గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 56: దైదలోని గుహాలయం

0
2

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 56” వ్యాసంలో దైదలోని శ్రీ అమరలింగేశ్వరస్వామి ఆలయం (గుహాలయం) గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]వే[/dropcap]ల్పూరునుంచి దైద అమరలింగేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరామని చెప్పాను కదా. ఈ ఆలయం గురించి ఇంతకుముందు కొంత విని వున్నాను. గుహాలయమని, కొంత దూరం కూర్చుని, కొంత దూరం పాక్కుంటూ వెళ్ళాలన్నారు. అలా నేను వెళ్ళలేననే భయంతో కొంత తాత్సారం చేశాను. తర్వాత కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆ గుహాలయాన్ని విశాలం చేశారనీ, నడిచి వెళ్ళటానికి వీలుగా వుందనీ తెలిసి ఈ మారు తప్పకుండా వెళ్ళి వద్దామని బయల్దేరాము. మార్పులకి సంతోషించాలో, బాధపడాలో తెలియని పరిస్ధితి. మార్పులతో నాలాంటి వాళ్ళంతా కూడా సుఖంగా లోపలకి వెళ్ళి చూడవచ్చుకదాని సంతోషం, అసలు ఏర్పడ్డ గుహల భౌగోళిక స్వరూపం మారిపోయిందే అనే బాధ మరోవైపు.

దైద, పల్నాటి సీమలో.. గురజాల – గొట్టిముక్కల దోవలో వుంది. ఇది ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున వున్న ప్రకృతి సిధ్ధమైన గుహ. ఇందులో నెలకొన్న అమరలింగేశ్వరస్వామి స్వయంభూ అంటారు. మామూలు రోజుల్లో అంతగా జనం కనబడకపోయినా సెలవు రోజుల్లో, కార్తీక మాసంలో, సోమవారాలలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కృష్ణానదిలో స్నానాలు చేసి తడి బట్టలతో ఈ సొరంగంలోకి దాదాపు కిలోమీటరు నడిచి అమరలింగేశ్వరస్వామిని దర్శించుకుని వస్తారు.

అగస్త్య మహర్షి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకున్నారని ఇక్కడివారి కథనం. ఆ తర్వాత చాలా కాలం ఈ సొరంగం మూతబడ్డది. అక్కడ వున్న బోర్డు ప్రకారం తెలుసుకున్న స్ధల చరిత్ర దాదాపు 100 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులైన కొంతమంది పశువుల కాపర్లు ఆ సొరంగం సమీపంలో కృష్ణా నది ఒడ్డున తమ పశువులు వదిలి అన్నాలు తిన్న తర్వాత అక్కడ వున్న చెట్టుకింద నిద్రించారుట. ఆ సమయంలో వారికి మంత్రాలు, భజనలు, సంకీర్తనలు వినిపించాయట. దానితో వాళ్ళు గ్రామస్థులకీ విషయం తెలియజేసి అందరూ కలసి వచ్చి వెతకగా బండరాళ్ళ మాటున సొరంగ ద్వారం కనపడింది. దానితో గ్రామస్తుల సహాయంతో తాళ్ళు కట్టుకుని సొరంగం లోపలికి ప్రవేశించారు. అక్కడ వాళ్ళకి అనేక మార్గాలు కనబడి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని సమయంలో, అశరీర వాణి ఒక ధ్వని రూపంలో మార్గం నిర్దేశించగా ఆ మార్గంలో వెళ్ళారుట. అక్కడ ఒక దేదీప్యమానమైన వెలుగును చూసి భయభ్రాంతులు కాగా, ఒక అశరీర వాణి వినిపించిందట… ఓ భక్తులారా, నేను అమరలింగేశ్వరుడను. ఇప్పటిదాకా ఇక్కడ నన్ని మహా పురుషులు యోగులు, సిధ్ధులు, మునులు పూజించారు. ఇంకనుంచి ఇక్కడ మీ చెంతనే అమరలింగేశ్వరస్వామిగా కొలువై వుంటాను… అంటుండగానే ఆ వెలుగు అదృశ్యమై, శివలింగం కనిపించిందట. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్ళు కూడా వాళ్ళు గమనించారు. ఆ నాటినుంచీ అమరలింగేశ్వరస్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విలసిల్లుతోంది.

                     

ఈ సొరంగంలో దాదాపు 500 మీటర్లు నడిచిన తర్వాత శివ దర్శనం చేసుకోవచ్చు. ఈయన్ని దర్శించటం ఇదివరకు చాలా కష్టంగా వుండేదిట. లోపల ఇరుకైన మార్గం వుండేది. అక్కడక్కడ ఒంగి, కూర్చుని, పాక్కుంటూ వెళ్ళువలసి వచ్చేదిట. ఇదివరకైతే లోపలకి వెళ్ళటానికి, బయటకి రావటానికి రెండు దోవలు విడి విడిగా వుండేవిట. మేము కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ భూగర్భ గుహా మార్గాన్ని అభివృధ్ధి పరచిన తర్వాత వెళ్ళాము. అందుకని వెళ్ళిన దోవనే బయటకి వచ్చాము.. రెండో మార్గం గురించి తెలియక. బయటకి వచ్చాక, అన్నీ చూస్తుండగా ఇంకొక సొరంగం మార్గం కనబడింది. అంతా ఒకటే గుహ అన్నారు.. ఇక్కడ రెండోది కూడా వున్నది.. అది కూడా చూడాలిగా మరి… అని అటు వెళ్ళాము… మేమేదో మొదటిసారి దానిని కనిబెడుతున్నట్లు. ఇంతా వెళ్తే అది ఇందాక చెప్పిన బయటకు వచ్చే దోవ. 46 మెట్లు దిగి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ బయటకి రావటానికి అన్నీ ఎక్కాలి. కొన్ని మెట్లు ఎత్తుగా కూడా వున్నాయి. లోపల రెండు అమ్మవార్ల విగ్రహాలు చిన్నవి, ఒక పెద్ద నంది విగ్రహం వున్నాయి. శివుణ్ణి చూసిన తర్వాత ఇటువైపు వస్తే అమ్మవారిని పెద్ద నందిని దర్శించి బయటకి రావచ్చన్నమాట.

సొరంగంలో నడుస్తూ దానిని చూసినప్పుడు ప్రకృతియొక్క విలక్షణతకు, చాతుర్యానికి అబ్బుర పడతాము.. పైకి కనబడుతున్న ఒక గుట్ట, దానికున్న ఒక ద్వారం వెనక ఇంత అద్భుతం వున్నదా అని. లోపల నడుస్తున్నప్పుడు ఇతర మార్గాలు చాలా కనబడతాయి. అవి శ్రీశైలం, కాశి, ఎత్తిపోతల, గుత్తికొండ బిలం వెళ్ళే మార్గాలని అక్కడివారు చెబుతారు. వాటిని నమ్మి ఎక్స్‌పెరిమెంట్స్ చెయ్యదల్చుకున్నవాళ్ళు తగు సన్నాహాలతో వెళ్ళండి. వద్దనుకున్న వాళ్ళు హాయిగా ఆ గుహ అందచందాలని చూసి, దైవ దర్శనం చేసుకుని ప్రశాంతంగా వచ్చేయండి. ఎందుకంటే కొందరు ఈ మార్గాలలో వెళ్ళి కనబడకుండా పోయారని చెబుతారు. తర్వాత మీ ఇష్టం.

గుహ బయట కూడా శ్రీ గంగా సమేత పర్వత వర్ధని, ఆంజనేయస్వామి, నవగ్రహాలు వగైరా దేవతలకు చిన్న చిన్న ఆలయాలు వున్నాయి. నది ఒడ్డు అవటంతో పరిసరాలు అందంగా, ప్రశాంతంగా వున్నాయి.

గుంటూరు జిల్లాలోని గురజాలనుంచి 12 కి.మీ.లు, పులిపాడు, దైదా మార్గంనుంచి 5 కి.మీ. లో వున్న ఇక్కడికి గురజాలనుంచి ఆటో సౌకర్యం కూడా వున్నది. సొంత వాహనమైతే మన సమయాల్లో వెళ్ళి రావచ్చు. అక్కడ ఏమీ దొరకవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here