Site icon Sanchika

గుంటూరు జిల్లా యాత్ర – 46: పెదనందిపాడు

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 46” వ్యాసంలో పెదనందిపాడు లోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]పె[/dropcap]దనందిపాడు చేరేసరికి 10-50 అయింది. ఆలయ ప్రవేశ ద్వారం తెరిచి వుంది కానీ లోపల ఆలయం తలుపులు మూసి వున్నాయి. అప్పుడే మూసేశారేమిటా అనుకుంటూ చూస్తే వెనక వున్న హాల్‌లో కార్యక్రమం ఏదో జరుగుతున్నట్లున్నది… చాలామంది వున్నారు. వాళ్ళని అడగాలా వద్దా అనుకుంటుండగానే వారిలో ఒకరు ఇటు వైపు రావటం, వారికి మా గురించి చెప్పి వారిని అడగటం జరిగింది. వెనక కళ్యాణ మండపంలో ఫంక్షన్ వుంది కనుక ఆలయం తొందరగా మూశారు, పూజారిగారు కూడా అక్కడే వున్నారు, చెప్పి వస్తానని వెళ్ళారు.

అయిదు నిముషాలలోపే వేరే వారు ఒక్కొక్కరూ వచ్చారు. అక్కడివారు గీతా ప్రార్థనా సంఘం అని ఒక సంఘంగా ఏర్పడి కార్యక్రమాలు చేసుకుంటూ వుంటారు. ఆ సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీ కూనిశెట్టి వెంకట శ్రీనివాసరావుగారు ముందు వచ్చారు. వారి కుటుంబంలో వారిదే నామకరణ మహోత్సవం జరుగుతోంది అక్కడ. తర్వాత ఆ సంఘానికి, ఆలయానికి సంబంధించిన వ్యక్తులు సర్వ శ్రీ దాసరి సత్యనారాయణ, శ్రీనివాస్, అర్చకులు సుబ్రహ్మణ్యంగారు, ఇంకా కొందరు పెద్దలు, మహిళలు కూడా వచ్చారు. ఫంక్షన్ హడావిడికన్నా మా హడావిడి ఎక్కువైంది. అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్యంగారు ఆలయ ద్వారాలు తెరిచి దేవుళ్ళకి హారతి ఇచ్చారు.

ఆలయం గురించి చెప్పమంటే 600 సంవత్సరాల క్రితం ఆలయమని చెప్పారు. వాసిరెడ్డి వారి వంశంలో భవానీ బాలచంద్రగారు కట్టించారుట. అంతకు మించి చెప్పలేక పోయారుగానీ, కూనిశెట్టి శ్రీనివాసరావుగారు ఎక్కడనుంచో “పెదనందిపాడు చరిత్ర” అనే పుస్తకాన్ని సంపాదించి చూపించారు. వారి దగ్గర ఒకే కాపీ వుండటంతో నాకివ్వలేక పోయారు. ఆసక్తితో మనకి అవసరమయ్యే సమాచారం కోసం అక్కడే తిరగేశాను. నా వ్యాసానికి పనికి వచ్చే సమాచారం చాలా తక్కువ దొరికింది. దానినే ఫోటో తీసుకు వచ్చాను. ఆ పుస్తకంలో…

ఊరి పేరు పక్కన వుండే పాడు అనే శబ్దానికి వివరణ ఇచ్చారు…. పాడయిపోయిన, నాశనమైన అని. సిరి సంపదలతో విలసిల్లిన గ్రామాలని పూర్వం కరువు కాటకాల వల్లగానీ, అంటురోగాలవల్లగానీ పాడు పెట్టేవారట. అంటే గ్రామస్తులంతా ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటికి వెళ్ళి నివాసమేర్పరుచుకునేవారు. దానిని పాడు పెట్టటం అనేవారు. నిర్మానుష్యమైన ఆ గ్రామాలు శిథిలమై, మట్టి గుట్టలుగా పేరుకుని వుండేది. అలాంటి గ్రామాలను పాడు అనీ, ఆ భూములను పాటి భూములనీ అనేవారట. తర్వాత వారో, వేరెవరో మళ్ళీ అక్కడ నివాసాలేర్పరుచుకునేవారనీ, అలాంటి గ్రామాల చివర “పాడు” అని చేరేదనీ వున్నది.

ఆ పుస్తకంలోనే మరొక పేజీలో వున్న పెదనందిపాడు కైఫియత్ ప్రకారం పూర్వం ఆ ప్రాంతమంతా కీకారణ్యం. అక్కడికి పెదనందిరెడ్డి అనే ఆయన తన ఇద్దరు తమ్ములతోను, పశువులతోను వచ్చి అక్కడ పశువులను మేపుకునేవాడు. సమీపంలోనే మేకలను మేపుకుంటున్న ఒక కాపరిని పెదనందిరెడ్డి “ఈ ప్రదేశం ఎప్పుడన్నా పాడా” అని అడిగాడుట. దానికి ఆ కాపరి “ఇది ఎన్నటికీ పాడు కాదు” అని సమాధానమిచ్చాడుట. అది విన్న పెదనంది రెడ్డి ధనవంతుడవటంవల్ల ఆ ప్రదేశంలో ఒక గ్రామాన్ని నిర్మించి, తన పేరు పెట్టాడు “పెదనందిపాడు” అని. ఈయన తమ్ముడు చిననందిరెడ్డి అక్కడికి కోశడు దూరంలో తను అంతకు ముందు పశువులను మేపుకున్న ప్రదేశంలో ఒక గ్రామం కట్టించి దానికి చిననందిపాడు అని పేరు పెట్టాడుట.

పెదనందిరెడ్డి తను కట్టించిన గ్రామానికి పశ్చిమ దిక్కులో ఒక చెరువు తవ్వించి, ఆ చెరువు ఉత్తరం కట్ట మీద శివాలయం నిర్మించి, సోమేశ్వరుడు అనే పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే ఈ ఆలయం. అప్పటి రాజులు ఈ ఆలయానికి పూజాది విధులు నిర్వర్తించటానికి భూములు కానుకగా ఇచ్చారుట.

తర్వాత గణపతి మహారాజు గారి ప్రధాని అయిన గోపరాజు రామన్న గారు క్రీ.శ. 1145వ సంవత్సరంలో కొన్ని గ్రామాలలో బ్రాహ్మణులను కరణాలుగా నియమించిన సందర్భంలో ఈ పెదనందిపాడు గ్రామంలో యజుశ్శాఖాధ్యాయనుడు, కౌండిన్యస గోత్రీకుడైన సంక్కు గుర్రాజు అనే ఆరువేల నియోగి బ్రాహ్మణుని కరణంగా నియమించారు. గ్రామంలో వచ్చిన అయివేజులతో ఆయన ఈ గ్రామంలో విష్ణ్వాలయం కూడా నిర్మింపచేసి మదన గోపాల స్వామిని ప్రతిష్ఠింపచేశాడుట. ఆ ఆలయానికి కూడా నిత్య ధూప దీప నైవేద్యాలకు భూమిని సమర్పించాడుట.

దీనివల్ల తెలిసిందేమిటంటే అప్పటి పాలకులు ప్రజోపయోగ కార్యక్రమాలు చేసేవారనీ, గ్రామ కరణాలు శిస్తులు వసూలు చేసుకోవటమేగాక గ్రామాభ్యుదయానికి పాటు పడేవారనీ, శివకేశవులకు భేదాన్ని పాటించేవారు కాదనీ. ఈ కైఫియత్ ద్వారా నాకు తెలిసిన ఇంకొక ముఖ్య విషయం ఈ ఆలయం క్రీ.శ. 1145 కి ముందే నిర్మించబడిందని. అమ్మయ్య. అంత హడావిడి చేసినందుకు కొన్ని పాయింట్లు దొరికాయికదండీ.

ఈ కరణం గుర్రాజుగారికి ఒక కుమార్తె. ఆవిడని భారద్వాజస గోత్రీకుడయిన రావూరి రమణప్ప అనే అతనికిచ్చి వివాహం చేసి, వివాహం సమయంలో తనకి కరణీకం ద్వారా వచ్చే ఆదాయంలో (మిరాశి) అయిదవ భాగం అల్లుడికి రాసిచ్చాడని కూడా దీనివల్ల తెలిసింది. కైఫియత్ గురించి చెబుతూ ఆలయం మాట మర్చిపోయానంటున్నారా… లేదండీ.

ఆలయం

ఆలయం మరీ పెద్దదేమీ కాదు. వెనక హాలు వగైరాలున్నాయి కానీ వేరే ఫంక్షన్ జరుగుతూండటంవల్ల మేము చూడలేదు. ఆలయం మధ్యలో సోమేశ్వరస్వామి లింగరూపం. స్వామికి ఎడమ పక్క ఉపాలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి… కుడి ప్రక్కన భద్రకాళీ సమేత వీరభద్రుడి ఉపాలయం. ముందు నవగ్రహ మండపం, కాలభైరవుడి ఉపాలయం, సుబ్రహ్మణ్యస్వామి ఉపాలయం వున్నాయి. ఆలయంలో నిత్య పూజలే కాక పర్వదినాలలో ప్రత్యేక పూజలు, భక్తులు చేసుకునే శుభకార్యాలూ కూడా జరుగుతూంటాయి. ఆలయానికి వేసిన రంగులతో ఉజ్వలంగా వెలుగొందుతూ కళకళలాడుతోంది. ఆలయంలో ఇంకా కొంత నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది.

         

అక్కడ చేరినవారంతా మా గురించి ఆసక్తి చూపించటమే కాదు, మా ద్వారా వాళ్ళ ఆలయం ఇంకా కొంతమందికి పరిచయం అవుతుందంటే సంతోషించారు. అందరికీ, ముఖ్యంగా చరిత్ర పుస్తకం వెతికి తీసుకొచ్చిన శ్రీ కూనిశెట్టి వెంకట శ్రీనివాసరావుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అక్కడనుంచి బయల్దేరబోయాము. ఫంక్షన్ జరుగుతోంది, కొంచెం సేపు ఆగితే భోజనం చేసి వెళ్ళచ్చన్నారు…వారి ఆహ్వానానికి సంతోషించినా, ఆ సమయంలో ఇంకొక ఆలయం చూడవచ్చనే మా ఉద్దేశ్యాన్ని వాళ్ళూ అర్ధం చేసుకుని దగ్గరలోనే వున్న శ్రీ సాయి నిఖిల్ శ్రీ మెస్‌లో భోజనం బాగుంటుంది .. అక్కడ భోజనం చేసి కొమ్మూరులో అగస్తేశ్వరస్వామి, చెన్న కేశవ స్వామిల పురాతన ఆలయాలున్నాయి, వాటిని కూడా దర్శించమన్నారు. ఆ ఊర్లో కృష్ణారావుగారిని కలిస్తే ఆలయం వివరాలు చెబుతారన్నారు. మన ప్రజలు వున్నారు చూశారూ. చాలా మంచివాళ్ళండీ. మనం నోరు తెరిచి అడగాలేగానీ, వాళ్ళకి తెలిసిన వివరాలు తప్పక చెబుతారు. అలా అక్కడికక్కడ తెలిసి మేము చూసిన ఊళ్ళు కూడా ఎన్నో.

వాళ్ళు చెప్పినట్లు శ్రీ సాయి నిఖిల్ శ్రీ మెస్‌లో భోజనం చేశాము. మెస్సుల వాళ్ళకి కూడా తెలిసి పోతుందండీ మనం ఆ ఊరి వాళ్ళం కాదని. పాపం ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని భోజనం పెట్టారు. భోజనం 60 రూపాయలే. భోజనం చేసి 2-00 గంటలకు అక్కడనుంచి కొమ్మూరు దోవ పట్టాము.

Exit mobile version