[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
బిర్లా టెంపుల్:
ఇది కాశీలో ప్రముఖ శివాలయాలలో ఒకటి. దేవాలయ గోడల మీద భగవద్గీతలోని శ్లోకాలతో నిండి వుంటుంది.
1930లో హిందూ విశ్వవిద్యాలయము నిర్మించిన మదన్ మోహన్ మాలవ్యా విద్యాలయ ప్రాంగణములో ఒక దేవాలయము నిర్మించాలని తలచారు. అంతకు పూర్వము ఎన్నో సార్లు కాశీవిశ్వనాథుని దేవాలయము ముట్టడికి గురైనది. అలాంటి ముంపుకు తావులేకుండా విశ్వవిద్యాలయము మధ్యలో విశాలముగా దేవాలయము నిర్మించాలని మాలవ్యా తలచారు. బిర్లా కుటుంబము పాలరాయితో నిర్మించటానికి ముందుకు వచ్చారు. బిర్లా వారు ఒక కమిటీగా ఏర్పడి పూర్తి పాలరాయితో, కాశి విశ్వనాథుని దేవాలయ మోడల్లో నిర్మించారు. ఇది నిర్మించటానికి 30 సంవత్సరములు పట్టింది.
నేను ఈ మహావిద్యాలయానికి రెండు సార్లు వెళ్ళాను. మొదటి సారి దేవాలయానికి చూడటానికి వెళ్ళాను. తరువాత యూనివర్సిటీలో గ్రంథాలయము చూడటానికే వెళ్ళాను. మొదటి సారి వెళ్ళినప్పుడు మూసి వుంది. రామ్‌నగర్ వెడుతూ ఇక్కడ ఆగి స్వామిని దర్శించి, గ్రంథాలయములో కొంత సేపు కూర్చొని వెళ్ళాను. దేవాలయములో మనసు శుద్ధి, గ్రంథాలయములో అజ్ఞానము శుద్ధితో హిందూ మహావిద్యాలయము సందర్శకులకు తప్పక నచ్చుతుంది. అక్కడ మనకు గంగ వడ్డున వున్న ఇరుకు సందులు, మురికి వుండవు. విశాలమైన రోడ్డు, ప్రశాంతమైన విద్యాలయ వాతావరణము, రాజసముగా నిలచి, చరిత్రను చెబుతూ, నిలబడ్డ ఆ భవనాలు మనలను ప్రశాంతచిత్తులుగా చేస్తాయి. దేవాలయము గేటు దాటగానే మనకు మదన్ మోహన్ మాలవ్యా విగ్రహము కనపడుతుంది. ఆయన విగ్రహము క్రింద వారు ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు చేసిన కృషి గురించి వుంటుంది. భారతీయులలో ఆత్మవిశ్వాసానికి ఆయన ముందుచూపుగా విద్య మీద దృష్టి నిలిపి మనలకు మొదటి సోపానముగా కట్టిన ఆ విద్యాలయానికీ, ఆయనకు వున్న ముందుచూపుకు నేను నమస్కారాలు సమర్పించాను.
(సశేషం)