[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 32-36” వ్యాసంలో కూచిపూడి, మూల్పూరు, ఎలవర్రు, ఇంటూరు, గోవాడ లోని ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
32 కూచిపూడి
ఇక్కడ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించిన శ్రీ రామలింగేశ్వర ఆలయం వున్నది. దీని గోపురం చాలా ఎత్తు అన్నారు. మేము వెళ్ళేసరికి ఈ ఆలయం మూసి వున్నది. బయటనుంచి సన్నగా పొడుగ్గా వున్న గోపురం ఫోటో తీసుకుని మూల్పూరు దోవ పట్టాము.
33 మూల్పూరు
మూల్పూరులోని అగస్తేశ్వరాలయం కూడా మూసి వున్నది. ఇది 100 సంవత్సరాలకి పూర్వం నిర్మింపబడిందన్నారు.
34 ఎలవర్రు
35 ఇంటూరు
అక్కడనుంచి ఇంటూరులో శ్రీ మూల స్ధానేశ్వరస్వామి ఆలయానికి వచ్చాము. పూజారిగారిల్లు పక్కనే వుండటంతో తలుపులు తెరిచారు. వారికి ఆలయం చరిత్ర ఏమీ తెలియదు. 400 సంవత్సరాలకి పూర్వపు ఆలయమని చెప్పారు. ఆలయం మధ్యలో ప్రధాన దైవం మూలస్ధానేశ్వరస్వామి, ఆయనకి కుడి పక్కు వీరభద్రుడు, ఎడమ ప్రక్కన అమ్మవారు. వీరభద్రుడికి పది పన్నెండు చేతులున్నాయి. స్పష్టంగా కనబడలేదు. 8 చేతులు వెనుక రాతిఫలకం మీద వున్నాయి మిగతావి ముందుకు వున్నాయి. విగ్రహానికి అలంకరించిన దుస్తులవల్ల స్పష్టంగా కనబడలేదు. అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు కొన్నిచోట్ల దుస్తులు సవరించి చూపిస్తారుగానీ, అపరాహ్ణ సమయమయ్యే.
అమ్మవారి రెండు చేతులూ కూడా పైకి ఎత్తి వున్నాయి. వాటిలో ఆయుధాలున్నాయి.
36 గోవాడ
ఇంటూరునుంచి బయల్దేరాము. పది నిముషాల ప్రయాణం తర్వాత దూరంగా పొలాలలో ఆలయం కనిపించింది. అది గోవాడ అయ్యుంటుంది, అక్కడికి వెళ్దామన్నాను. అంతకు ముందు గోవాడ గురించి అడిగితే చిన్న గుడి, పొలాల్లో వుంటుంది, అక్కడెవరూ వుండరు అన్నారు. మా చిన్నప్పుడు శివరాత్రికి అక్కడ జరిగే తిరణాల గురించి బాగా చెప్పుకునేవారు. నా అనుమానం నిజమే అయింది. అది శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయం, గోవాడే. అయితే చిన్నది కాదు. చాలా ఆలయాల సమూహం వున్నది ఆ కాంపౌండ్ లో. పునర్నిర్మించినట్లున్నారు. చక్కని రంగులతో ఆకర్షణీయంగా వున్నది. అమ్మయ్య, ఈ ఆలయం కూడా చూస్తున్నాము అని సంతోషంగా లోపలికి వెళ్ళాము.
లోపలికి వెళ్తూనే ఎడమ ప్రక్క సరస్వతి, షిర్డీ సాయి, సుబ్రహ్మణ్యేశ్వరుల ఉపాలయాలు గోడలు తలుపులు లేని మండపాలలో వున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక తలతో వుండటం ఇక్కడ విశేషం. ఇవ్వన్నీ 2010 నిర్మాణాలు.
ప్రధాన ఆలయం తలుపు కూడా తీసి వుంది. కానీ మధ్యలో బాల కోటేశ్వరస్వామి ఆలయం మూసి వున్నది. చుట్టూ వున్న ఉపాలయాలు చూడగలిగాము. ఆలయం లోపల ఒక ఉపాలయంలో నరసింహస్వామి, లక్ష్మి, విగ్రహాలు విడి విడిగా వున్నాయి. ముందు శివ లింగం, కుడివైపు వినాయకుడు.
ఆలయానికి కొంచెం దూరంగా ప్రత్యేక ఆలయంగా నవగ్రహ మండపం. ఇందులో భార్యా సమేతంగా వాహనాలమీద నవగ్రహాల విగ్రహాలు మూడు అడుగుల ఎత్తువి వున్నాయి. ఈ మండపానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు, అన్ని ద్వారాల దగ్గర ద్వారపాలకులు. ఈ మండపానికి ముందు చిన్న మండపంలో శనీశ్వరుని వాహనమైన వాయసం వుంది.
మేము విన్నదాని ప్రకారం అతి చిన్న ఆలయం. పొలాల మధ్య వుంటుంది. ఎవరూ వుండరు అని. ఇదివరకు అలా వుండేదేమోగానీ ప్రస్తుతం ఆలయాన్ని బాగా అభివృధ్ధి చేశారు. విశాలమైన ఆవరణలో అందంగా వున్నాయి ఆలయాలన్నీ.
4-40కి అక్కడనుంచి బయల్దేరి పెదపల్లి చేరాము. ఇక్కడ మా పెదనాన్నగారి అమ్మాయి ఉదయశ్రీ, మా మేనత్తగారి అబ్బాయి శర్మ (దంపతులు) వున్నారు. మా చెల్లెలు చేసి పెట్టిన ఫలహారాలు తిని, స్ట్రాంగ్ కాఫీ తాగి మళ్ళీ 6-30కి అక్కడనుండి బయల్దేరాము.