Site icon Sanchika

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 25

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

కబీరు సమాధి:

[dropcap]వా[/dropcap]రణాసిలో నే తప్పక దర్శించాలని ఉబలాటపడినది మాత్రము కబీరు సమాధి మందిరము. అది కబీరు చౌసాలో వుందని తెలుసుకొని ఒక రోజు శివాలయములో నా అర్చన పూర్తిచేశాక వెతుకుతూ వెళ్ళాను.

“తీర్ధ యాత్రలకు ఫలమొకటి
సాధు సంగములకు నాలుగూ
సద్గురు సేవలకు ఫలము మనేకము
అదే సాధుల మతము కబీరా” (కబీరు దోహా)

కబీరు దోహలు ఒక్కటైనా రానివారు వుండరు. కబీరు 15వ శతాబ్ధపు కవి, సాధు సంత్‌. నికార్సయిన భక్తుడు. కడు బీదరికములో వున్నా, భక్తి ఉద్యమాన్ని సుసంపన్నము చేసి, భక్తిలో మర్గాలు చూపిన యోగి సంత్‌ కబీరుదాసు.

కబీరు పుట్టుకపై రకరకాల కథనాలు వున్నా, ఆయన పెంచబడినది చేనేత పనిచేసే మహ్మదీయ దంపతుల చేతనే. వారికి ఆయన దొరికాడని కథ. కొందరు కాదంటారు. వారు మహ్మదీయ మతము అప్పుడే పుచ్చుకున్నారని, పూర్తిగా ఆ మతము అవలంబించ లేదని, అందువలననే కబీరు దోహాలలో మతాలకతీతమైనది వినపడుతుందని కొందరి వాదన. కొందరు ఆయన నాథ సంప్రదాయవాది యని వాదిస్తారు. కానీ కబీరు హిందూ మహ్మదీయ మతాలను రెంటినీ తిరస్కరించాడు. ఆయన హైందవములోని కర్మకాండలను నిరసించాడు. ముస్లిము మతములోని సున్తీని నిరసించారు.

కబీరు మతాలకతీతముగా రామ నామముతో ‘కబీరు మార్గ’మని చెప్పి నడిచాడు. ఆయనను అందుకే ఆయన శిష్యులు తప్ప ఎవ్వరూ పట్టించుకోలేదు.

కబీరు వారణాసి లోనే తన పూర్తి జీవిత కాలము జీవించాడు. ఆయన ‘స్వామీరామానంద’ తన గురువుగా ప్రకటించుకున్నాడు. కబీరు మహ్మదీయుడని గురువు మంత్రము ఇవ్వటానికి వప్పుకోడు. అసలు కబీరుతో మాట్లాడడు. స్వామీరామానందుడు గంగా స్నానము చేసి వచ్చే దారిలో కబీరు గురువు కోసము ఎదురుచూస్తూ వుంటాడు. గురువు తడి పాద ముద్రలను తాకి గురు పాద నమస్కారముగా భావిస్తాడట. తన చెయ్యి ఆయన పాదాల క్రింద కావాలని పెట్టి, స్వామీ రామానంద ఎవరినో తగిలానని ‘రామ రామ’ అంటే అదే గురువు ఇచ్చిన మంత్రముగా స్వీకరిస్తాడుట కబీరు. ఇది ప్రచారములో వున్న కథ.

కబీరు భారతీయ భక్తి ఉద్యమానికి అద్భుతమైన కొంగ్రొత్త రంగును అద్దాడు. భక్తిని సర్వ జనుల లోగిళ్ళలోకి తెచ్చి నిలిపాడు. ‘రామ’ అన్న నామముతో ఆయన ఆడిన ఆట అసమానము. కబీరు దోహాలు నిరాకార నిరంజనుని కొలిచే మార్గాలు. పంచదార గుళికలు. సుఫీలలో కబీరు వేసిన దారి అసమాన్యము. ఆయన తరువాత ఎందరికో దిక్సూచి అయ్యాడు.

వారణాసి లోనే తప్పక చూడాలనుకున్న ఆశ్రమము కబీరుదే. కబీరు శిష్యులు, కబీరు సమాధి మందిరమును కట్టి, నేటికీ కబీరు పేర అన్నదానాల వంటి ఎన్నో సత్కర్మలు చేస్తున్నారు. ఆ సమాధి మందిరము చాలా విశాలముగా వుంది. అక్కడ ఒక పుస్తకాల షాపు, అందులో కబీరు దోహాలు వున్న పుస్తకాలు అమ్ముతున్నారు.

‘నా ఇంటిని తగలేశాను
నా చేతిలో జ్ఞాన కాగడా పట్టాను.
ఇక భయం లేదు
ఎవ్వరి ఇల్లు అయినా కాలుస్తాను'( కబీరు దోహ).

కబీరు దోహాలుగా ఎన్నో ప్రాచుర్యములోకి వచ్చాయి. కొన్ని ‘గురుగ్రంధ సాహెబ్’లో‌ కూడా తీసుకోబడినాయి.

కబీరు ఆనాటి ‘అవధ్’ భాష లో ఆయన దోహాలను రచించాడు. రవీంద్రనాథ్ టాగూరు వాటిలో కొన్నింటిని ‘థౌజెండు పోయమ్స్ ఆఫ్‌ కబీరు’ పేర ఆంగ్లంలో అనువదించారు.

“పిచ్చివాడా
ఎక్కడెక్కడో వెతుకుతావెందుకు
నన్ను
నీ లోనే వున్నాను తెలుసుకో!
లేను మందిరంలో, లేను మసీదులో
లేను లేను కాబా కైలాసాలలో
లేను బాహ్య కర్మకాండలలో
లేనే  లేను యోగ, వైరాగ్యాలలో
మనసు పెట్టి వెదికి చూడు
క్షణంలో దొరుకుతాను!!
ఎక్కడెక్కడో వెతుకుతా వెందుకు నన్ను
నీ లోనే వున్నాను తెలుసుకో!”
(మోకో కహా ఢూంఢే బందే, మై తేరే పాస్ మే- అన్న కబీరు దోహా కు అనువాదం)

కబీరు సర్వమతముల సారమూ ఒక్కటే అని బోధించాడు.

ఆయన ఎల్లప్పుడూ కస్తూరి మృగం గురించి చెప్పేవారట. కస్తూరిమృగమన్నది హిమాలయాలలో తిరిగే  దుప్పి వంటి జంతువు. దానికి పొట్ట భాగములో సంచి వంటి దానిలో కస్తూరి ఉత్పత్తి అవుతుంది. వసంతములో సువాసనల వెదజల్లే ఆ కస్తూరి సువాసనలు పీల్చి తట్టుకోలేక ఆ మృగము అది ఎక్కడనుంచి వస్తోందా అని తుప్పలలో ముళ్ళల్లో రక్తం కారుస్తూ తిరుగుతుంది. ఆ సువాసన తన పొట్ట భాగము నుంచి యని గ్రహించదు. అలాగే మానవులు తనలో వున్న పరమాత్మను గ్రహించలేక అటూ ఇటూ తిరుగుతూ తనలోని ప్రభువును గ్రహించలేకపోత్తున్నారని చెబుతారు కబీరు.

అలతి అలతి పదాలలో అంతరాంతరాల జీవితాన్నీ ఆవిష్కరించే కబీరును ఆయన సమాధి మందిరములో ధ్యానముతో తలచి, ఆయన ఆసీస్సులకై తపించి, ప్రార్థించి నేను నా బసకు మరలి వచ్చాను.

(సశేషం)

Exit mobile version