[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
మా ధూళిదర్శనము ప్రత్యక్షముగా అవనందుకు నేను దర్శనానికి ఉదయము 4 గంటలకు వెళ్ళాను ఒంటరిగా. భక్తులు 10 మంది వున్నారు అంతే. లైను చాలా కురచగా వుంది. స్వామికి మనసారా పాలతో అభిషేకము చేసి అక్కడే కూర్చొని కొంత జపము ధ్యానము చేసుకున్నాను.
ఏడు గంటల సమయములో గది చేరితే అక్కావాళ్ళు కూడా రకరకాల గుడులకు చకచకా వెళ్ళి దర్శనాలు టకటకా పూర్తి చేసుకొని వచ్చారు. కాశీలో ఉదయము నాలుగు నుంచి ఆరు లోపల దర్శనాలు ఉత్తమము. మధ్యాహ్న హారతి సాయంత్రాలు దర్శనాలు బహు ఇబ్బంది. తొక్కిడి రాపిడిలతో పాటు దేవుడి దగ్గర నిలబడనియ్యరు. తరిమేస్తారు. మళ్ళీ మధ్యాహ్నాము రెండు నుంచి నాలుగు వరకూ పరమ శాంతం. హాయిగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు.
ఇది నే రెండు రోజులు వివిధ సమయాలలో దర్శించి కనిపెట్టిన విషయము.
గదికి అంతా చేరాము. ఇక ఆ రోజు గంగా ఘాట్ల సందర్శనము, సారనాథ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.
చిన్నక్క కూతురు కాశీలో చూడవలసిన ప్రదేశాల లిస్టు పట్టుకొచ్చింది. దాని లిస్టు ప్రకారముగా మేము ఘాటులు చూసి తరించాలి. సరే పదమని నలుగురము కలసి బయలుదేరుతుంటే, ఒక గైడు తగులుకున్నాడు. పదిహేను వందలన్నాడు. కోటీలో చేసే బేరములా అక్క గీచి గీచి బేరమాడింది. చివరకు వెయ్యికి కుదిరింది బేరము, మోటరుబోటులో ఘాట్లు అన్నీ చూపటానికి. మాతో గంగ వడ్డు వరకూ వచ్చి ఒక బోటులో ఎక్కించాడు అతను. బోటులో మా హడావిడి మాది, బోటు నడిపే అతని ఘోష అతనిదిగా సాగింది కొంత తడవు.
ఎండు కొబ్బరి చిప్పలు, నెయ్యిలో నానవేసిన వత్తులు, పసుపు కుంకుమ సామాగ్రి అంతా తీసింది చిన్నక్కగారు. మా చిన్నప్పుడు కార్తీకమాసము నదీ స్నానమని నాన్న మమ్ములను కృష్ణా తీరము తీసుకుపోతే అమ్మ ఇలా కార్తీకదీపాలు వెలిగించేదని తలచుకున్నాము. ఆ అనుభవముతో ఇవ్వన్నీ తెచ్చాను అంది తను. తను తెచ్చిన దీపాలను వెలిగించి అలా కార్తీకదీపాలు వదిలాము నలుగురము. చిన్నపిల్ల(అక్క కూతురు) వింత ఫోజులలో ఫోటోలు తీయించుకుంది. నలుగురము కలసి విడిగా ఇలా కాసేపు మా ఫోటోలతో హడావిడి పడి, చాల్లే అనుకొని నదినీ, ఆ సౌందర్యాని, గైడు చెప్పేది వింటూ గడిపాము మిగిలిన ఆ అరగంటా.
గంగా ఘాట్లు వారణాసిలో వున్న చాలా ముఖ్యమైన ఆకర్షణ. 86 ఘాట్లతో, దాదాపు 6 కి.మీ. గంగ వడ్డున పురాతనమైన కట్టడాలతో, ఎంతో చరిత్రను, ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తూ ఎంతో ఉన్నతముగా నిలువెత్తుగా నిలబడే ఆ ఘాట్ల సౌందర్యము చూసి తీరవలసినదే కాని వర్ణించటము ఎవరికీ సాధ్యము కాదు. మేము దశాశ్వమేథ ఘాట్‌లో బోటు ఎక్కాము. బోటు నడిపే అతను హరిశ్చంద్ర ఘాటు వరకూ తీసుకుపోయి, ఆసీ ఘాటులో వెనకకు త్రిప్పి, ఇటు పంచగంగా ఘాటు వరకూ తీసుకుపోయి మళ్ళీ ఎక్కినచోటే దింపాడు.
హరిశ్చంద్ర ఘాటును చూసినప్పుడు మన పాత తెలుగు సినిమాలు, హరిశ్చంద్ర పద్యాలు గుర్తుకువచ్చాయి. హరిశ్చంద్రుడు సత్యము కోసం రాజ్యాన్నీ, భార్యను కొడుకుని కోల్పోయి చివరకు ఈ గంగా వడ్డున వున్న శ్మశానానికి కాపరిగా వచ్చిన గుర్తుగా ఈ శ్మశానానికి, ఘూటుకీ ఆయన పేరు పెట్టి గౌరవించారు. సత్యం విలువ వేనోళ్ళ కీర్తించే ఆ గాథను తలుచుకు భావోద్రేకము కలిగింది.
గంగ మీద హరిశ్చంద్ర ఘాటు కాకుండా శ్మశానము వున్న మరో ఘాటు మణికర్ణిక ఘాటు. ఈ ఘాటు చాలా ప్రత్యేకమైనది. శివునకు ముఖ్యమైనది. దీనికి వెనక రకరకాల కథలు వున్నాయి. శివ పార్వతులు ఆ ఘాటులో స్నానమాడుతుంటే అమ్మ వారి చెవిదుద్దు అక్కడ పడిపోయిందట. శివుడు ఆ దుద్దుకై అక్కడే వెతుకుతూ వుంటాడని, కాశీలో మరణించి మణికర్ణికలో అంత్యక్రియలు పొందిన ఆత్మలను ఆయన మోక్షము ఇచ్చి తనలో కలుపుకుంటాడని అంటారు. పార్వతి దేవే ఆ దుద్దు దాచి స్వామిని అక్కడ వుండి జనులకు ముక్తి నిచ్చే ఏర్పాటు చేసిందని మరో కథనము. మరో కథ ప్రకారము అమ్మవారి దుద్దు గురించి అక్కడ వున్న ప్రజలను అడిగితే వారు తెలిసీ కూడా తెలియదని చెప్పారని, వారిని చండాలురుగా, కాటి కాపరులుగా మారిపోమ్మని శివుడు శాపమిచ్చాడట. వారి బాధ చూసి దయాసముద్రుడైన శివుడు వారికి ఈ శాపమే వరముగా మార్చి వారి చేత కాల్చపడిన శరీరపు తాలూకు ఆత్మలకు ముక్తి ప్రసాదిస్తానని వరమిచ్చాడట.
ఆ విధముగా వారు కాటికాపరులై మణికర్ణికకు యజమానులుగా మెసలుతున్నారు. ప్రతి దహనానికి పైన పెట్టే ఐదు దుంగలు వీరే పెడతారు. వీరి ఇంటి వంట చెరుకు, నిప్పు మణికర్ణిక నుంచి రావాలి. ఆ నిప్పు మీదే వీరి వంట పూర్తి చేస్తారు. అదే అందరూ తిన్నాలి. వీరిది వంశపారపర్యపు వృత్తి. వీరిని ‘కాశీ దోన్‌రాజా’ అంటారు. వీరికి చాలా గౌరవము వుంది. వీరు మోక్షపు ద్వారపు కాపలి అని ఇక్కడ వారి నమ్మకము.
మణికర్ణికలో ఎప్పుడూ నిప్పు రగులుతూనే వుంటుందని శివుని మాట. అందుకే అక్కడ ఎలాంటి సమయములోనైనా కనీసముగా మూడు శవాలు కాలుతూ వుంటాయి.
ప్రతిరోజూ దాదాపు 60 శవాలు కాలుతాయి అక్కడ.
అమ్మవారి చెవి దుద్దు పోయింది కాబట్టి ఆ ఘాటును మణికర్ణికా ఘాటు అన్నారు.
ఆ శ్మశానము ప్రక్కనే భక్తులు తండోపతండాలుగా వచ్చి పవిత్రస్నానాలు చేస్తారు. గంగకు అర్చనము, తర్పణము, దానము, పెద్దలకు పిండ ప్రదానము అక్కడే చేసుకుంటారు. ఎక్కడ ఒడ్డుకు చేరినా మణికర్ణికా ఘాటుకు బోటులో వచ్చి మునిగి, ఈ కార్యక్రమాలు చేసికొని వెడతారు. నేను కాశీలో మొదట వచ్చినప్పుడు ఆ ఘాటులోనే మూడు మునకలూ వేశాను.
కాశీలో మరో ముఖ్యమైన ఘాటు ఆసీ ఘాటు. రోజు ఇక్కడ కూడా హరతి జరుగుతుంది. ఎంతో విశాలముగా వుంటుంది ఈ ఘాటు. మెట్లు ఈ ఘాటులో చాలా వీలుగా వుంటాయి. ఆసి ఘాటు కాక, కాశీలో ప్రతి ఘాటులో మెట్లు మోకాళ్ళ ఎత్తులో ఎంతో ఇబ్బంది కలిగిస్తూ వుంటాయి. నాకు అర్థము కానిదేమిటంటే, పెద్దవాళ్ళు, కాళ్ళూ కీళ్ళూ పట్టేసే వాళ్ళు, కాశీలో గంగా స్నానము ఎలా చేస్తారో అని. ఆ మెట్లు, మోకాళ్ళ పర్వతాన్ని తలపిస్తాయి. అసీ ఘాటులో నయముగా వుంటాయి. దిగటము ఎక్కటము రెండూ కొద్దిగా తేలిక మిగిలిన వాటితో పోలిస్తే.
ప్రతీ ఘాటులో ఎన్నో పవిత్ర దేవాలయాలు, వాటి చరిత్ర వుంది. వాటి గురించి నేను సందర్శించిన దేవాలయాలతో పాటు వివరిస్తా.
ప్రేమ్‌చందు నవల రాసిన ముషి పేరున ఒక ఘాటు వుంది.
కేదారు ఘాటులో కేదారేశ్వరుడు నీళ్ళ నుంచి ఉద్భవించాడని ప్రతీతి. ఈ ఈశ్వరుడు ఇక్కడ అర్ధనారీశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. కాశీ లోని పంచలింగాలలో ఈ కేదారేశ్వరుడు ఒకరు. గుడి లోంచే ఘాటుకు మెట్లు. ఈ ఘాటు చాలా శుబ్రంగా వుంటుందని కూడా ప్రతీక. ఇక్కడ తెలుగువారు చాలా మంది వుంటారుట. అందుకే అక్కడ మినీ ఆంధ్రా అంటారు. కాని తమిళ భాషలో గుడి మీద పేర్లు, తమిళ భాషతో మాట ఎక్కువ.
ఇలా ఘాట్ల గురించి కబుర్లతో మాటల మధ్యన తెలుగువారికే ఏ ఘాటు లేదు అన్నాడు బోటు నడిపిన అతను. విజయనగర రాజులు మావారే అంటూ మేము బుకాయించామనుకోండి. అతను పట్టించుకలేదు. తన డాటా బేసులో కరెక్షను చేసుకోలేదు. మాట మార్చి చిరంజీవి సినిమా ఇక్కడే తీశారు అంటూ ఇంకో సమాచారము అందించాడు. చరిత్రకు తప్ప చిత్రాల మీద నాకు మక్కవలేదు పొమ్మన్నాను. అక్క మాత్రం ‘ఆ చిత్రమూ చరిత్రే లేవే!’ అంటూ నవ్వింది.
గంగ మీద నౌకా విహరము సూర్యోదయము కన్నా ముందు చాలా బావుంటుంది. సూర్యోదయము గంగ మీద చూడటము గొప్ప అనుభూతి. ఉదయభానుని బంగారు రేకులలో గంగ ప్రతిబింబించే రంగులు ఏ కెమెరాకు అందవు. మానసనేత్రంకు తప్ప. అందుకే చాలా మంది ఉదయము ఐదు గంటలకు గంగవడ్డున చేరుతారు నౌకలో తిరగాడటానికి. ముఖ్యంగా విదేశీ యాత్రికులను మనము ఆ సమయములో చాలా చూడవచ్చు. అసలు ఏ సమయమైనా ఈ విదేశీ యాత్రికులు, వారితో ఎలాగైనా ఏదోటి కొనిపించాలనే తాపత్రయపడే వీధి దుకాణపుదారులు కోకొల్లలు కాశీ పుర వీధులలో.
నలుభై నిముషాలు గంగ మీద నౌకావిహారము అయ్యాక తిరిగి గట్టుకు చేరి ఒక ‘ఓలా’ను పిలుచుకొని సారనాథ్‌కు బయలుచేరాము.
(సశేషం)