[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
లాల్‌బహుదూర్ శాస్త్రి మ్యూజియం:
[dropcap]రా[/dropcap]మ్‌నగర్‌లో తప్పక దర్శించవలసిన మరో ప్రదేశం లాల్‌బహుదుర్ శాస్త్రి మ్యూజియం. శ్రీ శాస్త్రి రామ్‌నగరులో వుండి చదువుకొని, తన రాజకీయ ప్రస్థానము మొదలుబెట్టిన చోటు. అక్కడ ఆయన ఇల్లు వుంది. ఆ ఇల్లే నేడు మ్యూజియంగా మార్చారు. దానిని కొందరు శాస్త్రిగారి అనునాయులు నడుపుతున్నారు.
వారణాశిలో చదువుకు ప్రతిరోజూ కాలి నడకన వెళ్ళుతూవుండేవారు. అలా ఎన్నో మైళ్ళు నడచి వెళ్ళి చదువుకున్నారు. గంగానది దాటటానికి 25 పైసలు లేకపోయినా, నది పడవల వంతెన మునిగిపోయినా ఈదుతూ వెళ్ళేవారట బడికి. చదివే రోజులలో కామేశ్వర మిశ్రా అన్న టీచరు శాస్త్రిగారికి ఎంతో సాయం చేసేవారు. వారి మూలంగా శాస్త్రీజీకి స్వాతంత్ర్య పోరాటముపై, రాజకీయాలపై మక్కువ ఏర్పడ్డాయి.
ఆయన కాలేజీలో వుండగా స్వాతంత్ర్య పోరాటము నిరాకరణోద్యమములో భాగముగా బ్రిటిష్ కాలేజీ వదిలి అప్పుడే స్థాపించిన హిందూ కళాశాలలో చేరి డిగ్రి విద్య పట్టా పొందుతారు. స్వాంతంత్రం తరువాత కాంగ్రెస్సు పార్టిలో వర్కింగు సెక్రట్రీ నుంచి క్యాబినెటు మినిష్టరుగా పదోన్నతి పొందారు. తాను నమ్మిన సూత్రాలకు కట్టుబడ్డ నిజాయితివాది. గాంధీ సూత్రాలను నమ్మిన గాంధేయవాది. నిజాయితీ పరుడు. భారతదేశము గర్వించతగ్గ మణిపూస. రెండవ ప్రధానిగా ఎన్నిక జరిగిన తరువాత ఆయన శాంతి చర్చలకు వెళ్ళి అనుమానస్పద పరిస్థితులలో మరణించటము దురదృష్టము.
వారణాసిలో ఆయన గృహము చాలా చిన్న ఇల్లు. ఒక గది, ప్రక్కన వంటగది. నేల మట్టినేల. చిన్న కిటికీలు. ఆ చిన్న ఇంట్లో ముగ్గురు పిల్లలతో, శాస్త్రి గారి అమ్మగారు వుండేవారు. శాస్త్రిజీకి లలిత శాస్త్రీతో వివాహమైనప్పుడు ఆయనకు కద్దరు దారము పెళ్ళి కానుకగా లభించిందట. అంతటి నిరాడంబరులు. వారి వివాహము తరువాత వారి ఇంటిలో పైన ఒక గది వేశారు.
వారి గృహము ప్రక్కన వున్న చిన్న ఇళ్ళు మారిపోయాయిట స్వాతంత్రం తరువాత. వారి ఇంటిలో శాస్త్రీజీ చిన్ననాటి నుంచి వున్న ముసలి నౌకరు ఈ ఇంటిని కూడా మారుస్తారా? అని శాస్త్రీజీని అడిగితే, శాస్త్రీజీ వప్పుకోలేదట. అందుకే వారు నివసించిన గృహము రూపురేఖలు నేటికీ వాటిని మార్చలేదు. ముందర రెండు గదులు వేశారు. అందులో ఒక పడకగది. లలితా శాస్త్రీ వున్నంతకాలము ఆమె వుండేవారట. మనము శాస్త్రీజీ వాడిన పెట్టె, వాళ్ళ మంచము, ఆమె పూజా సామాను, రామాయణ గ్రంథం చూడవచ్చు.
ఆ ముందర హాలులో శాస్త్రీజీ నిలువెత్తు చిత్రాలు అమర్చారు. ప్రక్కన ఆఫీసు గది. ప్రక్కనే ఆయన మనకు అందించిన స్లోగన్ ‘జై జవాన్, జై కిసాన్’ ఆ గుర్తులు స్తూపము వున్నాయి.
వాలంటీర్లతో నడిపే ఆ గృహానికి ప్రభుత్వ సాయం లేదని చెప్పారు. జాతికి సేవచేసిన మహానుభావులను జయంతి వర్ధంతులలో మాత్రమే కాకుండా, వారు చెప్పిన భావాలను ఆదర్శాలను ముందు తరాలకు అంద చెయ్యవలసిన భాద్యత మనకుంది కదూ అని అనిపించింది. ప్రభుత్వం ఇలాంటివి ఎప్పుడు పట్టించుకుంటుంది?
నాకు తోచినది అక్కడి వారికిచ్చి, గెస్టుల పుస్తకములో నా మాటలు రాసి, శాస్త్రిజీకి మౌనముగా నా నివాళ్ళు సమర్పించి బసకు వెనుతిరిగాను.
(సశేషం)