఈ మెట్లు కూడా భక్తులకోసం క్రీ.శ. 1761లో నరసారావుపేట జమీందారు కట్టించారు. అవి కూడా లేనప్పుడు ఈ దేవాలయానికి రావటానికి భక్తులు ఎంత కష్టపడేవారోకదా!!? రాను రానూ ఆ మెట్లు కూడా ఎక్కలేని భక్తుల కోసం గుడి దాకా చక్కని రోడ్డు వేయించారు 1999లో శ్రీ కోడెల శివప్రసాదరావుగారు మంత్రిగా వున్న సమయంలో. గుడిదాకా వాహనాల్లో వెళ్ళచ్చు. అయితే ఆ తర్వాత ఎక్కాల్సిన కొద్ది మెట్లూ బాగా ఎత్తుగా వుండటంతో కొంచెం ఆయాసపడ్డా.. తప్పదు.. నెమ్మదిగా ఎక్కండి మరి స్వామిని చూడాలిగా.

అన్నట్లు ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలని చూశారా? దోవంతా కూడా చూశారా? పూల చెట్లతో ఎంత అందంగా వున్నదో! దోవలో మ్యూజియమ్, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణయ్య కాళీయమర్దనం చేసే విగ్రహం చూడవచ్చు. దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీ నారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట వుంటారు)… పెద్ద విగ్రహాలని కూడా చూడవచ్చు. ఈ ఆలయాన్ని అభివృధ్ధి పరచటానికి బాగా శ్రధ్ధ తీసుకుంటున్నారు. దానితో ఇదివరకుకన్నా ఇప్పుడు భక్తుల రాకకూడా అధికమయింది.

 

 

 

 

 

 

 

ఇప్పటికీ చాలామంది భక్తులు మెట్ల దోవలో రావటానికే ఇష్టపడతారు. ఈ దోవ మొదట్లో బొచ్చు కోటయ్య ఆలయం, వినాయక ఆలయం వుంటాయి. భక్తులు బొచ్చు కోటయ్య ఆలయం దగ్గర తలనీలాలు సమర్పించి స్నానం చేసి కొండెక్కుతారు. మేము మెట్ల దోవలో వెళ్ళలేదు కనుక వీటిని చూడలేక పోయాము.

ఈ మెట్ల మార్గం చివరలో గొల్లభామకి చిన్న ఆలయం వున్నది. త్రికోటేశ్వరుని దర్శించిన భక్తులు గొల్లభామ ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు. వాహనంలో వెళ్ళినవారుకూడా కొంచెం దిగువలో వున్న గొల్లభామ ఆలయాన్ని చూడాలనుకుంటే ఎక్కువ కష్టపడక్కరలేదు.

ఆలయ నిర్మాణం

ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ. 1172కి ముందే జరిగివుంటుందంటారు. అసలు ఈ ప్రదేశం పేరు కొండకావూరు. కాని భక్తులు కోటప్పకొండగా, త్రికూట పర్వతంగానే పిలుస్తారు. ఈ కొండపై మూడు శిఖరాలు చూడవచ్చన్నాను కదా. వాటిని త్రిమూర్తుల పేర్లతో బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలుగా పిలుస్తారు.

శ్రీ త్రికూటేశ్వరస్వామి ఆలయం బ్రహ్మ శిఖరం మీద వున్నది.. ఇక్కడే పెద్ద శివుడి విగ్రహం, అభిషేక మండపం, ధ్యాన మండపం, నవగ్రహ ఆలయాలు కూడా వున్నాయి. ఒక పెద్ద హాలులో చుట్టూ గోడలకి స్ధల పురాణం అమర్చారు. వ్యూ పాయింట్ నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

ఈ శిఖరం మీదే కొంచెం పైకి వెళ్తే పెద్ద నాగేంద్రుని పుట్టని చూడవచ్చు. భక్తులు ఇక్కడ నాగేంద్రుని అర్చిస్తారు. ఇంక స్ధల పురాణం గురించి తెలుసుకుందామా….

స్ధల పురాణం

ప్రతి పురాతన ఆలయానికి వున్నట్లే దీనికీ స్ధల పురాణం రకరకాలుగా వున్నది. దక్షయజ్ఞం ధ్వంసమయిన తర్వాత పరమశివుడు ఒక చిన్న బాలుడిగా రూపం దాల్చి దక్షిణామూర్తిగా కైలాసంలో కఠోర తపస్సు చేశాడుట. ఆ సమయంలో బ్రహ్మ మిగిలిన దేవతలతో దక్షిణామూర్తిని దర్శించి తమకు జ్ఞాన బోధ చెయ్యమని కోరాడుట. శివుడు వారిని త్రికూటాచలానికి వస్తే జ్ఞాన బోధ చేస్తానని చెబుతాడు. శివునాజ్ఞ పాటించి వారు త్రికూటాచలం చేరుకుంటారు. తన మాట ప్రకారం ఇక్కడ వారికి శివుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆ ప్రదేశంలో వున్న గుడి పాత కోటప్ప గుడి అంటారు. ఇది రుద్ర శిఖరం మీద వున్నది. ఇక్కడ లింగం ఒక అడుగు ఎత్తు వుంటుంది.

రుద్ర శిఖరం ప్రక్కన విష్ణు శిఖరం. దీనికీ ఒక కధ వున్నది. శివుడికి ఆహ్వానం లేని దక్షయజ్ఞంలో హవిస్సు స్వీకరించిన పాపం పోగొట్టుకోవటానికి విష్ణువు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడిచాడట. ఆ రంధ్రంలోంచి నీరు వుప్పొంగి ప్రవహించింది. ఆ నీటిలో స్నానము చేసి తనని ప్రార్థిస్తే వారి పాపం పోతుందని శివుడు చెప్పాడు. విష్ణువు అలాగే చేసి తన పాపాన్ని పోగొట్టుకున్నాడుట. ఇక్కడ ప్రత్యక్షమైన శివుణ్ణి పాప వినాశనేశ్వరుడు అంటారు. యాత్రికులు ముందు ఈ శిఖరానికి వచ్చి ఇక్కడ స్నానం చేసి, పాప వినాశనేశ్వరుణ్ణి సేవించి తరువాత కొత్త కోటప్ప కొండకి వెళ్తారు. ఈ సరస్సే కాక కొండమీద ఇంకా కొలనులు వున్నాయిట. అవకాశం వున్నవారు చూడవచ్చు.

కొత్త కోటప్ప ఆలయం బ్రహ్మ శిఖరం మీద వున్నది. విష్ణు, రుద్ర శిఖరాలమీద శివుడు స్వయంగా వెలిశాడు, బ్రహ్మ శిఖరం ఖాళీగా వుందని, బ్రహ్మదేవుడు చింతించి, శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ఇక్కడా వెలిశాడు. ఇది కొత్త కోటప్ప కొండ. ఇక్కడే శివరాత్రికి తిరణాల జరుగుతుంది.

కాకులు కనబడవు

ఈ కొండమీద కాకులు కనబడవు. దానికి ఒక భక్తురాలు కారణం. ఆ కధ ఏమిటంటే… దక్ష యజ్ఞం విధ్వంసానంతరం శివుడు సతీ వియోగాన్ని భరించలేక ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఈ కొండ కింద కొండరావూరు అనే గ్రామం వుండేది. అందులో నంద, కుందారి అనే గొల్ల దంపతులు, వారి కుమార్తె ఆనందవల్లి వుండేవారు. ఆనందవల్లి కొండ అవతల గ్రామంలో పాలు, పెరుగు అమ్మటానికి ఈ కొండ మీదనుంచే వెళ్తూ వుండేది. ఆవిడ పరమ శివుడు అక్కడ తపస్సు చేసుకోవటం చూసి ప్రతి రోజూ పాలు, తేనె స్వామికి నైవేద్యం పెట్టి వెళ్తూ వుండేది. అదే సమయంలో సాలంకయ్య అనే ఒక రైతు అక్కడికి రాగా శివుడు ఆయనకి ఒక యోగిలాగా కనబడ్డాడు. సాలంకయ్య ఆయనని ఒక మహానుభావుడుగా గుర్తించి తన దగ్గర వున్న పళ్ళని సమర్పించి వెళ్ళాడు. ఆప్పటినుంచి సాలంకయ్య కూడా ప్రతి రోజూ స్వామికి పళ్ళు సమర్పించి వెళ్ళేవాడు.

ఒక రోజు గొల్లభామ ఆనందవల్లి స్వామికి పాలను తీసుకు వస్తూ మార్గ మధ్యంలో అలసి పాలకుండను దించి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక కాకి వచ్చి ఆ పాలకుండమీద వాలింది. దానితో కుండ ఒరిగి పాలన్నీ నేలపాలయ్యాయి. దానితో గొల్లభామ కోపగించి ఆ ప్రాంతంలో కాకులుండకూడదని శాపం పెట్టిందిట. అప్పటినుంచీ ఆ కొండమీద కాకులు కనబడవు ఇప్పటికీ.

గొల్లభామ ఆనందవల్లి తనకి వివాహం అయ్యి, గర్భవతి అయినప్పటికీ స్వామి సేవ మానలేదు. అయితే నెలలు నిండిన తర్వాత కొండ ఎక్కటానికి ఇబ్బంది పడుతూ, ఒక రోజు స్వామీ, ఈ సమయంలో నేను కొండ ఎక్కలేక పోతున్నాను. దయచేసి నువ్వే కిందకి రమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్ధించింది. స్వామి సరేనని ఆవిడ వెనకాలే తాను వస్తానని, అయితే తాను వచ్చేటప్పుడు ఆవిడ వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పాడు. సరేనని బయల్దేరింది ఆనందవల్లి.

అంతకుముందే సాలంకయ్య స్వామిని దర్శించి స్వామీ, ఈ రోజు మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించమని కోరాడు. స్వామి అంగీకరించి ఆయనని ఇంటికి వెళ్ళమని, తాను వస్తానని చెప్పాడు. సాలంకయ్య ఆనందంగా స్వామి ఆతిధ్యానికి తగు ఏర్పాట్లు చేసుకోవటానికి ఇంటికి వెళ్ళాడు.

ఈశ్వరుడు గొల్లభామ వెనకాల బయల్దేరాడు. శివుడి అడుగులకి కొండలు పగిలి, వింత శబ్దాలు రాసాగాయి. ఆనందవల్లి కొంచెం సేపు వూరుకున్నా తర్వాత భయంతో వెనక్కి తిరిగి చూసింది. దానితో శివుడు లింగ రూపం దాల్చి అక్కడే ఆగిపోయాడు. గొల్లభామ కూడా శిలగా మారిపోయింది. ఆ సమయంలో స్వామి తన ఇంటికి ఇంకా రాలేదని సాలంకయ్య స్వామికోసం వచ్చి ఈ దృశ్యం చూసి విలపించాడు. బాధపడుతున్న సాలంకయ్యకు శివలింగం నుంచి మాటలు వినిపించాయి… బాధ పడవద్దనీ, కోటి ప్రభలు ఎప్పుడైతే అక్కడికి వస్తాయో, అప్పుడు తాను కిందకి దిగి వస్తానని… ఆ శివలింగమున్న ప్రదేశమే పాత కోటప్పకొండగా ప్రసిధ్ధి చెందింది.

ఆ శివలింగానికి గుడి కట్టించి పూజించసాగాడు సాలంకయ్య. ఆయనే తర్వాత గొల్లభామకి కూడా గుడి కట్టించాడు. శివుణ్ణి దర్శించిన భక్తులు శివ భక్తురాలగు గొల్లభామ ఆలయాన్ని కూడా దర్శించి తరిస్తారు.

సాలంకయ్య అమ్మవారికి కూడా ఒక ఆలయాన్ని కట్టించాలనుకున్నాడు. అయితే శివుడు అతనికి కలలో కనిపించి తాను సతీ వియోగ సమయంలో అక్కడికి వచ్చాడు కనుక అమ్మవారికి అక్కడ గుడి వద్దని, కళ్యాణములు చెయ్యవద్దని ఆదేశించాడుట. అందుకే ఇక్కడ పార్వతీ దేవి ఆలయం లేదు. ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం కూడా చెయ్యరు.

చరిత్ర

చారిత్రక ఆధారాలనుబట్టి శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించటానికి ఈ ప్రాంతానికి వచ్చి నెల రోజులు పైన సమయం పట్టినా గెలవలేక పోయాడు. అప్పుడు ఈ స్వామి మహత్యం విని వచ్చి స్వామికి మొక్కుకుని వెళ్తే జయం లభించింది. ఆ సమయంలో స్వామివారి నిత్య ధూప దీప నైవేద్యాలకోసం కొండకావూరు గ్రామాన్ని రాసిచ్చాడని శాసనం ద్వారా తెలుస్తోంది. విష్ణుకుండిన రాజు రెండవ మాధవవర్మ కాలంలో ఈ క్షేత్రము ఎంతో ఉచ్ఛస్ధితిలో వున్నదని చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తున్నది.

ఈ ఆలయానికి నరసారావుపేట సంస్ధానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా వుంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం 1761లో రాజా మల్రాజు గుండారాయణంగారు నిర్మింప చేశారు.

ఉత్సవాలు

కోటప్పకొండ అనగానే శివరాత్రి ప్రభల సంబరమే గుర్తొస్తుంది. అంత ప్రసిధ్ధి చెందిందీ ఉత్సవం. ఇది మాఘ బహుళ ఏకాదశినుంచి అమావాస్య వరకు జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు వంద అడుగుల వరకు ఎత్తున్న ప్రభలను రక రకాలుగా అలంకరించి ఎంతో ఉత్సాహంగా భజనలు చేసుకుంటూ, ఆడుతూ పాడుతూ కొండకి తీసుకు వస్తారు. చిన్న పిల్లలు కూడా ఏ మాత్రం తీసిపోకుండా చిన్న చిన్న ప్రభలు తీసుకుని వస్తారు. వీటన్నింటినీ కొండకిందే వదిలేస్తారు. ఈ ప్రభలు వేల నుంచి లక్షల సంఖ్యలో కన్పిస్తూ కొండపై నుంచి చూసేవారికి కనువిందు చేస్తాయి. శివరాత్రి రోజు ఇక్కడకి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు.

దేవాలయంలో వసతి సౌకర్యాలు

కోటప్ప కొండపై టీటీడీ నిర్మించిన సత్రముతో పాటు ప్రభుత్వంచే నిర్మించబడిన రెస్ట్ హౌస్ ఉంది. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు అందుబాటులో ఉన్నాయి.

దర్శన సమయాలు

ఉదయం 6 గం. ల నుంచీ 1 గం. దాకా తిరిగి సాయంత్రం 3 గం. ల నుంచీ 8 గం. ల దాకా.

మార్గము

కోటప్ప కొండ చేరుకోవడానికి గుంటూరు నుంచి బస్సులు వున్నాయి. నరసారావుపేట బస్టాండ్ నుంచి బస్సులు, ఆటోలతో సహా వివిధ రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గమైతే నరసారావు పేటలో దిగి రోడ్డు మార్గాన కోటప్పకొండని చేరుకోవాలి.

ఆంధ్ర ప్రదేశ్‌లో అతి ప్రాముఖ్యత చెందిన ఈ కొండకి రోప్ వే వెయ్యటం కూడా ఆలోచనలో వున్నది. ఇది కూడా జరిగితే ఈ ప్రాంతం అన్ని విధాలా భక్తులనాకర్షిస్తుంది.

సాయంత్రం 6 గం. ల దాకా కొండమీద గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము. 7-45కి గుంటూరు బ్రాడీపేట చేరి శంకర విలాస్‌లో రూమ్ తీసుకుని ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాము.

(మళ్ళీ వారం కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here