గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 64: కాజ

0
1

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 64” వ్యాసంలో కాజ లోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయం, కాజ

భోజనం చేసి గుంటూరు నుంచి బయల్దేరి కాజ వచ్చేసరికి సాయంకాలం 3-50 అయింది. కాజ గుంటూరు విజయవాడ హైవేలో కొంచెం పక్కకి వెళ్ళాలి. ఇక్కడ కూడా గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయం వున్నది. కానీ మేము వెళ్ళేసరికి మూసి వున్నది. మరి ఆలయం తెరచి వుండే సమయం కాదుగదా. బయటనుంచే ఆలయాన్ని చూసి చాలా పురాతనమైనదానిలా వున్నది, చూడలేక పోతున్నామే అనుకుంటున్నాము. మా ఎదురుగా స్కూటర్ మీద వెళ్తూ ఒకమ్మాయి ఆగి స్కూటర్ నేదో పరీక్షించుకుంటోంది. వెంటనే ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి గుడి ఎప్పుడు తీస్తారో తెలుసా అని అడిగాము. మాటల్లో మేము వేరే వూరునుంచి ఇలా ఆలయాలన్నీ చూసుకుంటూ వస్తున్నామని తెలిసిన ఆ అమ్మాయి గుడి తీసేసరికి 5గం. అవుతుంది. మీరప్పటిదాకా వెయిట్ చెయ్యటం కష్టం కదా. పూజారిగారిల్లదే వెళ్ళి ఇలా వేరే ఊరునుంచి వచ్చామని మీ సంగతి చెప్పండి.. తలుపు తీస్తారు అనటమే కాకుండా నేను చెప్పానని చెప్పకండి అని కూడా చెప్పింది. ఆమె ఆ ఊరమ్మాయే.. ఏదన్నా మాట వస్తుందని. మాకోసం దేవుడే ఆ అమ్మాయిని పంపించాడనుకుంటూ మా చెల్లెలు, మేనగోడలు పూజారిగారింటికి వెళ్ళి విషయం చెప్పారు.

ముందు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయం తలుపులు తియ్యకూడదు, తియ్యం అన్నారు. మావాళ్ళు నా ఆసక్తి గురించి తెలియజేసి సమయం కుదరకే ఇలా రావాల్సి వచ్చిందని కొంచెం వివరించేసరికి వాళ్ళమ్మాయిని పంపించారు. ఆ అమ్మాయి వచ్చి బుధ్ధిగా శివుడి ఎదురుగా కూర్చుని ఫోన్‌లో మెసేజస్ చూసుకుంటూ కూర్చున్నది. ఆలయం 200 సంవత్సరాలకి పూర్వంది అని తప్ప వేరే వివరాలు చెప్పలేక పోయింది. దర్శనమయింది, చాలనుకుని సంతోషించాము.

ఆవరణలో కొన్ని విగ్రహాలు, నాగ ప్రతిమలు వున్నాయి. ధ్వజ స్తంభము 1998లో పునః ప్రతిష్ఠించినట్లు స్తంభం మీద వున్నది. బహుశా ఆలయం కూడా పునర్నిర్మింపబడి వుండచ్చు, అప్పుడేమన్నా కొన్ని విగ్రహాలు బయట పెట్టారేమో అనుకున్నాము.

       

లోపల శివుడు, వినాయకుడు, అమ్మవారు పార్వతీ దేవి ప్రత్యేక ఆలయాల్లో కొలువు తీరి వున్నారు. ఆలయం గ్రనేట్ కట్టడం. లోపల ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా అనిపించింది. ఇలాంటి ప్రదేశాలకొచ్చినప్పుడు కూడా కొంచెం సేపు కూర్చునే అవకాశం లేదే అనుకుంటూ 4-20కి ఆ అమ్మాయికి ధన్యవాదాలు చెప్పి అక్కడనుంచి బయల్దేరాము నవులూరుకి.

కాజలో స్కూటర్ అమ్మాయిచ్చిన సమాచారం నవులూరులో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, పెద్ద పుట్ట వుంది, చూడాల్సిందే.. అని. సమాచారం తెలిశాక ఇంక ఆగుతామా. పైగా దగ్గిరేనయ్యే. అందుకే ఇంకో బోనస్ అనుకుంటూ అటు బయల్దేరాము. మరి ముందు మా ప్లానులో లేదు కదా ఇది.

నవులూరు మంగళగిరి మండలంలో మంగళగిరికి శివార్లల్లో వున్నట్లు వున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here