Site icon Sanchika

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-11

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

కాశీ లో దేవీ దేవాలయాలు:

శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ దర్శయామాస పాండవమ్‌॥

[dropcap]సం[/dropcap]కటమోచన రోడ్డులో వున్న దుర్గామాత ఆలయము కాశీలో చూడవలసిన దేవాలయము. దీనినే దుర్గాకుండు దేవాలయమని కూడా అంటారు.  ఈ దుర్గాకుండు అత్యంత శక్తి వంతమైనది.  18వ శతాబ్ధములో బెంగాలుకు చెందిన రాణీ భవానీ నిర్మించిన దేవాలయమది. శక్తివంతమైన దుర్గాకుండు పూర్వము గంగానదికి ఆనుకుని వుండేదని అంటారు. ఈ కుండము ప్రక్కనే అమ్మవారి గుడి వున్నందున దుర్గాకుండ్ – దుర్గగుడి అంటారు.

అగస్త్యుల వారు ఒకసారి కార్తికేయుల వారిని అడిగారట, అమ్మవారికి దుర్గ అన్న పేరు ఎలా వచ్చింది అని. కార్తికేయులు ఇలా చెప్పారట: పూర్వం దుర్గాసురుడన్న అసురుడు ఘోర తపస్సు చేసి మగవారి నుంచి చావు లేని వరం పొందాడు. ఆ వర గర్వమున ముల్లోకాలలో అలజడులు లేపాడు. ఎవ్వరినీ హాయిగా బ్రతకనీయ లేదు. భగవత్భక్తులకు మరీ బెడద ఈ అసురుడి నుంచి. రుషి వాటికలను నాశనము చెయ్యటము, ఎవ్వరినీ తపస్సు చేసుకోనియ్యకపోవటము ఇత్యాదివి అసురునకు నిత్యకృత్యాలుగా మారాయి. ప్రపంచమంతా అతలాకుతలమైనది. సర్వులూ మహాదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు.

     పరమశివుడు  అమ్మవారి ఆ విషయము చూడమని కోరుతాడు. అమ్మవారు కాళరాత్రిని దూతగా పంపుతుంది. అసురుడు వినడు. పైగా కాళరాత్రిని బంధించమని సైన్యాన్ని పంపుతాడు. ఆమె వారిని వధించి దేవికి ఈ విషయము విన్నపిస్తుంది. అసురుడు కాళరాత్రి వెనకే అమ్మవారి స్వస్థలమైన వింద్యాచలానికి వస్తాడు. అమ్మవారు తన శక్తులను ఉసికొలుపుతుంది. అమ్మవారి శక్తికి అసురుడు నేలకూలుతాడు. ఈ యుద్ధమంతా కాశీఖండములో వివరముగా వుంటుంది. దేవతలు, రుషులూ ఆనందముతో అమ్మవారిని వజ్ర పంచకముతో స్తుతించి దుర్గాసురుడిన్ని వధించినందుకు ‘దుర్గాదేవీ’ అని కొలిచారు.

ఈ దేవాలయము కాశీలో వున్న ప్రముఖమైన దేవాలయాలలో ఒకటి. ఆ గుడిలో దుర్గను మానవమాత్రులు చెక్కలేదని, ఆ తల్లి ఆ విధముగా ప్రత్యక్షమైనదని స్థానికుల నమ్మకము. ఈ తల్లిని అర్చన చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము. ఆ విషయానికి సంబంధిచిన ఒక కథ అక్కడ చెబుతారు. ఇక్కడ దుర్గను కాశీరాజ కుమార్తె పూజించేదిట. ఆమె స్వయంవరములో తనకు నచ్చిన రాజును వివాహము చేసుకున్నదని మిగిలిన రాజులు యుద్ధానికి వస్తారు.  యువరాణి వివాహం చేసుకున్న రాజకుమారుడు, కాశీ రాజుతో కలసి ఇక్కడి దుర్గను కొలచి వెళ్ళి యుద్ధానికి వెడతారు. అప్పటి వారి యుద్ధంలో వారికి  విజయము లభిస్తుంది. అప్పటి నుంచి ఈ అమ్మవారిని విజయానికై గుర్తుగా కొలుస్తారు. ఈ గుడిని ‘నగర’ విధానములో నిర్మించారు. గుడి మొత్తము ఎర్రని ఎరుపు రంగుతో వుంటుంది. గంభీరమైన అద్భుతమైన శిఖరముతో దేవాలయము కన్నులవిందు చేస్తుంది. ఈ దేవాలయము గురించి దేవీ మహత్యములో కూడా  ప్రసక్తి వున్నదిట.

గర్భగుడిలో అమ్మవారు బంగారు తొడుగుతో అలరాడుతూ భక్తులను ఆనందపరుస్తుంది. గర్భగుడి ముందర భక్తులు నిలచి కొలుచుకోవటానికి బంగారు స్తంభాలతో కూడిన పెద్ద మండపము వున్నది. దేవాలయానికి చుట్టూ వరండా, అందులో ఎందరో భక్తులు సప్తశతీ, దేవీ భాగవతమూ పారాయణము చేస్తూ కనపడుతారు. కొందరు శ్రద్ధతో జపము చేస్తూ వుంటారు. ఆ వరండాలన్నీ అలాంటి శ్రద్ధాళువైన భక్తులతో నిండి వుంటాయి. ఆ దేవాలయము ప్రాంగణములో దీపాలు వెలిగించటము ఆనవాయితి. భక్తులు దీపం వెలిగించి ఒక ప్రక్కన వుంచుతారు. మందార మాలలతో అమ్మవారిని అర్చనచేస్తారు.

ముఖ్యంగా చతుర్దశి, అష్టమీ రోజులలో అమ్మవారిని మందారాలతో కొలవాలట. ఎఱ్ఱటి మందారాలు అమ్మవారికి ప్రీతి పాత్రమైనవని ఇక్కడి వారి నమ్మకము.

ఇక్కడ చండీ హోమము కూడా ఎక్కువగా చేస్తారు.

ఆ దేవాలయంలోకి వెళ్ళగానే, నేను ఎప్పుడో అక్కడికి వచ్చానన్నట్లుగా అనిపించింది. కొద్దిగా ఆలోచించగా నేను ఖాట్మండు వెళ్ళినప్పుడు అక్కడ వున్న దుర్గ గుడి కూడా అచ్చు అలానే వున్నదని గుర్తుకు వచ్చింది.

కుండమును దర్శించి, అమ్మవారి గుడిలో అమ్మకు ప్రదక్షిణలు చేసి, కొంత ధ్యానము చేసుకొని, వెనకకు మరలాను.

(సశేషం)

Exit mobile version