గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 28: చివలూరు

0
1

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 28” వ్యాసంలో చివలూరు లోని శ్రీ మదన గోపాలస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఉ[/dropcap]దయం 10గంటల కల్లా చివలూరు చేరాము. ఇక్కడ ఆలయాల గురించి ముందు మా షెడ్యూల్‌లో లేదు. ఇంతకు ముందు వెళ్ళిన ఆలయాల్లో తెలుసుకున్నాము. ఇలాంటి వాటిని మేము బోనస్ అంటాము. ఎన్ని బోనస్‌లు వస్తే అంత సంతోషం. అనుకున్న వాటికన్నా ఎక్కువ చూశాము కదాని.

చివలూరులో శివాలయం పూర్తిగా పడగొట్టి మళ్ళీ కడుతున్నారు. అందుకనే ముందుకు సాగి శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్ధానానికి చేరుకున్నాము. ఒక విశేషం ఏమిటంటే ఊళ్ళోవారిని మదన గోపాలస్వామి ఆలయం అంటే వెంటనే దోవ చెప్పలేక పోయారు. ఒకాయన మాత్రం ఆంజనేయస్వామి గుడికి ఇటే వెళ్ళండి అన్నారు. గోపాల స్వామి గుడి అడిగితే ఆంజనేయస్వామి గుడి దోవ చెప్తున్నారు ఏమిటా అనుకుంటూ, సరే ఒక గుడిలో అడిగితే ఇంకొక గుడి దోవ తెలియకపోతుందా అని వెళ్ళాము. తీరా చూస్తే బోర్డు మాకు కావాల్సిన మదన గోపాలస్వామిదే వున్నది. హమ్మయ్య అనుకుంటూ లోపలకి వెళ్ళాము.

ముందు ఒక గోడకి ఆనించినట్లు ఆంజనేయస్వామి విగ్రహం వుంది. అక్కడే పూజారిగారు వున్నారు. ఘనంగా పూజలు కూడా జరుగుతున్నాయి స్వామికి. మేము ప్రధాన దైవం మదన గోపాలస్వామిని దర్శించి ఇక్కడికి వద్దామని లోపలకి వెళ్తుంటే అక్కడి పూజారిగారు ఆపి ఈ స్వామిని దర్శించుకు వెళ్ళండి అని వివరాలు చెప్పారు.

ఇది 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయానికి మాన్యాలు వున్నాయి. ఇక్కడ మదన గోపాల స్వామికన్నా ఎక్కువగా ఆంజనేయస్వామిని కొలుస్తారు. ఆయన కోసం ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువ అని పూజారిగారు చెప్పారు. కోరి కొలిచినవారి కొంగు బంగారం ఆ స్వామి అని చెప్పారు. ఆంజనేయస్వామి ఇక్కడ కొలువై వున్న విషయం గురించి ఒక విశేషం చెప్పారు పూజారిగారు.

ఈ ప్రాంతంలో అంతా బ్రాహ్మణులు ఎక్కువగా వుండేవారు. ఈ ఆంజనేయస్వామి విగ్రహం నదిలో దొరికింది. స్వామిని తీసుకువచ్చి ఒకరి ఇంట్లో పెట్టారు. ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేద్దామని. స్వామి ఇంటివారి కలలో కనబడి గుళ్ళో వుంటానన్నారుట. స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి గుడిలో ముందు ఇప్పుడున్న ప్రదేశంలో వుంచి, తర్వాత ప్రత్యేక ఆలయం నిర్మించి ప్రతిష్ఠించాలనుకున్నారు. తర్వాత వేరే ఉపాలయం నిర్మించి ప్రతిష్ఠ చెయ్యాలని చూస్తే గోడకి ఆనించిన ఆంజనేయస్వామి విగ్రహం ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది లాగినా కదలలేదు. ఇదంతా జరిగి వంద సంవత్సరాలు పైన అయిందిట.

అప్పటినుంచీ ఆంజనేయస్వామి అంటే భక్తులలో నమ్మకం పెరిగింది. ఆయన కోసం రోజూ గుడికి వచ్చి వెళ్ళే భక్తులు వున్నారు. చాలా మంది ఆయన కోసమే వస్తారు. ఊళ్ళో వారికి కూడా ఆ గుడి మదన గోపాలస్వామి ఆలయంకన్నా ఆంజనేయ స్వామి ఆలయం అంటేనే తెలుస్తుంది.

మదన గోపాల స్వామి ఆలయంలో వచ్చి కూర్చుని తానే ప్రఖ్యాతి చెందిన సంజీవరాయణ్ణి దర్శించుకుని బయల్దేరాము. అన్నట్లు ఈ ఆలయానికి భక్తులు వస్తూ వుంటారు గనుక ఉదయం 6-30 నుంచీ 10 గం. దాకా తెరచి వుంటుంది.

మేము వెళ్ళేసరికి 10 గంటలయింది. అందుకనే దర్శనమయింది. మా వెనకే ఆలయానికి తాళాలు వేసి పూజారిగారు బయల్దేరారు. మా అదృష్టం బాగుంది, స్వామి దర్శనమే కాక ఆంజనేయుని కథ కూడా విన్నామని సంతోషంతో 10-20కి అక్కడనుండి బయల్దేరాము.

మా తరువాత మజిలీ దావులూరు. అయితే ఆ సమయానికే ఆలయాలన్నీ మూసేసి వుండటం అలవాటవటం మూలాన ముందే కొన్ని వివరాలు కనుక్కున్నాము. తూములూరు చెన్నకేశవస్వామి ఆలయం పక్కన దావులూరు పూజారిగారిల్లు వుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాము. మా సంగతి తెలుసుకుని ఆ ఇంట్లో మహిళలు సాదరంగా ఆహ్వానించి మంచినీళ్ళిచ్చి, మా అవసరాలు కనుక్కున్నారు. ఈయన దావులూరులోని వేణుగోపాలస్వామి ఆలయం పూజారిగారు. ఆయన గుళ్ళోనే వున్నారని ఆయనకి ఫోన్ చేసి చెప్పారు, మేము వస్తున్నామని, అక్కడే వుండమని. ఆ ఇంటివారికి ధన్యవాదాలు తెలిపి దావులూరు బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here