[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 52” వ్యాసంలో మల్లాది లోని వటవృక్షాంతర్గత వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి, మల్లేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
వటవృక్షాంతర్గత వెంకటేశ్వరస్వామి ఆలయం, మల్లాది
[dropcap]అ[/dropcap]క్టోబర్ 1వ తారీకు ఉదయం బయల్దేరి రైల్లో పిఠాపురం, అన్నవరం వెళ్ళి వచ్చాము. 2వ తారీకు పూర్తి విశ్రాంతి. 3వ తారీకు మళ్ళీ బయల్దేరాము ఉదయం 5-45కల్లా ఇంటినుంచి. ఈ రోజు మా ట్రిప్ అమరావతి చుట్టుపక్కల. అమరావతిలో బ్రేక్ ఫాస్ట్ చేశాం. అమర లింగేశ్వరస్వామిని ఇదివరకు చాలా సార్లు దర్శించి వుండటంతో, ఈ ట్రిప్‌లో ఆ ఆలయాన్ని పెట్టుకోలేదు సమయం లేకపోవటంవల్ల.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. కలియుగంలో భక్తుల కోరికలు తీర్చటానికి ఏడుకొండలమీదే కాక ఇంకా అనేక ప్రదేశాలలో స్వయంభూ గానో, భక్తుల ద్వారా ప్రతిష్ఠింపబడో, తనని కొలిచేవారి కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలసిన వటవృక్షాంతర్గత వెంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రుల రాజధాని అమరావతికి 9 కి.మీ.ల దూరంలో మల్లాది గ్రామంలో వున్నది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామి ఒక రావి వృక్షంలో వెలిశాడు. ఈ స్వామి భక్తులపాలిటి కల్పవృక్షం. కల్పవృక్షం ఎలా అయితే కోరిన కోరికలన్నీ తీరుస్తుందని చెబుతారో, అలాగే ఇక్కడ వెలిసిన వెంకటేశ్వరస్వామి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాడంటారు. అందుకే ఈయన చాలా మహిమగల దేవుడుగా కొనియాడబడుతున్నాడు.
స్ధల పురాణం
కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటకి 10 కి.మీ.ల లోపే తిరుమలగిరి అనే కొండ వున్నది. పూర్వం అక్కడ ప్రకృతి రమణీయతకీ, ప్రశాంత వాతావరణానికీ ముగ్ధులయి అనేక మంది ఋషులు అక్కడ తపస్సు చేసుకునేవారు. సప్తఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఒకసారి ఇక్కడికి వచ్చి వెంకటేశ్వరస్వామిని ఆ కొండమీద ప్రత్యక్షం కమ్మని పరిపరి విధాల ప్రార్థించాడు. ఆయన తపస్సుకు, ప్రార్థనలకు మెచ్చిన వెంకటేశ్వరస్వామి అక్కడ పుట్ట రూపంలో వెలిశాడు. తిరుమలగిరిలో వెంకటేశ్వరస్వామికి ఆకారం వుండదు. పుట్టకే నామాలు పెట్టి పూజలు చేస్తుంటారు. భరద్వాజమహర్షి ఆ స్వామిని కొలుస్తూ అక్కడ కొంత కాలం వుండి తర్వాత హిమాలయాల కెళ్ళిపోయాడు. తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు వచ్చి ఆ స్వామిని కొలిచేవారు. ఆ కాలంలో వ్యవసాయమే ముఖ్యవృత్తి కనుక తమ పంటలని బాగా పండించమని రైతులు మొక్కుకునేవారు. కొద్ది సమయంలోనే ఆయన రైతులపాలిట కల్పవృక్షంలాగా భావించి రైతులు పూజించసాగారు.
మల్లాది అమరావతికి 9 కి.మీ.ల దూరంలో వున్నది. అక్కడి ప్రజలు శాంత స్వరూపులు. దైవ చింతన కలవారు. రోజూ భగవంతుణ్ణి పూజించేవారు. ఒకసారి మల్లాదిలో భయంకరమైన కరువు సంభవించింది. పశువులు మేయటానికి గడ్డి కూడా దొరకలేదు. అలాంటి సమయంలో మల్లాదిలోని కొందరు పశువుల కాపర్లు తమ పశువులకు మేత కోసం వెతుక్కుంటూ తిరుమలగిరి అడవులకు వెళ్ళ సాగారు. అప్పుడు ఈ వెంకటేశ్వరస్వామి ఆలయం చూశారు. ఒకసారి ఏదో తెలియని వ్యాధి పశువులని బాధించింది. అప్పుడు ఆ పశువుల కాపర్లు వెంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. తమనీ తమ పశువులనీ కాపాడమని. తర్వాత పశువులకి ఆ వ్యాధి తగ్గి ఆరోగ్యంగా వున్నాయి. అప్పటినుంచి మల్లాది ప్రజలకి తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి మీద గురి కుదిరి ఆ స్వామిని సేవించసాగారు. పండగల్లో, పర్వదినాల్లో వారు ఆ స్వామిని దర్శించుకునేవారు. కానీ మల్లాదికి తిరుమలగిరికీ మధ్యవున్న కృష్ణానది వారి రాకపోకలకి అడ్డయ్యేది. ఆ నదిని దాటటానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మల్లాది ప్రజలంతా స్వామికి తమ ఇబ్బందులు మొర పెట్టుకుని తమ గ్రామంలోనే కొలువు తీరమని ప్రార్ధించారు. వారి ప్రార్థనలు మన్నించి స్వామి బత్తినేని బొల్లయ్య అనే రైతు పొలంలో వున్న రావిచెట్టులో వెలిశాడు. ఇది మల్లాది గ్రామంలో, అమరావతి – క్రోసూరు రోడు పక్కన వున్నది.
మల్లాది గ్రామ నివాసి బత్తినేని మల్లయ్యగారు రామ భక్తుడు. ఆయనకి రామకోటి రాయటం అలవాటు. ఆయన తన పొలంలో ఒక రావి చెట్టుని పెంచాడు. అది పెరిగి పెద్దదై బాటసారులకి ఆశ్రయమిచ్చేది.
ఆంధ్రప్రదేశ్ లో 1976లో పెద్ద తుఫాను వచ్చింది. దాని తాకిడికి ప్రాణికోటి అల్లాడిపోయింది. పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలాయి. బొల్లయ్యగారి పొలంలోని రావి చెట్టు కూడా కుప్ప కూలింది. సర్కారు వారు దానినక్కడనుంచి తొలగించటానికి వేలం వేసి ఆ చెట్టుని అమ్మేశారు. కొనుక్కున్న వారు దానిని తరలించటానికి ముక్కలుగా చేశారు. మర్నాడు 22-1-1977 మధ్యాహ్నం 12 గం.లకి అభిజిత్ లగ్నంలో, ముక్కలు కాబడ్డ ఆ చెట్టు మళ్ళీ తనంతట తను యధాతధంగా నుంచుంది. చెట్టు చుట్టూవున్న మట్టి, చెట్టు పాతి పెట్టి చుట్టూ పోసినట్లు దానంతటదే వచ్చింది. దీనిని ప్రత్యక్షంగా చూసిన తూమాటి నరసింహయ్య అనే రైతు నిశ్చేష్టుడయ్యాడు. కొంత సేపటికి తేరుకుని ఊళ్ళోకి పరిగెత్తి ఈ విషయం ఊళ్ళోవాళ్ళకి చెప్పాడు. ఊళ్ళో కొందరు స్త్రీలకి పూనకం వచ్చి వెంకటేశ్వరస్వామి చెప్పినట్లు చెప్పారు… తానా చెట్టులో వెలిశానని, తానే ఆ చెట్టుని మొదట్లో వున్నట్లు నిలబెట్టాననీ తనని పూజించినవారి కొరికలు నెరవేరుస్తాననీ..
ఈ విషయం తెలిసిన ఆ ఊరి ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాలవారు వచ్చి స్వామిని సేవించసాగారు. తర్వాత చెట్టుకటూ ఇటూ రెండు వేపచెట్లొచ్చాయి.. స్వామి దేవేరులా అనిపించేటట్లు.
22-1-1977 మల్లాది గ్రామ ప్రజలకు పండుగ రోజు. తమ మొరలు విని స్వామి తమ గ్రామంలో వెలిసిన రోజు. అందుకనే ప్రతి సంవత్సరం ఆ రోజు చెట్టు తిరునాళ్ళని అతి వైభవంగా చేస్తారు. స్వామిని భక్తితో కొలిచినవారి కోరికలు నెరవేరుతుండటంతో స్వామి మహిమ దూర ప్రాంతాలకు కూడా వ్యాపించి దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నారు.
ప్రస్తుతం ఈ వటవృక్షం చుట్టూ మండపం వుంది. చెట్టు మొదట్లో స్వామి నామాలు, శంఖం, చక్రం వున్నాయి. మేము వెళ్ళేసరికి ఉదయం 7-35 అయింది. వెంకటేశ్వరస్వామి ఆలయం ఇంకొకటి వున్నది. అది మూసి వున్నది. వట వృక్షాన్ని మాత్రం చూశాము.
భక్తుల అండదండలతో, దిన దిన ప్రవర్ధమానమవుతున్న ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మల్లాది ఊళ్ళోకి బయల్దేరాము. అసలు మేము చూద్దామనుకున్నది మల్లాదిలో శివాలయమే. దోవలో బోర్డు చూసి ఈ ఆలయాన్ని కూడా చూశాము.
మల్లేశ్వరస్వామి ఆలయం, మల్లాది
అమరావతి మండలంలోని మల్లాదిలో పురాతన మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది కృష్ణానది ఒడ్డునే కొలువుదీరింది. మల్లేశ్వరస్వామి ఆలయం మీదుగానే మల్లాది అనే పేరు వచ్చిదంటారు. ఆలయం ముందు రాతి ధ్వజస్తంభం భక్తులను అకర్షిస్తుంది. ఇక్కడికి చేరుకోవాలంటే అమరావతి నుంచి క్రోసూరు మార్గంలో మల్లాది స్టేజీ నుంచి కిలోమీటరు లోపలికి ప్రయాణించాలి.
మేము వెళ్ళేసరికి ఉదయం 7-40 అయింది. ఇక్కడ మల్లేశ్వరస్వామికే కాక వినాయకుడుకి, ఆంజనేయస్వామికి ఇంకా కొన్ని ఉపాలయాలున్నాయి. ఆలయం గేటు తీసి వుందిగానీ, ఆలయాల తలుపులు తెరిచి లేవు. ఆలయాలు విశాలమైన ఆవరణలో పరిశుభ్రంగా వున్నాయి. బహుశా పూజారిగారు పూజ నిమిత్తం అవసరమైనవాటిని తెచ్చుకునే ప్రయత్నంలో వున్నారేమో అనుకుంటూ మా తర్వాత మజిలీ అత్తలూరు వైపు వెళ్ళాము.