గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 41: ప్రత్తిపాడు

0
2

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 41” వ్యాసంలో ప్రత్తిపాడు లోని శ్రీ వేణుగోపాల సీతారామస్వామివారి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత దండేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]2[/dropcap]8వ తారీకు అంత తిరిగాం కదా… 29న లేవలేక పోయాం. పూర్తి విశ్రాంతి తీసుకున్నాం. మళ్ళీ సెప్టెంబరు 30వ తారీకు ఉదయం 5-50కి బయల్దేరాము ఇంటినుంచీ… మళ్ళీ అదే వాహనంలో. ముందు రోజు వచ్చిన డ్రైవర్‌కి ఈ రూట్ తెలుసంటే ఆయన్నే రమ్మన్నాము. కానీ ఆయనకి వేరే ట్రిప్ వెళ్ళవలసి రావటంతో కొత్తతను వచ్చాడు. దానితో ఈ రోజు ఒక పధ్ధతిలో వెళ్ళక కొంత దూరం ఎక్కువ తిరిగాం. దోవ కనుక్కోవటాలు కూడా ఎక్కువైంది. ఏది ఏమైనా ఇవాళ కూడా విజయవంతమైన రోజే. మరి వివరాల్లోకి వెళ్తే 5-50కి విజయవాడలో బయల్దేరిన వాళ్ళం 7-10 ని. లకు గుంటూరునుంచి 18 కి.మీ. ల దూరంలో వున్న (విజయవాడ నుంచి 74 కి.మీ. అని మా రథ సారథి ఉవాచ) ప్రత్తిపాడు చేరుకున్నాం.

శ్రీ వేణుగోపాల సీతారామస్వామి ఆలయం

ప్రత్తిపాడులో మేము ముందుగా దర్శించినది శ్రీ వేణుగోపాల సీతారామస్వామివారి ఆలయం. ముందు ఆంజనేయస్వామి ఉపాలయం వున్నది. పూజారిగారు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఆలయం రెడ్డిరాజుల కాలం నాటిది. అప్పట్లో గొట్టిపాడులో తవ్వుతుంటే సీతా రాముల విగ్రహం (వాళ్ళిద్దరిదే) దొరికిందిట. దానిని ఇక్కడ ప్రతిష్ఠించారు. మొదట్లో గోపీనాథస్వామి అనే పేరు.

తర్వాత నేను సేకరించిన వివరాలబట్టి పురాతనమైన ఈ ఆలయాన్ని పూర్వం చిలకలూరిపేట జమీందారు శ్రీ కోరుగంటి వెంకటరెడ్డి 1364 సంవత్సరంలో గ్రామం మధ్యలో నిర్మించారు. ఆ రోజులలో వీరు గ్రామంలోని శ్రీ దండేశ్వరస్వామికి సకల ఉత్సవాలు నిర్వహించేవారు. వేణుగోపాలస్వామి, సీతారామస్వామి ఒకే ఆలయంలో కొలువుతీరి వున్నారు. అందుకే ఆ పేరు. మొదట్లో స్వామి పక్కన రుక్మిణీదేవి మాత్రమే వుండేది. అప్పుడు స్వామి శ్రీ గోపీనాథస్వామిగా పూజలందుకునేవారు. తర్వాత శ్రీనివాస వెంకటాచార్యులుగారు సత్యభామ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామిగా పేరు వచ్చింది. 1760లో శ్రీ వెంకటకృష్ణమ్మ ఈ దేవాలయాన్ని పునరుధ్ధరించారు. 1925 ఏప్రిల్ 5నుండి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వున్నది.

 

ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఉత్తర ముఖంగా వుంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి చాలా ప్రాముఖ్యత వున్నది కదా. ఇక్కడ స్వామిని ప్రతి రోజూ ఉత్తర ద్వారంగుండానే దర్శించుకోవచ్చు.

ఈ ఆలయంలో 2014 జూన్ 21న శ్రీ సీతారామచంద్రస్వామివారి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు.

రామచంద్రుణ్ణి చూసి వచ్చాం కదండీ… ఆలయంనుంచీ బయటకి రాంగానే ఆత్మారాముడు నేనూ వున్నానన్నాడు. ఈ లోపల ఆలయం బయట చిమ్మి, నీళ్ళు జల్లి వుందిగానీ ఇంకా ముగ్గు వెయ్యలేదు. అక్కడ ముగ్గు డబ్బా వుంటే మా చెల్లెలు వెళ్ళి చక్కని ముగ్గు పెట్టి వచ్చింది. పక్కనే శివాలయం. అది కూడా చూశాక ఆత్మారాముణ్ణి శాంతింప చేద్దామని అటు వెళ్ళాం.

శ్రీ గంగా పార్వతీ సమేత దండేశ్వరస్వామి ఆలయం

ఆ ఊళ్ళో నేను నోట్ చేసుకున్న ఇంకొక ఆలయం శ్రీ గంగా పార్వతీ సమేత దండేశ్వరస్వామిది. అది కూడా పక్క సందులోనే వున్నది. అటు వెళ్ళాం. కొంచెం ఎత్తు ప్రదేశంలో వున్నది ఆలయం. ఆవరణ విశాలంగా వుంది. ఈ జిల్లాలో చాలామటుకు అతి పెద్ద, అతి చిన్న కాని, మధ్యస్తంగా వుండే ఆలయాలు ఎక్కువ. ఇది కూడా ఆ కోవలోదే.

పూర్వం ఈ ప్రాంతం అంతా దండకారణ్యం. గౌతమ మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేసి, శివ దర్శన పొంది, శివలింగాన్ని ప్రతిష్ఠించారంటారు. ఆ సమయంలో విదర్భ రాజ కుమార్తె సీమంతిని భర్తను నాగ కుమారులు బంధించి నాగలోకానికి తీసుకుని వెళ్ళారు. భర్తను వెతుకుతూ ఆ రాజకుమారి, గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద వున్న శివాలయానికి చేరుకున్నది. తన భర్తను రక్షించి ఇంటికి చేర్చమని పరమ శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ఆమెను మన్నించి, ఆమె భర్తను తిరిగి స్వస్ధలానికి చేర్చి, గండం నుంచి రక్షించాడు. అందుకనే గండేశ్వరస్వామిగా ప్రసిధ్ధి పొందాడు. ఆ సమయంలోనే ఈ గ్రామాన్ని భక్తులవాడగా పిలిచేవారని చరిత్ర కథనం.

ప్రకృతి వైపరీత్యాలలో గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన లింగం భూగర్భంలో కలిసిపోయింది. తర్వాత కాలంలో పరిశ్చేది కుసుమరాజు చోళ దేశంపై దండయాత్ర చేసి తిరిగి వెళ్తూ ఒక రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. స్వామి ఆ రోజు రాత్రి కుసుమరాజుకు కలలో కన్పించి, దగ్గరలోని చెట్టుకింద వున్న పుట్టలో తాను వున్నట్లు తెలిపారుట. తెల్లవారుఝామున కుసుమరాజు, తన పరివారంతో ఆ పుట్టను తవ్వించాడు. ఆ పుట్టలో శివలింగం కనిపించటంతో క్రీ.శ. 1144వ సంవత్సరంలో ఇక్కడ దేవాలయాన్ని కట్టించాడని చారిత్రక ఆధారాలు వున్నట్లు తెలిపారు.

కొండవీటి సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల అధీనంలో వున్నప్పుడు ప్రత్తిపాడు మండలాధిపతి గింజుపల్లి అచ్చినాయుడు ఈ ఆలయ దక్షిణ ముఖ మండపాన్ని నిర్మించాడు. అనంతరం శ్రీకృష్ణ దేవరాయల సోదరుడు సదా శివరాయలు పాలనలో 1476లో పార్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంగ్లేయుల పాలనలో ఈ ఆలయం చిలకలూరిపేట జమీందారులైన వెకటకృష్ణుని అధీనంలోకి వచ్చింది. వారి పాలనలో శ్రీ మహా గండేశ్వరస్వామి ఆలయంగా పిలువబడి వారి ఆధ్వర్యంలో సకల ఉత్సవాలు జరిగేవి. తర్వాత దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం శ్రీ గంగా పార్వతీ సమేత దండేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నారు స్వామి. పేరు మార్పుకు కారణాలు తెలియలేదు.

ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దోష నివారణకు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. దసరా నవరాత్రులు, కార్తీక మాసం, శివరాత్రి మొదలయిన పర్వదినాలలో ఉత్సవాలు బాగా జరుగుతాయి.

 

పూర్వం ఈ ఆలయాన్ని గండేశ్వరస్వామివారి ఆలయం అని పిలిచేవారని తెలుసుకున్నాంకదా. ఎవరికైనా ఆపద వస్తే ఇక్కడకు వచ్చి స్వామివారిని సేవిస్తే గండాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే వివిధ ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, స్వామివారిని దర్శించుకుంటారు. సోమవారంనాడు భక్తుల సంఖ్య ఇంకా అధికంగా వుంటుంది.

ఆలయ దర్శనయ్యేసరికి ఆత్మారాముడు నా సంగతి చూడమని గోల పెట్టాడు. పొద్దున్న ఇంట్లో కాఫీ మాత్రమే తాగి బయల్దేరాము మరి. అవ్వన్నీ పల్లెటూళ్ళవటంతో అక్కడ హోటల్స్ ఎక్కడా కనబడలేదు. గుడి దగ్గరే రోడ్డు మలుపులో ఒక బండి మీద ఇడ్లీ, దోశ వగైరా అప్పటికప్పుడు వేసి అమ్ముతున్నారు. శుభ్రంగా వుంది. ఆ ఊరి వాళ్ళనుకుంటాను మేము చూస్తుండగానే కొంతమంది వచ్చి పొట్లాలు కట్టించుకుని వెళ్తున్నారు. ఇంక మేము ఫిక్స్ అయిపోయాము. ఊళ్ళోవాళ్ళు వచ్చి పొట్లాలు కట్టించుకుని వెళ్తున్నారంటే, ఇదే ఈ ఊళ్ళోని మంచి టిఫెన్ సెంటర్ అని. మా రథ సారథి “మీరు కార్లో కూర్చోండమ్మా, నేను తెస్తాను. కొంచెం టైము పట్టేటట్లుంది” అని అందరికీ వేడి వేడి దోశలు తెచ్చి పెట్టాడు. ఇడ్లీలు అప్పటికి అయిపోయాయి. మేము దోశ తినేసరికి ఇడ్లీ వాయ వచ్చిందని మళ్ళీ ఇడ్లీ .. చాలా రుచిగా వున్నాయండి. కాఫీ లేదు అక్కడ. పెద్ద పెద్ద హోటళ్ళు దిగదుడుపనుకోండి. ఆత్మారాముణ్ణి పూర్తిగా శాంత పరచి 8 గంటలకి అక్కడనుండి బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here