[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 22” వ్యాసంలో సత్తెనపల్లి లోని శ్రీ కోటేశ్వరస్వామి ఆలయం, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణు గోపాలస్వామి ఆలయం, శ్రీ దుర్గా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]ని[/dropcap]న్నంతా తిరిగిన అలసట తీరనే లేదు. ఇవాళ తెల్లవారు ఝామున 5-45 కి బయల్దేరి ఆటోలో బస్ స్టాండ్‌కి చేరుకున్నాము నేను మా చెల్లెలు విమల, వాళ్ళమ్మాయి నీలిమ. బస్ స్టాండ్లో మా మేనకోడలు రాధికని కలుపుకుని గుంటూరు నాన్-స్టాప్ బస్‌లో గుంటూరు వచ్చాము. అక్కడ బస్ స్టాండ్‌లో ఇడ్లీ తిని సత్తెనపల్లి బస్ ఎక్కాము. సత్తెనపల్లి మా రాధికా వాళ్ళ అత్తగారి ఊరు. వాళ్ళకి ముందే చెప్పాము ఆ రోజు వస్తున్నామని. అందుకే విశ్రాంతి తీసుకోకుండా వెంటనే బయల్దేరింది.
వీర పల్నాడు ప్రాంతానికి ముఖద్వారంగా చెప్పుకోబడే సత్తెనపల్లికి కొంత చరిత్ర వుంది. ఆలయాల కబుర్లతో బాటు ఆ ఊర్ల గురించి నేను తెలుసుకున్న విశేషాలు కూడా చెబితే చర్విత చర్వణమే అయినా, మరొక్కసారి ఆ విజయ గాథలని గుర్తు తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో…
సత్తెనపల్లి ప్రాంతం ప్రజాఉద్యమాలకు కూడా నిలయం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణాని సత్తెనపల్లి కేంద్రంగా ప్రజా ఉద్యమాలు జరిగాయిట. 1946 నుంచి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఇక్కడి నాయకులు స్ఫూర్తి ప్రదాతలు. వావిలాల గోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహరావులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. వారి నాయకత్వంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమాలు ఇక్కడి ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించాయి. కృష్ణానదిపై నందికొండ ప్రాజెక్టు కోసం 50 వేల మంది ప్రజలతో అతిపెద్ద బహిరంగ సభ 1954లో సత్తెనపల్లిలో జరిగింది. 1955లో ప్రాజెక్టు నిర్మాణానికి జవహర్‌లాల్‌నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1982లో ఇక్కడ శాతావాహనా నూలుమిల్లు స్థాపన జరగటానికి కారణం వావిలాల గోపాలకృష్ణయ్యగారి కృషి. ఈ మిల్లు నుంచి తయారయ్యే నూలు అంతర్జాతీయంగా పేరు పొందింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం, హిందీ హాస్యనటుడు శ్రీ జానీ లీవర్ ఈ ప్రాంతం వాళ్ళే.
ఇంక యాత్రా విశేషాలు…
మేము సత్తెనపల్లి సెంటర్‌లో దిగేసరికి ఉదయం 8-25 అయింది. మా రాధికా వాళ్ళ మామయ్య శ్రీ అబ్బూరి సత్యన్నారాయణగారు అక్కడికి సెవన్ సీటర్ ఆటో పంపించారు. మేము లోకల్‌గానే తిరుగుతామని చెప్పటం వల్ల ఆ ఆటో మాట్లాడారు, అందరూ ఒకే వాహనంలో వెళ్ళటానికి వీలుగా వుంటుందని. ఆ ఆటోలో శ్రీ సత్యన్నారాయణగారింటికి వెళ్ళి వారిని తీసుకుని సత్తెనపల్లిలో ముందుగా …
అక్కడనుంచీ దగ్గరలోనే వున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణు గోపాలస్వామి ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయం కూడా పురాతనమైనదే అయినా, పునర్నిర్మించటం వలన కొత్తదానిలా కనిపిస్తుంది.
వేణుగోపాలస్వామికి అటూ ఇటూ ఉపాలయాల్లో లక్ష్మి, సరస్వతుల నల్లరాయి విగ్రహాలు వున్నాయి. వాటిని ఈ మధ్యనే ప్రతిష్ఠించారు అన్నారు. గోపాల కృష్ణుని విగ్రహమంతా వెండిరేకు తాపడం చేసి వుంది. ఎదురుగా బాలాంజనేయస్వామి.
ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడు. ఈయన ప్రతిష్ఠ వేణుగోపాలస్వామి తర్వాత అయినా దాదాపు అదే కాలంలో జరిగిందిట. ఒకసారి అక్కడ అంతా విపరీతమైన క్షామం వచ్చిందిట. దాని నివారణకి దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ప్రతిష్ఠ చెయ్యాలంటే అప్పటి జమీందార్లే ఆ ఆలయం కోసం ప్రత్యేకించి భూములిచ్చి అక్కడ క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించారుట.
శ్రీ దుర్గా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం
ఈ ఆలయంలో వున్న విశేషమేమిటంటే నవగ్రహాలు స్వామికి ఎదురుగా వుంటాయి. సాధారణంగా ఏ ఆలయంలోనూ ఇలా చూడం. అంతేకాదు ఇక్కడ వున్న 5 నాగేంద్రుల విగ్రహాలు కూడా అత్యంత మహిమాన్వితమైనవిగా చెప్పబడతాయి. సర్ప దోషాలు వున్నవారు, వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడ 41 రోజులు ప్రదక్షిణ చేస్తే తప్పక వారి కోరికలు నెరవేరుతాయిట. అలా చేసి, తమ కోరిక తీరలేదని చెప్పినవారు ఇప్పటివరకూ లేరుట.
ఈ ఆలయాలను చూసేసరికి సమయం ఉదయం 10-15 ఆయింది. ఇంక ఆ చుట్టుపక్కల ఏమీ లేవు అన్నారు. కొంచెం తర్జన భర్జనల తర్వాత 40 కి.మీ.ల దూరంలో చేజెర్ల వున్నది, అక్కడ కపోతేశ్వరస్వామి ఆలయం ప్రసిధ్ధి చెందింది అంటే అక్కడికి వెళ్దామనుకున్నాం. కానీ మేమున్నది సెవన్ సీటర్ ఆటోలో. అంత దూరం ఈ ఆటోలో వెళ్ళగలమా అని డ్రైవర్‌ని అడిగితే మీరు కూర్చుంటే నేను తీసుకు వెళ్తానన్నాడు. అప్పటికప్పుడు వాహనం మార్చటం కుదరదని దానిలోనే చేజర్లకి బయల్దేరాము. మొండోళ్ళం కదా. నా కోసం పాపం మావాళ్ళంతా శ్రమ పడ్డారు. చేజర్ల వివరాలు వచ్చేవారం….