గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 43: సింగనసాని పేట లేక చంఘిజ్ ఖాన్ పేట

1
2

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 43” వ్యాసంలో సింగనసాని పేట లోని శ్రీ నవనీత బాలకృష్ణస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

ఉదయం 8-35కి యనమదలనుంచి బయల్దేరి చిలకలూరిపేట రోడ్డులో ప్రయాణించి 9 గం.లకి సింగనసాని పేట ఉరఫ్ చెంగిజ్ ఖాన్ పేట చేరుకున్నాము. ఇది గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, కొండవీడు కొండల దిగువన వున్నది. కొండవీడు ఒకప్పుడు రెడ్డి రాజుల రాజధాని. ఇక్కడ బాల కృష్ణుడు వున్నాడని తెలిసి దోవ అడుగుతూ, అడుగుతూ వెళ్ళాము.

కర్ణాటక రాష్ట్రంలో రామాప్రమేయస్వామి ఆలయంలో మాత్రమే బాల కృష్ణుడు, వెన్నముద్ద చేతిలో పట్టుకుని, పారాడుతూ వున్నట్లు విగ్రహం వున్న ఆలయం వున్నది, ఇంక ఇండియాలో ఎక్కడా ఇలాంటిది లేదు అని వారి ఉవాచ. ఆ ఆలయమూ చూసే అవకాశం నాకు కలిగింది. మరి గుంటూరు జిల్లాలోని ఆలయాల గురించి వెతుకుతున్నప్పుడు అలాంటి కృష్ణుడే ఇక్కడా వున్నాడని తెలిసి, అందులో వాళ్ళు ఇండియాలో ఎక్కడా లేదన్నప్పుడు, మన తెలుగు రాష్ట్రంలో వుంటే, చూడకుండా వుంటామా.

గుంటూరు జిల్లా యాత్ర ఫాలో అవుతున్నవారికి ఇంతకు ముందు 26వ భాగంలో కొల్లిపర జనార్దన స్వామి ఆలయంలో వున్న ఇలాంటి బాల కృష్ణుని విగ్రహం గురించి చెప్పాను. అంటే కర్ణాటక వాళ్ళు చెప్పినట్లు కాక తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా నేను చూసినంత మటుకూ రెండు చోట్ల ఈ బాల కృష్ణుని విగ్రహాలు వున్నాయంటే మనకి కొంచెం గర్వ కారణమే కదా.

ఆలయాన్ని బోర్డు చూసి కనుక్కున్నాము. ఎందుకో తెలుసా సాధారణంగా ఆలయాలకి వుండే ప్రవేశ ద్వారం పై గోపురం ఈ ఆలయానికి లేదు. ఆలయం.. చెప్పాను కదా ఈ జిల్లాలో చాలా మటుకు ఆలయాలు మధ్యస్తంగా వున్నాయి. ఇదీ అంతే. ప్రహరీ గోడకానించి కొన్ని విగ్రహాలు పెట్టబడి వున్నాయి. శిధిలాలలో దొరికినవి అయి వుంటాయి.

ఆలయం గొప్పగా వుండదుగానీ, ఆలయంలోని చిన్ని కృష్ణయ్య బహు గొప్పగా వుంటాడండీ. నవనీత బాలకృష్ణ స్వామి. మోకాళ్ళమీద పాకుతూ ఆగినట్లు నల్ల విగ్రహం. రింగు రింగులు జుట్టు, చేతులకి మురుగులు, గజ్జెల మొలతాడు, కుడి చేతిలో వెన్న ముద్ద, ఎడమ చేయి వెన్న కుండ మీద. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ స్వామికి మెడలో పులిగోరు పతకం వున్న హారం వుంటుంది. ఇది శిల్పంలోనే వున్నది. వేరే దేవుళ్ళకి అనేక హారాలు వుండి వుండచ్చుగానీ పులిగోరు పతకం ఎక్కడా కనిపించదు. ఇక్కడ బాల కృష్ణుడి ప్రత్యేకత ఇది.

ఇంకొక విశేషం ఈ విగ్రహం కుడి భుజానికి చక్రం, ఎడమ భుజానికి శంఖం వుంటుంది. విష్ణువుకి సంబంధించిన అవతారాల విగ్రహాలకి శంఖం, చక్రం, విడిగా చేతుల్లో వుంటాయి. కానీ ఇక్కడ బాల కృష్ణుడికి భుజం మీద వుంటాయి. బాల కృష్ణుడిది వంకీలు తిరిగిన జుట్టు.. వెనుక భుజాలదాకా వుంటుంది చిన్న పిల్లలకి వున్నట్లు. పైన జుట్టు అధోముఖ పద్మంలాగా వుంటుంది. కుడి కాలు మడిచి ముందుకి పెట్టి వుంటుంది, ఎడమ కాలు మడిచి వెనక గోడ వైపుకి వుంటుంది .. పాకుతున్న పోజులో దాదాపు 3.5 అడుగుల విగ్రహం. ఎంత అందంగా వుంటాడంటే మీకక్కడనుంచి కదిలి రాబుధ్ధి కాదు. పూజారిగారు కృష్ణుడిని మాత్రం ఫోటో తీసుకోనియ్యలేదు. అక్కడ వున్న ఫోటోని తీసికోమన్నారు. అదే తీశాను. అదే చూడండి..ఏం చేస్తాం. పక్కనే వున్న వేణు గోపాల స్వామిని, రాజ్య లక్ష్మి అమ్మవారిని ఫోటో తీసుకోనిచ్చారు.

ఈ స్వామి సంతాన సాఫల్యానికి, వివాహానికే కాదు ఇంకా మనిషికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా వాటిని తొలగించటంలో ప్రసిధ్ధుడు. ఈ స్వామికి మొక్కుకుని వెన్న నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. దానికోసం భక్తులు ఇక్కడ 21 రోజులు, 25 రోజులు, 41 రోజులు, వారు కోరుకున్న విధంగా పూజలు చేయించి, వెన్నని నైవేద్యంగా సమర్పిస్తారు.

శ్రీకృష్ణ దేవరాయలుకి ఒకసారి ఈ స్వామి కలలో కనిపించాడుట. ఆయన మర్నాడు తన ఆస్ధానంలోని వారిని పిలిచి కల సంగతి చెప్పి అలాంటి కృష్ణుడి విగ్రహాన్ని కోటలో ప్రతిష్ఠించాలని శిల్పులని అలాంటి విగ్రహం తయారు చెయ్యమని ఆదేశించారుట. శిల్పులు అంగీకరించారు. శిల్పం చెయ్యటానికి తగిన నల్ల రాయి ఉదయగిరి కొండల్లో దొరుకుతుందని వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ శిల్పానికి తగిన రాయి గురించి అన్వేషిస్తుండగా శిల్పులకి ఈ విగ్రహం కనిపించిందిట. వారు ఆ విగ్రహాన్ని శ్రీకృష్ణ దేవరాయలుకి సమర్పించగా ఆయన తన ఆస్ధానంలో ప్రతిష్ఠించారు.

తర్వాత కృష్ణదేవరాయలు తూర్పు దిశగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ కొండవీడు ప్రాంతానికి వచ్చాడు కానీ సులభంగా కొండవీడుని జయించలేక పోతాడు. అప్పాజీ ఆస్ధానంలో ప్రతిష్ఠించిన చిన్ని కృష్ణుడికి 41 రోజులు శ్రధ్ధగా పూజలు చేయించమని సలహా ఇవ్వగా ఆస్ధానానికి కబురు పెడతాడు. పూజలు మొదలు పెట్టిన 21వ రోజు పూజ జరుగుతూండగా కృష్ణ దేవరాయలు కొండవీడు జయించాడు. ఆ సమయంలో రాయలు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి కొండవీడు కొండ దిగువన గోపీనాధ ఆలయం నిర్మించి దానిలో ప్రతిష్ఠించాడు. తర్వాత కాలంలో ముస్లింల పరిపాలనలో ఆలయాలను ధ్వంసం చేస్తూండగా ఈ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తారనే భయంతో విగ్రహాన్ని భూస్ధాపితం చేశారు. అలా చాలా కాలం భూమిలో వున్నది స్వామి విగ్రహం. తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనలో మండలాలు ఏర్పరిచి, జమీందారులను నియమించినప్పుడు, ఈ ప్రాంతం చిలకలూరిపేట జమీందారుగారి ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో ఒక రైతు తన ఇంట్లో కాకరపాదు పెట్టాడు. ఆ కాకరపాదు ఏడాది పొడుగునా ఏ కాలంలోనైనా విపరీతమైన కాపు కాసింది. దానితో ఆ రైతు వాటిని అమ్మి ధనం సంపాదించుకున్నాడు. రెండో సంవత్సరం కూడా అలాగే జరిగే సరికి రైతుకి అనుమానం వచ్చింది. ఒక కాకరపాదు ఇన్ని రోజులు ఇంత పంట ఇచ్చిందంటే తప్పకుండా భూమిలో ఏతో విశేషం వుండి వుంటుందని తవ్వి చూడగా ఈ విగ్రహం బయల్పడింది. రైతు చిలకలూరిపేట జమీందారుకి విషయం వివరించాడు. అప్పటి జమీందారు రాజా వెంకట కృష్ణా రాయడుగారు వచ్చి స్వామిని చూసి, తన ఆస్ధానంలో ప్రతిష్ఠించాలని తీసుకుని వెళ్ళబోయాడు. కానీ బండి సహకరించలేదు. చక్రం విరిగిపోయింది. బాగు చేయించినా మళ్ళీ అదే పరిస్ధితి. సాయంకాలం అయ్యేసరికి అక్కడే విశ్రమించి మర్నాడు ప్రయాణం చేద్దామనుకుంటారు. ఆ రాత్రి స్వామి జమీందారుకి స్వప్న సాక్షాత్కారమిచ్చి తానక్కడే వుండదల్చుకున్నానని, జమీందారుకి కావాలంటే ఆయన తోటలో పున్నాగ చెట్టుకింద తవ్వితే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం వుంటుందనీ, దానిని ప్రతిష్ఠించుకోమనీ చెబుతారు. మర్నాడు జమీందారు అది నిజమో కాదో తెలుసుకోవటానికి తన తోటలో తవ్వించగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం బయల్పడింది. దానిని ఆస్ధానంలో ప్రతిష్ఠించి, బాల కృష్ణుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని చిలకలూరిపేట జమీందారు రాజా మునురి వెంకట హనుమంతరావుగారు 350 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆలయ అర్చకత్వం వంశపారంపర్యంగా వస్తోంది. ప్రస్తుతం 11వ తరం వారున్నారు. ఆయన పేరు శ్రీ రాఘవేంద్ర. సెల్ నెంబరు కింద ఇస్తున్నాను.

      

ఈ ఊరి పేరు తమాషాగా వుంది కదా. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రామాన్ని సంగసాని అనే ఒక మహిళకి బహూకరించారుట. అప్పటినుంచీ సంగసానిపేట అయి, అ తర్వాత కాలక్రమేణా చంఘిజి ఖాన్ పేట అయిందని ఒక కథనం.

ఇలాంటి కథలు వింటుంటే ఈ ప్రాంతాలకి గతంలో ఎంత ఘన చరిత్ర వున్నదో అని ఆశ్చర్యం వేస్తుంది కదూ. అలాగే భగవంతుడు తన ఉనికిని నిరూపిస్తూ చేసిన లీలల కథలు వింటే దైవం మీద నమ్మకం పెరుగుతుంది అనుకుంటూ అక్కడనుంచి శ్రీ రాఘవేంద్రగారు చెప్పిన ప్రకారం కొండవీడు దుర్గం కింద వున్న గోపీనాధ ఆలయం అదే చీకటి కోనేరు అదే కత్తుల బావికి పయనమయ్యాము.

శ్రీ రాఘవేంద్ర సెల్ నంబరు 8464040431

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here