[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
గవ్వలమ్మ గుడి:
కాశీలో మరో ప్రత్యేకమైన దేవాలయము ‘గవ్వలమ్మ గుడి’ లేదా కౌడి మాతా గుడి. ఈ గుడిలో దేవత ‘కౌడి మాతా’ అంటే గవ్వల మాతా. అందుకే ఆమెను గవ్వలమ్మ అంటారు. ఆమెను అక్కడ శివుని సోదరి అని కూడా చెబుతారు.
ఆమె దక్షిణ దేశానికి చెందిన గ్రామదేవతగా కూడా చెబుతారు. అందరూ దేవీ దేవతలు కాశీలో వివిధ చోట్ల నివాస మేర్పుచుకున్నారు.
అలానే ఈమెకు కూడా కాశీలో వుండాలని అనిపించినదట. కాని మిగిలిన దేవతలు ఆమెను తిరస్కరించారు. వుండటానికి అనుమతించలేదు. ఆమె శివుణ్ణి ప్రార్థించిదిట. శివుడు కరుణతో, ఆమెను అక్కడ వుండమని, భక్తులు కాశీ వచ్చినా, ఆమెను సేవించి వెడితే తప్ప యాత్ర ఫలితము రాదని వరమిస్తాడు. ఆమెను సోదరిలా ఆదరిస్తాడు స్వామి. అలా ఆమె దేవాలయము వెలిసింది.
ఆ గుడి చాలా చిన్నది. కేవలము అమ్మవారు విగ్రహముతో గర్భగుడి వుంటుంది, పెద్ద చెట్టునానుకొని. దుర్గగుడికి దగ్గరలో వుంటుంది ఈ గుడి.
ఆ అమ్మవారిని అర్చించే పద్ధతి వింతగా వుంటుంది. పసుపు కుంకుమ, జాకెట్టు గుడ్డతో పాటు ఐదు గవ్వలు కూడా ఇస్తారు. మనము వెళ్ళి ముందుగా మూడు ప్రదక్షిణలు చేసి పది మెట్ల పైన వున్న దేవాలయానికి వెడతాము. అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్టు గుడ్డ అర్పించి గవ్వలు ఒకటి మన వద్ద వుంచుకొని, మిగిలినవి అమ్మవారి ముందు పడేలా విసరాలి. విసిరి అమ్మవారితో మూడు సార్లు
‘గవ్వలు నీకు, డబ్బులు మాకు’
‘గవ్వలు నీకు యశస్సు మాకు’
‘గవ్వలు నీకు విజయము మాకు’ అని చెప్పాలి.
మనకు తోచిన పైకము హుండీలో వేసి నమస్కరించుకు రావాలి. ఆ గవ్వను మన డబ్బులు వుంచుకునే స్థలములో పెడితే లాభాలు వస్తాయని చెబుతారు.
అక్కడి పూజారికి తెలుగు బాగా వచ్చు. చూడబోతే, మన తెలుగువారు ఎక్కువగా దర్శిస్తారులా వుంది ఈ గుడిని. ఆ దేవాలయము దారి వెతకటము పెద్ద కష్టము కాదు. దుర్గగుడి వద్ద ‘కౌడిమాతా గుడి’ అని అడిగితే చెబుతారు.
అక్కడకు కొంత దూరములోనే ప్రసిద్ధ ‘సంకటమోచన హనుమన్’ ఆలయము వుంది. దానిని ‘మంకీ టెంపుల్’ అని కూడా అంటారు. ఆ గుడి రామ భక్త హనుమ దేవాలయము. దేవాలము విశాలమైన ప్రాంగణము. ఆవరణంతా పెద్ద పెద్ద మర్రి చెట్లు శతాబ్దాలవి విస్తరించి వుంటాయి.
దేవాలయములో కోతులు విపరీతము. కాని మన వద్దకు రావవి. మనలను ఏమీ చెయ్యవు. ఈ కోతులు ఎక్కువగా వుంటాయి కాబట్టి ఈ దేవాలయాన్ని ‘మంకీ టెంపుల్’ అంటారు.
ఆ దేవాలయము కాశీలో తప్పక దర్శించవలసిన దేవాలయాలలో ఒకటి. మన కష్టాలు ఆ దేవాలయ ప్రాంగణములో అడుగు పెట్టే వరకే వుంటాయి. తరువాత మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకము.
ఎలాంటి సంకటాన్నైనా తీసివేస్తారని హనముని అక్కడ సంకటమోచన హనుమాన్ అని భక్తితో కొలుస్తారు. మిఠాయి సమర్పిస్తారు. స్వామి హనుమ విగ్రహము వింతగా వుంటుంది. దాదాపు సమతలముగా (ఫ్లాటుగా) వున్న ఆరెంజు రాయికి రెండు కళ్ళు వుంటాయి. ఆ కళ్ళు శక్తివంతముగా, మెరుస్తూ మనలను లోపల కంటూ చూస్తూ వుంటాయి. అంత అందమైన హనుమను నేను నా జన్మలో చూడలేదు. ఆ స్వామి అలా కళ్ళలో మిగిలిపోయారు.
భక్తులు ప్రతిదినమూ వేలలో వస్తారు అక్కడికి. మంగళవారమూ, శనివారమూ ఈ భక్తుల సంఖ్య లక్షలలో చేరుకుంటుంది. నిత్యము ‘హనుమాన్‌చాలీసా, సుందరాకాండ’ పారాయణాలు జరుగుతూ వుండే ఈ దేవాలయము ‘అసి’ నది వడ్డున వుంది. రామభక్త తులసీదాసు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆయనకు హనుమంతుల వారు కనిపించి రామ దర్శనము గురించి చెప్పిన స్థలములో ఆ దేవాలము నిర్మించారుట.
ఆ దేవాలయానికి చాలా భద్రత వుంది. 2006లో టెర్రరిస్టుల దాడి జరిగినది. అప్పటి నుంచి అక్కడ భద్రత ఎక్కువైనదట. రామభక్త సంతు తులసీదాసుకు వారణాసీకి ఎంతో సంబంధమున్నది. తులసీ మానస మందిరమూ ఈ హనుమంతుల వారి దేవాలయము వచ్చే దారిలోనే వుంటుంది.
(సశేషం)