[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
తులసీ దాసు- రామచరిత మానస- హనుమాను చాలీసా:
పుట్టినవెంటనే తండ్రినీ, ఐదు సంవత్సరాల వయస్సులో తల్లినీ పోగొట్టుకున్న రాముబోలా బాల్యము కడు పేదరికములో, యాచన వృత్తిలో గడిచింది. 15 సంవత్సరముల ప్రాంతములో వారణాసి వచ్చి ‘సీష సనాతన’ అన్న గురువు వద్ద సంస్కృతము, వేదము, వేదాంగాలు, తర్కము నేర్చుకొని పండితుడవుతాడు.
విద్యాభ్యాసము పూర్తి చేసి తిరిగి జన్మస్థలానికి వెళ్ళి వివాహము చేసుకుంటాడు. భార్య ప్రోద్బలముతో సంసారిక జీవనము వదలి సన్యాసము తీసుకుంటాడు. అప్పుడు గురువిచ్చిన నామము ‘తులసీదాసు’.
ఆయన ఆ మంత్రము పరమ నిష్ఠగా జపిస్తూ రామ దర్శనానికై తల్లడిల్లుతూ వుంటాడు. ఒకనాటి ఉదయము రాములవారిని చూడగలవని చెబుతారు హనుమ. అన్నీ సిద్ధము చేసుకొని ‘కమదగిరి’ గిరి ప్రదక్షణలో వుండగా రాచ కుమారులు ఇద్దరు గుఱ్ఱాలపై కనపడుతారు. తులసీదాసు వారిని గుర్తించక రామునికై ఎదురుచూస్తూ వుంటాడు.
హనుమ ఆ రాచకుమారులే రామ లక్ష్మణులని వివరిస్తాడు. తులసీదాసు విలపించి దర్శనముకై తిరిగి తిరిగి ప్రార్థించగా రాముడు వస్తాడని చెప్పి మాయమవుతాడు హనుమ.
మరోరోజు పూజకై గంధం తీస్తున్న తులసీదాసు వద్దకు స్వయంగా రాములవారు వచ్చి చందనము ఇవ్వమని తిలకము దిద్దుకోవాలని కోరుతారు. తులసీదాసు రామస్వామిని చూసి మైమరచి పోయి వుంటే, రాముడే స్వయంగా చందనము తీసుకొని తిలకము దిద్దుకొని, తులసీదాసుకు తిలకం దిద్ది వెళ్ళిపోతాడు.
చిత్రకూటములోని ఈ వింతలన్నీ తులసీదాసు తన జీవితచరిత్ర అయిన ‘వినయపత్రిక’లో రాసుకున్నారు. ఆయన చిత్రకూటము నుంచి వారాణాసి వచ్చి తన జీవిత చరమాంకం వరకూ వారణాసిలో వుండిపోయారు.
ఆ విధముగా ప్రజలకు అందుబాటులో ‘రామచరితమానస్’ వచ్చింది. 1073 దోహలలో వున్న ఈ అపూర్వ గ్రంథరాజము ప్రతి హైందవులకు పవిత్రపారాయణ గ్రంధం. నేటికీ ఉత్తర భారతములో ప్రతి దినమూ పారాయణముగా పఠించే గ్రంధమిది. ఈ గ్రంధము ద్వారానే రామకథ జనజీవిత భాగమైయ్యింది అన్నది అతిశయోక్తి కాదు. “తులసీ మానస మందిర్” వున్న చోటనే ఈ గ్రంధము రాశారని, దాని గుర్తుగా మానస మందిరమన్న దేవాలయము నిలిపారు. అందుకే ఆ గుడి గోడలకు రామచరితమానస్ చెక్కి వుంటుంది.
కుంభమేళా సమయాన తులసీదాసు సమాధి స్థితిలో 40 దోహాల “హనుమానుచాలీసా”ను రచించారు. నేటికీ భక్తుల పాలిటి కల్పవృక్షమది. ఎలాంటి కోరికైనా దీక్షగా ‘హనుమానుచాలీసా’ చదివినవారికి ఫలిస్తుంది. హనుమ ఇచ్చిన వరము ఇది. ‘సంకటమోచక హనుమాను, హనుమాను బాహు, వైరాగ్యసందీపిని, గీతావళీ, పార్వతీ మంగళము’ ఇత్యాది ఎన్నో రచనలు చేశారు తులసీదాసు.
అసీఘాటు ప్రక్కన ఆయన ఆశ్రమము వున్న ఘాటును ‘తులసీఘాట’ని ఆయన పేరుతో పిలుస్తారు. ఆ ఘాటులో ఆశ్రమము నిర్మంచుకొని తన చివరి క్షణము వరకూ వుండిపోయారు తులసీదాసు. నేటికీ అక్కడ తులసీదాసు కొలచిన ఆ హనుమంతుని కొలచినవారికి తీరని కోరికలు లేవని భక్తుల నమ్మకము. ఆ ఆశ్రమములో మనము తులసీదాసు వాడిన పాముకోళ్ళు, (మంచము) బల్ల, ఆయన కొలచిన రాములవారిని చూడవచ్చు.
తొంభై సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస వదిలిన ఈ పండితుడు, ధార్మికుడు, యుగకర్త, భక్తిని బహుళ వ్యాపకము చేసిన ఋషి. గంగమ్మ వడిలో కలిసిపోయినా, ఆయన రచనలు మాత్రము ఈ దేశ మట్టి మీద శాశ్వతముగా నిలిచిపోయాయి. రామకథ జన నాలుకల మీద నిలిపి, తను గంగమ్మలో జల సమాధి అయ్యారా భక్త తులసీదాసు.
ఆయన ఘాటును దర్శించి, ఆయనచే పూజింప బడిన రామస్వామినీ, హనుమను దర్శించగలగటము నా అదృష్టము. ఆయన చేతితో రాసిన రామచరిత మాత్రము చూడటానికి అనుమతి వుండాలని నిలువరించారు.
(సశేషం)