Site icon Sanchika

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 68: ఉండవల్లి

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 68” వ్యాసంలో ఉండవల్లి గుహల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]వీ[/dropcap]లయినంతసేపు పైనే గడిపి నెమ్మదిగా దోవలో కనబడ్డ ఆంజనేయస్వామి, గరుత్మంతుని ఆలయాలు కూడా చూసుకుంటూ మళ్ళీ ఇన్ని మెట్లూ కిందకి దిగేసరికి చాలా అలసిపోయాము. కింద ఆలయం కట్టేశారు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడో తెరుస్తారు. అంతసేపు వేచివుండే ఓపిక ఎవరికీ లేదు. రోడ్డుమీదకొచ్చి విజయవాడ బస్ ఎక్కాము. దోవలోనే ఉండవల్లి గుహలు అని గుర్తొచ్చింది. అక్కడ దిగుదాము. రోడ్డు పక్కనే వుంది కదా. చూసి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. బస్ చాలా రద్దీగా వుంది. నుంచునే మొత్తానికి ఉండవల్లి చేరాము. నా చిన్నప్పటినుంచీ వాటిని చూడాలని. ఎక్కడో లోపలకి వుంటాయి. ఎవరూ వుండరక్కడ. వగైరా వగైరాలతో చూడటం కుదరలేదు.

ఇప్పుడు బస్ స్టాప్ పక్కనే ఉండవల్లి గుహలు. జనాలు బాగానే వున్నారు. ఆవరణ శుభ్రంగా వుంది. ఎక్కడికక్కడ చరిత్ర తెలిపే బోర్డులున్నాయి. అన్ని ప్రదేశాలకీ ఇలా వుంటే ఎంత బాగుంటుంది. దీనిని కూడా ఈ మధ్యే అభివృధ్ధి చేసినట్లు వున్నారు. ప్రవేశానికి టికెట్ వుంది.

మామూలుగా చూసే వాళ్ళకి వీటి కోసం ఇంత దూరం రావాలా అనిపించవచ్చు. కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు, దాన్లో దేవతా ప్రతిమలతోబాటు దాదాపు 20 అడుగుల ఏక శిలా అనంత పద్మనాభస్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతా మూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడగలిగినవారు అద్భుతం అంటారు.

ఒకే పర్వతాన్ని తొలచి 4 అంతస్తులుగా మలచారు ఈ గుహలని. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే వున్నాయి. కింద అంతస్తులో తాపసులు, భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం వున్నది. దీని నిర్మాణం అసంపూర్తిగా వున్నది.

                  

మొదటి అంతస్తులో నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఋషులు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి వున్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు వున్నాయి. రెండవ అతస్తులో 25’ పొడవు 6’ వెడల్పుగలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయనించి వుంటారు. నాభిలో తామర పుష్పం… అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు, పక్కన విష్ణు వాహనమైన గరుత్మంతుడు, తపస్సు చేస్తున్న ఋషులు, ఇంకా అనేక విగ్రహాలున్నాయి. రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి వుండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత. ఇక్కడ కొండలో రాతిని మలచి ఈ విగ్రహాన్ని చెక్కారు. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి.

మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం. వీటిలో విగ్రహాలేమీ వుండవు.

14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7 వ శతాబ్దం నాటి విష్ణుకుండినుల కాలానివనీ, క్రీ.శ. 1343లో అన్నారెడ్డి కుమారుడు పంచమ రెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చారనీ తెలుస్తున్నది. గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు. పూర్వం ఈ మార్గాలగుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు. ఇక్కడ వున్న ఒక సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి వుంది.

కొంత కాలం క్రితం పురావస్తు శాఖవారు ఈ ప్రాంతంలో త్రవ్వకాలు సాగించినప్పుడు కొన్ని బౌధ్ధమత చిహ్నాలు, శిల్పాలు బయట పడ్డాయి. దానితో ఒకప్పుడు ఈ కొండపై భాగాన బౌధ్ధారామాలు విలసిల్లాయంటారు.

ఇలాంటి అపురూపమైన కళాఖండాలు చరిత్రలో కనుమరుగు కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రజలదీ. ప్రభుత్వం ఈ మధ్య కొంత ఆసక్తి చూపించి గుహల చరిత్ర గురించి పర్యాటకులకు తెలిసేటట్లు బోర్డులు పెట్టింది. నిర్వహణ కూడా కొంత బాగానే వున్నది.

అక్కడనుంచీ మళ్ళీ బస్‌లో విజయవాడ చేరుకుని ఆటోలో ఇంటికి చేరేసరిగి ఒళ్ళు హూనమైంది. ఒకే రోజు 500 మెట్లున్న కొండ ఎక్కటం, అది కాకుండా ఇంకా కొన్ని మెట్లెక్కి గుహాలయం చూడటం … మాటలా!!??

Exit mobile version