Site icon Sanchika

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 22

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

శ్యామాచరణ లాహిరీ:

మిత్రులు నాకు గుర్తు చేశారు లాహిరీ మహశయ సమాధి దర్శించమని.

నేను ఒక మధ్యాహ్నము దశాశ్వఘాటు గుండా బయలుచేరి వెతుకుతూ సాగాను. వారి సమాధి మందిరము దర్శించటానికి. శ్యామాచరణ లాహిరీ మహాశయుల గురించి చెప్పటమంటే గంగా నది పవిత్రం కొలిచే ప్రయత్నమే!

ప్రతి క్రియాయోగ సాధన చేసే సాధకుల‌కు లాహిరీ మహాశయ మహా గురువులు.

సంసారములో వుంటూ, సంసారానికి అంటక జీవితాన్ని పండించుకోవచ్చని ప్రత్యక్షంగా చూపిన గురువులు శ్రీ లాహిరీ మహాశయ. వారు వారణాసిలో వుంటూ సామాన్యమైన సంసార జీవితము గడుపుతూ ఎందరికో క్రియను బోధించి, క్రియ ద్వారా మోక్షం పొందొచ్చని నిరూపించారు.

శ్రీ మహావతార్‌ బాబాజీకి ప్రత్యక్ష శిష్యులు లాహిరీ మహాశయ. వీరినే యోగిరాజు అని భక్తులు కొలుస్తారు. లుబ్దమైన యోగ మార్గాన్ని పునరుద్ధరించి ప్రజలను యోగ మార్గములోకి మరల్చటానికి యోగిరాజుగా, ‘పూర్ణ యోగావతారము’గా పరమాత్మ అవతరించాడు. జ్ఞానులకు, సన్యాసులకు మాత్రమే మోక్షము సాధ్యమని, సంసారులకు అది దుర్బలమన్న మాట వొట్టి భ్రమ – అని తెలియచెయ్యటానికి యోగిరాజు లాహిరీ మహాశయగా పరమాత్మ వేంచేశారు.

పరిపూర్ణమైన ఆత్మానందములో సదా మునిగి తమను ఆశ్రయించిన శిష్యులను పరిపూర్ణులుగా చేసేవారు యోగిరాజులు.

‘శ్యామాచరణ లాహిరీ’ బెంగాలు లోని ‘గుర్ని’ గ్రామములో సనాతన బ్రాహ్మణ కుటుంబములో 1828వ సంవత్సరములో జన్మించారు. ఆయన బాలునిగా వుండగానే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమందే కుటుంబము వారణాసికి బదిలి అయ్యింది. ఆయన విద్యాభ్యాసము సంస్కృత కళాశాలలో సాగింది. ఉర్దూ, బెంగాలీ, సంస్కృతము, ఫ్రెంచ్, ఆంగ్లముతో పాటు వేదాలు కూడా అభ్యసించారు.

’కాశీమోని’తో యోగిరాజులకు వివాహము జరుగుతుంది. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలుగుతారు.

ఆయన తన ఉద్యోగములో భాగముగా 1861 లో రాణీకేత్‌కు బదిలీ చెయ్యబడతారు. అక్కడకు వెళ్ళటము వారికి అసలు ఇష్టంగా వుండదు. కాని తప్పక వెళ్ళి అక్కడ కొంత కాలము వుండి మళ్ళీ జాబు మార్చుకోవాలనే ఉద్దేశముతో రాణీకేత్‌కు వెళ్ళి చేరుతారు.

సామాన్యముగా రోజులు సాగుతూ వుంటాయి. లాహిరీ మహాశయ కుటుంబము వారణాసిలోనే వుంటుంది. లాహిరీ ఒక్కరే రాణీకేత్‌లో వుంటారు. ఒక నాటి సాయంత్రము వ్యాహళికి వెడుతూవుంటే ఆయనను వెనక నుంచి ఎవరో పిలుస్తారు. ఎవరో అని తిరిగి చూస్తే అర్థము కాదు. పిలిచినవారు ఆయనను రమ్మనమని కొండలలోకి తీసుకుపోతారు. అక్కడ ఒక గుహ చూపి ‘ఏమైనా గుర్తువచ్చిందా’ అని అడుగుతారు. ‘లేద’ని సమాధానము చెబుతారు లాహిరీ మహాశయ. ఆయన లాహిరీ మహాశయ తలపై చెయ్యి పెడతారు. వెయ్యి విద్యుద్ఘాతము తగిలినట్లు అవుతుంది లాహిరీకి. ఆయనలో పూర్వపు స్మృతులు మేలుకుంటాయి. తన ఎదురుగా వున్నది తన గురుదేవులు మహావతార్ బాబాజీ అన్న విషయము తెలుస్తుంది. బాబాజీ కావాలనే లాహిరీ మహాశయను రాణీకేత్‌కు పిలిపిస్తారు.

ఆయన తన గురువును కలిసి క్షణమున గురువు అయిన బాబాజీ లాహిరీ మహాశయను ఆ కొండ చెరియ మీద నుంచి క్రిందికి దుమకమంటారు. మరో ప్రశ్న లేక లాహిరీ దూకేస్తారు. కొంత సేపటికి గురువు ముందు మెలుకువ వస్తుంది లాహిరీకి.

తరువాత బాబాజీ ఆయనకు క్రియా యోగము బోధిస్తారు. ప్రపంచములో ప్రజల కష్టాలకు సమాధానము క్రియ ఒక్కటే అని చెబుతారు బాబాజీ.

ఈ అపూర్వ విద్యను వ్యాప్తిచెయ్యమని లాహిరీ మహాశయకు చెప్పి, తనను పిలిచినప్పుడు కనపడుతానని చెబుతారు బాబాజీ.

క్రియ విద్యను ఆనాటి నుంచి లాహిరీ మహాశయులు ఎందరో భక్తులకు నేర్పుతారు. భార్య మొదట యోగిరాజులను అర్థము చేసుకోదు. తరువాత ఆమె కూడా ఆయన శిష్య పరంపరలో ఒకరుగా మారుతారు. లాహిరీ మహాశయ భార్యకు ఒకనాటి రాత్రి మెలుకువ వస్తుంది. కళ్ళు తెరచి చూస్తే యోగిరాజులు పద్మాసనములో గాలిలో తేలుతూ ధ్యానములో వుంటారు. ఆమె చూసి భయపడి కెవ్వు మంటుంది. లాహిరీ మహాశయ ఆనాటి నుంచి మళ్ళీ ఎప్పుడూ ఆ గదిలో పడుకోరు. మేడ మీద గదిలో వుండే మరో గదిలో నివసించారు.

యోగిరాజులు ఎందరికో క్రియను బోధించారు. వారి శిష్యులలో భేదభావము చూపలేదు. కుల మతాలకు అతీతముగా ఎందరో లాహిరీ మహాశయ వద్ద క్రియాయోగము తీసుకున్నారు. ఆనాటి కాల మాన పరిస్థితులలో అది ఒక గొప్ప విప్లవము.

లాహిరీమహాశయ నిశ్చల సమాధిలోవుండగా వారి నాడి కొట్టుకోవటము కూడా ఆపివేశేవారు. ఆయన మేనల్లుడైన డాక్టరు ఆ విషయము గమనించి భయపడితే, యోగములో అది సాధ్యమేనని సర్ది చెబుతారు. ఒక సమయాన యోగిరాజులను చూడటానికి వచ్చే ప్రజలకు ఆయన కనపడలేదని గాలిలో తేలి కూర్చొని అందరికి దర్శనమిచ్చారు.

యోగిరాజులను నమ్మిన భక్తులకు వారి నమ్మకమే కాపాడుతుందని వేరు వేరు సందర్భాలలో నిరూపించారు. ఆయన శిష్యులలో ఒక పేద శిష్యుని భార్యకు కలరా సోకుతుంది. రక్షించమని వేడుకుంటాడు శిష్యుడు.

‘చెప్పినది చేస్తావా?’ అని అడుగుతారు యోగిరాజులు.

‘సరే’ అంటాడు శిష్యుడు.

సువాసననీరు తెమ్మని చెప్పి అందులో మూత్రం కలిపి పట్టమంటారు యోగిరాజులు.

శిష్యుడు అలానే చేసి భార్యను కాపాడుకుంటాడు. ఇందులో యోగిరాజుల మాట మీద గురి తప్ప వైద్యము లేదు. భక్తితో చేర వచ్చిన శిష్యులకు క్రియ తప్పక చెయ్యమని చెబుతారు ఆయన.

ఆయన కుమార్తె మరణించిన సందర్భములో భార్య దుఃఖిస్తూ బ్రతికించనందుకు యోగిరాజులను కోపగించుకుంటుంది. కర్మలను అనుసరించాలని భోదిస్తారు కాని బాధ చూపరు యోగిరాజులు. సంసారములో వుంటూ తామరాకుపై నీటి బొట్టులా మెసలిన యోగిరాజులు సంసారులు ఎలా వుండాలో చూపారన్నటానికి ఇది ఉదాహారణ.

ఒక సందర్భములో ఒక ఫోటోగ్రాఫరు ఫోటో తీయ్యటానికి ప్రయత్నిస్తే ఏమీరాదు. అతను యోగిరాజును ప్రాధేయపడితే ఒక్క ఫోటో మాత్రము తీయగలుగుతాడు. అదే మనకు నేడు లభ్యమవుతున్నది.

   

పంచను భట్టాచార్య, శ్రీ యుక్తేశ్వర్ గిరి, స్వామీ ప్రణబానందా, భూపేంద్రనాథ్ సన్యాల్ వంటి ఎందరో శిష్యులు ఆయన భోదించిన విద్యను వ్యాప్తి చేశారు. ఆయన శిష్యులు ఎందరో తరువాత ఈ క్రియ పరంపరను కొనసాగిస్తున్నారు.

ఆయన తన ప్రతి రోజు క్రియ అనుభవాలను లిఖించి బెంగాలీ డైరీలలో తర్జుమా చేసి ప్రచురించటానికి తన శిష్యులైన పంచానన భట్టాచార్యుకు మాత్రమే అనుమతినిచ్చారు. ఆ డైరీలలో ఆయన వద్ద క్రియ విద్యను పొందిన మహానుభావులలో శ్రీ షిరిడీ సాయి ఒకరని ‘పురాణపురుష’ లో చెబుతారు. ఎన్నో వారి లీలలు మనకు ఆ గ్రంథంలో లభ్యమవుతున్నాయి. పరమహంస యోగానంద ‘యోగి ఆత్మకథ’ లో కూడా లాహిరీ మహాశయ గురించి ప్రసక్తి వుంది.

యోగిరాజు భోదనలలో ముఖ్యముగా క్రియ ద్వారా పరమ సత్యమును ఎలా తెలుసుకోవచ్చునో చెబుతారు.

‘ఏదో రోజు మనము సర్వము వదిలి వెళ్ళిపోవాలి. అందుకే బ్రతికివుండగానే పరమాత్మతో సంబంధము ఏర్పరుచుకుంటే, మరణాంతరము పనికి వస్తుంద’ని చెప్పేవారు.

‘భగవంతునితో నిజ సంబంధాన్ని కలగచేసేది క్రియ మాత్రమే’.

‘రోజూవారి జీవితములో ఆటుపోటులకు కృంగవలదు. సదా పరమాత్మతో అనుసంధాన పరచుకుంటే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. క్రియా యోగం ద్వారా ఆ సంబంధము సాధ్యము’.

గురుశిష్య పరంపరలో తప్ప ఈ క్రియా యోగ ఎవ్వరూ ఎవ్వరికి భోదించరాదని లాహిరీ మహాశయ నొక్కి వక్కాణించేవారు. ఆ సూత్రము నేటికి క్రియా యోగులు పాటిస్తారు. క్రియను గురువు చెప్పినట్లుగా పాటించమని, గురువు మీద నమ్మకముతో వుండమని చెప్పేవారు యోగిరాజులు.

యోగిరాజులకు తన శిష్యులతో ప్రత్యేకమైన సంబంధము వుండేది. వారికి కావలసినది వారికి అందించేవారు గురుదేవులు.

సత్యమును పాటించమని, ఇంద్రియ నిగ్రహము ముఖ్యమని చెప్పేవారు. అంతేకాదు మానవులకు వారి వ్యక్తిగత నిబద్ధత ఎంతో ముఖ్యమైనదని, దానికై సదా జాగరూకతతో వుండాలని కూడా చెప్పేవారు.

ఆయన తన అవతార సమాప్తికి ముందుగానే శిష్యులకు చెప్పి అందరి సమక్షంలో తన శరీరాన్ని వదిలివేశారు.

హిందు పద్ధతిలో మణికర్ణికలో దహనము చేసి, అస్థికలతో సమాధి నిర్మించారు శిష్యులు. వారణాసిలోని చౌచష్ఠి గాటుకు దగ్గరలో ‘సత్యలోక్’ అన్న దేవాలయములో ఆ సమాధిని మనము దర్శించవచ్చు. వారు నివసించిన గృహము ఆ మందిరముకు దగ్గరగా వుంటుంది. అది ఎప్పుడూ మూసివేసే వుంటుంది. కేవలము గురుపూర్ణిమకు భక్తుల కోసము తెరవబడుతుంది. నేను వారి గృహము ముందుర వున్న అరుగు మీద కూర్చొని వారిని నా ధ్యానములో నిలుపుకు కొంత తడువు ప్రార్థించాను. తరువాత ఆయన సమాధి వద్ద ధ్యానము చేసి బసకు మరలాను.

(సశేషం)

Exit mobile version