[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
[dropcap]కా[/dropcap]శీలోని దేవీ దేవాలయాలలో నవ గౌరి దేవీ దేవాలయాలు వూన్నాయి. ఈ నవ గౌరి అమ్మవారులు – ‘భవానీ గౌరి, జ్యేష్ఠ గౌరి, లలితా గౌరి, మంగళగౌరి, ముఖనిమాలీకా గౌరి, శృంగార గౌరి, సౌభాగ్యగౌరి, విశాలక్షిగౌరి, విశ్వభుజగౌరి’.
ఈ నవ గౌరీలలో మంగళగౌరి దేవీ ప్రముఖమైనది. ఈ మంగళగౌరి దేవి ఆలయము పంచగంగా ఘాట్‌లో వుంది. పంచగంగా ఘాట్ అతి పవిత్రమైనది. ఆ ఘాటుకు ఆ పేరు రావటానికి కారణము, పూర్వము అక్కడ ‘వేదశిర’ అన్న ఋషి దీర్ఘమైన తపస్సు చేస్తూ వుండేవాడు. ఒకనాడు ‘సుచి’ అన్న అప్సర అటుగా పోతూ పొరపాటున ఆ ఋషివర్యులకు తపఃభంగం కావిస్తుంది. తపస్సు చెడి సుచిని చూసిన ఋషి, తన తఫఃభంగం కావించిన ఆమెను తాకకుండా తన ఓజష్సును ఆ అప్సరలో ప్రవేశింపచేసి మరల తపంలో మునిగిపోతాడు. సుచి ఒక కూమార్తెను కని, ఋషి వాటికలో విడిచి వెనకకు పోతుంది. ఋషి పాపను చూసి సంతోషించి, దూత్పాప అని పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటాడు. ఆమెకు పెళ్ళి వయస్సు వచ్చే సరికే వివాహము చెయ్యాలని చూస్తాడు ఋషి. ఆమె తనకు సామాన్యమైన వాడు వద్దని, గొప్పవాడు వరుడుగా రావాలని కోరుతుంది. అందుకు ఆమెను తపస్సు చెయ్యమని చెబుతాడు ఋషి. దూత్పాప ఘోర తఫమునకు బ్రహ్మ ప్రత్యక్షమై, సర్వ నదులు ఆమె జుట్టులో నివసిస్తాయని, సర్వసంతోషాలు ఆమెకు కలుగుతాయని వరమిస్తాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన దూత్పాపను ఒకనాడు ధర్మరాజు అనే రాజు చూసి పెళ్ళి చేసుకోవాలనే కోరికను వెలిబుచ్చుతాడు. ఆమె తన తండ్రితో మాట్లాడమని చెబుతుంది. రాజుకు ఆగ్రహము కలిగి శిలగా కమ్మని శపిస్తాడు. నీరైపొమ్మని రాజుకు ప్రతిశాపమిచ్చి, తండ్రికి విషయము చెబుతుంది. పాషాణముగా వద్దని లోహపు బొమ్మగా వుండమని తండ్రి సలహా ఇస్తాడు. లోహము కరిగి తరువాత నీరుగా మారుతుంది. ఆ నీరు నదిగా మారి దూత్పాప నదిగా గంగలో కలుస్తుంది. ఆమె నదిగా మారినప్పుడు శాపం పొందిన రాజు నదిగా మారి ఆమెలో కలుస్తాడు.
అదే ప్రదేశములో మయూఖాదిత్యుడు పరమశివుని, అమ్మవారిని ప్రతిష్ఠించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు ఆయనలోని ఉష్ణము కిరణమన్న నదిగా పారుతుంది. శివపార్వతులు ప్రత్యక్షమై ఆయన చల్లబడేలా చేస్తారు. అందుకే ఆ దేవాలయములో ఉష్ణోగ్రత ఎలా వున్నా ఆ ఆదిత్యుడు మాత్రము చల్లగా వుంటాడు. మనము దర్శించుకున్నప్పుడు ఆయనను తగిలి చూడవచ్చు. ఆయన మంచులా చల్లగా తగులుతాడు.
అమ్మవారు ఆ దేవాలయములో మంగళకరములుగా అందరిని కాపాడు గౌరిగా కొలువై వుంటానని వరమిస్తుంది. అందుకే, నవ గౌరీలలో ఈ దేవాలయంలోని మంగళగౌరి ఎంతో ప్రముఖమైనది. తప్పక దర్శించవలసిన అమ్మవారు. తనను పూజించిన వారి కోరికలు ఇట్టే తీర్చే తల్లి ఈ మంగళగౌరి.
దూత్పాప నది, కిరణనది వచ్చి గంగా, యమునా, సరస్వతి నదులతో కలిసినందుకు అది పంచగంగా అయ్యింది. ఈ ఘాట్ చాలా పవిత్రమైనది. తప్పక పుణ్యస్నాన మాచరించవలసినది స్థలమది.
పవిత్రమైన ఈ ఘాట్ లోనే బిందు మాధవ దేవాలయమూ వుంది. ఈ దేవాలయము కేశవదేవాలయము.
మహావిష్ణువు, శివుని కోరికపై కాశీకి వచ్చి మరలిపోతూ కాశీ నగర సౌందర్యము చూసి మైమరచి పోతాడు.
ఆయన ఆ సౌందర్యం చూస్తూ పంచగంగా వాటికలో తిరుగుతూ ఘోర తపస్సు చేస్తున్న ఒక ఋషిని చూస్తాడు. ఆ ఋషి పేరు అగ్నిబిందుడు. ఆయన తపస్సుకు విష్ణువు సంతోషించి వరము కోరుకోమంటే, ఋషి మహావిష్ణువును చూసి ఆనందించి, స్తోత్రాలు చేసి ఆ ప్రదేశములో నివసిస్తూ భక్తులను కాచుకోమని కోరుతాడు. ఆ ఘాట్‌లో స్నానము చేసి మహావిష్ణవును కొలచిన వారికి మోక్షము ప్రసాదించమని, అక్కడ వెలసిన రూపము తన నామముతో పిలవబడాలని కోరుకుంటాడు. అందుకే మహావిష్ణువు అక్కడ బిందు మాధవునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలా పంచగంగా ఘాట్ అంత ప్రత్యేకమైనది.
అందుకే మహాశక్తి వంతమైన అవధూత, 300 సంవత్సరాలు జీవించిన శ్రీ త్రైలింగస్వామి కూడా తన ఆశ్రమము పంచ గంగా ఘాట్ లోనే ఏర్పరుచుకున్నారు.