Site icon Sanchika

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 55: వేల్పూరు

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 55” వ్యాసంలో మల్లాది లోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం గురించి, శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవస్వామి ఆలయం గురించి, శ్రీ రామాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] తర్వాత మజిలీ వేల్పూరు చేరేసరికి ఉదయం 9-20 అయింది. గూగుల్‌లో చూశాను.. ఇక్కడ ఊరి మధ్యలో అర్ధనారీశ్వరుని విగ్రహం చాలా బాగుంటుందని. దాని కోసం వెతికాం. చాలామందిని ఆడిగాం. లాభం లేకపోయింది. ఒక్కోసారి నాకనుమానం.. మేము పొరపాటున ఎవరినన్నా బయటవారిని అడుగుతున్నామా అని, లేకపోతే వాళ్ళ వూరి ఆలయాల గురించి వారికి తెలియదా… చివరికి బస్ కోసం అనుకుంటా ఒక గట్టు మీదు కూర్చున్నావిడ చెప్పారు, అక్కడున్న అతిసన్నని సందులోంచి లోపలకెళ్తే అక్కడ చాలా పాత ఆలయాలున్నాయని, కుడివైపు కొంచెం దూరం వెళ్తే రామాలయంలో మేమడిగే అర్ధనారీశ్వరుడి విగ్రహం వుంటుందనీ. నిజంగా భగవంతుడు మాకోసమే ఆవిడని అక్కడ కూర్చోబెట్టాడా అనిపించింది. లేకపోతే ఎంతమందిని అడిగినా తెలియని విషయం ఆవిడ ఎంత తేలిగ్గా, వివరంగా చెప్పింది.. ఆవిడ చెప్పకపోతే మేమంత దగ్గరగా వెళ్ళి అంత పురాతన ఆలయం చూడకుండా వచ్చేవాళ్ళం.

ఆ సందులోంచి లోపలకెళ్తే దూరంగా చిన్న ఆలయాలు కొంచెం ఎత్తయిన ప్రదేశంలో. అతి పురాతన ఆలయాలు కదా నిర్వహణ కూడా ఆలాగే వుంది. అక్కడ వరసగా రెండు ఆలయాలు వున్నాయి. మొదటిది చెన్నకేశవస్వామి ఆలయం, రెండవది రామలింగేశ్వరస్వామిది. రెండూ పురాతనమైనవని చూస్తేనే తెలుస్తోంది.

శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

ఆలయాలు అతి విశాలమైన ప్రాంగణంలో వున్నాయి. ఆవరణ అంతా రకరకాల చెట్లే కాక, గడ్డి, పిచ్చి మొక్కలు కూడా చాలా వున్నాయి. ముందు భయపడ్డాము.. ఏ పాములైనా వుంటాయేమోనని. అక్కడ వాచ్‌మేన్ మేము రావటం చూసి మాతో వచ్చి ఆలయాల గురించి కొంచెం చెప్పాడు. రామలింగేశ్వరస్వామి ఆలయం మూసి వున్నది. ధ్వజ స్తంభం దగ్గర ఐదు శాసనాలు వున్నాయని చూపించాడు. ఆలయం ముందు మండపంలో నాలుగు స్తంభాలమీద శాసనాలు వున్నాయి.

ఈ శాసనాలలో కోటకేతరాజు(క్రీ.శ.1182 – 1209)గారి దాన శాసనాలతోబాటు విష్ణుకుండిన రాజు రెండవ మాధవవర్మ (క్రీ,శ. 435 -473) వేయించిన శాసనం కూడా వున్నది. ఈయన అనేక యజ్ఞయాగాదులు చేశాడు. వేల్పూరులో రామలింగేశ్వరాలయంలో ఆయన శాసనం వుండటంతో ఆయనే ఆ ఆలయం నిర్మించి వుండవచ్చని ఒక భావన.

          

రామలింగేశ్వరస్వామి ఆలయం బయట ఒక రాతిమీది వెయ్యి పడగల ఆదిశేషు చెక్కారు చూడండి అని చెప్పారు వాచ్‌మేన్. ఒకే పాముకి వెయ్యి తలలు లేవుగానీ రాతికి ఒక వైపు 500 నాగుల బొమ్మలు ఇంకొక వైపు 500 నాగుల బొమ్మలు చెక్కారు. (మేము లెక్కబెట్టలేదండోయ్, రాతినుండా వున్నాయి.)

శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవస్వామి ఆలయం

 

తర్వాత చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్ళాము. అక్కడ వున్న పూజారిగారు శ్రీ గిరివర్ధనాచార్యులుగారు చెప్పిన వివరాలు ప్రకారం ఈ ఆలయం క్రీ.శ. 1213లో ఇక్ష్వాకుల ప్రతిష్ఠ. పల్లవులు, చోళుల సమయంలో బయట మండపం, తర్వాత చుట్టూ ప్రాకార నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ కూడా చాలా శాసనాలున్నాయి. రామలింగేశ్వరస్వామి ఆలయం ఇంకా పురాతనమైనది. బౌధ్ధుల సమయంలోదిట. తర్వాత కోటకేతురాజుల సమయంలో శివాలయం నిర్మించబడింది. శివాలయం కింది బౌధ్ధారామం వున్నదంటారు.

శ్రీ రామాలయం

ఊళ్ళో లైబ్రరీ దగ్గర రామాలయం వున్నది. దానిలో వున్నది నేను గూగుల్‌లో చూసిన అర్ధనారీశ్వరుని విగ్రహం అని అక్కడికి బయల్దేరాము. వాచ్‌మేన్ వచ్చి దోవ చూపించాడు. ఇదివరకు ఆ విగ్రహం ఊళ్ళోనే బయటే వుండేదట. అయితే దొంగలు దానిని ఎత్తుకు వెళ్దామని చూడటంతో తీసుకెళ్ళి రామాలయంలో ప్రతిష్ఠ చేశారుట. రామాలయం ముందు హాల్ లాగా వుంది. హాల్‌కి ఒక చివరి మూడు ఉపాలయాలు. మధ్య దానిలో రామచంద్రుడు (మూసి వున్నది). రాముడికి ఎడమవైపు వీరభద్రస్వామి, కుడివైపు అర్ధనారీశ్వర విగ్రహం. వీరభద్రస్వామి విగ్రహం గంభీరంగా వున్నది. అర్ధనారీశ్వర విగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. వయ్యారంగా నిలుచున్న స్త్రీమూర్తి, గంభీరంగా నుంచున్న పురుషునికి మధ్య స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అంత చక్కగా చెక్కిన శిల్పి నిజంగా అభినందనీయుడు. ఇలాంటి విగ్రహాన్ని ఊరు మధ్యలో ఎందుకు వదిలేశారో తెలియదు. ఏ నిర్మాణంలోదో, ఏ కాలంలో చెక్కారో ఆధారాలేమీ లేవు. దొంగలు ఎత్తుకు పోవటానికి ప్రయత్నించారంటే ఆశ్చర్యమేమీలేదు. అంత అందంగా వుంది.

     

అతి పురాతన ఆలయాలు, అందమైన అర్ధనారీశ్వర విగ్రహం చూశామన్న సంతోషంతో, చెన్నకేశవస్వామి ఆలయ పూజారి శ్రీ గిరివర్ధనాచార్యులుగారికి, పూజారి లేకపోయినా అక్కడి వివరాలు తనకి తెలిసినంతమటుకూ శ్రధ్ధగా చెప్పిన వాచ్‌మేన్‌కీ (పేరు చెప్పారుగానీ నేను మరచి పోయాను) కృతజ్ఞతలు తెలిపి ఉదయం 10-40కి అక్కడనుండి దైద అమరలింగేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరాము. ఇది గుహాలయము. మరి వివరాల కోసం వచ్చేవారం దాకా ఆగాలి.

శ్రీ గిరివర్ధనాచార్యులు గారి సెల్ నెంబరు 8008590329

Exit mobile version