భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 3: శ్రీ మూలాంకురేశ్వరీ దేవి, అమీనాబాద్

0
2

[box type=’note’ fontsize=’16’] “ఇంతటి పురాతనమైన ఆలయానికి నల్గొండ, కర్నూల్, మార్కాపురం తదితర ప్రాంతాలనుంచి భక్తులు వస్తున్నా, దగ్గర ప్రాంతాలలో నివసించే చాలామందికి ఈ ఆలయం గురించి తెలియక పోవటం విచారకరం” అంటున్నారు పి.యస్.యమ్. లక్ష్మి “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 3: శ్రీ మూలాంకురేశ్వరీ దేవి, అమీనాబాద్” వ్యాసంలో. [/box]

[dropcap]మ[/dropcap]ర్నాడు ఉదయం తయారయి ఫలహారం చేసి మేమనుకున్న శ్రీ మూలాంకురేశ్వరి ఆలయానికి బయల్దేరాము. దారి వివరాలు గురించి గుంటూరులో మాకు తెలిసినవారిని, హోటల్ లోనూ అడిగాము. ఎవరూ అసలు అలాంటి పేరే వినలేదు, మాకు తెలియదు అని చెప్పారు. వాళ్ళలా చెప్పినంత మాత్రాన మేము వదిలి పెడతామా?? కనుక్కుని వెళ్ళి చూసివచ్చి వాళ్ళకి చెప్పాము. హోటల్ వాళ్ళకి కూడా చెప్పాము – తర్వాత మాలాంటి వాళ్ళెవరన్నా వస్తే చెప్పమని. వాళ్ళూ సంతోషించారనుకోండి, మా ఊళ్ళో మేమింతమటుకూ చూడని ప్రదేశం గురించి మీరంత దూరంనుంచి వచ్చి చూసి చెప్పారని.

దోవలో అడుగుతూ వెళ్ళి మొత్తానికి ఉదయం 10 గంటలకు ఆలయాన్ని చేరుకున్నాము. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్ళే త్రోవలో గుంటూరునుంచి 18 కి.మీ. ప్రయాణం చేసిన తర్వాత ఎడమవైపు రోడ్డులో 1 కి.మీ. దూరం వెళ్తే వస్తుంది ఈ ఆలయం. దోవ పొడుగూతా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న తూర్పు కనుమల అందాలు… అవునండీ చూసే కళ్ళకి మనసుండాలే గానీ బండ రాళ్ళతో నిండిన కొండల్లో కూడా ఎన్నెన్నో అందాలు కనబడతాయి! ఈ అందాలను గుండె నిండా నింపుకుంటూ మనం చేరుకుంటాం అమీనాబాద్‌లో శ్రీ మూలాంకురేశ్వరీ దేవి నిలయమైన అందమైన చిన్న కొండ.

కొండ క్రింద ఎడమవైపు శ్రీ పోలేరమ్మ తల్లికి చిన్న ఆలయం. అమ్మవారిని దర్శించి, కొండమీదకి కొన్ని మెట్లు ఎక్కితే వస్తుంది తొలుత పూజలందుకునే విఘ్నేశ్వరుని మందిరం. ఆ స్వామికి ప్రణమిల్లి, ఇంకొన్ని మెట్లు ఎక్కాము. అక్కడ ప్రాచీన శివాలయం, అయ్యప్ప దేవాలయాలను దర్శించి, ఇంకొంచెం ముందుకు సాగాము.

అమ్మలగన్నయమ్మ, తన బిడ్డలను చల్లగా చూసే కృపాకరి, శ్రీ మూలాంకురేశ్వరీ దేవి దర్శనానికి ఇంకొంచెం శ్రమపడక తప్పదు. అంటే ఇంకా కొన్ని మెట్లెక్కాలి. అయితే చుట్టూ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నెమ్మదిగా ఎక్కాము. ఆ దేవి కృపా కటాక్ష వీక్షణాల్లో సేద తీరాలంటే తప్పదు మరి. ఆ దేవి దర్శనాకాంక్షతో వున్న మనకి మెట్లెక్కుతున్న ఆయాసమే తెలియదు.

అవును మరి. ఇన్నేళ్ళనుంచి ఇక్కడ కొలువు తీరి, తరతరాలనుంచి కొలిచిన వారికి కొంగు బంగారమైన తల్లిని మనం మరిస్తే ఆవిడ మనకి దూరమవుతుంది. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను దర్శించి, మన భక్తి ప్రపత్తులతో ఆ ఆలయాలు మరుగున పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది.

చరిత్రలోకి వెళ్తే ఈ ఆలయ నిర్మాత 13 – 14 శతాబ్దాల మధ్య కాలంలో కొండవీటిని పాలించిన అనవేమారెడ్డి. ఆయన యుధ్ధంలో తనకు చేకూరిన విజయానికి చిహ్నంగా అమీనాబాదులో ఈ కొండమీద ఈ ఆలయం నిర్మించాడు. ఆది పరాశక్తే ఈ మూలాంకురేశ్వరీదేవి. ఈవిడ రెడ్డి రాజుల కులదైవం. ఇక్కడ వున్న జారుడు బండ శిలా శాసనాల ద్వారా ఈ విషయం వెల్లడి అవుతుంది. (జారుడు బండ శిలా శాసనం అంటే కొండ మీద ఏటవాలుగా ఒక ఫలకం మీద వున్న శాసనం) అంతే కాదు. ఆలయం కట్టించినప్పుడు అనవేమారెడ్డి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం 5 గ్రామాల పంట భూమని దానంగా ఇచ్చారుట.

 

ఆలయం చిన్నదే. ముందు ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, దానికి ముందు యజ్ఞ మండపం వున్నాయి. పూర్వపు రాజులు ఇక్కడ అనేక యాగాలు చేశారు. ఇప్పటికీ ఈ మండపంలో యజ్ఞాలు జరుగుతూ వుంటాయి.

అమ్మవారు విశాలమైన నేత్రాలతో, పచ్చని ముఖంతో చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తారు. దేవి ముందు శ్ర చక్రం వున్నది. ఆ రోజు సంక్రాంతి… పెద్ద పండుగ. పూజ చేయించాము. పూజారిగారు లలితా అష్టోత్తరంతో శ్రీ చక్రానికి కుంకుమ పూజ శ్రధ్ధగా చేశారు.

ఇక్కడ స్ధానికులు చెప్పే ఇంకొక కథ కొంచెం ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. రుక్మిణీ కళ్యాణం కథ గుర్తుందిగా. రుక్మిణి కళ్యాణానికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళటం, అక్కడనుండి శ్రీ కృష్ణుడు ఆమెను రథం మీద తీసుకు వెళ్ళటం, రుక్మి అడ్డగించటం. అవ్వన్నీ ఇక్కడ జరిగాయంటారు. తమ కులదేవత అయిన ఈ అమ్మనవారిని పూజించిన రుక్మిణిని శ్రీకృష్ణుడు రథం మీద తీసుకు వెళ్తుంటే, డోకిపర్రు దగ్గర రుక్మిణి సోదరులు అడ్డుకున్నారని, శ్రీకృష్ణుడు వారికి శిరోముండనం గావించి తర్వాత రుక్మిణిని పెళ్ళాడాడని. ఏమిటో రుక్మిణీ కళ్యాణ గాథని నమ్ముతాముగానీ, అదిక్కడ జరిగిందంటే..!?

1415 సంవత్సరంలో కొండవీటి రాజుల్లో చివరి వాడైన రాచవేముని కాలంలో నిర్మించబడిన సంతాన సాగరం (ఇప్పటి మల్కా చెరువు) కొండకు సమీపంలోనే వున్నది. ఇక్కడ ఇంకా అనేక శిలాశాసనాలు దొరికాయటగానీ పరిష్కరింపబడలేదు. అనినుల్ ముల్క్ అనే గవర్నర్ తన పేరు మీద ఈ గ్రామం పేరుని అమీనాబాద్‌గా మార్చాడట.

కాలక్రమంలో ఆలయ పంట భూములన్నీ హరించుకుపోగా, అమ్మవారికి నిత్య ధూప దీప నైవేద్యాలే కష్టమయినాయి. అటువంటి సమయంలో శ్రీ శంకరమంచి రాఘవయ్య కుమారుడు శ్రీ శంకరమంచి రాధాకృష్ణ మూర్తి ఆలయ అర్చక బాధ్యతలను స్వీకరించారు. ఆలయ ట్రస్టు ఛైర్మెన్‌గా శ్రీ పెద్ది అక్కయ్య నియమింపబడ్డారు. సుమారు 40 సంవత్సరాలనుంచీ వీరే ఆలయ అభివృధ్దికి ఎంతగానో కృషి చేస్తున్నారు.

కొండకింద వున్న పోలేరమ్మ ఆలయం, మధ్యలో వున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప స్వామివార్ల ఆలయాలు తర్వాత నిర్మింపబడ్డవి. శివాలయం పురాతనమైనదే. ఆలయ ప్రాంగణంలో వున్న వేప రావి చెట్లని దర్శిచిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజూ భక్త జన సందోహం అంతగా లేక పోయినప్పటికీ, ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

ఈ ఆలయాన్ని దర్శించిన ఆర్ అండ్ బి సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఆలయ దక్షిణ భాగంలో కళ్యాణ మండపాన్ని నిర్మించటానికి సహాయపడ్డారు. సినీనటుడు రాజశేఖర్ మొదటి చిత్రం వందేమాతరం ఈ ఆలయ పరిసరాల్లో నిర్మించారు.

2001లో జరిగిన ఒక సంఘటనతో ఇక్కడి భక్తులలో అమ్మవారిమీద నమ్మకం మరింత పెరిగింది. ఆ సంవత్సరం జరిగిన దసరా ఉత్సవాలలో 14 ఏళ్ళ అమ్మాయి పొరపాటున యజ్ఞమండపంనుంచి జారి 80 అడుగుల కింద వున్న బండలమీద పడింది. అంత ఎత్తుమీదనుంచి పడినా ఆ అమ్మాయికి చిన్న గాయం కూడా కాలేదు. అమ్మవారి దయవల్లనే ఆ అమ్మాయికి ఏ గాయం కాలేదని భక్తుల నమ్మకం.

ఈ గ్రామంలో అధిక జనాభా ముస్లింలదే. అయినా వారంతా అమ్మవారిపై విశ్వాసంతో, మత సామరస్యంతో కలిసి మెలిసి వుంటారు.

ఇంతటి పురాతనమైన ఆలయానికి నల్గొండ, కర్నూల్, మార్కాపురం తదితర ప్రాంతాలనుంచి భక్తులు వస్తున్నా, దగ్గర ప్రాంతాలలో నివసించే చాలామందికి ఈ ఆలయం గురించి తెలియక పోవటం విచారకరం. ఇలాంటి పురాతన ఆలయాలను అవకాశంవున్న భక్తులు తప్పక సందర్శించాలి.

పురాతన ఆలయాన్ని చూశామనే సంతృప్తితో మధ్యాహ్నం 11-30కి మా కారు దగ్గరలోనే వున్న పెద్ద కాకానికి దారి తీసింది శ్రీ కాకానేశ్వరుడి దర్శనం కోసం. ఆ వివరాలు వచ్చే వారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here