Site icon Sanchika

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-19

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

కీనారాం అఘోరీ బాబా ఆశ్రమము:

[dropcap]కొ[/dropcap]న్నిసార్లు మనకు తెలియకనే మనము గొప్ప ప్రదేశానికి వెళ్ళటమో, గొప్ప వ్యక్తులతో పరిచయాలో ఏర్పడటమో జరుగుతాయి. అది మనకు ముందు తెలియదు. తరువాత అర్థమవుతుంది ఏదో పూర్వజన్మ బంధం అని. అలా వారణాశిలో నాకు తెలియకుండా నేను ఒక గొప్ప ఆశ్రమానికి తీసుకుపోబడ్డాను. ఒకసారి కాదు రెండు సార్లు కాదు, పదేపదే. వారణాశిలో విశ్వనాథుని ప్రతిదినము దర్శించటము, గంగా దర్శనము హారతి తరువాత నేను ఎక్కువగా దర్శించిన ఆశ్రమము కూడా ఇదే. అది శ్రీ బాబా కీనారామ్ ఆశ్రమము.

దుర్గా గుడి నుంచి రామ్‌నగరు వైపు వెడుతుండగా నేను ఎక్కిన ఆటో అతను ఒకచోట ఆపి, ‘దీదీ! ఈ ఆశ్రమము చాలా శక్తివంతమైనది. దర్శించుకురండి’ అని చెప్పాడు.

నేను చెప్పులు బయట వదిలేసి లోపలకు నడిచాను. ఆ విశాలమైన గేటుకు ఇరువైపులా మూడు అటు మూడు ఇటు పుర్రెలు బొమ్మలు అలంకారార్థం వున్నాయి.

ఏమిటి ఇది? అని అనిపించింది.

‘ఇది అఘోరీ బాబా ఆశ్రమము’ అన్నాడు గేటు దగ్గర వున్నతను.

లోపల పెద్ద భవనము. ప్రక్కనే తటాకము. పెద్ద పెద్ద చెట్లు. పెద్ద షెడ్డు వున్నాయి. ఆ భవనము దగ్గరకు ముందరే ధుని వుంది. భవంతి వద్దకు వెళ్ళే కొద్ది ఏదో శక్తి బలంగా లాగుతోంది. విచిత్రంగా అనిపించింది. సాంబ్రాణి వెలిగించి అక్కడ వుంచుతున్నారు భక్తులు.

శక్తివంతమైన ఆ ప్రదేశము, ఆ ధుని దగ్గర నేను కొద్దిసేపు మాత్రమే వున్నాను. వుండిపోవాలన్న తపన. అక్కడే కళ్ళు మూసుకు కూర్చోవాలన్న ఆకాంక్ష. కాని నేను ఆ రోజు చూడాలకున్న ప్రదేశాలు పూర్తి చెయ్యాలని బయటకు వచ్చాను.

ఆ ఆశ్రమములో శక్తి నన్ను వదలలేదు. నేను రెండు రోజుల తరువాత అక్కడికనే బయలుదేరి వెళ్ళాను. ఆ రోజు ఆశ్రమ వివరాలు తెలుసుకున్నా. ఎంతో సేపు అక్కడ ధ్యానము చేశాను కూడా.

బాబా కీనారాం 1601 లో వారణాశికి దగ్గరలో ఒక పల్లెలో జన్మించారు. తల్లితండ్రులకు పిల్లలు లేరు. ఈయన లేకలేక కలిగిన సంతానము. పుట్టిన వెంటనే శిశువు ఏడవలేదు. చప్పుడు చెయ్యలేదు. మూడవనాడు ముగ్గురు సాధువులు వచ్చి ఎత్తుకుంటే ఆయన మొదటిసారి ఏడ్చాడు. ఆయన స్వయంగా శివుని అవతారమని భక్తుల నమ్మకము.

బాబా కీనారాం తన ఆధ్యాత్మిక ప్రయాణము ‘హింజెలుమాతా‘ ఆలయము నుంచి మొదలుపెడతారు. అఘోరీలు అంటే, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, సర్వం సమాజానికి అందిస్తూ, తన చుట్టూ వున్న సమాజపు సేవ చేస్తూ వుండటము. అఘోరీలంటే సాక్షాత్తు పరమశివుని అంశమని నమ్మకము.

కీనారాం బాబా వారణాశి చేరి, అక్కడ కీనారాం సంతల్ అన్న ఆశ్రమము నిర్మించి ప్రజలకు సేవ చేస్తారు. సనాతన ధర్మాన్ని తిరిగి నెలకొల్పుతారు.

అఘోరీ కల్టు మొదలు పెట్టినది ఈ బాబా అనే అంటారు. అఘోరీల గురించి నానా రకాలైన అపోహలు ప్రజలలో వున్నాయి. అవి సత్యదూరమంటారు ఆశ్రమములో. ‘వివేకసారం’ అన్న గ్రంధంలో అఘోరీల నియమావళి గురించి వివరించి చెబుతారు బాబా. ఆ గ్రంథం నేటికీ ప్రామాణికమైన గ్రంథం.

అఘోరీలు నా అన్న వారు లేకుండా, సమాజమే తన కుటుంబములా వుంటారు. వారు ఒక కౌపీనము మాత్రమే ధరించి, శరీరముపై మమకారము లేక, శరీరమన్నది పరమాత్మను చేరటానికి వాహనమన్న స్పృహతో వుంటారు. దేనిన్నీ అసహ్యయించుకోరు. సర్వమందూ పరమశివుని సదా దర్శిస్తూ ఆత్మానందములో వుంటారు.

వారణాశిలో నెలకొన్న ఆశ్రమము పరమ శక్తివంతమైనది. జబ్బులతో దీర్ఘరోగాలతో వున్నవారు ఆ ఆశ్రమానికి వచ్చి అక్కడి కుండములో వారాని రెండు సార్లు చొప్పున స్నానం చేస్తారు. అలా ఐదు వారాలు చేస్తే ఎలాంటి రోగమైనా తగ్గుతుందిట. అలా స్నానానికి వెళ్ళి వచ్చిన తరువాత వారి వస్త్రాలను అక్కడే వదిలేస్తారు.

చాలా శక్తివంతమైన ఆ కుండములో నీటితోనే ప్రోక్షణ మాత్రము చేసుకున్నాను. గ్రహ పీడ బాధలతో వున్నవారు ఆ ఆశ్రమములో నిద్ర చేస్తారు. నేను మొదట చూసిన షెడ్డు వచ్చిన భక్తులు పడుకోవటానికి.

కీనారాం బాబా 170 సంవత్సరాలు జీవించి, ఇచ్ఛా మరణము తీసుకున్నారు. ఆ బాబా గురు పరంపరలో 11 వ గురువుగా మళ్ళీ వస్తానని బాబా చెప్పారుట. ప్రస్తుతం వున్న బాబా 11 వ గురువు.

కీనారాం బాబా ప్రజలకు అందించిన సేవ అపూర్వము. ఆయన ఇచ్ఛామరణం తరువాత ఆయనను హింజెలు మాతా యంత్రం తో కలిపి ఆశ్రమములో సమాధి చేశారు. ఆయన వెలిగించిన ధుని నేటికీ వున్నది. అక్కడ ఫోటోలు తీయ్యటము నేరము. కాని కొన్ని ఫోటోలు ఇంటర్‌నెటులో వున్నాయి.

ఆ ఆశ్రమములో జరిగే ఉత్సవాలలో ప్రజలు మత భేదం లేకుండా పాల్గొంటారు. నేటికీ దీర్ఘరోగాలు కలవారు, శాంతి కోసము వెతుక్కునేవారు ఆ ఆశ్రమానికి వస్తూ వుంటారు. నేను రెండవసారి వెళ్ళినప్పుడు సమాధి మందిరము తెరచే వున్నది. నేను అగరుబత్తులు వెలిగించి, అక్కడ పెట్టి ధ్యాన నిమగ్నమయ్యాను. అక్కడ వున్న బాబా విభూది నాకు కొంత ఇచ్చారు. నేను కాశీలో చాలా జబ్బు పడ్డప్పుడు ఆ విభూధిని నుదుటన ధరించి, నీళ్ళలో కలుపుకు త్రాగాను.

నన్ను పదే పదే లాగిన ఆ శక్తిని మరువలేను. నేను ఆ శక్తికి వందనాలర్పించి, నాకు తోచిన డొనేషను కట్టి, అక్కడ్నుంచి నా బసకు తిరిగి వచ్చాను.

Exit mobile version