Site icon Sanchika

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 30: చిలుమూరు

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 30” వ్యాసంలో చిలుమూరులోని గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]క్కడ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరాలయానికి మేము వెళ్ళేసరికి ఉదయం 11-55 అయింది. ఆలయం మూసి వుంది. ఆలయం ఆవరణ విశాలంగానే వుంది. ఆలయం ఎదురుగా మండపంలో చిన్న నంది, దాని పీఠంపై రెండు వైపుల శాసనం కనబడుతోంది. మిగతా రెండువైపులా కూడా వ్రాసి వుందిగానీ, అరిగిపోయింది.

ఈ ఆలయం కృష్ణానదికి ఈవలి ఒడ్డున వుంటే అవతల తీరంలో ఐలూరు అనే ఊళ్ళో ఇదే సమయంలో ఆవిర్భవించిన ఇంకో శివాలయం వుంది. ఈ రెండిటినీ కలిపి ఉభయ రామేశ్వరమంటారు. ఇక్కడ లింగం సైకత లింగంట. మేము చూడలేదుగా.

స్ధల పురాణం

త్రేతా యుగంలో రావణాసురుణ్ణి వధించినందుకు బ్రహ్మహత్యా పాతకంనుంచి తప్పించుకోవటానికి శ్రీరామచంద్రుడు శివలింగాలను స్ధాపించాడని అనేక కథలు వినవస్తూంటాయి. ఈ కథల్లోనే హనుమంతుడు శివలింగాన్ని తేవటానికి వెళ్ళటం, ఆలస్యంగా రావటం, ముహూర్తం మించిపోకుండా శ్రీరామచంద్రుడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించటం, తర్వాత చేరిన హనుమంతులవారికి కోపం రావటం ఇవ్వన్నీ కొన్ని చోట్ల స్ధల పురాణాలుగా చెబుతారు. ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే ఆంజనేయస్వామి తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదనే కోపంతో తన తోకతో అక్కడ ప్రతిష్ఠింపబడిన లింగాన్ని పెకిలించబోయాడుట. అది రాలేదు. అయితే దానికి గుర్తుగా శివలింగంపై నేటికీ తోక గుర్తు కనబడుతుందంటారు. అక్కడున్న శివలింగం రాకపోయేసరికి హనుమంతుడు దిగులు చెంది తాను తెచ్చిన శివలింగాన్ని విసిరి వేశాడుట. అది కృష్ణానదికి అవతల వున్న ఐలూరు ప్రాంతంలో పడింది. హనుమంతుని ఆగ్రహం తగ్గించటానికి శ్రీరామచంద్రుడా శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడుట. ఒకే సందర్భంగా శ్రీరామచంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు కనుక ఈ రెండూ కలిపి ఉభయ రామేశ్వరముగా కీర్తి చెందాయి.

   

చిలుమూరులో ఇంకొక విశేషం చెబుతారు. ఇక్కడి శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత క్రమేణా పెరగటం గమనించిన సీతాదేవి తన గుప్పిటతో ఇసుకను తీసి లింగం పైన వుంచిందిట. అప్పుడు లింగం పెరగటం ఆగిపోయింది. శివలింగము మీద గుప్పెడంత బొడిపలాగా ఇప్పుడూ చూడవచ్చుట.

ఉభయ రామేశ్వరం రెండు శివాలయాల్లో శివరాత్రికి పెద్ద తిరణాల జరుగుతుంది. శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున అన్న సమారాధన కూడా జరుగుతుంది. వేలాదిమంది భక్తులు వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుని, వేడుకలలో పాల్గొని తృప్తి చెందుతారు.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం

ఆలయం చిన్నదే. మూసి వుంది. బయటనుంచే ఫోటోలు తీసుకుని బయల్దేరాము. ఒకే రోజు చాలా ఊళ్ళు, చాలా ఆలయాలు చూడటం వల్ల వచ్చే ఇబ్బందే ఇది. మధ్యాహ్న సమయంలో ఆలయాలు మూసి వుంటాయి, వేచి వుండటానికి మనకి సమయం వుండదు, మళ్ళీ రావటానికి దూరాభారం. కొన్ని నిట్టూర్పులు తప్పవు.

మధ్యాహ్నం 12-10కి అక్కడనుంచి తర్వాత మజిలీకి బయల్దేరాము.

Exit mobile version