భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 8: జిల్లెళ్ళమూడి

0
1

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 8” వ్యాసంలో “జిల్లెళ్ళమూడి అమ్మ బాల్యం ఈనాటి బాలబాలికలకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. మంచితనాన్ని, త్యాగాన్ని నేర్పుతుంది” అంటూ జిల్లెళ్ళమూడి గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]మే[/dropcap]ము జిల్లెళ్ళమూడి చేరేసరికి మధ్యాహ్నం 2 గంటలయింది. కారు దిగి లోపలకి వెళ్ళామో లేదో ఎంతో ఆత్మీయులలాగా పలకరించారు అక్కడివారు ‘ఇప్పుడే వస్తున్నారా’ అంటూ. మేము ఆశ్రమాన్ని చూడటానికి వచ్చామంటే… ‘ముందు ప్రసాదం తీసుకోండి, తర్వాత అమ్మ దర్శనం చేసుకోవచ్చు’ అన్నారు. భోజనాల సమయం దాదాపు అయిపోవచ్చిందనే మొహమాటంతో మేము ‘ఆకలిగా లేదు’ అన్నాము. వాళ్ళు వినిపించుకోకుండా ‘అమ్మ దర్శనానికి వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెళ్తే అమ్మ బాధ పడుతుంది. ఎంత ఆకలి వేస్తే అంతే తినండి’ అని బలవంతాన ముందు భోజనం పెట్టారు. జిల్లెళ్ళమూడిలో నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏ సమయంలో వెళ్ళినా అక్కడ ఆత్మీయులలాగా భోజనం పెడతారు. ఆ ప్రశాంత వాతావరణం, ఆ ఆప్యాయతా చూస్తే మనస్సుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది.

భోజనం అయ్యాక అక్కడ ఆఫీసులో ఒకరు వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ విశేషాలని చూపిస్తూ వివరించారు. అప్పుడు ఈ వ్యాసాలు రాస్తానని ఊహించక పోవటంతో వారి పేరు, ఇంకా కొన్ని వివరాలు రాసుకోలేదు.

1958 ఆగస్టు 15 న అమ్మ తన స్వహస్తాలతో ఈ అన్నపూర్ణాలయం ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. పేద, గోప్ప, కులం, మతం అనే తేడా లేకుండా ఎంత మంది వచ్చినా, ఎప్పుడొచ్చినా అక్కడ భోజనం వడ్డిస్తారు.

జిల్లెళ్ళమూడి అమ్మ

జిల్లెళ్ళమూడి అమ్మ మార్చి 28, 1923లో గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సీతాపతి, రంగమ్మ. అమ్మ అసలు పేరు అనసూయ. పదమూడవ ఏట అమ్మకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వరరావుతో బాపట్లలో వివాహం జరిగింది. కాపురం బాపట్లలో పెట్టారు. నాలుగేళ్ల తర్వాత 1940లో నాగేశ్వరరావుగారు జిల్లెళ్ళమూడి కరణంగా బాధ్యతలు స్వీకరించటంతో ఆ దంపతులు జిల్లెళ్ళమూడిలో కాపురం పెట్టారు.. వీరు వచ్చిన తర్వాత ఆ గ్రామం అభివృధ్ధి బాట పట్టింది.

అందరిపట్లా ప్రేమ చూపే ఆవిడ బోధలు అందరినీ ఆకర్షించాయి. అమ్మ జిల్లెళ్ళమూడిలోని ప్రజలకు అనేక విషయాల మీద సందేశాలు ఇస్తుండేవారు. భక్తులు ఆవిడను “అమ్మ” అని భక్తిగా, ప్రేమగా పిలుచుకునేవారు. అమ్మ దగ్గర పొందే సాంత్వనం భక్తులు ఈవిడ దగ్గర పొందేవారు. అప్పుడే కాదు, ఇప్పటికీ (1985లో పరమపదించారు) ఆవిడని అనుసరించే భక్తులు వున్నారంటే ఆవిడ భక్తులని ఎంత ప్రభావితం చేశారో తెలుస్తుంది.

బాల్యం

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఈవిడ చిన్నతనంనుంచే తన ప్రతిభని అనేక సందర్భాలలో ప్రదర్శించారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరణతో చూసేది. అన్ని విషయాలను ప్రశ్నించేది. మనిషి మనిషిగా బ్రతకాలని బోధించేది. ఆడపిల్ల అణుకువగా వుంటూనే ఆత్మశక్తిని కలిగి వుండాలని చెప్పేది.

జిల్లెళ్ళమూడి అమ్మ బాల్యం ఈనాటి బాలబాలికలకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. మంచితనాన్ని, త్యాగాన్ని నేర్పుతుంది. అందరితో కలిసి జీవించడమే కాదు, సంస్కృతిని, సంస్కారాన్ని కూడా నేర్పిస్తుంది. ‘ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు’ – అనేదే ఈమె వేదాంత బోధ. ఒకరు ‘అమ్మా, ఏమీ ఉపదేశం ఇవ్వరు. ఎందుకు?’ అని అడిగితే ‘నేను ఇస్తున్న ఆహారమే ఉపదేశమ’ని చెప్పారుట. రిచర్డ్ షిఫ్మేన్ అనే ఆయన అమ్మ గురించి రాసిన తన పుస్తకం… ‘మదర్ ఆఫ్ ఆల్…’ లో అమ్మ అందరినీ తన బిడ్డలుగా భావించి ప్రేమతో ఇచ్చే ఆహారంలో కేవలం శరీర పోషణే కాదు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అని రాశారు. ఆవిడ ప్రతి ఒక్కరిమీదా చూపించే ప్రేమ అటువంటిది.

ఒకసారి వాసుదాస స్వామి అనే వైష్ణవ స్వామి వద్దకు అమ్మ వెళ్ళగా తల్లి లేని పిల్ల అని తెలిసి అందరూ తనను ప్రేమించేట్లు చేయనా అని అడిగారుట ఆయన. అమ్మ ‘’అందరూ నన్ను ప్రేమించినా ద్వేషించినా నేను అందర్నీ ప్రేమించేట్లు ఆశీర్వదించండి‘’అన్నదట. ఎంత గొప్ప మనసో కదా.

ఆధ్యాత్మిక ధోరణిలో వున్న అమ్మ పెళ్లి చేసుకోవటం లోని అంతరార్ధం చాలామందికి అర్ధం కాలేదు. అడిగిన వారికి అమ్మ ఇచ్చిన సమాధానం “ఆధ్యాత్మిక జీవితానికి వివాహం అడ్డు కాదు – అని చెప్పటానికే, నేను వివాహం చేసుకున్నాను.” అని చెప్పారట. తన భార్యలో ఒక దివ్యమూర్తిని చూసిన నాగేశ్వరరావుగారు ఆవిడ భక్తుడిగా మారారు. కానీ, అమ్మ మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారట. భక్తులు, ఆవిడ భర్తను “నాన్నగారు” అని పిలుచుకునేవారట. అయన, 1981లో మరణించారు.

వీరికి ఒక కుమార్తె. పేరు హైమ. ఆమె 1944లో జన్మించి 1968లో అనారోగ్యంతో మరణించారు. మొదటినుండి, “అమ్మ” తన కుమార్తె త్వరలోనే ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు. అమ్మ తన కుమార్తెకు దైవత్వం ఇచ్చి ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించారు. ఆ గుడి “హైమాలయం”గా పేరొందినది.

అమ్మ బోధలు, సేవలు

1950వ సంవత్సరంలో వేసవి కాలంలో ఒక సన్యాసి ఆకలితో, నీరసంతో నడవలేక నడుస్తూ వెళ్తుంటే అమ్మ చూసి ఇంటికి పిలిచి ఆతిథ్యం స్వీకరించమని కోరింది. ఆ ఊళ్ళో దేవాలయం లేదు కనుక తాను భిక్ష స్వీకరించనని చెప్పగా అమ్మ మనసు తల్లడిల్లి ఒక దేవాలయం, స్వంత సత్రం ఏర్పాటు చేయాలని భావించింది. ఊరి వారందరి సహకారం కోరుతూ ఎవరికీ ఇబ్బంది కలుగకుండా రోజుకు ‘’పిడికెడు బియ్యం పథకం‘’ ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి వారు దాన్ని సేకరించి అందజేసేవారు. వాటిని భద్రం చేసి అందులో కొంత భాగం దేవాలయ నిర్మాణానికి ఉపయోగించటం ఆమె ఆలోచన. కొద్ది కాలం లోనే ఇది అద్భుత విజయం సాధించింది. 1958 ఆగస్ట్ పదిహేనున ‘అన్నపూర్ణాలయం’కు ప్రారంభోత్సవం చేసింది. ఆ సత్రం లో భోజనం చేయటానికి ఆకలే అర్హత. అమ్మ తన ఇంటికి ‘అందరి ఇల్లు’అని పేరు పెట్టింది.

కుల మత బేధాలు, మత కలహాలూ లేని వాతావరణాన్ని అమ్మ అందరింట్లో నెలకొల్పింది. అందరూ ఏకోదర సంబంధ బాంధవ్యంతో కలిసి భోంచేస్తారు, కలిసి పనిచేస్తారు, కష్టసుఖాలు పంచుకొని కలిసిమెలసి ఉంటారు.

ఒకసారి ఒక 60 ఏండ్ల స్త్రీ అమ్మ వద్దకు వచ్చి, ఏదైనా మంత్రోపదేశం చెయ్యమని అడిగింది. దానికి ఆవిడ “నాకే మంత్రమూ రాదు తల్లీ, ఇంక నీకేమి బోధిస్తాను.” అని అన్నారు. తర్వాత మాటల సందర్భంలో “కూతుళ్ళనూ, కోడళ్ళనూ ఒకే రకంగా చూసుకో! అదేవిధంగా కొడుకులనూ, అల్లుళ్ళనూ ఒకే రకంగా చూసుకో! ఈ వయసులో చేయవలసిన సాధన ఇదే. అద్వైతం అంటే కూడా ఇదే!” అని ఉపదేశించింది.

మద్రాసులో ఒక భక్తురాలి గృహంలో అమ్మ విడిదిచేసి వున్నప్పటి సంగతి. సినిమా నటి సావిత్రి అమ్మ దర్శనానికి వచ్చింది. దర్శనం తర్వాత వెళుతూ, జిల్లెళ్ళమూడి అమ్మను తన గృహానికి కూడా రమ్మని వేడుకొంది. అమ్మ మౌనంగా విన్నది. సావిత్రి ఏమనుకుందో ఏమో, “అలా రావడానికి మీరేం తీసుకుంటారమ్మా?” అని వెంటనే అడిగింది. అమ్మ చిరునవ్వుతో, తాను ఇచ్చే అమ్మనే గాని తీసుకునే అమ్మను కానని, జవాబు చెప్పింది. దైవత్వం,మాతృత్వమంటే అలా ఉంటాయి. తనకు తారసపడిన గురువులందరూ తీసుకున్నవారే కావటం వల్ల, సావిత్రి అలా అడిగి ఉండవచ్చు.

సాధారణంగా అవతారాల లక్ష్యం దుష్టశిక్షణ, శిష్టరక్షణ. ‘దుష్టత్వాన్ని శిక్షించాలి కానీ దుష్టులను కాదు’ అని అంటుంది అమ్మ.

‘‘లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంటూ రెండూ లేవు. నీవు చేసే ప్రతి పనీ దైవకార్యమే. ఈ జగత్తే దైవం. ముముక్షుత్వమే మోక్షం, ధ్యాసే ధ్యానం, వర్గం లేనిది స్వర్గం’’అంటూ చిన్న చిన్న మాటలతో అందరికీ అర్ధమయ్యేటట్లు గొప్ప విషయాలు చెప్పేవారు. ‘‘సుఖానికి మార్గం ఒక్కటే; ఏది జరిగినా వాడు (దైవం) చేశాడనుకోవడమే’’; ‘‘సర్వాన్నీ అనుభవిస్తూ సర్వాన్నీ విడిచిపెట్టేదే వివాహం’’- అంటూ పరమసత్యాలను వెల్లడించింది.

విద్యారంగంలో కూడా అమ్మ విశేష కృషి చేశారు. 1971లో సంస్కృత పాఠశాల, కళాశాలలను స్ధాపించి, మన సంస్కృతీ సంప్రదాయ వ్యాప్తికి ముందడుగు వేసింద. అక్కడ చదివే ప్రతి వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కలిగించి ఆదర్శ ప్రాయమైనది.

వృధ్ధులకు అండగా ‘ఆదరణాలయం’ ఏర్పరచి వారికి అండదండలయింది అమ్మ. రోగిష్టులపట్ల ఆవిడ చూపించిన ప్రేమ అపారం. ప్రకృతి వైఫల్యాలలో ఆవిడ చేసిన కార్యక్రమాలు అమోఘం. అంతేకాదు అమ్మ సామూహిక ఉపనయనాలూ, అక్షరాభ్యాసాలూ, వివాహాలు చేసి సామాన్యులకు ఎంతో సౌకర్యం కలుగచేస్తుంది. పిల్లలకు భోగిపళ్ళుపోయటం ఇప్పటికీ కొనసాగుతోంది అంటారు.

నిర్యాణం

అమ్మ తన జీవిత కాలం, అంటే 1953లోనే తన నిర్యాణాంతరం తనని ఎక్కడ ఉంచాలో తెలియచేశారు. అక్కడ అప్పుడే భక్తులు చేపట్టిన గుడి నిర్మాణం 1985 లో అమ్మ నిర్యాణాంతరం పూర్తయింది. ఆ గుడి పేరు “అనసూయేశ్వరాలయం”. అమ్మ భౌతికంగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన భక్తులు అమ్మ పెళ్ళి రోజును ఆ గుడిలో ఘనంగా జరుపుకునేవారు. అమ్మ 1985లో మరణంచిన తరువాత, అమ్మ భౌతిక కాయాన్ని, ఆవిడ ఆదేశానుసారం ఆ గుడిలోనే ఖననం చేసి, ఆ ప్రదేశంలో అమ్మ విగ్రహాన్ని నెలకొల్పారు.

ఎప్పుడు చూసినా నిండుగా, మూర్తీభవించిన ప్రేమలా కనబడేది అమ్మ. సాక్షాత్తూ అన్నపూర్ణాదేవిలా కనిపించే ఆవిడని చూసి భక్తితో ప్రణమిల్లేవారు. పరిస్తితులకు మించిన గురువులేదు అన్న అమ్మకు గురువులే లేరు. అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఎందరో వైద్యులు అమ్మ ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. 12-7–1985న అమ్మ తన అరవై మూడవ ఏట పరమాత్మలో కలిసి పోయింది. అమ్మకు భ్రుకుటీ భేదం, సహస్రార భేదం జరిగి, తలనుండి, భ్రుకుటి నుండి రక్తం చిమ్మిందట.

మాతృశ్రీ పబ్లికేషన్స్ ముప్ఫైకి పైగా తెలుగులోనూ అయిదు ఆంగ్లం లోను అమ్మపై పుస్తకాలను ప్రచురించి అమ్మ ఆశయాలను ప్రచారం చేస్తోంది. శ్రీ విశ్వజననీ పరిషత్, అమ్మ ఆరంభించిన అన్ని సంస్థలనూ కార్యక్రమాలనూ సమర్ధవంతంగా నిర్వహిస్తున్నది.

 

అమ్మకు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ. ఇలాంటి అవధూతలు భూమి మీద వున్నా లేకున్నా వారి బోధలు అన్ని కాలాలకూ పనికి వచ్చేవి. వాటిని ఆచరించేవారు కూడా వుంటూనే వుంటారు. వారు నివసించిన పవిత్ర ప్రదేశాలను అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.

రవాణా సౌకర్యం

బాపట్లదాకా రైలు, రోడ్డు మార్గాలున్నాయి. బాపట్ల, పొన్నూరు నుంచి జిల్లెళ్ళమూడికి బస్ సౌకర్యం వున్నది. బాపట్లనుంచి జిల్లెళ్ళమూడి 15 కి.మీ.లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here