[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 26” వ్యాసంలో కొల్లిపర లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]ము[/dropcap]న్నంగినుంచి 7 కి.మీ.ల దూరంలో వున్న కొల్లిపరకి చేరుకునేసరికి ఉదయం 8-45 అయింది. ఈ ఊళ్ళో ఒక విష్ణ్వాలయం, ఒక శివాలయం చూశాము. ముందుగా విష్ణ్వాలయం గురించి…
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం
కృష్ణదేవరాయలు వంశీకుడు, సదాశివరాయలు 233మంది చేతి వృత్తులు చేసుకునేవారికి ఈ గ్రామం దానంగా ఇచ్చారు. అందుకని సదాశివ పురంగా పిలువబడింది. కాలక్రమేణా నదిలో నీరు తగ్గి ఇసుక పఱ్ఱలేర్పడటం, గోవులు తిరగటంతో గోవు పఱ్ఱ, ఇసుక పఱ్ఱ, కొవ్వు పఱ్ఱగా పిలువబడి చివరికి కొల్లిపరగా మారింది.
ఆలయానికి ఎదురుగా రోడ్డుకవతల గరుడ స్తంభం పైన నంది, నాగరి లిపిలో శాసనం వున్నాయి. దీనితో ఆలయం అంతకు ముందు అక్కడదాకా వుండివుండచ్చు, మధ్యలో రోడ్డు తర్వాత వచ్చి వుండచ్చనిపిస్తుంది. ఇదివరకు వచ్చిన భారతి మాస పత్రికలో ఈ ఆలయం శాసనం ప్రచురించారుట.
ఆలయంలో జనార్దనస్వామి కుడివైపు పారాడే చిన్ని కృష్ణుని నల్లరాతి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఎడమవైపు ఆంజనేయస్వామి. ఈ పారాడే చిన్ని కృష్ణుని ఆలయం కర్ణాటకలో ఒక్కచోటే వున్నదని మా కర్ణాటక పర్యటనలో వాళ్ళు చెప్పారుగానీ, గుంటూరు జిల్లా పర్యటనలో మేము రెండు ఆలయాలు చూశాము. ఇది ఒకటి, చంఘీజ్ ఖాన్ పేటలో ఒకటి. అక్కడైతే ముఖ్య దైవమే పారాడే కృష్ణుడు. దాని గురించి తర్వాత.
విశేషం
ఈ ఆలయంలో ఏ కార్యక్రమం విశేషంగా జరిగినా గరుడ పక్షులు వస్తాయట. సరిగ్గా ముహూర్తం సమయంలో వచ్చి తర్వాత అదృశ్యమవుతాయట. 2009లో ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనూ, 2018 ఫిబ్రవరిలో రాజగోపురం నిర్మాణం సమయంలో కూడా ఆ పక్షులు వచ్చాయి. తర్వాత అదృశ్యమవటం అనేక వేలమంది భక్తులు చూశారుట. స్వామి ఇక్కడ వున్నారనటానికి దీనిని నిదర్శనంగా గ్రామ ప్రజలు భావిస్తారు.
సంతాన ప్రాప్తి కోసం, కుటుంబంలో భార్యా భర్తల మథ్య విబేధాలు తొలగటం కోసం, పిల్లల విద్యా బుధ్ధుల కోసం ఈ స్వామిని సేవించి కళ్యాణం చేయిస్తే మంచి ఫలితాలుంటాయంటారు.
అక్కడనుంచి శివాలయానికి బయల్దేరాము. మున్నంది శివాలయంలో చెప్పారు. ఈ శివాలయం కూడా పురాతనమైనదని.
శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరాలయం
ఆ రోజు సంకష్టహర చతుర్ధిట. గణపతికి పంచామృతాభిషేకాలు చేస్తున్నారు. ఆలయం మధ్యలో శివుడు. ఎత్తయిన పానవట్టంమీద మూడు అడుగుల లింగం. విభూతి రాసి, కుంకుమ బొట్టుపెట్టి చాలా ఆకర్షణీయంగా వున్నారు శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వరస్వామి. పక్కనే ఉపాలయంలో అభయ హస్తంతో అమ్మ పార్వతీదేవి.
దర్శనానంతరం 9-25కి అక్కడికి ఒక కిలో మీటరు దూరంలో వున్న తూములూరు బాట పట్టాము.