[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 62” వ్యాసంలో గుంటూరులోని లాలాపేటలోని శ్రీ పద్మావతీ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం; శ్రీ జగన్నాధ, సుభద్రా, బలరాముల ఆలయం, మరియు కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]ఆ[/dropcap] చుట్టుపక్కల ప్రదేశాలు అంతకుముందు ట్రిప్ లోనే అయిపోయాయి కనుక, అమృతలూరునుంచి నేరుగా గుంటూరు వచ్చి కనబడ్డ హోటల్‌లో టిఫెన్ చేసి ముందుగా లాలాపేటలోని శ్రీ పద్మావతీ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళేసరికి ఉదయం 10 గం. అయింది.
జిల్లాకి ముఖ్య పట్టణం గుంటూరు వచ్చేశాము కనుక ఈ జిల్లా గురించి కొంత చరిత్ర కూడా చెప్పుకుంటే బాగుంటుందికదా. ఈ జిల్లాకి అనాదినుంచీ చాలా పేరు ప్రఖ్యాతులున్నాయండీ. ఏముంది గుంటూరు మిరపకాయ ఘాటు, పొగాకు ఘాటు అంటారా? కారం అంటే ఇలా వుండాలీ అంటారండీ ఇప్పటికీ మిరపకాయ ఘాటు గురించి కొందరు. ఇంక పొగాకు సంగతా.. ఇప్పుడయితే తగ్గారుకానీ, చుట్ట కాల్చాలంటే గుంటూరు పుగాకు చుట్టే కాల్చాలిరా అనేవాళ్ళు. ఇవి రెండూ ఇప్పటికీ విదేశాలకి కూడా ఎగుమతి అవుతాయి. ఇంక చేనేత వస్త్రాలు సరేసరి.
కృష్ణానదీ పరీవాహక ప్రదేశంలో వున్న గుంటూరు అతి పురాతనమైన నగరం. ఎంత పురాతనమైనదంటే పురాతన రాతి యుగంనాటి అవశేషాలు ఇక్కడ దొరికాయి.
ఈ ఊరికి ముందు సంస్కృత నామధేయం గర్తపురి అని వుండేది కానీ తర్వాత అది గుంటూరు అయింది. దీనిని శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, కోట వంశీయులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగరం రాజులు, కుతుబ్ షాహీలుపాలించారు. 1180లో పల్నాటి యుధ్ధం ఈ జిల్లాలోనే జరిగింది. రాజా వెంకటాద్రి నాయుడుగారి సమయంలో ఈ ప్రాంతంలో ఆయన చాలా ఆలయాలు నిర్మించారు, అనేక ఆలయాలను పునరుధ్ధరించారు, అనేక ఆలయాలకి విరివిగా దానాలు ఇచ్చారు. ఈ ప్రాంతం 1788లో ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వెళ్ళటంతో అప్పటినుంచీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైంది. ఇంక ఆలయాల సంగతికొద్దాం.
పూర్వం దక్షిణాన వున్న రామేశ్వరానికి, ఉత్తరాన వున్న కాశీకి తీర్థయాత్రల కోసం, చదువుల కోసం అనేకమంది వెళ్ళి వస్తూవుండేవారు. వారు గుంటూరు ద్వారా ప్రయాణం చేసేవారు. సాధువులు కూడా మోక్షసాధనకోసం తీర్థయాత్రలు చేసేవారు. అయితే వీరిలో కొందరికి మోక్షసాధనకి మార్గం ఒకటే కాదు, ఆలయ స్ధాపనలు, సత్రాల నిర్మాణం, బాటసారులకు భోజన సౌకర్యం వగైరా అనేక మార్గాలు వున్నాయి. అలాంటి వారిలో కొందరు తమకిష్టమైన ప్రదేశాలలో స్ధిరపడి సత్రాలు కట్టించి బాటసారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించేవారు. వారు పూజలు చేసుకునేందుకు తమకి ఇష్టమైన దైవాలను కూడా అక్కడ ప్రతిష్ఠించి నిత్య పూజలు చేసేవారు. వీటిని మఠాలు అనేవారు.
300 సంవత్సరాల క్రితం అలా ముగ్గులు సాధువులు అయోధ్యనుంచి గుంటూరు వచ్చారు. వారి పేర్లు శ్రీ జగన్నాధ దాస్ బాబాజీ, శ్రీ శ్యామల దాస్ బాబాజీ, మరియు శ్రీ భగవాన్ దాస్ బాబాజీ. వీరు 1818లో గుంటూరులో నివాసమేర్పరుచుకుని లాలాపేటలో మూడు మఠాలు స్ధాపించి, యాత్రీకులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించసాగారు. వీటికోసం వారు ఎవరినీ డబ్బు అడిగేవారు కాదు. తోచినవారు ఇష్టపూర్వకంగా ఇచ్చే విరాళాలతో ఈ మఠాలు సాగేవి. ఇప్పుడు ఆ సత్రాలు, మఠాలు కనిపించకపోయినా వారు ప్రతిష్ఠించిన దేవతామూర్తులు ఆ ఆలయాలలో ఇప్పటికీ పూజలందుకుంటున్నాయి. అవే లాలాపేటలోని శ్రీ పద్మావతీ, ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ జగన్నాధ, సుభద్రా, బలరాముల ఆలయం, మరియు కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయం. ఇవి మూడూ ఈ సాధువుల చేత దాదాపు ఒకే సమయంలో నిర్మించబడ్డవి.
శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం
గర్భగుడిలో మధ్యలో వెంకటేశ్వరస్వామి నానా విధ అలంకారాలతో భక్తుల పాలిటి కల్పవృక్షంలా దర్శనమిస్తాడు. స్వామికి బొడ్లో కత్తి, యజ్ఞోపవీతం, 108 సాలగ్రామాల మాలతో శోభిల్లుతూ వుంటారు. స్వామి వెనుక మకరతోరణంలో దశావతారాలు చెక్కబడ్డాయి. స్వామికి ఒక వైపు ప్రత్యేక ఆలయంలో ఆసీనురాలైన పద్మావతి అమ్మవారు అభయ హస్తంతో భక్తులను ఆదరిస్తుంది. మరోపక్క ఆండాళ్ అమ్మవారు కన్నతల్లిలా ఆదరిస్తుంది.
ఇక్కడ కార్యక్రమాలు అన్నీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. ప్రతి గురువారం, శుక్రవారం తిరుమంజనం సేవలు, పంచామృతాభిషేకాలు ప్రత్యేకించి వుంటాయి. శనివారం భక్తుల రద్దీ మామూలు రోజులకన్నా ఎక్కువగా వుంటుంది. ఈ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అక్కడు అమ్మవారి విగ్రహాలు గోడమీద వుంటాయి. ఇక్కడ రోజూ మహిళా భక్తులచేత సహస్రనామ పారాయణలు, పర్వ దినాలలో భక్తి కార్యక్రమాలు జరుగుతాయి.
జగన్నాథ స్వామి ఆలయం
1967నుంచీ ఎండౌమెంట్స్ డిపార్టుమెంట్ అధీనంలో వున్న ఈ ఆలయం కూడా లాలాపేటలోనే వున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు మూల విరాట్. శ్రీకృష్ణుని విగ్రహానికి ముందు జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాముడు విగ్రహాలుంటాయి. రుక్మిణీదేవికి, సత్యభామకి పక్కన ప్రత్యేక ఉపాలయాలున్నాయి. ఒక ప్రత్యేక ఉపాలయంలో ఆంజనేయస్వామి కొలువుతీరి వుంటాడు.
ఇంతకు ముందు శిధిలావస్థలో వున్న ఆలయాన్ని కాపాడుకుందామని కొందరు యువతీ యువకులు శుభ్రపరిచే సమయంలో గోడలకి మందంగా వున్న సున్నపు పూతల వెనుక మరుగునపడ్డ అద్భత శిల్పాలను చూసి పెద్దలకి, వారి ద్వారా ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారికీ విషయం తెలియచేశారు. పెద్దలు జగన్నాధ సేవా సమితిగా ఏర్పడి 40 లక్షల రూపాయలు విరాళాలుగా పోగు చేశారు. ప్రభుత్వం 12 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయం పునరుధ్ధిరింప బడింది.
జగన్నాధ రధయాత్ర, దేవీ నవరాత్రులు, దీపావళి వగైరా పండగలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
ఆంజనేయస్వామి ఆలయం, కొత్తపేట
ఇక్కడనుంచి కొత్తపేటలో గుంటగ్రౌండ్‌కి ఎదురుగావున్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయస్వామి ఉత్తరం ముఖంగా వుంటారు. వైఖానస ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి. ఈ స్వామిని చాలా మహిమగల దేవుడుగా భక్తులు కొలుస్తారు. దూర దూరాలనించి కూడా వచ్చి పూజలు చేయించుకుంటారు.
ఇక్కడనుంచి పాత గుంటూరులోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరాము. అతి పురాతనమైన ఈ ఆలయం విశేషాలు వచ్చే వారం.