Site icon Sanchika

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 69: కొమరవోలు

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 69” వ్యాసంలో కొమరవోలు లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ కామేశ్వరీ దేవిల ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ [/dropcap]మారు మీకు ఇప్పుడిప్పుడే అభివృధ్ధి చెందుతున్న అతి మహిమాన్వితమైన ఒక ఆలయం గురించి చెబుతాను. ఇది గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలంలో వున్నది. రేపల్లెనుంచి 5 కి.మీ. ల దూరం. ఆటోలో వెళ్ళి రావచ్చు.

ఈ మహిమాన్విత ఆలయంలో నివసిస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వరుడు. మీరు సరిగ్గానే చదివారండీ. నివసిస్తున్నదే. అక్కడికెళ్తే మేము ఆయన్ని చూడచ్చా అని అడుగుతున్నారా!? సహజమే కదండీ. చూడచ్చు. మీ అదృష్టం బాగుంటే మీకూ కనబడతాడు. ఆగండాగండీ. మీరందరూ చాలా ప్రశ్నలు సంధించటానికి తయారయిపోయారు. నేనే వివరాలు చెప్పేసి నా పరువు నిలబెట్టుకుంటా. అదేనండీ… ఇన్నాళ్ళూ నాకు మీరే కాదు పత్రికలవారు కూడా ఒక కితాబిచ్చారు. నేను రాసినవి నిజాయితీగా రాస్తాను (పురాణ కథల గురించి నేను సాక్ష్యం చెప్పనండోయ్) అని. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ నివసిస్తున్నాడు అని కూడా నేను నిజమే చెప్పాను.

కొమరవోలులో వున్న ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ కామేశ్వరీ దేవిల ఆలయం. ఇప్పుడు అక్కడ శివుడికి, వేణు గోపాలస్వామికి, నవగ్రహాలకి ప్రత్యేక ఆలయాలు వచ్చినా, మొదటి ఆలయం మాత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ కామేశ్వరీ దేవిలదే. ప్రప్రధమంగా ఈ ఆలయం ఎలా వచ్చిందో మీకు చెప్పాలి కదా.

ఇది 600 సంవత్సరాల క్రితం నైజాం ప్రభువుల పరిపాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటన. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో యల్లాప్రగడ వంశస్తులైన నియోగి బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ వుండేది. ఆ ఇల్లాలికి సంతానం లేదు. సంతానం కోసం పాపం ఆ మహిళ అనేక పూజలు పునస్కారాలు చేస్తూ వుండేది. ఆ రోజుల్లో స్నానం చెయ్యాలన్నా, బట్టలుతుక్కోవాలన్నా, మంచనీళ్ళు తాగాలన్నా దేనికైనా సరే నీళ్ళు కావాలంటే చెరువుకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఆవిడ ఒక రోజు చెరువుకి వెళ్తుండగా ఒక పెద్ద సర్పం ఎదురొచ్చి, పడగవిప్పి నిలబడిందిట. ఆ ఇల్లాలు ఆ రోజుతో తన బతుకు అయిపోయిందనుకుని, పిల్లలు లేని బతుకు బతికేకన్నా చావటమే నయమనుకుని ఆ సర్పానికి నమస్కరించి అలాగే నిల్చుందిట. ఆ సర్పం తన మానాన తాను పక్కకి వెళ్ళి పోయిందట. ఆ రాత్రి ఆవిడకి కలలో కూడా ఆ సర్పమే కన్పించిందిట. పగలు చూసిన సర్పమే రాత్రి కలలో వచ్చిందనుకున్నదిట. తర్వాత కొంతకాలానికి ఆవిడ గర్భవతి అయింది. వారందరి సంతోషానికి అంతులేదు.

నెలలు నిండాక ఆవిడ ఒక సర్పానికి జన్మనిచ్చింది. కుటుంబీకులంతా, ఏమిటీ విచిత్రం అనీ, వాళ్ళకేమన్నా కీడు జరుగుతుందేమోననీ అనుకున్నారు. పండితుల్ని సంప్రదించగా భయపడద్దు, ఆ సర్పం మీకు ఏ హానీ చెయ్యదు, జాగ్రత్తగా పాలు పోసి పెంచండి, సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామే మీ ఇంట్లో వెలిశాడు, సంతోషించండి అని చెప్పారుట. వారు ఆ పామునే కన్న కొడుకుగా భావించి గారాబంగా పెంచసాగారు. ఒక గిన్నెలో పాలు పోసి పెట్టి నాగన్నా అని పిలిస్తే ఆ పాము ఎక్కడ వున్నా వచ్చి పాలు తాగి పోయేదిట. ఎవరినీ ఏమీ భయ పెట్టకుండా ఒక మూలన చుట్ట చుట్టుకుని పడుకునేదిట.

అప్పటినుంచి ఆ కుటుంబంకూడా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు దిన దినాభివృధ్ధి చెందింది. పాడి పంటలు వృధ్ధి చెందాయి.

కొంత కాలం తర్వాత ఆ ఇంట్లో ఇంకో కుమారుడికి వివాహం జరిగి కొత్త కోడలు ఇంటికి వచ్చింది. ఆవిడ ఒక రోజు పెద్ద కుండతో పాలు కాచి, దాన్ని పొయ్యి మీదనుంచి దించి పక్కనున్న కుదురు మీద కుండను పెడుతున్నాననుకుని పెట్టిందిట. కానీ అది కుదురు కాదు. వారు కొడుకుగా చూసుకుంటున్న పాము. తర్వాత కొంత సేపటికి పెద్ద కోడలు వచ్చి కుండలో పాలు తీసి చల్లార్చి నాగన్నా అని పిలిచింది. రోజూ వెంటనే వచ్చే నాగన్న ఆ రోజు ఎన్ని సార్లు పిలిచినా రాలేదు. ఎక్కడికెళ్ళాడోనని ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ వెదకగా పాలకుండ కింద కదలకుండా వుండటం చూశారు. కుండ తీసి చూడగా అప్పటికే ఆ పాల వేడికి సర్పం ప్రాణం పోయింది. కన్న కొడుకు పోయినట్లు దుఃఖించిన ఆ కుటుంబం, ఊరి పెద్దల సలహామీద ఆ సర్పానికి దహన సంస్కారం గావించారు.

ఆ రోజు రాత్రి తల్లికి ఆ సర్పం కలలో కనిపించి, కొత్త కోడలు చేసిన నిర్వాకం గురించి చెప్పింది. తాను ఆ గ్రామంలో చెరువు పక్క చింత చెట్టు కింద వెలుస్తున్నానని, ప్రతి నాగుల చవితికి యల్లాప్రగడ వంశం ఆడపడుచులని పుట్టలో పాలుపొయ్యమని, ఆడపడుచులు మాత్రమే పాలు పొయ్యాలని, ఇంటి కోడళ్ళు పొయ్యకూడదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ వంశంలోని ఆడపడుచులు కొమరవోలులో చింత చెట్టు కిందున్న పుట్టలో పాలు పోస్తున్నారు. చెట్టుకిందున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్వయంభూ విగ్రహానికి పూజలు చేస్తుంటారు. ఈ నిషేధం ఇతరులకు వర్తించదు గనుక ఇతరులు కూడా ఎక్కడెక్కడనుంచో వచ్చి ఇక్కడ పుట్టలో పాలు పోస్తూవుంటారు.

పిల్లలు లేనివారు, చెవి, ముక్కు, కన్ను సంబంధించిన రోగాలతో బాధపడుతున్నవారు, ఇతర సమస్యలతో సతమతమవుతున్నవారు వచ్చి ముడుపులు కట్టి, పుట్టలో పాలుపోసి, పొంగళ్ళు వండి నైవైద్యాలు పెడతారు. అలా చేసిన చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని మరల మరల స్వామి దర్శనం చేసుకుంటారు.

దాదాపు పది సంవత్సరాల క్రితం ఆ వంశానికి చెందిన ఆముదాలపల్లి దుర్గా ప్రసాదరావుగారికి, రిటైర్డు టీచరు, తరతరాలుగా చింతచెట్టు కింద వున్న స్వామిని తీసి ఒక చిన్న గదిలోకి చేరిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. అదే భగవత్ సంకల్పంగా భావించి ఇతరుల సహకారంతో ఒక చిన్న గది నిర్మించారు. వేద పండితుల పర్యవేక్షణలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని తొలగిస్తూవుండగాచింత చెట్టు కింద శ్రీ కామేశ్వరీ దేవి విగ్రహం, కాండం దగ్గల శ్రీచక్రం కూడా కనిపించాయి. మూడింటిని తొలగించి ఆ గదిలో శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అప్పటినుంచి రాష్ట్రం నలుమూలలనుంచి భక్తుల రాక కూడా ఎక్కువైంది. అనేక మంది అనేక కోరికలతో వచ్చి, అవి తీరాక ఇక్కడ వ్రతాలు, అభిషేకాలు చేయిస్తున్నారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించటం, చెవులు కుట్టించటం వగైరా కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నారు. ఈ విధంగా ఇక్కడ సందడి పెరిగింది.

దేవాలయ పూజారి శ్రీ తురిమెళ్ళ నాగేశ్వరరావు ఎటువంటి జీతభత్యాలు లేకుండా స్వచ్ఛందంగా తమ శక్తిమేర ధూప దీప నైవైద్యాలతో స్వామి సేవ చేసుకుంటున్నారు.

ఇంక ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కనిపించటం గురించి… ఒక దేవతా సర్పం తరచు ఈ గుళ్ళో దర్శనమిస్తూ వుంటుంది. పూజారిగారు గుడి తలుపు తీసేటప్పుడు ఆ చప్పుడికి నెమ్మదిగా పక్కనుంచి బయటికి వెళ్ళి చింత చెట్టి కింద వున్న పుట్టలోకి వెడుతుందిట. ఈ సర్పం ఒకసారి గుడి ముందు వున్న ద్వార పాలకుల విగ్రహం పైన తిరిగిన ఫోటోలు అక్కడ వున్న భక్తులు తీశారు. అవి కూడా చూడండి.

భక్తులు ఇక్కడ గమనించిన ఇంకొక విశేషం పుట్టమీద వున్న కలుగులు (రంధ్రాలు) అప్పుడప్పుడూ మూసుకుంటూ వుంటాయి. మళ్ళీ కొంచెం సేపు తర్వాత చూస్తే తెరుచుకుని వుంటాయి.

ఇంకొక విశేషం చింత చెట్టు మొదలు మెలి తిరిగ సర్పాలు పెనవేసుకున్నట్లు వుంటుంది. చెట్టు అన్ని కాలాల్లో గుబురుగా ఆకుపచ్చగా వుంటుంది. గుడి కట్టేటప్పుడు అడ్డంవచ్చిందని పనివాళ్ళు ఒక కొమ్మ కొట్టేశారుట. ఆ కొమ్మ కొట్టినతని చెయ్యి చచ్చుబడి పోయింది. అక్కడితో కొన్ని రోజులు గది నిర్మాణం నిలిచిపోయిందిట. వేద పండితులను సంప్రదించగా, కొట్టిన ఆ చెట్టు కొమ్మను చెట్టుమీద వేసి, సుబ్రహ్మణ్యస్వామిని తెలియక చేసిన అపరాధం, క్షమించమని వేడుకోండి, స్వామి దయ ఎలా వుంటుందో చూద్దామని చెప్పారు. ఆ విధంగా చెయ్యగానే అతని చెయ్యి మామూలుగా వచ్చిందిట. ఆ చింత చెట్టు అంత మహత్యం కలదని భక్తుల విశ్వాసం.

         

ఇక్కడ దేవతా సర్పం తిరుగుతున్నదనటానికి నిదర్శనంగా, సర్పం తిరుగుతున్నప్పుడు మల్లె, సంపెంగ, మొగలి పూల వాసనలు గుబాళిస్తాయిట. దేవాలయం ముందున్న చెరువు కూడా 600 సంవత్సరాల క్రితంనుంచి వున్నదని చెప్తారు. దీన్లో నీళ్ళు అన్ని కాలాల్లో వుండటం మరో విశేషం.

ఈ దేవాలయానికి నేను మూడు సార్లు వెళ్ళాను. మొదటిసారి వెళ్ళినప్పుడు చింత చెట్టు నిండా పాము ఆకారంలో ముద్రలులాగా కనిపించాయి. ఫొటోలు కూడా తీశాను..చూడండి. తర్వాత వెళ్ళినప్పుడు అవి లేవు.

ఒకసారి మా సావిత్రి పిన్ని కూతురు రాధిక నేను కలిసి కామేశ్వరి అమ్మవారికి 108 కలువ పూలతో పూజచేసుకున్నాము. అమ్మవారిని ఆ అలంకారంలో కూడా దర్శించండి. తను కామేశ్వరి నోము కూడా నోచుకున్నది.

దేవాలయంలో నిత్య పూజలతోబాటు సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవి, దసరా, కార్తీక మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయానికి ఎక్కువమంది భక్తులు వచ్చి తరించాలనే కోరికతో ఒక వసతి గృహాన్నికీ.శే. కసుబా రామకృష్ణ, వెంకట రమణమ్మగార్ల జ్ఞాపకార్ధం, (మా పెద్దమ్మమ్మగారు, తాతగారు) వారి కుమార్తె నారపజా ఇందుమతి, వారి భర్త కీ.శే. రామారావుగార్లు కట్టించారు. ఆలయ ప్రవేశద్వారం కుమారి కసుబా వెంకట షీల జ్ఞాపకార్ధం వారి తల్లిదండ్రులు శ్రీ కసుబా రాధాకృష్ణమూర్తి, సుబ్బలక్ష్మిగార్లు నిర్మించారు.

కొందరు భక్తులు ముందుకొచ్చి వెయ్యిమందికి సరిపడే వంట పాత్రలు గ్యాస్ స్టవ్లు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఇచ్చారు.

భక్తుల సహకారంతోనే శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి, నవగ్రహమండపాలు కూడా నిర్మింపబడ్డాయి. ఇక్కడ గోశాలకూడా నిర్వహింపబడుతోంది. మేము ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడే యాదృచ్ఛికంగా మొక్కలు అమ్మే అతను వస్తే అందరం తలా కొన్ని మొక్కలు, పూల చెట్లు, పళ్ళ చెట్లు కొని నాటాము.

ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించండి.

Exit mobile version