భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 21: శ్రీ విమర్శాంబా సమేత ప్రకాశ వీరేశ్వరస్వామి ఆలయం, కూచినపూడి

1
1

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 21” వ్యాసంలో కూచినపూడి లోని శ్రీ విమర్శాంబా సమేత ప్రకాశ వీరేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]కూ[/dropcap]చినపూడి నిజాంపట్నం మండలంలోని చిన్న గ్రామం. గ్రామానికి తగ్గట్లే అక్కడి ఆలయం కూడా చిన్నదే. ఆలయం చిన్నదైనా, దీనికున్న విశేషాలు గొప్పవి. క్రీ.శ. 1635లో శ్రీ పులిగడ్డ వీర్రాజు జమీందారుగారిచే నిర్మింపబడిన ఈ ఆలయం మొదట్లో రెండు అంతస్తులుగా వుండేది. ఇందులో పై అంతస్తులో దైవదత్తమైన శ్రీ చక్రం, కింద వీరేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు. ఈ శ్రీ చక్రానికి వున్న చరిత్ర ఏమిటంటే….

కృతయుగంలో అగస్త్య మహర్షి శిష్యులలో ఒకరైన మౌద్గల్య మహర్షికి ఆది పరాశక్తి దివ్యానుగ్రహం వల్ల ఈ శ్రీ చక్రం లభించిందని, ఆ మహర్షి కైవల్యానంతరం ఆ శ్రీ చక్రం భూస్ధాపితమై, తిరిగి ఇంత కాలానికి మౌద్గల్య మహర్షి వంశస్తుడైన శ్రీ పులిగడ్డ వీర్రాజు జమీందారుగారికి లభించిందని చెప్తారు. అది ఎలాగంటే…

క్రీ.శ. 1630 ప్రాంతంలో ఆ ప్రాంతాలలో వర్షాభావం వల్ల తీవ్ర కరువు వచ్చింది. అప్పుడు కూచినపూడి గ్రామం లేదు. ఈ ప్రాంతం రుద్ర భూమి. అప్పుడిక్కడ పంచములు వుండేవారు. వారంతా జమీందారు దగ్గరకు వచ్చి తమకు నీటి ఎద్దడి తప్పించమని కోరారు. ప్రజల సౌకర్యార్ధం జమీందారు ఇక్కడ ఒక చెరువు తవ్వించారు. ఆ తవ్వకాలలో లభించింది ఈ పంచ లోహ నిర్మితమైన శ్రీ చక్రం. ఈ శ్రీ చక్రం అర్చనా విధానంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా అన్ని కోణాలు, వాటి అధిష్టాన దేవతలు అన్నీ వాటి వాటి స్ధానాల్లో చిన్న మూర్తులుగా దర్శనమిస్తాయి. ఆ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠ చెయ్యదలచి పుణ్య నదుల పవిత్ర తీర్థాలకోసం పర్యటించిన శ్రీ వీర్రాజుగారికి గండకీ నదిలో రెండు సాలగ్రామ లింగాలు లభించాయి. వాటిని తీసుకువచ్చి ఒక దానిని వారి ఏలుబడిలోనే వున్న రాజోలులో జీవేశ్వరస్వామిగా ప్రతిష్ఠించారు. కూచినపూడిలో.. రుద్ర భూమి శివాలయ నిర్మాణానికి మంచి ప్రదేశంగా భావించి, ఆ ప్రదేశంలో రెండంతస్తుల దేవాలయం నిర్మింపచేసి అందులో పై అంతస్తులో శ్రీ చక్రాన్ని, కింద రెండవ సాలగ్రామ లింగాన్ని శ్రీ ప్రకాశ వీరేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. పైన శ్రీ చక్రానికి అభిషేకార్చనలు జరుగుతుంటే, ఆ అభిషేక జలం క్రింద భాగంలో వున్న శ్రీ ప్రకాశ వీరేశ్వరస్వామివారి సాలగ్రామ లింగంపైన ధారా పాత్రద్వారా పడుతూ, ఏక కాలంలో శ్రీ చక్రార్చనతోపాటు లింగార్చన కూడా జరిగేదట. అప్పటి ఈ రెండంతరాల దేవాలయం ఎత్తు మంగళగిరి గాలి గోపురానికన్నా ఎత్తుగా వుండేదిట.

తర్వాత అక్కడ గ్రామం ఏర్పడింది. ఇంతటి మహత్తరమైన శ్రీ చక్రం లభించిన చెరువును శ్రీ చెరువు అనీ, ఆ ప్రాంతాన్ని శ్రీ చక్ర పురము అనీ, శ్రీ పురము అనీ వ్యవహరించేవారు. తర్వాత ఆ గ్రామ పునరుధ్ధరణకు తోడ్పడిన జమీందారులు కూచన్న, పుడమన్న పేర్ల మీద ఆ ఊరి పేరు కూచనపుడమి, కూచనపూడి, కూచినపూడి అయింది. శ్రీ చెరువులోని నీటితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇలా ఒక శతాబ్దం గడిచిపోయింది.

మన దేశంలో బ్రిటిష్ వారి పాలన ప్రారంభం అయింది. బ్రిటిష్ అధికారులు గ్రామాలను, పట్టణాలను సర్వే చేయించి, వారి వ్యాపారాభివృధ్ధికి వీలుగా రహదారులను వేయించి, తీర ప్రాంతాలలో ఓడ రేవులను బాగు పరిచే పనిలో భాగంగా ఆనాటి జిల్లా కలక్టర్ గారు ఆ ప్రాంతాన్ని సర్వే చేయించటానికి వచ్చారు. అర్చకులూ, ధర్మకర్తలూ వారిస్తున్నా వినకుండా వారి వెంట వచ్చిన ఇంజనీర్‌తో కలిసి కలక్టరుగారు పాద రక్షలతోనే ఎత్తయిన ఈ ఆలయ శిఖరాన్ని ఎక్కి, బైనాక్యులర్స్‌తో పరిసర ప్రాంతాలను పరిశీలించి వారికి కావలసిన లెక్కలు పూర్తి చేసుకు వెళ్ళారుట. కలక్టర్ గారి బృందం ఆలయం దిగుతుండగానే ఆలయం పైనుంచి క్రిందకు బీటలు వారిందిట. వారి బృందం పొలిమేర దాటుతుండగానే విపరీతమైన ఉరుములు మెరుపులతో గాలివాన వచ్చి ఆలయం కూలిపోయి పై అంతస్తులో వున్న పంచ లోహ మేరుప్రస్తం కింద పడి భిన్నమైంది. ఆలయం ఎప్పుడైతే కూలిపోయిందో అప్పుడు అక్కడ వున్న అర్చకుడు గుండె ఆగి మరణించాడు. ఆ గాలి వాననే రక్తాక్షి నామ సంవత్సరం పెద్ద గాలివానగా చెప్తారు. శ్రీ చక్రం, ఆలయం భిన్నమవటం, అర్చకుడు మరణించటం వల్ల ఆలయం పాడుపడిపోయింది. శ్రీ చక్రం కొంత భాగం భూస్ధాపితమయింది. ఇప్పటికీ ఆ శ్రీచక్రంలో మిగిలిన కొంత భాగాన్ని.. బిందు స్ధానంలో ప్రతిష్ఠింపబడిన పార్వతీ పరమేశ్వరులను, కింద 3 వరసల వరకు.. ఈ ఆలయంలో దర్శించవచ్చు.

తిరిగి 1763లో ఆనాటి జమీందారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీ చక్రానికి బదులుగా అమ్మవారి ఆలయం నిర్మించారు. ధ్వజ స్ధంబాన్ని ప్రతిష్ఠించారు. భక్తుల బాధలను విమర్శించి పరిపాలించే దేవిగా భావించి ఆ అమ్మవారిని విమర్శాంబ అనే పేరుతో పూజించారు. ఈ అమ్మవారికి వెనుక గోడలో మహిషాసుర మర్దని విగ్రహాన్ని చెక్కారు. అమ్మవారి పై కప్పులో బాలా త్రిపుర సుందరీ యంత్రాన్ని వేశారు.

           

ఈ ఆలయంలో ఇంకొక విశేషం.. అపురూపమైన నటరాజ విగ్రహం. సాధారణంగా మనం నటరాజు విగ్రహంలో ఇంకే శిల్పాలను చూడము. కానీ ఇది సమస్త దేవతా పరివేష్టిత, పార్వతీ సహిత శివ తాండవ శిల్పం. ఇది ఐదు అడుగుల ఏక శిలా విగ్రహం. దీనిలో వున్నన్ని పరివార దేవతలు ఇంకే శివ తాండవ మూర్తుల్లో గోచరించరు. ఇందులో గణపతి నాలుగు చేతులతో, మూషిక వాహనం పైన దర్శనమిస్తాడు. గణపతికి ఎడమ భాగంలో చంద్రుడు, చంద్రుడుకి ఎడమ భాగములో నారదుడు దర్శనమిస్తారు. మూర్తి కుడి వైపు పై భాగంలో ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, సూర్య భగవానుడు. వీరందరికీ పైన శరభ సాళువ రూపం (విష్ణుమూర్తికి అష్టముఖ గండభేరుండ బడబానల జ్వాలా నరిసింహస్వామి యొక్క రూపం ఎలా మహిమాన్వితమైనదో, శివుడికి శరభ సాళువ రూపం అలా అమిత మహిమాన్వితమైనది) కుడి భాగంలో అష్ట దిక్పాలకులు, ఎడమ భాగంలో సప్త మహర్షులు గోచరిస్తారు. పాద భాగంలో శ్రీ మహా విష్ణువు మద్దెల వాయిస్తుంటే, లక్ష్మీ దేవి తాళం వేస్తున్నట్లు, సరస్వతీ దేవి వీణ వాయిస్తున్నట్లు, బ్రహ్మ దేవుడు కూడా తాళం వేస్తున్నట్లు వున్నారు. పార్వతీదేవి చిన్ముద్రతో నంది పక్కనే కనబడుతుంది. కింద దేవ గురువు బృహస్పతి, అసుర గురువు శుక్రాచార్యులవారు, స్వామివారి పాదానికి కింద భాగంలో కాలుడు, మహా కాలుడు అనే రాక్షసులను చూడవచ్చు. తాండవ శివుడి ఇంతెత్తు విగ్రహం, ఇంతమంది పరివార దేవతలతో ఒకే శిలలో రూపొందింపబడినది బహుశా ఇదొక్కటే అంటున్నారు అక్కడివారు.

ఇన్ని విశేషాలున్న ఈ పురాతన ఆలయం నేటికీ పులిగడ్డ వంశీయుల ఆధ్వర్యంలో దిన దనాభివృధ్ధి చెందుతోంది అంటే పులిగడ్డవారందరికీ సంతోషదాయకమేకదా. అన్నట్లు నేనూ పులిగడ్డవారి ఆడబడుచునే.

ఆలయ దర్శనమైన తర్వాత మా తమ్ముడు వాళ్ళు కారులో నగరం దాకా వచ్చి అక్కడ హైదరాబాదు వెళ్ళే బస్ ఎక్కించారు. అది విజయవాడ వెళ్ళేదయినా, సీట్లు తెనాలి దాకానే వుండటంతో తెనాలిలో దిగి అక్కడనుంచీ మళ్ళీ విజయవాడ నాన్ స్టాప్ బస్‌లో విజయవాడ చేరేసరికి రాత్రి 10 గంటలు దాటింది. బస్ స్టాండ్ లోనే కేంటీన్ లో ఇడ్లీ తిని ఆటోలో ఇంటికి చేరేసరికి రాత్రి 11 గంటలు. ఇవాళ్టి ప్రయాణం ఇలా అయింది. కొంచెం శ్రమ పడ్డా, అనేక ఆలయాలు దర్శించామనే తృప్తి మిగిలింది. రేపటి సంగతి వచ్చే వారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here