[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 47” వ్యాసంలో కొమ్మూరు లోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం గురించి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం గురించి, శ్రీకాళీ భద్రకాళీ సమేత ఉద్దండ వీరభద్రస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]పు[/dropcap]వ్వులు, ఘంటసాల పాటలు ఇష్టంలేని వారు వుండరు కదా. మరి అలాంటివారందరూ ఒక్కసారి వాటితో పాటు కరుణశ్రీ బిరుదాంకితులు కీ.శే. జంధ్యాల పాపయ్య శాస్త్రిగారిని కూడా గుర్తు చేసుకోండి. అదేనండీ .. నేనొక పూల మొక్కకడకేగి, చివాలున కొమ్మవంచి, గోరానెడునంతలోన…. కరుణశ్రీ గారనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పద్యాలు పుష్ప విలాపమే కదండీ. వారినెందుకు గుర్తు చేసుకోవటమంటే మరి మనం కరుణశ్రీగారి పుట్టిన ఊరు వెళ్తున్నాం. మాకు ముందు తెలియలేదు లెండి. కొమ్మూరులో శ్రీ అనంత వెంకట కృష్ణారావుగారు చెప్పారు. మరి ఆయన పుట్టిన ఊరు వెళ్తున్నాము… ఆయన్ని స్మరించుకునే అవకాశం వచ్చింది కనుక ఆయన గురించి నాలుగు ముక్కలు…
శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ఆగస్టు 4 వ తారీకు 1912 వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలో కొమ్మూరు గ్రామంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. ఈయన 20వ శతాబ్దంలో బాగా ప్రజాదరణ పొందిన తెలుగు కవి. సంస్కృత పండితులు. అధ్యాపక వృత్తి చేపట్టారు. ఈయన కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాశాలు. కరుణశ్రీ అనే కలం పేరుతో రచనలు చేశారు. వీరి రచనలలో కుంతి కుమారి, పుష్ప విలాపం ఆనాడే కాదు, ఈనాటికీ బహుళ జనాదరణ పొందిన ఖండ కావ్యాలు. వీరు జూన్ 22 1992 నాడు పరమపదించారు.
పెదనందిపాడులో వారు కొమ్మూరులో శ్రీ అనంత వెంకట కృష్ణారావుగారు, హైస్కూల్ టీచర్‌ని కలవమని ఆయన ఫోన్ నెంబరు ఇచ్చారు. వారు కొమ్మూరు ఆలయాల అభివృధ్ధికి విశేష కృషి చేస్తున్నారు గనుక, ఆలయాల గురించి విశేషాలు చెప్పగలరన్నారు. అందుకే మేము దోవలో వుండగానే వారికి ఫోన్ చేశాము. ఆయనకి స్వల్ప అనారోగ్య కారణంగా ఎక్కువ కదల లేకుండా వున్నారని వారి శ్రీమతి విజయలక్ష్మి గారు మాకు దోవ చెబుతూ, ఆ ఎండలో దోవలోకి ఎదురొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.
ముందుగా వారి ఇంటికి వెళ్ళి విజయలక్ష్మిగారిచ్చిన చల్లటి నిమ్మకాయ నీళ్ళు తాగి సేద తీరాము. శ్రీ కృష్ణారావుగారు ఆలయాల గురించి విశేషాలు చెప్పటమే కాదు, అస్వస్తతగా వున్నా స్వయంగా వచ్చి తాళాలు తీయించి, ఆలయాలను చూపించారు. సమాజాభివృధ్ధికి తమవంతు కృషిగా గ్రామంలోని ఆలయాభివృధ్ధికి తోడ్పడుతున్న వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాము.
శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం
ఆలయ చరిత్ర
ఆలయంలో అమర్చిన ఈ దేవాలయ చరిత్ర శిలా ఫలకాన్నిబట్టి తెలుసుకున్న ఆలయ చరిత్ర…
పూర్వం ఈ గ్రామంగుండా ఓగేరు నది ప్రవహిస్తూ వుండేది. దాని పరిసరాల్లో అగస్త్య మహర్షి తన శిష్య బృందంతో నివాసం వుండేవాడు. ఒక రోజు మనీశ్వరుడికి నదీ ప్రవాహంలో నీటిపై తేలియాడుతూ ఒక శివ లింగం కనిపించింది. దానిని మునీశ్వరుడు భక్తితో ఆరాధించి అక్కడే ప్రతిష్ఠించాడు. అదే అగస్త్యేశ్వరస్వామి అని పురాణ ప్రసిధ్ధి. ఆ స్వయంభూ లింగం స్ఫటిక లింగం. అమ్మవారు పార్వతీ దేవి.
ఆలయ నిర్మాణం
ఈ దేవాలయం పూర్వ కాలంలో గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, నంది మండపం, స్వస్త మండపం, ఛత్ర మండపం, వైవాహిక మండపం, రుద్రాక్ష మండపం, భోగ మండపం వగైరా అనేక మండాపాలతో విరాజిల్లుతుండేదిట. ప్రస్తుతం దేవాలయ ప్రాంగణంలో సువిశాల మండపం 24 స్తంభాలు కలిగి, ప్రతి స్తంభం నాలుగు వైపుల అద్భుత శిల్ప సంపద కలిగి, తన ప్రత్యేకతను చాటుకుంటున్నది.
దేవాలయంలో రెండు నందీశ్వర విగ్రహాలు వున్నాయి. జీవకళ ఉట్టి పడుతూ వుండే వీటిలో ఒక నందీశ్వర శిలా విగ్రహం తెల్ల రాతితోను, మరియొకటి నల్ల రాతితోను మలచ బడ్డాయి. ఇవికాక దేవాలయంలో పూర్వ రాజులు వేయించిన శిలా శాసనాలు కూడా వున్నాయి.
క్రీ.శ. 988 సంవత్సరంలో చాళుక్య వంశీయులు శ్రీ త్రిభువన మల్లదేవర మహారాజులు ఇక్కడికి వచ్చి స్వామి శిధిలాలయం స్ధానే నూతన ఆలయం, మండపాదులు నిర్మించారు. తర్వాత శ్రీ కుళోత్తుంగ చోళ మహారాజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ఆయనకి జరిగే ఉత్సవాలు మొదలైనవి సక్రమంగా జరగటానికి, అఖండ దీపారాధనకి కొన్ని మాన్యాలిచ్చినట్లు తెలుస్తున్నది. తర్వాత శ్రీ గజపతి మహారాయలు కొన్ని మండపాలు నిర్మించినట్లు చెప్పబడుతున్నది.
ఆలయంలో ఇంకా కాశీ విశ్వేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడి ఉపాలయాలు కూడా వున్నాయి.
శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం
సువిశాలమైన ఈ ఆలయ ఆవరణలో శివ కేశవులకు భేదము లేదని నిరూపించటానికా అన్నట్లు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం కూడా నిర్మింపబడింది. ఈ ఆలయం కర్ణాటక రాజైన కృష్ణ దేవరాయలు మంత్రి హరిబలపు తిమ్మరసయ్య కుమారుడు శ్రీ లక్ష్మీకాంత రుసులు వారిచే నిర్మితమైనట్లు తెలుస్తున్నది.
కీ.శే. జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి వంశ పారంపర్యంలో వారు శ్రీ జంధ్యాల శ్యాం సుందర్ ఇక్కడ పూజారి.
ప్రస్తుతం దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో వున్నది. ఇక్కడ స్మార్తాగమం ప్రకారం భరద్వాజ గోత్రీకులచే పూజాదికాలు నిర్వహింప బడుతున్నాయి.
శ్రీకాళీ, భద్రకాళీ సమేత ఉద్దండ వీరభద్రస్వామి ఆలయం
ఈ ఆలయం అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి దక్షిణంగా వున్నది. ఆ ఆలయ నిర్మాణం సమయంలోనే ఈ ఆలయం నిర్మాణం కూడా జరిగింది అంటారు. తర్వాత ఈ ఆలయం శిధిలావస్థకు చేరిన సమయంలో ఈ ఆలయం బాగు పడినప్పుడే అగస్త్యేశ్వరస్వామి ఆలయం కూడా బాగు పడుతుందని విజ్ఞులు చెప్పారుట. అలాగే ఆ ఆలయం జీర్ణోధ్ధారణ జరిగిన తర్వాత అగస్త్యేశ్వరస్వామి ఆలయ జీర్ణోధ్ధారణ కూడా జరగటమే కాదు, ప్రస్తుతం ఈ ఆలయం స్వయం సమృధ్ధిగా వున్నది అని, ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయని శ్రీ కృష్ణారావుగారు చెప్పారు. ఇన్ని ఆలయాలు చూశాను, ఆలయ మాన్యాలు అన్యాక్రాంతమైనాయనేవారే ఎక్కువ వున్నారుగానీ, మా ఆలయం అభివృధ్ధి పధంలో వున్నది అని చెప్పిన వారు శ్రీ కృష్ణారావుగారే. దీనికి వారినీ, ఆలయ కమిటీవారినీ, ఆ గ్రామ ప్రజలని, పాలకులను కూడా ఆభినందించి తీరాలి.
అన్నట్లు శ్రీ వీరభద్రస్వామి ఆలయం కొంచెం దూరంలో వున్నప్పటికీ, ఈయన అగస్త్యేశ్వరస్వామి ఆలయ క్షేత్ర పాలకుడుట.
ఇందులోనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వున్నది. దీని నిర్మాతలు శ్రీ గొట్టిపూటి హరిబాబు, శ్రీదేవి గార్లు. ఇక్కడ ప్రతి ఆదివారం మహిళలచే ప్రత్యేక పూజ జరుగుతుంది.
ఇంకా ఇక్కడ అద్దంకమ్మ, పోలేరమ్మ గ్రామ దేవతల ఆలయాలు కూడా ప్రసిధ్ధి చెందినవే. సమయాభావం వల్ల వాటికి వెళ్ళలేదు.
ఆలయాలన్నీ చూసి, విశేషాలు తెలిపి, శ్రమ అనుకోకుండా వచ్చి ఆలయాలను చూపించిన శ్రీ కృష్ణారావుగారికి, వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలిపి అక్కడనుండి బయల్దేరాము. శ్రీ కృష్ణారావుగారు కొండపాటూరు పోలేరమ్మ తల్లి చాలా ప్రసిధ్ధి చెందింది, తప్పక దర్శనం చేసుకుని వెళ్ళమన్నారు. ఆ దోవ పట్టాము.