[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
దేవ్ దీపావళి:
[dropcap]పౌ[/dropcap]ర్ణమిలలో కార్తీక పౌర్ణమి ముఖ్యమైనది. ఈ పౌర్ణమి నాడు చేసే సముద్రస్నానానికీ, దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. కార్తీకపురాణములో కార్తీకపౌర్ణమి నోముల వివరణ వుంది. కార్తీకమాసము నడిమధ్యలో వచ్చే ఈ పౌర్ణమిన కాశీ నగరములో ఉత్సవాలు జరుపుతారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు కాశీ నగరానికి వచ్చి గంగకు అర్చన చేసి, విశ్వనాథుని దర్శించి వెడతారు. ఆనాటి సాయంత్రము గంగ వడ్డున వున్న 84 ఘాట్లలో దీపాలు వెలుగుతాయి.
భక్తి పారవశ్యముతో విశ్వేశ్వరునిపై భజనలు, హారతులతో ఆ కిలోమీటరు గంగా తీరము వెలిగిపోతూ వుంటుంది. గంగపై ఉదయించే చంద్రుని దర్శనముకై లక్షలలో ప్రజలు వచ్చి వుంటారు. అది ఒక మహా ఉత్సవము. అటువంటి ఉత్సవము ఈ భువిలో వేరెక్కడా చూడలేము. అదే ఈ “దేవ్దీపావళి” ఉత్సవము.
నాకు ఆ ఉత్సవము చూసే అవకాశము కలిగింది. దీపావళి తరువాత 15 రోజులకు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ఉదయము నుంచి గంగకు పూజలు, గంగ ఒడ్డున దానాల హడావిడి మొదలవుతుంది. ఆ పౌర్ణమి రోజు నేను ఉదయమే గంగ ఒడ్డుకు చేరుకున్నా. ఆ రోజు దశాశ్వమేథ్ ఘాటు వద్దకు ఉదయము నుంచి ట్రాఫిక్ నియంత్రణ మొదలెట్టారు. కాలి నడక తప్ప రిక్షాలను కూడా పంపకుండా అడ్డముగా కర్రలు కట్టేశారు. ఆ రోజు నాకు తెలిసిన బ్రాహ్మడ్ని దానము పట్టటానికి రమ్మని పిలిచాను. మీర్ ఘాటు వద్ద నిలచి పిలిస్తే అతను మణికర్ణిక వద్దకు రమ్మన్నాడు.
చంద్రుడు ఆకాశములో అద్భుతంగా వెలుగులు చిందుతూ మెరిసిపోతున్నాడు. క్రింద గంగ ఒడ్డున నూనె దీపాలు, ఆకాశము రాకా చంద్రడి వెలుగులు పోటి పడుతూ భూలోక స్వర్గముగా వుంది గంగాతీరము.
ప్రతి ఐదు ఘాట్లకు ఒక స్టేజ్, భజనలు సంగీత కార్యక్రమాలు, హారతులు రాజకీయ నాయకుల స్వీచ్లతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగి పోతోంది. నిజంగా దేవ్దీపావళి చూడ వలసిన ఉత్సవము. దాదాపు 300 నుంచి 500 బోట్లు ఆ రాత్రి గంగ మీద ఆ ఘాట్లలలో తిరిగి వుంటాయి.
దేవ్దీపావళి దేవతల కోసము చేసే దీపావళి. మాములుగా మనము అమవాస్యరోజు చేసేది మన సంతోషము కోసము. ఇది ఆ గంగమ్మ తల్లికోసము.
ఆ రోజు వారణాసిలోని వారందరూ గంగ వడ్డునే వున్నారేమో అన్నంత జనులు. బోట్ల మీద టూరిష్టులు. నేను ఎక్కిన బోటంతా విదేశీయులే. నా ప్రక్కన కూర్చున విదేశీ యాత్రికుడు మాటల మధ్య చెప్పాడు ఆయనకు ఈ ట్రిప్పు పదిహేనవ ట్రిప్పట. అలా ఎంత కాలమొస్తామో తెలీదని, కాలము కలిసొస్తే కాశీలో వుండిపాతామని చెప్పాడు.
చిన్నపిల్లలు బోటులలో హడావిడిగా తిరుగుతూ దీపాలు పూలు అమ్మతున్నారు. నేనూ ఒక దీపము కొని చంద్రోదయమైన తరువాత జగదంబను ప్రార్థన చేసి ఆ దీపము గంగలో వదిలేశాను.
చంద్రుడు మాత్రము ఆ రోజ గంగ మీద విద్యుద్దీపాలకు పోటీగా వెలిగిపోయాడు. ఆ దృశ్యం కళ్ళతో చూడవలసినదే కాని వర్ణించ సాధ్యము కాదు.
మాకు దూరంగా ఎసీ బోటు ఒకటి తిరుగుతూ కనపడింది. అందులో నాకో స్వామీజీ కూడా కనిపించారు. వారు మరురోజు నుంచి జరిగే యాగం కోసము వచ్చినట్లున్నారు.
(సశేషం)