Site icon Sanchika

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 38: నిజాంపట్నం

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 38″ వ్యాసంలో నిజాంపట్నంలోని గోకర్ణేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కూచినపూడి ఆలయ పూజారిగారు శ్రీ ఫణిగారు, శ్రీ బండారు వెంకటరావుగారు రచించిన నిజాంపట్నం మండల సంక్షిప్త దర్శని అనే పుస్తకాన్ని ఇచ్చారు. దాని ద్వారా నిజాంపట్నం చరిత్ర కొంత తెలిసింది. అదేమంటే…

పూర్వం నిజాంపట్నం పేరు నవనిధాన పట్నం. దీనిని నవనిధానుడు అనే రాజు పరిపాలించటంవల్ల ఈ పేరు వచ్చిందిట. తర్వాత తిమ్మభూపాలుడు అనే రాజు పరిపాలించటంవల్ల అతని పేరుతో తిమ్మభూపాల పట్నంగా పేరు మార్చబడింది. తర్వాత కాలంల మన దేశంపై ముస్లింల, ఆంగ్లోయుల ప్రభావం పడింది. నైజాం నవాబుల పరిపాలనా కాలంలో నిజాం అనే పేరు శాశ్వతంగా వుండేలా తిమ్మభూపాల పట్నాన్ని నిజాంపట్నంగా మార్చారు. అదే పేరు ఇప్పటికీ వాడుకలో వుంది.

క్రీ.పూ. 2వ శతాబ్దంలో కుబ్బేరకుడు నుంచి వేంగీ చాళుక్యులదాకా (తూర్పు చాళుక్యులు) ఈ కర్మ రాష్ట్రాన్ని (గుంటూరు జిల్లా ఇక్ష్వాకుల కాలంనుంచీ అలా పిలవబడింది) అనేక రాజులు పరిపాలించారు. కాకతీయుల కాలంలో దీనిని కాకతీయుల ప్రతినిధులు కాకతీయ సామ్రాజ్యం పేర పరిపాలించారు. వీరిలో గణపతిదేవ చక్రవర్తి గజ సైన్యాధ్యక్షులు, వారి బావమరిది, నృత్య రత్నాకర గ్రంధకర్త జాయపసేనాని ముఖ్యులు. రుద్రమదేవి, వీర ప్రతాపరుద్ర దేవుని కాలంలో జిల్లా, దాని అనుబంధ ప్రాంతాలు కాకతీయుల పాలన క్రింద వున్నాయి. తర్వాత ముస్లింలు, రెడ్డి రాజులు విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, మొఘలులు, నిజాం, బ్రిటిష్ వారు వగైరా అనేక రాజ్యాధినేతల పరిపాలనలు మారి స్వాతంత్ర్య సిధ్ధ్యానంతరం ప్రజా పరిపాలనలోకి వచ్చింది.

ఒక్కసారి ఇది చదివితే ఇంతమంది రాజులు మన ప్రాంతాలని ఏలారా అనే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రాజులు మారేటప్పుడు ఎన్ని యుధ్ధాలు జరిగాయో అనే భయం కూడా వేస్తుంది కదా.

విజయనగర రాజుల సమయంలో నిజాంపట్నం మండలాన్ని పులిగడ్డ పాపనరసింహం, ఆయన కుమారులు మల్లప్ప, నంది వీరయ్యలకు ఇబ్రహీం పాదుషా స్వాధీనపరచాడుట. వీరిలో నందివీరయ్య కాలంలో ఈ నిజాంపట్నం బాగా అభివృధ్ధి చెందింది. మా నాన్నగారు వాళ్ళు పులిగడ్డవారే. వీరి వంశస్ధులే. అందుకే ఆ ప్రాంతాలంటే అభిమానం.

పెరిష్ఠా అనే చరిత్రకారుడు నిజాంపట్నం పెద్ద రేవు పట్నమని తన గ్రంథంలో కొనియాడాడు. పెద్ద ఓడలు ఈ నిజాంపట్నం రేవునకు వస్తూవుండేవిట. ఆ కాలంలో ఇతర దేశాలతో వ్యాపారం చురుకుగా జరుగుతుండేదిట. వ్యాపారం ఎక్కువగా నిజాంపట్నం రేవు ద్వారా జరుగుతుండటంతో నిజాంపట్నం ప్రాధాన్యత పెరిగి వాణిజ్య కేంద్రంగా పేరుపొందిది. ఇక్కడనుంచి అనేక వస్తువులు ఎగుమతులు దిగుమతులు జరిగేవి. బర్మా, చైనా, సయాం, జావా, మలేషియా, సుమిత్రా మొదలైన తూర్పు ప్రాంతాలకు, గ్రీస్, రోమ్ మొదలైన పశ్చిమ ప్రాంతాలకు వాణిజ్యం జరుగుతూ వుండేది.

బ్రిటిష్ వారి కాలంలో నిజాంపట్నం అభివృధ్ధి చెందింది. సీ కస్టమ్స్ ఆఫీస్‌ని కట్టించారు. తర్వాత కొంతకాలానికి సముద్రం మెరక వెయ్యటంతో ఓడలు వచ్చే అవకాశం తగ్గింది. అప్పటినుంచి నిజాంపట్నం ప్రాధాన్యత తగ్గింది.

నిజాంపట్నం గురించి నేను తెలుసుకున్న చరిత్ర చెప్పాను. ఇప్పుడు ఆలయం గురించి.

గోకర్ణేశ్వరాలయం

ఇక్కడ కూడా గోకర్ణేశ్వరుడి ఆలయం వుంది. ఈయనకి కుడి పక్క వీరభద్రుడు, ఎడమ వైపు అమ్మవారు బాలా త్రిపుర సుందరి ప్రత్యేక ఉపాలయాల్లో వున్నారు. ఇంకో ఉపాలయంలో కనకదుర్గమ్మ. ఇంతకన్నా వివరాలు తెలియలేదు.  అక్కడనుంచీ ఆ రోజుకి మా ఆఖరి మజిలీ చందోలుకు బయల్దేరాము.

 

Exit mobile version