గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 31: కొల్లూరు

4
2

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 31” వ్యాసంలో కొల్లూరు లోని గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] తర్వాత మజిలీ కొల్లూరు. శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామి ఆలయం చేరేసరికి 12-30 దాటింది. ఆలయం మూసి వుంది. కానీ ఆలయం ముందెవరో మహానుభావుడు చెప్పాడు పక్క సందులో పంతులుగారి హోటల్‌లో వుండే రామకృష్ణని అడగండి, తాళాలు వాళ్ళ దగ్గర వుంటాయి.. చూపిస్తారు అని. ఆ మహానుభావుడికి ధన్యవాదాలు తెలిపి పంతులుగారి హోటల్ చేరుకున్నాము. రామకృష్ణగారు ఆ సమయంలో అక్కడ లేరు గానీ వారి తమ్ముడు మురళి వున్నారు. లంచ్ టైమ్ అయిందికదా అక్కడేమైనా తిందామనుకున్నాం గానీ (అక్కడ భోజనం లేదు), ఆయనే చెప్పారు భోజనం సమయం కదా ఎదురు సందులో రాంబాబు మెస్ బాగుంటుంది అక్కడకెళ్ళి భోజనం చేయండి అని. గుడి పంతులుగారికి కూడా కబురు పెట్టారు ఆయన తాళాలు తీసుకుని వచ్చారు. స్ధల పురాణం పుస్తకం కోసం అడిగితే వెతికారు.. దొరక లేదు… తర్వాత ఆలయంలో ఇస్తారులెండి, దర్శనం చేసుకోమన్నారు. మన దేశంలో మంచివాళ్ళు చాలా తక్కువ వున్నారు అనే మాటలో నిజం లేదనిపించిందండి మా ఈ యాత్రలో. ప్రతివారూ ఎంతో శ్రధ్ధ చూపించి శ్రమ అనుకోకుండా ఆలయాలు తెరిపించటం, పుస్తకాలు వెతికివ్వటం, లేకపోతే తెలిసిన విషయాలు చెప్పటం.. వారందరి సహాయం లేకపోతే నా ఈ యాత్రా వ్యాసాలు వుండేవి కావు. అందుకే, వారందరికీ పత్రికా ముఖంగా నమోవాకాలు.

శ్రీ అనంత భోగేశ్వర మల్లేశ్వరాలయం

ఇది పశ్చిమ కళ్యాణి చాళుక్యుల సమయంలో నిర్మింపబడిన ఆలయం. తర్వాత వేంగి చాళుక్యులు, వెలనాటి చోళులు, కాకతీయ రాజులు, వీరందరి నీరాజనాలు అందుకొన్నది.

ఈ శివాలయం గురించి నాలుగు కధలు వినిపిస్తాయి.

అందులో ఒకదాని ప్రకారం క్రీ.శ. 705-715 ప్రాంతంలో తాడిగిరివాడు వద్ద నివసించిన అనంత బోయ మహారాజు తన పేరు కలిసి వచ్చేటట్లు శ్రీ అనంత భోగేశ్వరస్వామిని ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడట. మరొక కథనం ప్రకారం క్రీ.శ. 814 – 830 ప్రాంతంలో శ్రీ విజయాదిత్య నరేంద్ర మృగేశ్వరుడు నిర్మించినదని వేంగి రాజ చరిత్ర ద్వారా తెలుస్తున్నదని. క్రీ.శ 1115లో మహాప్రగ్గెడ అనంతపాలయ్య నిర్మించినట్లు తెలియజేసే శాసనాధారాలు, కైఫియత్‌లు వున్నయ్యంటారు. గుంటూరు మండల దేవాదాయ ధర్మాదాయ దర్శనం అనే గ్రంధంలో అనంత భోగేశ్వరస్వామి ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడని వున్నదంటారు.

క్రీ.శ. 814 – 830ల మధ్య కాలంలో విజయాదిత్య నరేంద్ర మృగేశ్వరుడు అనే రాజు వేంగీ సామ్రాజ్యాన్నితన వశం చేసుకొని 12 సంవత్సరాలు కత్తి దించక 108 పైగా యధ్ధములు చేశాడుట. అతను యుధ్ధంలో విజయం పొందిన తర్వాత ఆ యుధ్ధ క్షేత్రాలలో నరేంద్రేశ్వర అనే పేరుతో శివాలయాలని నిర్మించాడుట. అలాంటి ఆలయం కొల్లూరులో కూడా కట్టించాడని లిఖిత పూర్వకమైన ఆధారాలున్నాయి. ఆనాటి యుధ్ధ భూమి నేటి శివాలయం పున్న ప్రాంతం కావచ్చు. విజయానికి నిదర్శనంగా ఇక్కడ కూడా నరేంద్రేశ్వర స్వామిని ప్రతిష్టించాడు. కైఫియత్ ప్రకారం అనంత భోగేశ్వరస్వామికి మునుపు నరేంద్రేశ్వర స్వామి అనే పేరు వున్నది. అనంతపాలయ్య మొదట్లో జైన సిధ్ధాతాలను నమ్మి చేబ్రోలులో అనంత జినాలయం నిర్మించాడుట. తర్వాత ఈయన కొలువులో వున్న శ్రీపతి పండితుడు తన ఉత్తరీయములో నిప్పులు మూటగట్టడం ద్వారా అద్భుత శక్తులు ప్రదర్శించి శైవ మతాధిక్యతను చాటి అనంతపాలయ్యను శైవాభిమానిగా మార్చాడని, తర్వాత అనంతపాలయ్య కొల్లూరులోని నరేంద్రేశ్వరాలయాన్ని అనంత భోగేశ్వరంగా మార్చి వుంటాదనే జనశృతి. ఇది విశ్వసనీయం కాదని కొదరు పండితుల భావన.

కానీ నేటికీ ఒక ప్రాచీన నంది విగ్రహము, అక్షరాలు అరిగిపోయిన ఒక ప్రాచీన శాసన స్తంభము శ్రీ పార్వతి అమ్మవారి ఆలయంలో కనబడుతున్నవి. ఆనాటి నరేంద్రేశ్వరస్వామి దేవాలయము నేటి శ్రీ పార్వతి అమ్మవారి దేవాలయ ప్రాంగణమై వుండవచ్చని, ఏ కారణం చేతనో నరేంద్రేశ్వరస్వామి దేవాలయము శిథిలమై వుండవచ్చని, ఆ ఆవరణలో 19వ శతాబ్దములో శ్రీ పార్వతి అమ్మ ప్రతిష్ఠింపబడ్డారని కొందరి విజ్ఞుల అభిప్రాయం. పూర్వం గ్రామంలో నరేంద్రేశ్వరస్వామి వున్నాడనే ప్రతీతి వుండటంచేత అనంత భోగశ్వరం నిర్మించిన తర్వాత అనంతేశ్వరస్వామినే కొందరు నరేంద్రేశ్వరస్వామి అని పిలుస్తారు.

మరొక కథనం ప్రకారం కళ్యాణి చాణుక్యుల చక్రవర్తి అయిన ఆరో విక్రమాదిత్యుడు కర్ణాటక ప్రాంతాన్ని పాలిస్తూ సమస్త ఆంధ్రదేశ సార్వభౌమత్వం కోసం తన సేనాని మహాప్రెగ్గడ అనంతపాలయ్యను క్రీ.శ. 1115 ప్రాంతంలో దండయాత్రలకు పంపించాడు. ఈయన రాజ్యాలను జయిస్తూ క్రీ.శ. 1115లో కొల్లూరు గ్రామ మధ్యలో అనంతేశ్వరుడు అనే లింగాన్ని ప్రతిష్ఠించి, ఆలయ ప్రాకారాన్ని, ముఖమండపాన్ని కట్టించి దేశముగా ప్రకటించాడుట. దేశమంటే హద్దులుగల ప్రదేశం లేదా గ్రామం. ఇక్కడ ఉత్సవాల కోసం కొంత భూమిని కూడా సమర్పించాడు. ఈయన వేయించిన శిలా శాసనం నేటికీ కొల్లూరు ఆలయంలో చూడవచ్చు.

శ్రీ పార్వతీ అమ్మవారి దేవాలయం

శ్రీ అనంత భోగేశ్వరస్వామివారి ఆలయం ప్రాంగణంలో శ్రీ పార్వతీ అమ్మవారి దేవాలయం 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. పూర్వం ఈ గ్రామవాసులలో కొందరు కాశీకి వెళ్ళి అన్నపూర్ణాదేవిని దర్శించి వచ్చేవారుట. వాళ్ళతో ఒక యతీశ్వరుడు కృష్ణా తీరంలో వున్న మీ కొల్లూరు గ్రామంలో కూడా పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠిస్తే ఉమాపార్వతీ క్షేత్రంగా ఖ్యాతి చెందుతుందని చెప్పారుట. తర్వాత కొందరు భక్తులు గ్రామస్తుల సహకారంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందు పార్వతీ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకుంటారు.

గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంకూడా వున్నది. మేము అపరాహ్ణంలో వెళ్ళటంవల్ల దర్శించలేదు. అయితే అక్కడ పరివార దేవతలలో కొలువు తీరిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి గురించి ఒక విశేషం చెప్పుకుంటారు. విష్ణ్వాలయం అర్చకులొకరు దివిసీమ నుండి శ్రీకాకుళం రేవు మీదుగా కొల్లూరు వచ్చేటప్పుడు వారికి కృష్ణా నదీ గర్భంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దివ్య విగ్రహం దర్శనమిచ్చిందిట. దానిని శ్రధ్ధా భక్తులతో తీసుకువచ్చి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈయనకి భక్తి శ్రధ్ధలతో 101 ప్రదక్షిణలు, తోమాల సేవ, అప్పాలు వగైరా సమర్పించిన మనిషికి పట్టిన పీడలు, చీడలు మటుమాయమవుతాయని ప్రసిధ్ధి.

   

చితామణి నాటకం

చింతామణి నాటకం గురించి వినని తెలుగువారుండరేమోనంటే అతిశయోక్తి కాదేమో. ఆ సంఘటన 14 – 15 శతాబ్దములలో ఇక్కడ జరిగినదే అంటారు. చింతామణి శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వేశ్య, సుబ్బిశెట్టి పోతార్లంకకు చెందిన శెట్టి, భవాని శంకరుడు, బిల్వమంగళుడు కొల్లూరుకు చెందిన విప్రులు.

దర్శనమయ్యాక మురళిగారు చెప్పిన రాంబాబు మెస్ వెతుక్కుంటూ కాలి నడకనే బయల్దేరాము కారు అక్కడే వదిలి. చాలా దగ్గర అన్నారు. దోవలో ఎవరినడిగినా వెంటనే దోవ చూపించారు. బహుశా అది చాలా ఫేమస్ మెస్ అయి వుంటుంది అనుకుంటూ నడుస్తుంటే స్టూడెంట్స్ కూరల పేకెట్స్ తీసుకుని వెళ్తూ కనిపించారు. వాళ్ళని కూడా పలకరించేశాము. వాళ్ళూ రాంబాబు మెస్ నుంచే తెచ్చుకుంటున్నారు. బాగుంటాయి అని వాళ్ళుకూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. రాంబాబు మెస్ చేరుకున్నాము. చిన్నదే. పెంకుటింటి ముందు తాటాకులతో వసారాలాగా దింపి వుంది. ముందు సిమెంటు తొట్టెలో నీళ్ళు.. కాళ్ళు కడుక్కోవటానికి. లోపల 7, 8మంది ఒకే సారి కూర్చుని భోజనం చెయ్యటానికి వీలుగా బల్లలు వేసి వున్నాయి. మేమెళ్ళేసరికి ముందు తింటున్నవారు బయటకు వచ్చారు. మేము వెళ్ళాము. యజమాని కూర్చోండి అని బల్లలు చూపించి చాలా బాగా మాట్లాడుతూ, పనివాళ్ళకు అన్నీ పురమాయిస్తూ, మెనూలో లేని చట్నీ, ఇంకో రకం పప్పు కూడా మాకు ప్రత్యేకంగా వేయించారు. వాటికోసం వేరే డబ్బులు తీసుకోమన్నా వద్దన్నారు. భోజనం 60 రూపాయలే. బాగుంది. తృప్తిగా భోజనం చేసి వస్తూ ఆయనకా విషయం చెప్పాము. భోజనం ఎలా వుంటుందో అని భయపడ్డాము కానీ ఇంటి భోజనంలాగా బాగుందండీ అంటే ఆయన చాలా సంతోషించారు.

మా భోజనం అవుతుండగానే ఆలయం పూజారిగారు వచ్చి స్ధల పురాణం పుస్తకం దొరకలేదండీ, తర్వాత పంపిస్తామన్నారు అని చెప్పి వెళ్ళారు. ఇంతలో మురళిగారు పుస్తకం ఎక్కడ సంపాదించారోగానీ, తెచ్చి ఇచ్చారు. ఆయనకేమి అవసరం చెప్పండి, పూజారిగారితో కబురు పెట్టటం, పుస్తకం దొరికిన తర్వాత ఆయనే తెచ్చివ్వటం. వారి సహృదయతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాము.

ఒక ముఖ్య విషయం

శ్రీ మురళి గారు ఇచ్చిన పుస్తకం .. కొల్లూరు కధనం .. శ్రీ పొణుకుమాటి వెంకట సుబ్బయ్య (రాష్ట్రస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత) రచించినది. దీనికోసం రచయిత చేసిన కృషిని మెచ్చుకోవాలి. ఈయన స్ధానిక పురాతన అవశేషాలను, కైఫీయత్తులను, జనశ్రుతులను, శాసనాలను, ఇరుగు పొరుగు గ్రామాలలో లభించే చరిత్రాంశాలను పరిగణనలోకి తీరుకొని, విశ్లేషించి ఈ పుస్తకానికి ఒక రూపాన్ని కల్పించారు. క్రీ.పూ. 1000 సంవత్సరాలనుండి, క్రీ.శ. 2000 వరకు, అంటే సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్రను సంగ్రహంగా పొందుపరచారు. నేను పైన తీసుకున్న చారిత్రక అంశాలు వీరి పుస్తకంలోంచి సేకరించినవే.

చారిత్రిక ప్రాముఖ్యమున్న ప్రతి గ్రామంవారు ఇలాంటి శ్రధ్ధ తీసుకుని తమ గ్రామాలగురించి ఇలాంటి పుస్తకాల రాస్తే మరుగు పడుతున్న మన దేశ ఉజ్వల చరిత్ర అందరికీ తెలుస్తుంది కదా.

ఇంకొక విషయం – కైఫియత్ అంటే తెలుసా మీకు? నాకయితే ఈ గుంటూరు యాత్రలోనే తెలిసింది. అమర్తలూరు వారిచ్చిన కైఫియత్ పుస్తకం చూసి కైఫియత్ అంటే గ్రామ చరిత్ర తెలియజేసే పుస్తకం అనే అవగాహనకొచ్చాను. దీని గురించి ఇంకొంచెం విశదంగా కొల్లూరు కథనంలో డా. పురాణం రాధాకృష్ణ ప్రసాద్, పురాతత్వవేత్త, చరిత్ర పరిశోధకులు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరక్టర్, కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ, తెనాలి వారు వ్రాసిన ముందు మాటలో ఇంకొంచెం వివరంగా తెలుసుకున్నాను. మరి నాలాంటి తెలియనివాళ్ళ కోసం ఆయన వ్రాసిన ముందు మాటలోంచి ఒక పేరా యధా తధంగా కింద ఇస్తున్నాను…

“ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది. గ్రామ చరిత్రలే దేశ చరిత్రలకు మూలాధారాలు. కనుక గ్రామ చరిత్రలను విస్మరించక పరిగణలోనికి తీసుకొనవలసి వుంటుంది. దేశ లేక ప్రాంత చరిత్రలను నిర్మించటానికి ఈ గ్రామ చరిత్రలు ఎంతగానో తోడ్పడతాయి. దీనిని గమనించిన కల్నల్ మెకంజీ ఎంతో శ్రమించి అనేక గ్రామాలకు సంచారం చేసి గ్రామ కైఫీయత్తులన్న పేరుతో వ్రాయసగాండ్ల చేత కథనాలను వ్రాయించాడు. ఎట్టి చరిత్ర తెలియని గ్రామాలకు చరిత్ర నిర్మాణానికి ఈ కైఫియత్తులే ఎంతో ప్రయోజనకరంగా వున్నవి. నేడుకూడా ఉపయోగపడుతున్నవి.”

ఇన్ని వివరాలు, విశేషాలు మూటగట్టుకుని అక్కడనుండి ప్రయాణమయ్యాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here